ఇంటర్‌నెట్ సర్వీసులు, సమాచార వనరులు
ఇంటర్‌నెట్ అందించే సామాన్యమైన సమాచార మూలం, ఎలక్ట్రానిక్ మెయిల్‌ని పంపించడం కొరకూ దాన్ని స్వీకరించడం కొరకూ అయిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓ విధానమే. ఇది ఈ-మెయిల్‌గా ప్రసిద్ధిగాంచింది. నిజానికి, ఈ-మెయిల్ ఇంటర్‌నెట్‌లో సాగే రాకపోకల్లో అధికశాతానికి ప్రాతినిధ్యంవహిస్తోంది. మరి అనేకమందికైతే, ఇది వాళ్లు ఉపయోగించే ఏకైక ఇంటర్‌నెట్ సమాచార మూలమైవుంది. ఇదెలా పనిచేస్తుంది? ఆ ప్రశ్నకు జవాబును కనుగొనేందుకు, తపాలా బట్వాడా పద్ధతిని మొదట పునఃసమీక్షిద్దాం.
మీరు కెనడాలో నివసిస్తున్నారనీ, మాస్కోలో నివసిస్తున్న మీ కుమార్తెకు ఓ ఉత్తరాన్ని పంపించాలని అనుకుంటున్నారనీ ఊహిద్దాం. ఆ ఉత్తరం కవరుపై చిరునామాను సరిగ్గా రాసిన తర్వాత, మీరు దాన్ని పోస్ట్‌డబ్బాలో వేశారు. ఇక ఉత్తరం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తపాలా కార్యాలయం నుండి, ఆ ఉత్తరం వెళ్లాల్సిన గమ్యస్థానానికి బహుశా ఓ ప్రాంతీయ పంపిణీ కేంద్రానికో లేక జాతీయ పంపిణీ కేంద్రానికో పంపించబడుతుంది. అటు తర్వాత అక్కడనుండి మీ కుమార్తె ఇంటికి సమీపంలో ఉన్న ఓ స్థానిక తపాలా కార్యాలయానికి పంపించబడుతుంది.
ఈ-మెయిల్ విషయంలోనూ అదే విధమైన ప్రక్రియ జరుగుతుంది. మీరు మీ ఉత్తరాన్ని మీ కంప్యూటర్‌లో కూర్చిన తర్వాత, మీ కుమార్తె యొక్క ఈ-మెయిల్ చిరునామాను స్పష్టం చెయ్యాలి. ఒక్కసారి మీరీ ఎలక్ట్రానిక్ ఉత్తరాన్ని పంపగానే, అది మీ కంప్యూటర్ నుండి, తరచుగా మీ కంప్యూటర్‌ను టెలిఫోన్ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్‌నెట్‌కు కలిపే మోడెమ్ అని పిలువబడే ఓ సాధనం ద్వారా ప్రయాణిస్తుంది. అది స్థానిక, జాతీయ తపాలా కార్యాలయాల పంపిణీల మాదిరి పనిచేసే వేర్వేరు కంప్యూటర్ల ద్వారా ప్రయాణిస్తుంది. మీ కుమార్తె ఏ కంప్యూటర్‌లో నుండి ఆ ఉత్తరాన్ని తిరిగి పొందగలదో ఆ గమ్యస్థాన కంప్యూటర్‌కు దాన్ని పంపించేందుకు తగిన సమాచారాన్ని అవి కల్గివున్నాయి.
మామూలు తపాలా బట్వాడావలె కాకుండ ఈ-మెయిల్—నెట్‌వర్క్‌లోని ఏదొక భాగం బాగా క్రిక్కిరిసిపోతేనో లేక తాత్కాలికంగా పనిచేయకపోతేనో తప్ప—తరచుగా దాని గమ్యస్థానాన్ని, మరి ఇతర ఖండాలకు కూడా నిమిషాల్లో లేక అంతకన్నా తక్కువ సమయంలో చేరుకుంటుంది. మీ కుమార్తె తన ఎలక్ట్రానిక్ మెయిల్ బాక్స్‌ను చెక్‌చేసినప్పుడు, మీ ఈ-మెయిల్ ఉత్తరాన్ని ఆమె కనుగొంటుంది. ఈ-మెయిల్‌ని దాని వేగమూ, ప్రపంచవ్యాప్తంగా కావల్సినంతమందికి దాన్ని ఒకేసారి పంపించుకునే వీలును కల్పిస్తున్న దాని సదుపాయమూ ప్రసిద్ధిగాంచిన సమాచార సాధనంగా చేశాయి.
