కఠినమైన మాటలు, నలిగిన హృదయాలు
“మూర్ఖురాలా, సోమరిదానా!”a జపాన్‌లోని ఒక స్త్రీకి ఈ మాటలు చాలా బాగా గుర్తు—తన చిన్నతనంలో చాలా తరచుగా ఆమెను ఆ మాటలతో పిలిచేవారు. ఎవరు? స్కూలుపిల్లలా? తోబుట్టువులా? కాదు. ఆమె తలిదండ్రులే. ఆమె ఇలా గుర్తు తెచ్చుకుంటుంది: “ఇలా పేర్లుపెట్టి పిలవడం నన్ను చాలా తీవ్రంగా గాయపర్చేది, దానితో నేను క్రుంగుదలకు లోనయ్యేదాన్ని.”
తన చిన్నతనంలో తన తండ్రి ఎప్పుడు ఇంటికి తిరిగివచ్చినా తాను భయంతోనూ వ్యాకులతతోనూ వణికిపోయేవాడని అమెరికాలోని ఒక వ్యక్తి గుర్తుతెచ్చుకుంటున్నాడు. “ఈనాటికీ కారు రోడ్డుదిగి ఇంటివైపుకు వస్తున్న శబ్దం నా చెవుల్లో స్పష్టంగా గింగురుమంటుంది” అని ఆయన గుర్తుతెచ్చుకుంటున్నాడు, “అప్పుడు భయంతో నా ఒళ్లు జలదరించడం నాకింకా జ్ఞాపకముంది. మా చిన్న చెల్లి ఎక్కడో ఒకచోటుకిపోయి దాక్కునేది. మా నాన్నొక పరిపూర్ణతావాది, మేము చేయాల్సిన ఇంటి పనులేవీ కూడా సరిగా చేయడంలేదని ఆయన గుడ్లురుముతూ చెప్పేవారు.”
ఈయన అక్క ఇలా జతచేస్తుంది: “మా తలిదండ్రులు ఇద్దర్లో ఎవ్వరూ కూడా మమ్మల్ని హత్తుకోవడంగానీ, ముద్దుపెట్టుకోవడంగానీ నాకు గుర్తులేదు. వాళ్లు ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అనడమో లేక ‘నిన్ను చూసి నేను గర్విస్తున్నాను’ అనడమో విన్నట్లు నాకు గుర్తులేదు. ఒక పిల్లవాడు, ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అన్న మాటలు అసలు ఎన్నడూ వినకపోవడమనేది, ‘నువ్వంటే నాకస్సలు ఇష్టంలేదు’ అన్న మాటలు తన జీవితంలో ప్రతిరోజూ వినడంతో సమానం.”
ఈ వ్యక్తులు బాల్యంలో అనుభవించిన క్షోభ చాలా స్వల్పం అని కొందరనవచ్చు. పిల్లలు కఠినమైన, నిర్దయతోకూడిన మాటలు వినడమూ, నీచమైన ప్రవర్తనను సహించడమూ నిశ్చయంగా అసాధారణమేమీ కాదు. ఇటువంటివి వార్తాపత్రికల ప్రధాన శీర్షికల్లోనూ సంచలనాత్మక టీవీ కార్యక్రమాల్లోనూ ఏమాత్రం కన్పించే విషయాలు కావు. వీటివల్ల కల్గే నష్టం కళ్లకు కన్పించదు. కానీ తలిదండ్రులు ప్రతిరోజూ తమ పిల్లల్ని ఆ విధంగా దుర్వ్యవహారానికి గురిచేస్తూపోతేమాత్రం దాని ప్రభావాలు వినాశకరంగా ఉండవచ్చు అంతేకాదు—అవి జీవితాంతమూ ఉండవచ్చు.
పిల్లల్ని పెంచే పద్ధతుల్ని పరిశీలించడానికని 1951లో ఐదేళ్ల వయస్సున్న పిల్లల గుంపునొకదాన్ని అధ్యయనం చేశారు. ఆ అధ్యయనానికి సంబంధించి 1990లో చేయబడిన మరొక అధ్యయనాన్ని పరిశీలించండి. వారి పెంపకంయొక్క దీర్ఘకాలిక ప్రభావాలపై అంతర్దృష్టిని సాధించడంకోసం పరిశోధకులు ఆ పిల్లల్లోని చాలామంది జాడను కనుక్కోగల్గారు, వారిప్పుడు మధ్యవయస్సులో ఉన్నారు. వారిలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ, భావోద్వేగ ఆరోగ్యం కొరవడుతూ, వైవాహిక జీవితంలోనూ, స్నేహబంధాల్లోనూ, చివరికి పనిచేసే స్థలంలోనూ కష్టాల్నెదుర్కొంటూ ఉన్నవారు—బీద తలిదండ్రులకు పుట్టినవారో లేక ధనికులైన తలిదండ్రులకు పుట్టినవారో కానవసరంలేదనీ, చివరికి స్పష్టంగా కల్లోలభరితమైన కుటుంబాలనుండి వచ్చినవారే కానవసరం లేదనీ ఈ క్రొత్త అధ్యయనం ఒక ముగింపుకు చేరుకుంది. చిన్నతనంలో వాత్సల్యాన్ని ప్రదర్శించక, ఉదాసీనంగా ఉంటూ, అనురాగాన్ని చాలా తక్కువగా చూపుతూనో లేక అసలేమాత్రం అనురాగం చూపకనో ఉన్న తలిదండ్రుల పిల్లలే వీరు.
