కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 7/8 పేజీ 31
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వ్రాసి ఇవ్వబడుతున్న మందుల నకిలీల విషయంలో జాగ్రత్తపడండి
  • ఎముకల వ్యాపారులు
  • సమయాని కన్నా మరెక్కువే చెప్పే చేతిగడియారాలు
  • విరూపంగా కనిపించడం
  • చారిత్రాత్మక కోత
  • సింగపూర్‌లోని విద్యార్థులు అగ్రగణ్యులు
  • రోగులకు సర్జరీ చేసేటప్పుడు వెచ్చదనాన్నిచ్చారు
  • కఠిన దారిద్ర్యం నుండి అతి సంపన్నస్థితికి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ముచ్చటైన కోలా ముగ్ధులను చేస్తుంది
    తేజరిల్లు!—1992
  • మనుష్యులను పట్టు జాలరులుగా సేవచేయుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1997
g97 7/8 పేజీ 31

ప్రపంచ పరిశీలన

వ్రాసి ఇవ్వబడుతున్న మందుల నకిలీల విషయంలో జాగ్రత్తపడండి

ప్రతి సంవత్సరం, దాదాపు 1,600 కోట్ల డాలర్ల అమ్మకంతో నకిలీ మందుల వ్యాపారం వర్థిల్లుతోంది. పారిస్‌ వార్తాపత్రికయైన లా మోన్డ్‌ అభిప్రాయం ప్రకారం, “ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అమ్మబడుతున్న మందుల్లో కనీసం 7 శాతం నకిలీవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనావేస్తుంది.” అమ్మబడుతున్న నకిలీ మందుల శాతం ఎంత అధికంగా ఉందంటే, అది బ్రెజిల్‌లో 30 శాతమూ, ఆఫ్రికాలో 60 శాతమూ ఉండవచ్చు. ఈ నకిలీ మందుల్లో నాసి రకం మొదలుకొని, పూర్తిగా నిరుపయోగకరమైన మందులు లేదా విషపదార్థాలుగల మందులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, నైజర్‌లో మెనిన్‌జైటిస్‌ మహామారిని లా మోన్డ్‌ ఉటంకిస్తోంది. నైజర్‌లో వేలాదిమందికి ఇవ్వబడిన టీకాలు వట్టి నీళ్ళేనని తేలింది. నైజీరియాలో, ఘనీభవ విరుద్ధ పదార్థమున్న సిరప్‌ ఇవ్వడంతో 109 మంది పిల్లలు మరణించారు. “బ్లాక్‌మార్కెట్లు చాలా చౌక ధరకు మందులను అందజేస్తాయి కనుక ఆసుపత్రులు కూడా బ్లాక్‌మార్కెట్లనే ఆశ్రయిస్తున్నాయి” అని ఆ వార్తా పత్రిక చెబుతుంది. అనేక దేశాల్లో లేదా అవినీతితో కూడిన చట్టం అమలులో ఉన్నందువల్ల ఈ సమస్యను పరిష్కరించడంలో ఆరోగ్యశాఖాధికారులు చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.

ఎముకల వ్యాపారులు

“నిరాశచెందిన యుద్ధబాధిత కాబుల్‌ నివాసులు కోళ్ళ తిండి కొరకు మానవ ఎముకలను అమ్మేందుకు వాటిని త్రవ్వి తీస్తున్నారు” అని రోయిటర్స్‌ న్యూస్‌ సర్వీస్‌ నివేదిస్తుంది. ఎముకల్లో కాల్షియమ్‌, భాస్వర లవణం, కార్బనేట్‌ సమృద్ధంగా ఉంటాయి కనుక, ఎముకలను జంతువుల మేత కొరకూ, సబ్బు తయారీలోనూ, వంట నూనె తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. ఆరు కిలోగ్రాముల బరువున్న అస్థిపంజరంతో దాదాపు 50 సెంట్ల డబ్బును సంపాదించవచ్చు. కడుపేదరికంలో ఉన్న పట్టణవాసులకు ఆ మాత్రం డబ్బు నిజంగా చాలా పెద్ద మొత్తమే. “ఇది మంచి వ్యాపారం. నేను తరచూ జంతువుల ఎముకలనే ఏరుతున్నప్పటికీ, ఇక్కడ మానవ ఎముకలు సులభంగా దొరుకుతాయని” 14 ఏండ్ల ఫేజ్‌డీన్‌ అంటున్నాడు. విచారకరంగా, ఆఫ్ఘనిస్తాన్‌లో అనేక సంవత్సరాలు అంతర్యుద్ధం జరిగినందువల్లనే ఖనిజసమృద్ధిగల ఈ పదార్థం సులభంగా లభ్యమౌతుంది.