న్యూస్ గ్రూపులు
జనాదరణ పొందిన మరొక సర్వీసు, యూజ్‌నెట్ అని పిలువబడింది. యూజ్‌నెట్ నిర్దిష్టమైన అంశాలపై గ్రూప్ చర్చలు చేసుకునేందుకు న్యూస్ గ్రూపులకు ప్రవేశార్హతను అందిస్తోంది. కొన్ని న్యూస్ గ్రూపులు వేర్వేరు వినియోగధార వస్తువుల అమ్మకాలపైనా లేక కొనుగోళ్లపైనా దృష్టినిల్పుతున్నాయి. వేలాది న్యూస్ గ్రూపులు ఉన్నాయి, మరి ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్న వ్యక్తి ఒక్కసారి యూజ్‌నెట్‌లోనికి ప్రవేశార్హతను గనుక పొందితే, వాటికి చందాలు కట్టాల్సిన అవసరమేమీ లేదు.
తపాలా బిళ్లల సేకరణలో నిమగ్నమైన ఓ న్యూస్ గ్రూపులో ఒకరు చేరారని ఊహిద్దాం. ఈ హాబీని గూర్చిన క్రొత్త మెస్సేజ్‌లను (సమాచారాలను) ఈ గ్రూపుకు చందాకట్టిన ఇతరులు పంపించినప్పుడు, ఆ మెస్సేజ్‌లు క్రొత్తగా చేరిన ఈ వ్యక్తికి లభ్యమౌతాయి. ఈ వ్యక్తి న్యూస్ గ్రూపుకు ఎవరో ఒకరు పంపించిన సమాచారాన్ని మాత్రమేగాక దానికి ప్రతిస్పందనగా ఇతరులు రాసిన వాటిని కూడా పునఃసమీక్షిస్తాడు. ఉదాహరణకు, ఒకరు ఫలానా తపాలా బిళ్లల పరంపరను గూర్చిన సమాచారాన్ని కోరినట్లైతే, అటుతర్వాత కొంతసేపటికి ఈ న్యూస్ గ్రూపుకు చందాదారులైన వారందరికీ వెనువెంటనే లభ్యమయ్యేలా సమాచారాన్ని అందిస్తూ ప్రపంచపు నలుమూలల నుండీ అనేక ప్రత్యుత్తరాలు రావొచ్చు.
దీనికి కొద్ది తేడాతో ఉన్నదే బులెటిన్ బోర్డ్ సిస్టమ్ (బిబిఎస్). సాధారణంగా ఓ వ్యక్తిచేగానీ లేక ఒక గుంపుచే గానీ నిర్వహించబడుతున్న ఒక కంప్యూటర్‌లో ఫైళ్లన్నీ నెలకొల్పబడ్డం విషయంలో మినహా, బిబిఎస్‌లు యూజర్‌నెట్‌లానే ఉంటాయి. ఈ న్యూస్ గ్రూపులు చర్చించే విషయాలు, వాటిని ఉపయోగించే వారి అభిరుచుల్నీ, దృక్కోణాల్నీ, నైతిక విలువల్నీ ప్రతిబింబిస్తాయి గనుక విచక్షణా జ్ఞానం అవసరం.
ఫైళ్లను పంచుకోవడమూ, టాపిక్ సెర్చింగ్
ఇంటర్‌నెట్ మొదటి లక్ష్యాల్లో ఒకటి, భూగోళవ్యాప్తంగా సమాచారాన్ని పంచుకోవడం. ముందు శీర్షికలో ప్రస్తావించబడిన ఉపాధ్యాయుడు, అప్పటికే బోధనా అంశాల్ని తయారుచేసుకొని దాన్ని పంచుకోవడానికి సుముఖుడైన మరో విద్యావేత్తను ఇంటర్‌నెట్‌పై కనుగొన్నాడు. 3,200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, నిమిషాల్లోనే ఫైళ్లు బదిలీ అయిపోయాయి.
