ప్రపంచ పరిశీలన
ఎయిడ్స్ మరియు ఆసియా
తీర్మానించబడిన ఎయిడ్స్ కేసుల సంఖ్య విషయంలో కొన్ని పాశ్చాత్య దేశాలు తరుగుదలను గమనించినప్పటికీ ఆ మహమ్మారి ఆసియాలోని అనేక భాగాల్లో తీవ్రంగా వ్యాపించింది. ఏసియావీక్‌లోని ఒక నివేదిక ప్రకారం భారతదేశంలోని కేసుల సంఖ్య “1990 మొదటి అర్థభాగంలో 71 రెట్లు పెరిగింది.” మరి 1990లో ప్రపంచంలోని కేసుల విషయంలో 57వ స్థానాన్ని కలిగివున్న థాయిలాండ్ 1990 మధ్య కాలానికల్లా 5వ స్థానాన్ని ఆక్రమించింది. కంబోడియా తనకున్న 173వ స్థానం నుండి 59వ స్థానానికి ఎగబాకింది. మరి ఫిలిఫ్పీన్స్ అదే కాలంలో 131 శాతం పెరుగుదలను చూసింది. ఈ అసంఖ్యాక దేశాల్లో పెచ్చుపెరిగిపోతున్న పిల్లల సెక్స్ పరిశ్రమ దీనికి కారణమని అనేకులకు తెలుసు, అయితే “పర్యాటక పరిశ్రమ నుండి వచ్చే డబ్బుపై ఎక్కువగా ఆధారపడే” దేశాలకు చెందిన కొందరు రాజకీయ వేత్తలు దానికి విరుద్ధంగా “కార్యసాధక చర్యలు తీసుకునేందుకు నిరాసక్తంగా ఉన్నారని” ఏసియావీక్ పేర్కొంటుంది.
పిల్లలపై దురాచారం మరియు వ్యాధినిరోధక వ్యవస్థ
జపాన్‌నందలి మీయే విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం, పిల్లవాడు దీర్ఘకాలం దురాచారానికి గురైతే అతని వ్యాధి నిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది, అలా పిల్లవాడు వ్యాధికి గురయ్యే ప్రమాదంలో ఉంటాడు. భౌతిక దురాచారం మూలంగా కలిగిన మెదడు నరాలు చిట్లిపోవడం వల్ల లేక ఇతర పరిస్థితుల కారణంగా మరణించిన, ఒక నెల నుండి తొమ్మిది సంవత్సరాల వయస్సుగల 50 మంది పిల్లల శరీరాలను విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. “వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రించే” థైమస్ గ్రంథులు ఆ పిల్లల శరీరాల్లో “మాములు బరువుకంటే సగం బరువుకు తగ్గాయని” మైనీచీ డైలీ న్యూస్ నివేదిస్తుంది. ఆ దురాచారం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే దాని పరిమాణం అంత తక్కువకు చేరుకుంటుంది. వాస్తవానికి, “ఆరు నెలలకంటే ఎక్కువకాలం దురాచారానికి గురైన ఒక పిల్లవాని గ్రంథి, దురాచారానికి గురికాని పిల్లవాని గ్రంథి బరువులో కేవలం ఒకింట పదహారవ వంతు మాత్రమే ఉందని” ఆ వార్తాపత్రిక చెప్పింది. మానసిక దురాచారానికి గురైన లేక వారి తలిదండ్రులు ఆహారాన్ని అందించలేకపోవడం మూలంగా కుపోషణకు గురైన పిల్లల్లో గ్రంథులు అదే విధంగా బరువు తగ్గాయని పరిశోధకులు కనుగొన్నారు.
మీ చేతులను కడుక్కోండి!
