తేనెటీగ ఎప్పుడు తేనెటీగ కాదు?
తేనెటీగలు చాలా బిజీ జీవితాలను గడుపుతాయి, ప్రతి దినం వందలాది పూలను సందర్శించి తమ తేనెతట్టుకి తేనెను చేరవేస్తాయి. వసంతం వచ్చినప్పుడు మగ ఈగలు జత కోసం వెదుకుతాయి. ఇందుకు అవి దృష్టిమీదా, వాసనమీదా ఆధారపడతాయి. అయితే, హ్రస్వదృష్టిగల తేనెటీగ అవధానాన్ని ఒక అసాధారణమైన జోడు కోరుకుంటుంది—అది ఆర్కిడ్.
దక్షిణ యూరప్‌లో, అడవుల్లో పెరిగే అనేక రకాల ఆర్కిడ్‌ల ఫలదీకరణం ఆడ తేనెటీగల రూపాన్ని అనుకరించడంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఆర్కిడ్‌లు ఇతర ఆర్కిడ్‌లకు పుప్పొడి “పొట్లాలు” పంపించాల్సివుంటుంది. వీటిని మోసుకుపోవడానికి తేనెటీగలు భేషుగ్గా పనికొస్తాయి. తేనెటీగలను ఆకర్షించాలంటే ఈ ఆర్కిడ్‌లలో రుచికరమైన తేనె ఉండాలి, కానీ వాటిలో తేనె మాత్రం లేదు. అందుకని అవి మోసానికి పాల్పడాలి. ఆ మోసం ఏమిటంటే, ఈ పువ్వు ఎంతగా ఒక ఆడ తేనెటీగలా కనిపిస్తూ, దానిలాగే వాసనలు వెదజల్లుతూ ఉంటుందంటే మగ తేనెటీగ దానితో జతకట్టాలని ప్రయత్నిస్తుంది! ఈ ఆర్కిడ్‌లలో ఒక్కొక్క జాతికి తన స్వంత కపట వేషమూ, సువాసనలూ ఉంటాయి.
తేనెటీగ తన పొరపాటును గ్రహించేలోపలే ఈ ఆర్కిడ్ జిగురుగా ఉన్న తన పుప్పొడి పొట్లాన్ని దాని శరీరంపైకి బదిలీ చేసేస్తుంది. తర్వాత తేనెటీగ ఎగిరిపోయి మరో ఆర్కిడ్ వలలో పడుతుంది, ఆ రెండవ ఆర్కిడ్ పుప్పొడిని స్వీకరిస్తుంది. ఈ విధంగా చాలాసార్లు మోసపోయిన తర్వాత, ఈ ఆర్కిడ్‌లను ఇక నమ్మరాదని తేనెటీగ గ్రహిస్తుంది. అప్పటికే అది బహుశ కొన్ని పూలపై పుప్పొడిని జల్లే ఉంటుంది.
ఆలోచించలేని ఈ ఆర్కిడ్‌లు తేనెటీగలను మోసం చేయడానికి సరిగ్గా అదే వాసననూ, రూపాన్నీ ఎలా సంపాదించాయి? అటువంటి అసాధారణమైన రూపనిర్మాణాలు, జ్ఞానవంతుడైన ఒక రూపనిర్మాణకుడు ఉన్నాడని రుజువు చేస్తాయి. ఆయన సృష్టి మనల్ని ఎల్లప్పుడూ ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉంటుంది, సమ్మోహనపరుస్తూనే ఉంటుంది.