ఓ విషయాంశాన్ని ఇంటర్‌నెట్‌లో ఎక్కడ కనుక్కోవాలో ఒకనికి తెలియనప్పుడు ఏ సహాయం లభ్యమౌతుంది? టెలిఫోన్ డైరెక్టరీని ఉపయోగించి మనమొక ఫోన్ నంబర్‌ని కనుగొన్నట్లుగానే, సెర్చి సైట్లుగా (విషయాన్వేషణ స్థలాలుగా) పేరుగాంచిన వాటిలోనికి మొదట ప్రవేశార్హతను సంపాదించడం ద్వారా ఇంటర్‌నెట్‌పై ఆసక్తికరమైన లొకేషన్లను (ప్రదేశాలను) ఇంటర్‌నెట్ ఉపయోగించే వ్యక్తి పట్టుకోవచ్చు. అతడు సెర్చి (విషయాన్వేషణ) చేయడానికి ఓ పదాన్నిగానీ లేక ఓ పదబంధాన్నిగానీ ఇస్తాడు; తర్వాత సమాచారం కనుగొనబడే ఇంటర్‌నెట్ లొకేషన్ల జాబితాతో ఆ సైటు (స్థలం) ప్రత్యుత్తరం ఇస్తుంది. సాధారణంగా, సెర్చి రద్దీగా ఉండదు. సెర్చిచేయడానికి కొన్ని క్షణాలు మాత్రమే పడతాయి!
ముందు ప్రస్తావించబడిన రైతు, కంప్యూటర్లనూ, ఉపగ్రహ చిత్రాలనూ ఉపయోగించే ప్రిసిషన్ ఫార్మింగ్ (ప్రామాణిక వ్యవసాయం) అని పిలువబడిన ఓ క్రొత్త టెక్నిక్ గురించి విన్నాడు. ప్రిసిషన్ ఫార్మింగ్ అనే పదబంధాన్ని సెర్చ్ సైట్‌లో టైపు చేయడం ద్వారా ఆ పద్ధతిని ఉపయోగిస్తున్న రైతుల పేర్లనూ, అలాగే దాన్ని గూర్చిన సవివరణాత్మకమైన సమాచారాన్నీ ఆయన కనుగొన్నాడు.
వరల్డ్ వైడ్ వెబ్
ఇంటర్‌నెట్‌లోని ఓ భాగం, వరల్డ్ వైడ్ వెబ్ (లేక, వెబ్) అని పిలువబడింది. ఇది గ్రంథకర్తలు పాదవచనాలకు సంబంధించిన పాతకాలంనాటి తలంపును ఓ క్రొత్తపంథాలో ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఓ పత్రికా శీర్షిక రచయితగానీ లేక పుస్తక రచయితగానీ పాదవచన గుర్తును పెట్టినప్పుడు, మనం అదే పేజీ క్రిందవున్న భాగాన్ని పరిశీలిస్తాం. మనం బహుశా మరో పేజీనిగానీ లేక మరో పుస్తకాన్నిగానీ చూడమని కోరబడవచ్చు. ఇంటర్‌నెట్ కంప్యూటర్ డాక్యుమెంట్ల రచయితలు తమ డాక్యుమెంట్లలోవున్న ఓ పదాన్నిగానీ లేక పదబంధాన్నిగానీ లేక చిత్రాన్నిగానీ అడుగున గీతగీసే లేక హైలైట్‌చేసే (ఉన్నతపర్చి చూపే) టెక్నిక్‌ని ఉపయోగిస్తూ ప్రధానంగా అదే విధమైన పద్ధతిని అనుసరిస్తారు.
హైలైట్ చేయబడిన పదం లేక చిత్రం, దాని ఇంటర్‌నెట్ సంబంధిత సమాచార మూలం ఉన్నదనీ అది తరచుగా మరో డాక్యుమెంటులో ఉన్నదనీ పాఠకునికి ఓ సంకేతం ఇస్తుంది. ఈ ఇంటర్‌నెట్ డాక్యుమెంట్‌ని తెచ్చుకోవచ్చు. పాఠకుని కోసం దాన్ని వెనువెంటనే ప్రదర్శించవచ్చు. ఈ డాక్యుమెంట్ బహుశా వేరే కంప్యూటర్‌లో, మరో దేశమందు ఉండి ఉండొచ్చు. యాక్సెస్ ది ఇంటర్‌నెట్! రచయితయైన డేవిడ్ పీల్, ఈ టెక్నిక్ “మిమ్మల్ని అసలైన డాక్యుమెంట్లకు సంబంధించిన సంప్రదింపు డాక్యుమెంట్లకు మాత్రమేగాక ఆ అసలైన డాక్యుమెంట్లకు కూడా కలుపుతుంది” అని తెలియజేస్తున్నాడు.