“మీ చేతులను కడుక్కోవడం అనేక అంటురోగాలు వ్యాపించకుండా నివారించేందుకుగల ఎంతో ప్రభావవంతమైన, సులభమైన మరియు పొదుపైన మార్గమని” కోరీరే డేల్లా సేర అనే ఇటాలియన్ వార్తాపత్రిక పేర్కొంటుంది. అయినప్పటికీ, “పదిమంది ఇటలీ వారిలో ముగ్గురికంటే ఎక్కువమంది మరుగుదొడ్డికి వెళ్లివచ్చిన తర్వాత తమ చేతులు కడుక్కోరు మరి వారు వెంటనే భోజనం చేస్తున్నప్పటికీ వారు చేతులు కడుక్కోరు.” ఈ సర్వేలో కనుగొన్న ఫలితాలు ఇతర దేశాల్లో జరుపబడిన అదే విధమైన సర్వేల ఫలితాలతో దాదాపు సమానంగా ఉన్నాయి. “చేతులు క్రిములను ఆహారం వరకు చేరవేయగలవు మరియు తక్షణం కలుషితం చేయగలవు” అని ఎన్‌రీకో మాల్యానో అనే మైక్రోబయోలజిస్ట్ వివరిస్తున్నాడు. అలా తక్షణం జరిగే దుష్ఫలితాన్ని ఎలా నివారించవచ్చు? మీ చేతులను—మీ గోళ్లక్రింద కూడా—సబ్బూ వేడినీళ్లు లేక వెచ్చని నీళ్లతో కనీసం 30 క్షణాలపాటూ (సూక్షక్రిములను నిర్మూలించేందుకు అవసరమైన కనీస సమయం) కడుక్కోండి. అందులో చేతులను 10 నుండి 15 క్షణాలపాటూ రుద్దడం కూడా ఇమిడివుంది. వాటిని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోండి, మీ ముంజేతుల వద్ద నుండి మొదలుపెట్టి మీ వేళ్లవరకూ అలా చేయండి అని ఆ శీర్షిక చెబుతుంది.
హెపటైటిస్-బి మూలంగా మరణాలు
ప్రతి సంవత్సరం పది లక్షలకంటే ఎక్కువమంది ప్రజలు హెపటైటిస్-బి మూలంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనావేస్తుంది. ఈ మరణాల్లో దాదాపు 1,50,000 భారతదేశంలోనే సంభవిస్తున్నాయని పేడియార్టీషియన్ అయిన జగదీష్ చిన్నప్ప చెబుతున్నాడు. ఒక మల్టీ నేషనల్ ఫార్మస్యూటికల్ కంపనీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక మహాసభలో, భారతదేశంలో “హెచ్‌బివి [హెపటైటిస్-బి-వైరస్] గలవారు 3.5 నుండి 4 కోట్లమంది ఉన్నారు, వారు ప్రపంచమంతటా ఉన్న వారిలో 10 శాతం మంది” అని ఆయన వివరించాడని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిస్తుంది. “తీవ్రమైన కాలేయ వ్యాధిగల రెండు కేసుల్లో ఒకటి మరియు మామూలు కాలేయ క్యాన్సర్‌గల పది కేసుల్లో ఎనిమిది హెపటైటిస్-బి మూలంగానే”నని వార్తాపత్రిక జత చేస్తుంది.
ఇంట్లో గాలి కాలుష్యం
ప్రతి సంవత్సరం గాలి కాలుష్యానికి సంబంధించిన అనారోగ్యం మూలంగా 22 లక్షల మంది భారతీయులు మరణిస్తున్నారని భారతదేశంలోని క్రొత్త ఢిల్లీలోని టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (TERI) నిర్వహించిన ఇటీవలి అధ్యయనం చూపిస్తోంది. ఆ అధ్యయనం ప్రకారం గమనిస్తే ఇంట్లో కాలుష్యం ప్రాముఖ్యమైన కారకమని తెలుస్తోందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిస్తోంది. బొగ్గు, కలప మరియు పిడకల సహాయంతో వంటలు చేసుకునే గుడిసెల్లో నివసించే స్త్రీలకు ఎక్కువ ప్రమాదం వాటిల్లే ముప్పు ఉంది. ఇంటి బయట గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోబడుతున్నప్పటికీ, కోట్లాదిమందికి తమ స్వంత ఇళ్లల్లో ఉన్న ముప్పును తగ్గించేందుకు ఎక్కువ చర్యలేమీ తీసుకోబడటం లేదని నిపుణులు భావిస్తున్నారు. “ఒక గుప్త సమస్య ఉనికిలో ఉంది, మరి దానికి తక్షణ పరిష్కారం లభించేట్లు కనిపించడం లేదు” అని TERI డైరెక్టరైన ఆర్. కే. పాచూరీ పేర్కొన్నాడు.
