అరణ్యంలోని ఆవులింత
ఎవరైనా బహిరంగంగా ఆవులిస్తే, అతను అమర్యాదస్థుడని లేక అతనికి బాగా బోరు కొడుతుందనీ ప్రజలు అనుకుంటారు. మర్యాదను గురించిన నియమాలను అలక్ష్యం చేస్తే, ఆవులింత వాస్తవానికి ఎంతో ఉపయోగకరమైన పనిని నెరవేర్చుతుంది. ఆవులింత అనేది సంకల్పరహితమైన ఉచ్వాస. మనం దినంలోని పని చేత అలసిపోయినప్పుడు సాయంత్రంలో లేక మనం నిద్ర లేచిన వెంటనే ఉదయాన ఆవులిస్తాం. దీర్ఘంగా ఆవులించడం మనకు ప్రాణవాయువు యొక్క సరఫరాను అధికం చేస్తుంది మరి మనకు క్షణికంగా ఉత్తేజాన్నిస్తుంది; అది తరచూ మనం నిద్ర మేల్కొనడంలో ఒక భాగం.
అయితే, జంతువులు తరచూ బాగా ఊపిరి పీల్చుకునేందుకు కాకపోయినా అవి కూడా ఆవులిస్తాయని మీకు తెలుసా? అవి అలా చేసేందుకు గల కారణం తరచూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు, కోతులు వర్తమానాన్ని అందజేసేందుకు కొన్నిసార్లు ఆవులిస్తాయి. నోరు పూర్తిగా తెరిచి పళ్లను భయంకరంగా చూపడం, పోటీదారుడైన మగ కోతికి లేక దాడి చేయబోయే జీవికి హెచ్చరికను పంపడం వలె ఉంటుంది. ఆ వర్తమానం: ‘నేను భయంకరంగా కొరుకుతాను. దూరంగా ఉండు!’
ఆఫ్రికా పల్లపు ప్రాంతాలకు చెందిన వేట పిల్లులు, తరచూ వేటాడే ముందు ఒళ్లు విరుచుకుని ఆవులిస్తాయని గమనించడం జరిగింది. మానవుల వలెనే పిల్లుల ఆవులింత ఒక శరీర సంబంధ క్రియ చేస్తుంది, అంటే ఊపిరితిత్తులకు అదనపు గాలిని పంపే పని అన్నమాట. ఇది రక్తంలోని ప్రాణవాయువును అధికం చేస్తుంది. తర్వాత గుండె దాన్ని శరీరంలోని అన్ని ఇతర భాగాలకూ పంపుతుంది, అలా చిన్న దూరాలకు వేగంగా పరిగెత్తేందుకు తక్షణ శక్తినిస్తుంది.
అంతెందుకు, చేపలు కూడా ఆవులిస్తూ కనిపించాయి! జంతు ప్రపంచం లోపల (ఆంగ్లం) అనే పుస్తకం, కొన్నిసార్లు “వేగంగా కదిలే ముందు ఆవులించే” చేపలను గురించి చెబుతుంది. “ఒక చేప కాస్త భయపడినప్పుడు లేక శత్రువును చూసినప్పుడు లేక ఆహారాన్ని చూసినప్పుడు అంటే వేగంతో కూడిన క్రియ అవసరమైన ప్రతీసారీ కూడా ఆవులించవచ్చు.”
బహుశ అన్ని ఆవులింతలకంటే అత్యంత ప్రభావవంతమైనది నీటి గుర్రం లేక బిహమాత్‌ది అయి వుంటుంది. స్థూల కాయంగల ఈ జీవి తన నోరు అనే పెద్ద సొరంగాన్ని 150 డిగ్రీల విస్తీర్ణం వరకూ తెరువగలదు! ఆ నీటి గుర్రాల కొలనులో, రారాజెవరో తెలిపేందుకు ఒక ముసలి మగ నీటి గుర్రానికి ఆ ఆవులింత సహాయం చేస్తుంది. తన సరస్సు రాజ్యంలోకి ప్రవేశించేందుకు ధైర్యం చేసే వారెవరికైనా అది జడిపించే హెచ్చరికగా ఉంటుంది.
అది సింహ గర్జన యొక్క నాటకీయతను తీసుకురాకపోయినప్పటికీ, ఒక ఆవులింత, అది నిద్ర వల్ల వచ్చినదైనా లేక భయం కలిగించేదైనా లేక కేవలం శక్తినిచ్చేదైనా కూడా అది ఒక ఉపయుక్తమైన సంకల్పాన్ని నెరవేర్చుతుంది. అది జంతు సామ్రాజ్యం యొక్క రూప నిర్మాణకుని సృజనాత్మకతకు మరొక మచ్చు తునక మాత్రమే!