ఫోటోలనూ ఛాయాచిత్రాలనూ భద్రపర్చడాన్నీ, వాటిని వెతికి పట్టుకోవడాన్నీ అలాగే వ్యంగ్యచిత్రాలనూ వీడియోలనూ సౌండ్లనూ భద్రపర్చడాన్నీ, వాటిని ప్లేచేయడాన్నీ కూడా వెబ్ సుసాధ్యం చేస్తుంది. దీనికి ముందున్న శీర్షిక ప్రారంభంలో ప్రస్తావించబడిన గృహిణియైన లోమా, విశ్వానికి సంబంధించిన ప్రస్తుత సిద్ధాంతాల్ని గూర్చిన వర్ణభరితమైన నిడివితక్కువగల ఓ చిత్రాన్ని సంపాదించి, ప్రదర్శించింది. ఆమె తన కంప్యూటర్ ఆడియో సిస్టమ్ ద్వారా ఆ చిత్రకథా వివరణను విన్నది.
నెట్ సర్ఫింగ్
వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించడం ద్వారా, ఓ వ్యక్తి వేర్వేరు దేశాల్లోని కంప్యూటర్లలో భద్రపర్చబడిన సమాచారాన్నీ, వర్ణభరితమైన ఛాయాచిత్రాల్నీ సులభంగానూ త్వరితగతినా వీక్షించవచ్చు. వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించడం ఎంతో సులభం. ఇది కొన్ని రీతుల్లో చూస్తే ప్రయాణం చేయడానికి సమపోలికగా ఉండొచ్చు. వెబ్ ప్రదర్శించే మృత సముద్ర గ్రంథపు చుట్టల్నిగానీ లేక మారణహోమ జ్ఞాపకార్థ మ్యూజియమునుగానీ ఒకడు సందర్శించవచ్చు. ఒక ఇంటర్‌నెట్ వెబ్ సైట్ నుండి మరో సైటుకి ముందుకూ వెనుకకూ చురుకుగా కదిలే ఈ సామర్థ్యాన్నే నెట్ సర్ఫింగ్ అంటారు.
వ్యాపార సంస్థలూ, మరితర సంస్థలూ తమ ఉత్పాదనల్నీ లేక సర్వీసుల్నీ ప్రకటించడానికీ అలాగే ఇతర సమాచారాల్ని అందించడానికీ ఓ మాధ్యమంగా వెబ్‌నందు ఆసక్తి చూపిస్తున్నాయి. వాళ్లు ఓ రకమైన ఎలక్ట్రానిక్ స్టోర్‌ఫ్రంట్ విండో అయిన ఒక వెబ్ పేజీని సృష్టిస్తారు. ఒక సంస్థ యొక్క వెబ్ పేజీ చిరునామా తెల్సిన తర్వాత, భావి వినియోగదార్లు “షాపింగ్”కు వెళ్లేందుకు బ్రౌజర్‌ను ఉపయోగించవచ్చు లేక సమాచారాన్ని బ్రౌజింగ్ చేయవచ్చు. అయితే, మార్కెట్లలో దొరికే అన్ని ఉత్పాదక వస్తువులూ, సేవలూ లేక సమాచారమూ ఎలా ఆరోగ్యదాయకమైనవికావో అలాగే ఇంటర్‌నెట్‌పై దొరికేవన్నీ ఆరోగ్యదాయకమైనవికావు.
గోప్యంగానూ, భద్రతాయుతంగానూ వ్యవహారాల్ని కొనసాగించేందుకు తగినంత భద్రతగలదిగా ఇంటర్‌నెట్‌ను చేయడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. (భద్రతను గురించి మనం తర్వాత మరింత చర్చిద్దాం.) ఈ వాణిజ్యపరమైన కార్యకలాపాలు ఇంటర్‌నెట్‌పై కలుగజేసిన రద్దీ అంతకంతకూ పెరుగుతున్నందున ప్రపంచవ్యాప్తంగా మరొక ఇంటర్‌నెట్‌ను రూపొందించాల్సి వచ్చింది. దీనిని కొందరు ఇంటర్‌నెట్ II అని పిలిచారు.
“చాట్” అంటే ఏమిటి?