ఆరోగ్యకరమైన జీవిత విధానాన్ని ప్రేరేపించడం
తమ 1997 ప్రపంచ ఆరోగ్య నివేదికలో, పెరిగిపోతున్న “బాధా సంక్షోభాన్ని” మానవాళి ఎదుర్కొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తుంది. ప్రతి సంవత్సరం, క్యాన్సర్ మరియు హృద్రోగం మరితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు జత చేరి 2.4 కోట్ల మంది ప్రజలను చంపుతున్నాయి మరియు ఇతర కోట్లాదిమంది కష్టాలను అధికం చేసే ముప్పును కలిగిస్తున్నాయి. రాబోయే 25 సంవత్సరాల్లో, అనేక దేశాల్లో క్యాన్సర్ కేసుల సంఖ్య రెండింతలౌతుందని అంచనావేయబడింది. అనేక ధనిక దేశాల్లో అతి గొప్ప హంతకియైన హృద్రోగం మరియు పక్షవాతం పేద దేశాల్లో కూడా మరింత సామాన్యమైనదిగా అవుతుంది. వీటికి ప్రతిస్పందనగా, ఆరోగ్యకరమైన జీవిత విధానాన్ని ప్రేరేపించేందుకు మరియు తరచూ మరణకరమైన వ్యాధులకు దారితీసేవైన అనారోగ్యకరమైన ఆహారం, ధూమపానం, స్థూలకాయాన్ని తగ్గించకపోవడం మరియు వ్యాయామం చేయకపోవడం వంటి ప్రమాద కారకాలను తగ్గించేందుకు “తీవ్రతరమైన మరియు సుదీర్ఘకాలం కొనసాగే” ఒక ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాలని WHO పిలుపునందిస్తోంది.
దేవునియందు వైజ్ఞానికుల నమ్మకం
పూర్వం 1916లో, అమెరికాకు చెందిన మనోవిజ్ఞానశాస్త్రజ్ఞుడైన జేమ్స్ లాబ యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన 1,000 మంది వైజ్ఞానికులను వారు దేవునియందు విశ్వాసాన్ని కలిగి ఉన్నారా అని అడిగాడు. వారి సమాధానం? జవాబిచ్చిన వైజ్ఞానికుల్లో, 42 శాతం మంది దేవునియందు విశ్వాసాన్ని వ్యక్తం చేశారని ది న్యూయార్క్ టైమ్స్ నివేదిస్తుంది. విద్యాభ్యాసం విస్తరించే కొలది దేవుని యందు విశ్వాసం సన్నగిల్లుతుందని లాబ ఊహించి చెప్పాడు. ఇప్పుడు, దాదాపు 80 సంవత్సరాల తర్వాత, జార్జియా విశ్వవిద్యాలయానికి చెందిన ఎడ్వర్డ్ లార్సన్, లాబ యొక్క ప్రఖ్యాత సర్వేను తిరిగి చేశాడు. అవే ప్రశ్నలనూ అవే పద్ధతులనూ ఉపయోగిస్తూ, మానవజాతితో క్రియాశీలంగా సంభాషించే దేవుని యందు మీకు విశ్వాసముందా అని లార్సన్ జీవశాస్త్రజ్ఞులనూ, భౌతికశాస్త్రజ్ఞులనూ మరియు గణితశాస్త్రజ్ఞులనూ కూడా అడిగాడు. నేడు కూడా అంతే మంది వైజ్ఞానికులు అంటే దాదాపు 40 శాతం మంది దేవుని యందు విశ్వాసాన్ని వ్యక్తం చేశారని ఫలితాలు చూపించాయి. డా. లార్సన్ ప్రకారం, “లాబ గారు మానవ మనస్సునో లేక విజ్ఞానశాస్త్రం మానవుల అవసరాలను అన్నింటినీ సంతృప్తిపర్చగల సామర్థ్యాన్నో తప్పుగా అంచనావేశాడు.”
