మా పాఠకుల నుండి
ఊయల మరణం “ప్రపంచ పరిశీలన”లోని “ధూమపానం ఊయల మరణాలతో సంబంధాన్ని కలిగివుంది” (జనవరి 22, 1997) అనే అంశం విషయమై మీకు కృతజ్ఞతలు. ప్రతి తల్లీ ఈ అంశాన్ని మనస్సులోకి తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. నేను గర్భధారణ సమయంలో కూడా ధూమపానం చేయడం కొనసాగించినందుకు నా చిన్న బాబు సిడ్స్ వ్యాధి (సడన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్) మూలంగా దాదాపు మరణం ముంగిటి వరకూ వెళ్లాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక సంవత్సరం వరకూ, వాడు నిద్రపోయే ప్రతిసారీ హార్ట్ మానిటర్ ధరించాల్సి వచ్చేది, ఎందుకంటే వాడి గుండె ఆగిపోతే ఆ మానిటర్ హెచ్చరికనిస్తుంది. నాకు అప్పుడు యెహోవా తెలిసివుంటే ఎంత బాగుండేది. నేను పొగ త్రాగడం మానేసి ఉండేదాన్ని, బహుశ నా కొడుకుకూ నాకు కూడా అంతటి భయానకమైన అనుభవం ఎదురై ఉండేది కాదు.
ఎ. సి. ఎ., అమెరికా
కీళ్లనొప్పుల బాధితురాలు “నేను బలహీనంగా ఉన్నప్పుడే నేను శక్తివంతంగా ఉంటాను” (జనవరి 22, 1997) అనే శీర్షికగల లూరెట్టా మాస్స్ అనుభవం విషయంలో నేను మీకు వందనాలు చెప్పాలని అనుకుంటున్నాను. నాకు 27 సంవత్సరాల వయస్సు, నేను కూడా రూమెటాయిడ్ కీళ్ల నొప్పి మూలంగా బాధపడుతున్నాను. చికిత్స నొప్పిని తగ్గించినప్పటికీ, నా అనారోగ్యం నేను నా పూర్తికాల పరిచర్యను మానుకునేలా చేసింది గనుక నేను కొన్నిసార్లు విసుగును అనుభవిస్తాను, నిరుత్సాహంగా భావిస్తాను. తనకు అనారోగ్యం ఉన్నప్పటికీ యెహోవాను సేవించాలని లూరెట్టా మాస్స్ తీసుకున్న తీర్మానం ఎంతో ప్రోత్సాహకరమైనది. నా నిరుత్సాహ భావాలు నాపై ఆధిపత్యం వహించేందుకు నేను అనుమతించను; ప్రకటనాపనిలో నేను ఇంకా ఎక్కువ భాగం వహించాలని కోరుకుంటున్నాను.
ఎ. బి., ఇటలీ
నా తల్లి 30 కంటే ఎక్కువ సంవత్సరాలు రూమెటాయిడ్ కీళ్లనొప్పి మూలంగా బాధను అనుభవించింది. ఆ నొప్పిని అసలు తగ్గించలేమన్నది ఎంతో దుఃఖకరమైన విషయం. నా తల్లి అన్ని సంఘ కూటాలకూ హాజరయ్యేలా తన పరిస్థితిని చూసుకుంటుంది గనుక నేను ఆమెను చూసి గర్విస్తున్నాను. ఆమె తన చక్రాల కుర్చీలో కూర్చుని దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో భాగం వహిస్తుంది, ఆమె ఇంకా ప్రకటనాపనిలో భాగం వహించగలదు. మరి తనకు అనారోగ్యం ఉన్నప్పటికీ ఆమె ఎన్నడూ ఫిర్యాదు చేయదు.
ఎస్. ఎమ్., జర్మనీ
నోవహు కాలంనాటి జలప్రళయం “బైబిలు ఉద్దేశము: జలప్రళయం—వాస్తవమా, కల్పితమా?” (మార్చి 8, 1997) అనే శీర్షిక నేను ఆ చారిత్రాత్మక సంఘటనను గంభీరంగా పరిగణించేందుకు నాకు వాస్తవంగా సహాయం చేసింది. నాకు కూడా అనేకమంది ఇతరుల వలెనే చిన్న తనంలోనే జలప్రళయాన్ని గురించి నేర్పబడింది. అయితే, అనేకులు దాన్ని కేవలం రాత్రిపూట చెప్పుకునే కథలా మాత్రమే పరిగణిస్తారనే విషయాన్ని నేను ఎన్నడూ గుర్తించలేదు. యేసు అంత్య దినాలను నోవహు కాలంతో పోల్చాడనే వాస్తవమే ఆ జలప్రళయం ఒక వాస్తవిక సంఘటన అనే విషయాన్ని చూపుతుంది.
ఎస్. ఎమ్., అమెరికా
నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు నా పదేళ్ల కుమారునికి తీవ్రమైన ADHD ఉంది. “నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లలకు సహాయం” (మార్చి 8, 1997) అనే శీర్షికలు వచ్చినప్పటి నుండీ, అనేకమంది స్నేహితులు తాము ఆ సమస్యను అర్థం చేసుకుని నాకు సహాయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ నేను నా కుమారుడు ఎలా భావిస్తున్నామో తాము ఎన్నడూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయామని చెప్పారనే విషయాన్ని మీకు తెలియజేసేందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఇప్పుడు తాము సహాయం చేసేందుకు మరింత ఇష్టపూర్వకంగా ఉంటామని అనేకమంది వ్యాఖ్యానించారు. సంఘంలోని ఒక సహోదరి నా కుమారునితో కలిసి ఆ శీర్షికను చదివి వాడ్ని ప్రోత్సహించేందుకు కూడా సమయాన్ని వెచ్చించింది. నా కుమారుడు తర్వాత నా వద్దకు వచ్చి ఆ పత్రికను తన కొరకు మళ్లీ చదవమని నన్ను అడిగాడు.
ఎల్. ఎ. డి., అమెరికా