ఇంటర్‌నెట్ అందించే మరో సర్వసామాన్యమైన సర్వీసు, ఇంటర్‌నెట్ రిలే చాట్ లేక చాట్. చాట్ ఓ గుంపుగా సమకూడిన ప్రజలు మారు పేర్లు ఉపయోగిస్తూ, ఒకరికొకరు మెస్సేజ్‌ల్ని వెంటవెంటనే పంపించుకునేలా అనుమతిస్తుంది. దీనిని వేర్వేరు వయస్సులకు చెందిన గుంపులు ఉపయోగించినా, విశేషంగా ఇది యువత మధ్య ఆదరణపొందింది. ఒక్కసారి కనెక్ట్ చేయబడినట్లైతే, యూజర్ (చాట్‌ను ఉపయోగించే వ్యక్తి) ప్రపంచమందంతటా ఉన్న అనేకమంది ఇతర యూజర్లకు పరిచయమవుతాడు.
కాల్పనిక విజ్ఞానశాస్త్రం, చలనచిత్రాలూ, క్రీడలూ, రొమాన్స్ వంటి కావాల్సిన అంశాన్ని చూపించే చాట్ రూమ్‌లు (ప్రదేశాలు) లేక చాట్ ఛానళ్లు సృష్టించబడ్డాయి. చాట్ రూమ్‌లోపల టైప్ చేయబడిన మెస్సేజ్‌లన్నీ, ఆ చాట్ రూమ్‌లో భాగంవహిస్తున్న వాళ్లందరి కంప్యూటర్ స్క్రీన్‌లపై దాదాపుగా ఏకకాలంలో కన్పిస్తాయి.
చాట్ రూమ్ ఏక కాలంలో కలియ తిరుగుతూ, మాట్లాడుకుంటూ ఉన్న ఓ పార్టీలోని ప్రజలను పోలి ఉంటుంది. అలా కలియ తిరగడానికీ, మాట్లాడుకోవడానికీ బదులుగా ఈ చాట్ రూమ్‌లో అందరూ చిన్న చిన్న మెస్సేజ్‌ల్ని టైపుచేస్తూ ఉంటారు. చాట్ రూమ్స్, సాధారణంగా 24 గంటలూ పనిచేస్తూ ఉంటాయి. క్రైస్తవులు, 1 కొరింథీయులు 15:33వ వచనంలో ఉన్న సహవాసాన్ని గూర్చిన బైబిలు సూత్రం వంటి సూత్రాల్ని జీవితంలోని అన్నికోణాల్లోనూ వాళ్లు అన్వయించుకున్నట్లుగానే చాట్ గ్రూపుల్లో భాగంవహించడం విషయంలోనూ అన్వయించుకుంటారు.a
ఇంటర్‌నెట్‌కు ఎవరు చెల్లిస్తారు?
‘ఇంటర్‌నెట్‌పై ఒకరు చేయగల్గే దూర ప్రయాణాలకు చార్జీలను ఎవరు చెల్లిస్తారు?’ అని బహుశా మీరు ఆలోచిస్తుండవచ్చు. ఖర్చుల్ని యూజర్లందరూ అంటే సమిష్టిగానూ లేక విడివిడిగానూ పంచుకుంటారు. అయినప్పటికీ, ఇంటర్‌నెట్‌ను ఉపయోగించే వ్యక్తి అనేకమైన అంతర్జాతీయ సైట్లను సందర్శించినప్పటికీ కూడా ఆయనకు దూరాభారాన్ని దృష్టిలో పెట్టుకొని తయారుచేసే టెలిఫోన్ బిల్‌ను ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. ఇంటర్‌నెట్‌ను ఉపయోగించే అనేకమంది వ్యక్తులు, అనేక సందర్భాల్లో తమ దగ్గరనుండి నిర్ణీత నెలసరి ఫీజును వసూలు చేసే ఇంటర్‌నెట్ సర్వీస్‌ను అందించే స్థానిక వాణిజ్య కంపెనీ దగ్గర ఖాతాను కల్గివున్నారు. ఇంటర్‌నెట్ సర్వీసును అందించేవాళ్లు, అదనపు ఫోన్‌ల కొరకయ్యే ఖర్చుల్ని అరికట్టేందుకు సాధారణంగా ఓ స్థానిక టెలిఫోన్ నంబర్‌ని ఇస్తారు. ఇంటర్‌నెట్ యాక్సెస్ నెలసరి ఫీజు దాదాపు 20 (అమెరికన్) డాలర్లు.