నిరాశగల తరం
నేటి 15 నుండి 24 సంవత్సరాల వయస్సుగల యౌవనుల అభిప్రాయాలను రెండు తరాల వెనకటి కాలంనాటి యౌవనస్థుల అభిప్రాయాలతో పోల్చి చేయబడిన సర్వే, మాదకద్రవ్యాల దుర్వినియోగం, నేర నిష్పత్తి మరియు ఆత్మహత్య పెరిగిపోవడాన్ని చూపిస్తుందని ది ఆస్ట్రేలియన్ నివేదిస్తోంది. వ్యూహరచన విశ్లేషకుడు మరియు వైజ్ఞానిక రచయిత అయిన రిచ్చర్డ్ ఎకర్జ్‌లీ, “జీవితం ఉత్తేజవంతంగా మరియు ఉల్లాసవంతంగా ఉండాలనీ, సహాయం కొరకు ఇతరులపై ఆధారపడకుండా తమ ఎడల తాము శ్రద్ధ వహించగలగాలనీ, జీవిత విధానాన్ని ఎన్నుకునే సాధ్యత తమకు అందుబాటులో ఉండాలనీ, మరి సమాజపు సమస్యలను ప్రభుత్వాలు తీర్చే సామర్థ్యాన్ని కలిగి లేవనీ మరియు సాంఘిక పరిస్థితులను మార్చే శక్తి తమలో కూడా లేదనీ వారు అభిప్రాయపడుతున్నారని” చెబుతూ నేటి అనేకమంది యౌవనస్థుల భావాల సారాంశాన్ని వ్యక్తం చేశాడు. షానూ అనే పేరుగల పదిహేనేళ్ల అమ్మాయి ఇలా చెబుతోంది: “జనాభా పెరిగిపోతుంది, ఉన్న కొద్ది పాటి ఉద్యోగాల కొరకు, కొద్ది పాటి ఇళ్ల స్థలాల కొరకు, అంతా కొద్దిపాటిగానే ఉన్న వనరుల కొరకు మేమంతా పోటీ పడవలసి ఉంటుంది.”
ప్రపంచ ప్రయాణం చేస్తున్న వైరస్‌లు
విమానాల మరుగు దొడ్లలోని ట్యాంకులు వైరస్‌లను చంపవలసిన రసాయనాలను కలిగివుంటాయి, అయితే కొన్ని వైరస్‌లు క్రిమి సంహారకాల ప్రభావాన్ని తట్టుకుని చనిపోకుండా మిగిలి ఉంటున్నాయని న్యూ సైంటిస్ట్ పత్రిక నివేదిస్తోంది. నార్త్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పర్యావరణ వైజ్ఞానికుడైన మార్క్ సాబ్సీ, అమెరికాకు వచ్చి చేరుకునే అంతర్జాతీయ విమానాలనుండి తను తనిఖీ చేసిన మురుగులోని దాదాపు సగ భాగం సజీవ వైరస్‌ను కలిగి ఉందని కనుగొన్నాడు. అమెరికాలో, విమానాల నుండి దిగుమతి చేయబడిన మురుగు, ప్రజా సీవేజ్ స్టేషన్‌లో శుభ్రపర్చబడి తర్వాత వాతావరణంలోకి వదిలివేయబడుతుంది. అలా, ఈ వైరస్‌లలో కొన్ని హెపటైటిస్ ఎ మరియు ఈ, మెనింజైటిస్ మరియు పోలియో వంటి వ్యాధులను కలిగించే ప్రమాదం ఉంది. సాబ్సీ ఇలా జత చేస్తున్నాడు: “ప్రపంచ విమానాశ్రయాల ద్వారా సంక్రమించగల రోగాల జాబితా చాలా కలత కలిగించేదిగా ఉంది.”
