మా పాఠకుల నుండి
ప్రాణ స్నేహితుడు వెళ్లడం “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నా ప్రాణ స్నేహితుడు ఇల్లెందుకు మారాడు?” (జనవరి 8, 1997) అనే శీర్షిక ఎడల నా ప్రగాఢమైన మెప్పును తెలియజేయాలనుకుంటున్నాను. ఇది సమయానికి అందింది. త్వరలోనే, నా స్నేహితురాళ్లలో ఒకరు దూరంగా వెళ్ళిపోతున్నారు; ఆమె, ఆమె భర్తా మరెక్కువ మంది ప్రచారకుల అవసరమున్న సంఘంలో సేవ చేసేందుకు వెళ్తున్నారు. నేను ఆమె విషయంలో చాలా సంతోషిస్తున్నప్పటికీ, నేను ఆమె సహవాసాన్ని ఎంతగానో కోల్పోతానని నాకు తెలుసు. మీరిచ్చిన అమోఘమైన సలహాకు నా కృతజ్ఞతలు.
ఆర్. ఏ., ఇటలీ
మా ప్రాంతీయ పైవిచారణకర్త, ప్రయాణ పరిచారకుడు మమ్మల్ని వదిలిపెట్టి మరో ప్రాంతంలో సేవ చేసేందుకు వెళ్ళినప్పుడు ఈ శీర్షిక నన్నెంతగా కదిలించిందో మీరు ఊహించలేరు. నా ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ అవసరాలను తీర్చేందుకు ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఆ శీర్షికలో ఇవ్వబడిన పోటోలో చిత్రీకరించబడినట్లే, వీడ్కోలు చెప్పడం అనేది ఎంతో వేదనకరమైన విషయం. ఒంటరితనంతో పోరాడేందుకు సహాయపడడంలో మీరు ఇచ్చిన సలహాలు ఎంతో సమయోచితమైనవి.
జె. డి., నైజీరియా
సహనం నాకు 22 ఏండ్లు. “సహనం—లోకం హద్దులు మీరిందా?” (ఫిబ్రవరి 8, 1997) అనే పరంపరకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. యౌవనస్థులైన క్రైస్తవులు అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ శీర్షికలు నేను మరీ హద్దులు దాటకుండా ఉండేందుకు ప్రోత్సహించాయి. లోకం నుండి ఒత్తిళ్ళు కలిగినా కూడా యెహోవాకు సేవ చేయాలి అన్న నా నిర్ణయాన్ని అవి బలపరచాయి.
ఎమ్. బి., ఇటలీ
వంటగది సరదా “వంటగది సరదాగా ఉండగలదు” (ఫిబ్రవరి 8, 1997) అనే శీర్షికకు కృతజ్ఞతలు. నేను కూడా వంట గదిలో జరిగిన సంభాషణల వల్ల ప్రయోజనం పొందాను. ఉల్లిపాయలనూ, బంగాళా దుంపలనూ ఒలిచేటప్పుడు, మా అమ్మ యెహోవాను ప్రేమించాలని నాకు బోధించేది, ఆయనను పూర్తిగా సేవించేందుకు నన్ను ప్రోత్సహించేది. ఈ వంటగది సంభాషణలు విలువైనవన్న విషయం—మరి ముఖ్యంగా మా నాన్న మతం విషయంలో మమ్మల్ని వ్యతిరేకించిన కష్ట కాలాల్లో—రుజువయ్యింది. మా నాన్న యెహోవా సేవకుడుగా మారడాన్ని చూసే ఆనందం ఇప్పుడు నాకూ మా అమ్మకూ లభించింది. అలాగే, రుచికరమైన అనేక వంటలు చేయడం కూడా నేను నేర్చుకున్నాను!
ఏ. ఎమ్. ఎమ్., ఇటలీ
నేను వినోద పరిశ్రమ యజమాని ఇంట్లో వంటమనిషిగా పని చేస్తున్నాను. అలా నేను వంటగదిలో పనిచేస్తున్నప్పుడు, వేడుకలు చేసుకునేందుకు వచ్చే ప్రముఖులతో సహా అక్కడికి వచ్చే సందర్శకులతో ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచుకునే అనేక అవకాశాలు నాకు లభించాయి. నేను కొన్ని బైబిలు సాహిత్యాలను వంటగదిలోని ఒక సొరుగులో ఉంచుకుంటాను. ఒక సందర్భంలో ఒక సందర్శకునితో బైబిలు చర్చ చేశాను. మరెక్కువగా చర్చ చేసేందుకు తర్వాత ఆయన మళ్ళీ వంటగదికి వచ్చాడు. నేను వంటగదిలో కోడి మాంసం వేయించే పనిలో ఉండగా, ఆయన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే నా పుస్తకం బిగ్గరగా చదివాడు. అవును, మీరన్నది నిజం. వంటగది సరదాగా ఉండగలదు!
ఏ. ఆర్., అమెరికా
పాపాన్ని ఒప్పుకోవడం నేను సంఘ పెద్దగా సేవ చేస్తున్నాను. “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేను నా పాపాన్ని ఒప్పుకోవాలా?” (ఫిబ్రవరి 8, 1997) అనే శీర్షిక ఎడల నా మెప్పుదలను తెలియజేస్తున్నాను. తాము కొంత కాలం క్రితం చేసిన గంభీరమైన ఉల్లంఘనలను ఒప్పుకునేందుకు అనేక మంది యౌవనస్థులను ఈ శీర్షిక కదిలించింది. ప్రేమపూర్వకమైన సహాయాన్ని పొందిన తర్వాత ఈ యౌవనస్థులు యెహోవాతో తమకు గల అనుబంధాన్ని పునఃస్థాపించుకోవడాన్ని చూడడం ఆనందంగా ఉంది. తాము పరిశుభ్రంగా ఉండాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు.
ఓ. బి., ఇటలీ
ఒకరు తమ పాపాల విషయమై మౌనం వహించడం అపాయకరం కాగలదని గుర్తించేందుకు ఈ శీర్షిక నాకు సహాయం చేసింది. ఒప్పుకునేటప్పుడు సిగ్గూ, కలవరమూ కలుగుతాయి. కానీ తమ పాపాన్ని యెహోవాకూ, తమ తల్లిదండ్రులకూ చెప్పినప్పుడు తమకూ వాళ్ళకూ మధ్య బలమైన సన్నిహిత అనుబంధం ఉన్నట్లు తెలుసుకుంటారు.
బీ. కే., గయానా
సరిగ్గా నాకు అవసరమైనప్పుడే ఈ శీర్షిక వచ్చింది. నేను చేసిన పనిని నా తల్లిదండ్రులకూ, సంఘ పెద్దలకూ చెప్పవలసిన అవసరం ఉందని గ్రహించాను. ఆ శీర్షిక నా కోసమే వ్రాయబడిందా అన్నట్లు భావించాను. చివరికి నా సమస్యలను గురించి వారితో చెప్పుకున్నప్పుడు నాకెంతో ఉపశమనం కలిగింది!
ఏ. ఏ., అమెరికా