మీరు గ్రహించినట్లుగానే, ఇంటర్‌నెట్‌కున్న భవిష్యత్తు అపరిమితమైనది. కానీ మీరు ఈ సూపర్‌హైవే సమాచారమందు అభివృద్ది సాధిస్తారా?
[అధస్సూచి]
a చాట్ రూమ్స్ విషయంలో జాగ్రత్తవహించాల్సిన అవసరతను గురించి తర్వాత చర్చించబడుతుంది.
[7వ పేజీలోని బాక్సు]
ఇంటర్‌నెట్ చిరునామాలు—అవి ఏమైవున్నాయి?
ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ చేయబడిన ప్రజలను గుర్తించడం, ఈ-మెయిల్ చిరునామాలతో సాధించబడింది. drg@tekwriting.com అనే ఈ-మెయిల్ చిరునామాగల ఓ స్నేహితునికి మీరు ఈ-మెయిల్ పంపించాలని అనుకున్నారని ఊహిద్దాం.b ఈ ఉదాహరణలో, ఆ వ్యక్తి గుర్తింపును లేక లాగిన్‌ను “drg” సూచిస్తుంది. ప్రజలు తమ పూర్తిపేరునో లేక పొట్టిసంతకాల్నో తరచుగా తమ లాగిన్‌గా ఉపయోగిస్తారు. “@” చిహ్నాన్ని అనుసరించివున్న పదం, బహుశా తమ యజమానిదీ, తమ వ్యాపార స్థలానిదీ లేక తమకు ఈ-మెయిల్ సర్వీసును అందించేవారిదీ అయివుండొచ్చు. ఈ విషయంలో “tekwriting” అనేది అలాంటి ఈ-మెయిల్ సర్వీస్ అందించేవారిని గుర్తిస్తుంది. ఆ చిరునామాలోని చివరి భాగం, మీ స్నేహితుడు ఏ సంస్థనుండి లాగిన్ చేశాడో ఆ సంస్థను గుర్తిస్తుంది. మరి ఈ విషయంలో “com” అనేది వాణిజ్యపరమైన సంస్థను సూచిస్తుంది. విద్యాపరమైన సంస్థలు పేరును పెట్టడంలో అదే విధమైన నియమాన్ని అనుసరించినా అది “edu”తో ముగుస్తుంది, మరి లాభరహితమైన సంస్థలకైతే “org”తో ముగుస్తుంది. మరొక ప్రామాణిక ఈ-మెయిల్ చిరునామా, ఆ చిరునామాగల వ్యక్తి దేశాన్ని సూచించే సంకేతంతో ముగుస్తుంది. ఉదాహరణకు, lvg@spicyfoods.ar అనే చిరునామా, “lvg” అను లాగిన్‌గల వ్యక్తి అర్జెంటినా దేశంలోని “spicyfoods” అనే సంస్థకు సంబంధించినవాడని సూచిస్తుంది.
మరొక రకమైన చిరునామాలు ఇంటర్‌నెట్‌పై వెబ్ డాక్యుమెంట్లు ఉండేచోటును తెలియజేస్తాయి. వర్షాధార అడవులపై పరిశోధనను గూర్చిన సమాచారం, http://www.ecosystems.com/research/forests/rf వద్ద ఉన్న వెబ్ డాక్యుమెంట్‌లో కనుగొనబడుతుందని అనుకుందాం. “http” అనే అక్షరాలు (హైపర్‌టెక్ట్స్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్) ఓ తరహా వెబ్ డాక్యుమెంట్‌ని నిర్వహించడం కొరకైన ప్రోటోకాల్‌ని గుర్తిస్తుంది, మరి “www.ecosystems.com” అనేది వెబ్ సర్వర్‌గా పనిచేసే కంప్యూటర్ పేరును—మరి ఈ విషయంలో “ecosystems”గా నిర్దేశించబడిన ఓ వాణిజ్యసంస్థ పేరును సూచిస్తుంది. అసలైన వెబ్ డాక్యుమెంట్, ఈ చిరునామాలోని “/research/forests/rf” అనే ఆఖరిభాగమే. వెబ్ చిరునామాలు, తరచుగా యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్‌లు (కావాల్సిన చిరునామాను తెలిపే విధానం) అనీ లేక క్లుప్తంగా యుఆర్‌ఎల్‌లు అనీ పిలువబడతాయి.
[అధస్సూచి]
b ఉదహరించబడిన ఇంటర్‌నెట్ చిరునామాలు ఊహాజనితమైనవి.