సమయాని కన్నా మరెక్కువే చెప్పే చేతిగడియారాలు

రీయోడేజనరోలో, యూనివర్సిటీ ఎన్‌ట్రన్స్‌ పరీక్షలో 77 మంది విద్యార్థులు కాపీలు కొట్టేందుకు డిజిటల్‌ చేతిగడియారాలను ఉపయోగించినట్లు కనుగొనబడిన తర్వాత అనర్హులుగా చేయబడ్డారు అని ఊ గ్లోబూ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. ఆ చేతిగడియారాలు దాదాపు టెలిఫోన్‌ పేజర్‌లాగే పనిచేశాయి; వాటిలో టెలిఫోన్‌ నెంబర్‌లు వచ్చే బదులు, పరీక్షా ప్రశ్నలకు సరైన జవాబుల వచ్చాయి. విద్యార్థులు ఒక్కో చేతిగడియారానికి 14,000 డాలర్ల వరకూ ఖర్చుపెట్టారని ఆ వార్తాపత్రిక చెబుతుంది. ఆసక్తికరంగా, 1987 నాటికే ఇంగ్లండ్‌లోని మరియు వేల్స్‌లోని స్కూల్‌ ఎగ్జామినింగ్‌ బోర్డులు కంప్యూటరైజ్డ్‌ చేతిగడియారాలను ఉపయోగించే మోసగాళ్ళను ఒక కంట కనిపెడుతుండాలని ఉపాధ్యాయులకు హెచ్చరికనిచ్చాయి.

విరూపంగా కనిపించడం

అద్దంలో చూసుకునే చాలా మంది ప్రజలు తమకు కనిపించే ప్రతిబింబం తమదేనని అంగీకరిస్తారు. బాడీ డిస్‌మార్ఫిక్‌ డిసార్డర్‌ అని పిలువబడే స్థితితో బాధపడుతున్న ప్రజలు అద్దంలో చూసుకున్నప్పుడు తమ రూపం విరూపంగా కనిపిస్తుంది. “ఈ స్థితిలో, వాళ్ళు ఏదో ఒక కవళికను గూర్చే ఆలోచిస్తూ అది వాస్తవానికి మామూలుగానే ఉన్నప్పటికీ ఎంతో అసహ్యంగా ఉన్నట్లు ఊహించుకుంటారు” అని కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియా పత్రికయైన ది ప్రొవిన్స్‌ చెబుతుంది. ఊహించుకున్న లోపాలను గూర్చిన మానసిక వ్యధ ఎంతో అధికంగా ఉండడం వల్ల ఆ వ్యాధితో బాధపడేవారిలో 25 శాతం మంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారని న్యూయార్క్‌ సైకియాట్రిస్ట్‌ ఎరిక్‌ హాలండర్‌ చెబుతున్నాడు.