వెల్లడైన ఈ విషయాలు, దాదాపు 2,000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఒక సత్యాన్ని పేలవమైన స్వరంతో తిరిగి చెబుతున్నాయంతే: “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:21) తలిదండ్రులు పిల్లల్ని మౌఖికంగానూ, భావోద్వేగపరంగానూ దురాచారానికి గురిచేయడం వారిలో తప్పకుండా కోపాన్ని పుట్టిస్తుంది, తత్ఫలితంగా నిజానికి వారి మనస్సు క్రుంగేలా చేస్తుంది.
విషాదంతో పెరగడం (ఆంగ్లం) అనే పుస్తకం ప్రకారం, బాల్యదశలోని క్రుంగుదల అనేటువంటిదేమీ లేదని డాక్టర్లు భావించి ఎంతోకాలం కాలేదు. కానీ అది తప్పని కాలమూ, అనుభవమూ రుజువు చేశాయి. నేడు, బాల్యదశలోని క్రుంగుదల అనేది గుర్తించబడిందనీ, అది ఇక ఏమాత్రం అసాధారణం కాదనీ ఆ పుస్తకం రచయితలు నొక్కి చెబుతున్నారు. దాని కారకాల్లో తలిదండ్రుల తిరస్కారం వారి దుర్వ్యవహారం వంటివి ఉన్నాయి. ఆ రచయితలు ఇలా వివరిస్తున్నారు: “కొన్ని కేసుల్లోనైతే తలిదండ్రులు పిల్లలపై నిర్విరామంగా విమర్శల్ని గుప్పించారు, ఎప్పుడు చూసినా వారిని అవమానిస్తూనే వచ్చారు. మరితర కేసుల్లో తలిదండ్రులు-పిల్లల సంబంధంలో కేవలం శూన్యమే ఉంది: పిల్లల పట్ల తలిదండ్రుల ప్రేమ ఎన్నడూ వ్యక్తం చేయబడలేదు. . . . దాని ఫలితం ప్రాముఖ్యంగా అటువంటి తలిదండ్రులున్న పిల్లలకే విషాదకరంగా ఉంది, ఎందుకంటే ఒక మొక్కకు సూర్యరశ్మీ, నీరూ ఎలాంటివో ఒక పిల్లవానికి—ఆ మాటకొస్తే పెద్దవారికైనా సరే—ప్రేమ అనేదీ అలాంటిదే.”
తలిదండ్రుల ప్రేమ ఒకవేళ స్పష్టంగానూ, బాహాటంగానూ వ్యక్తం చేయబడినట్లైతే పిల్లలు దానిద్వారా ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నేర్చుకుంటారు: తాము ప్రేమకు పాత్రులు; తాము విలువైనవారు. చాలామంది ఈ భావన ఒక రకమైన అహంభావమనీ, ఇతరులకంటే ఎక్కువగా తమను తాము ప్రేమించడమనీ పొరపాటుగా అర్థం చేసుకుంటారు. కానీ ఈ సందర్భంలో దానర్థం అది కాదు. ఈ విషయంపైన వ్రాసిన తన పుస్తకంలో ఒక రచయిత్రి ఇలా అంటుంది: “మీ పిల్లవాడు తనను గురించి తాను కల్గివున్న అభిప్రాయం, తాను ఎటువంటి స్నేహితుల్ని ఎంపికచేసుకుంటాడు, ఇతరులతో ఎలా సర్దుకుపోతాడు, ఎటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు, జీవితంలో ఎంత సాధిస్తాడు అనే విషయాల్ని ప్రభావితం చేస్తుంది.” తనను గురించి తాను సమతుల్యమైన, అహంకారరహితమైన దృక్పథాన్ని కలిగివుండడం ఎంత ప్రాముఖ్యమో గుర్తిస్తూ, బైబిలు అతి గొప్ప ఆజ్ఞల్లో రెండవదిగా దాన్ని పేర్కొంటుంది: “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలె[ను].” (ఇటాలిక్కులు మావి.)—మత్తయి 22:38, 39.
ఒక సాధారణ తల్లి లేక తండ్రి పిల్లవాని ఆత్మగౌరవం వంటి ఎంతో ప్రాముఖ్యమైనదాన్ని నాజూకైనదాన్ని నాశనం చేయాలని కోరుకోవడం ఊహకందని విషయం. అయితే, అది ఎందుకంత తరచుగా జరుగుతుంది? మరి దాన్ని ఎలా నివారించవచ్చు?
[అధస్సూచి]
a జపనీస్‌లో, నోరోమా బాకా!