సురక్షితంగా ఉండాలంటే బెల్టు బిగించండి
◼ అమెరికాలో 5 నుండి 24 ఏండ్ల వయస్సులోని యౌవనస్థుల్లో మోటారు వాహన ప్రమాదాలు మృత్యువుకు ప్రధాన కారణంగా ఉన్నాయి.
◼ జపాన్‌లో, రొమ్ము క్యాన్సరువల్ల చనిపోయేవారికన్నా రెండు రెట్లకంటే ఎక్కువమంది రోడ్డు ప్రమాదాలవల్ల చనిపోతున్నారు. ప్రోస్ట్రేట్ క్యాన్సరువల్ల చనిపోయేవారికన్నా దాదాపు నాలుగు రెట్లు ఎక్కువమంది రోడ్డు ప్రమాదాలవల్లే చనిపోతున్నారు.
◼ యూరప్‌లో, హత్యలవల్ల మరణించేవారికన్నా నాలుగు రెట్లు ఎక్కువమందిని కారు ప్రమాదాలు చంపుతున్నాయి.
భయోత్పాతాన్ని పుట్టించే ఈ గణాంకాలు, మోటారు వాహనాల్లో ప్రయాణించడంలో సహజంగా ఉన్న ఒక ప్రమాదాన్ని నొక్కిచెబుతున్నాయి—వేగం మృత్యువును తీసుకురాగలదు. అంతేగాక, వేగంతోపాటు మద్యం మత్తు కూడా ఉంటే అది హత్యలకు దారితీస్తుంది. కానీ ప్రమాదాలూ, గాయాలూ సంభవించే సాధ్యతను తక్కువ చేయగలము. అదెలా?
సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లను అలవర్చుకోవడమే దానికి మంచి ప్రారంభం. కొంతమంది సేఫ్టీ నిపుణులు 10 ప్రమాదాల్లో 9 ప్రమాదాలను తప్పించవచ్చనీ లేక నివారించవచ్చనీ చెబుతున్నారు. రోడ్డు ప్రక్కన సైన్ బోర్డుమీదనున్న వేగ పరిమితిని మించిపోవడమూ, ట్రాఫిక్‌లో ఇతర వాహనాలను ఓవర్టేక్ చేయడమూ అటూ ఇటూ కట్లు కొట్టడమూ, ముందున్న వాహనం వెనకాలే దగ్గరగా నడపడమూ, మాదకద్రవ్యాలు లేక మద్యపానీయాల మత్తులో నడపడమూ, సరిగ్గా మెయింటైన్ చేయని వాహనాన్ని నడపడమూ వంటివి అపాయకరమైన డ్రైవింగ్ అలవాట్లకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. జీవం పట్ల గౌరవమూ, మన తోటి మానవుని పట్ల ప్రేమ, మోటారు వాహనాన్ని నడిపే విషయంలో మనం జాగరూకతతో కూడిన బాధ్యతాయుతమైన వైఖరిని అలవర్చుకోవడానికి మనల్ని నడిపించాలి.—మత్తయి 7:12.
సేఫ్టీ నిమిత్తం సీట్ బెల్టులు పెట్టుకోవడం అన్నది మరొక సరళమైన చర్య, కానీ తరచూ దీన్ని విస్మరించడం జరుగుతుంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి ప్రతినిధి అయిన టిమ్ హర్డ్ ప్రకారం, “దుర్ఘటన జరిగినప్పుడు మీ ప్రాణం పోకుండా ఉండడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం సేఫ్టీ బెల్టులు పెట్టుకోవడమే. అది మీరు ప్రాణాపాయాన్ని తప్పించుకునే అవకాశాన్ని రెండింతలు చేస్తుంది.” చిన్న పిల్లల విషయంలోనైతే, చైల్డ్ సేఫ్టీ సీట్లను ఉపయోగించడం వారు ప్రాణాపాయాన్ని తప్పించుకునే అవకాశాన్ని మూడింతలు చేస్తుంది.a
ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అమెరికాలోని ప్యాసెంజరు వాహనాలలో దాదాపు మూడవవంతు మంది సీట్ బెల్టులను ఉపయోగించరని సర్వేలు చూపిస్తున్నాయి. ఒక తండ్రి లేక తల్లిగా మీరు వాహనాన్ని నడిపే ముందు మీ పిల్లలు సురక్షితంగా ఉండడానికి వారు బెల్టులు పెట్టుకున్నారో లేదో రూఢీపర్చుకుంటారా? వాటిని బిగించడానికి సమయాన్ని వెచ్చించడం చాలా ప్రయోజనకరంగా ఉండగలదు.
[అధస్సూచి]
a నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఇలా సిఫార్సు చేస్తుంది: “వెనుకవైపుకి తిరిగి ఉండే చైల్డ్ సీట్లలోని పిల్లల్ని, ప్యాసెంజర్-సైడ్ ఎయిర్ బ్యాగులు ఉన్న కార్లలోని ముందుసీట్లలో కూర్చోబెట్టకూడదు. ఎయిర్ బ్యాగులో గాలినిండడం మూలాన దాని తాకిడికి పిల్లవాడు గాయపడవచ్చు.”