తినుబండారాలు తినడం మరియు దంతక్షయం
చక్కెర పదార్థాలను తినటాన్ని తగ్గించడం దంతక్షయాన్ని నిరోధించేందుకు సహాయం చేస్తుందనే విషయం ఎంతో కాలంగా తెలిసినదే. మీరు ఎప్పుడు మరియు ఎంత తరచుగా తినుబండారాలను తింటారనే దాన్ని గమనించుకోవడమే ప్రత్యేకంగా ప్రాముఖ్యమైన విషయమని హౌ టు కీప్ యువర్ ఫ్యామిలీ స్మైలింగ్ అనే కుటుంబ దంత మార్గదర్శక పుస్తకం నివేదిస్తోంది. మిఠాయీలు లేక శుద్ధి చేయబడిన కార్బోహైడ్రేట్‌లకు మీ పళ్లమీదున్న పాచితో కలయిక ఏర్పడినప్పుడు, ఒక ఆమ్లం తయారవుతుంది. ఆ ఆమ్లం మీ పళ్ల ఎనామిల్‌పై దాదాపు 20 నిమిషాల పాటూ దాడి చేస్తుందని ఆ బ్రొషూర్ చెబుతుంది. ఈ సమయంలో పళ్లలో రంధ్రాలు కావడం ప్రారంభం కావచ్చు. అంతేకాకుండా, “మీరు మిఠాయీలను లేక పిండి పదార్థాలను తిన్న ప్రతీసారీ ఇది సంభవించగలదు.” కాబట్టి మీరు ఏదైనా తినబోతుంటే, మీ పళ్లపై ఆమ్లం ప్రభావం కేవలం ఒకేసారి పడే విధంగా చేస్తూ “ఆ మొత్తాన్నీ ఒకేసారి తినడం మంచిది.” లేక పోతే, అదే తిను బండారాన్ని చాలా సమయం పాటూ మెల్లిగా గిల్లి గిల్లి తినడం ఆమ్లం దాడిని పొడిగించేందుకు దారి తీస్తుంది. దంతక్షయాన్ని ఎదిరించేందుకు సహాయకంగా మీరు మీ పళ్లను రోజుకు కనీసం రెండుసార్లన్నా తోముకోవాలని దంత వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే, ప్రతి రోజూ డెంటల్ ఫ్లాస్‌తో మీ పళ్ల మధ్య శుభ్రం చేయడాన్ని మర్చిపోకండి.
కనుమరుగౌతున్న గంగ
భారతదేశమందలి గంగానదిని కోట్లాది మంది హిందువులు పవిత్రమైన దానిగా పరిగణిస్తారు. గంగానది దాని మార్గమంతటిలో ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయానికి జీవాధారంగా కూడా ఉంది. అయితే ఆ నదికీ దాని పూర్వపు తీరాలకీ మధ్య పెద్ద పెద్ద బీడు భూములను సృష్టిస్తూ ఇప్పుడు దాని జలాలు తగ్గుముఖం పట్టాయనీ ఇండియా టుడే నివేదిస్తోంది. ప్రవాహం విపరీతంగా తగ్గిపోవడానికి కారణం వర్షాభావమూ మరియు నది ఎగువ ప్రాంతంలో ఆ నీటిని పొలాలకు ఎక్కువగా ఉపయోగించడమే. ఆ ప్రాంతంలో వ్యవసాయానికి ముప్పు కలిగించడమే కాకుండా, నీళ్లు లేకపోవడం మూలంగా ఒండ్రుమట్టి వచ్చి చేరడం కలకత్తాలోని ఓడరేవును ప్రయాణానికి అననుకూలమైన దానిగా చేస్తుందని నివేదిక తెలియజేస్తోంది.