చారిత్రాత్మక కోత

“చైనా దేశ చరిత్రలో మొదటిసారిగా, గోధుమ పొలాల్లో యంత్రాలు మానవుల కన్నా ఎక్కువ పని చేశాయి” అని రోయిటర్స్‌ న్యూస్‌ సర్వీస్‌ రిపోర్టు చేసింది. 8,00,000 కన్నా ఎక్కువ కోత యంత్రాలు ఉపయోగించబడ్డాయని చెప్పబడుతుంది. సా.శ.పూ. 1300కి కొంత కాలం క్రితం మొదటిసారిగా చైనాలో గోధుమలు ప్రవేశపెట్టబడ్డాయి. అది మొదలుకొని ఇప్పటివరకూ చిన్న కుటుంబ పొలాల్లో ఫలకరంగా గోధుమలు పండించబడుతున్నాయి. చాలా వరకు పొలంపనులను చేతితోనే చేయడం జరుగుతోంది. ప్రపంచ జనాభాలోని 20 శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలకు చైనా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, సాగు చేయగల భూమిలో 7 శాతం భూమి మాత్రమే దాని స్వాధీనంలో ఉందనీ, “వ్యవసాయ అధికారులు దేశ పొలాల్లో యంత్రాల ఉపయోగాన్ని పెంచాలనే ఆతురతతో ఉన్నారనీ” ఆ రిపోర్టు చెప్పింది.

సింగపూర్‌లోని విద్యార్థులు అగ్రగణ్యులు

41 దేశాల నుండి వచ్చిన ఐదు లక్షల కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్త విద్యాభ్యాస ప్రమాణాలను పోల్చి చూసే 90 నిమిషాల పరీక్షలో పాల్గొన్నారు. పరీక్షా ఫలితాలేమిటి? గణితంలోనూ విజ్ఞానశాస్త్రంలోను ప్రపంచంలోని అగ్రగణ్యులైన విద్యార్థులు సింగపూర్‌లోని విద్యార్థులని పరీక్షలోని మార్కులు తెలుపుతున్నాయి. సింగపూర్‌ తర్వాత, గణితంలో ఎక్కువ మార్కులున్న మిగిలిన పది దేశాలు—దక్షిణ కొరియా, జపాన్‌, హాంగ్‌ కాంగ్‌, బెల్జియమ్‌, చెక్‌ రిపబ్లిక్‌, స్లోవక్‌ రిపబ్లిక్‌, స్విట్జర్‌లాండ్‌, నెదర్‌లాండ్స్‌, స్లొవానియా. విజ్ఞానశాస్త్రంలో ఎక్కువ మార్కులు సంపాదించిన దేశాలు—సింగపూర్‌, చెక్‌ రిపబ్లిక్‌, జపాన్‌, దక్షిణ కొరియా, బల్గేరియా, నెదర్‌లాండ్స్‌, స్లొవానియా, ఆస్ట్రియా, హంగేరీ, ఇంగ్లండ్‌. దాదాపు 34,00,000 మంది ప్రజలు మాత్రమే ఉన్న ఒక దేశం ఎలా ప్రపంచంలోకెల్ల చురుకైనదయ్యింది? బహుశా కష్టపడి కృషి చేయడం వల్లే కావచ్చు. హోమ్‌వర్క్‌ చేయడానికి విద్యార్థులు గడిపే అంతర్జాతీయ సరాసరి గంటలు 2 నుండి 3 గంటలైతే, సింగపూర్‌ విద్యార్థులు ప్రతిరోజు గడిపే సరాసరి గంటలు 4.6 అని ఏసియావీక్‌ రిపోర్టు చేస్తుంది.

రోగులకు సర్జరీ చేసేటప్పుడు వెచ్చదనాన్నిచ్చారు

గాలివలన కలిగే బాక్టీరియా పెరుగుదలను అరికట్టడానికి ఆసుపత్రిలో ఆపరేషన్‌ గదులను చల్లగా ఉంచడం ఇన్‌ఫెక్షన్‌ను మూడింతలు చేస్తుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ అనేస్తేసియాలజిస్ట్‌ అయిన డానియేల్‌ సెస్లర్‌ చేసిన క్రొత్త అధ్యయనం చెబుతోంది. “గాయాలకు ఇన్‌ఫెక్షన్‌ అయ్యేందుకు కారణం నిజానికి గాలిలో తేలుతున్న బాక్టీరియా కాదు కానీ, చర్మం మీద లేదా శరీరం లోపల ఉన్న బాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడేందుకు రోగికున్న ప్రతిరోధకశక్తి తగ్గిపోవడమేనని” డా. సెస్లర్‌ అంటున్నాడు. చల్లగా ఉండే ఆపరేషన్‌ గదులు రోగి శరీర ఉష్ణోగ్రతను మైనస్‌ 16 డిగ్రీల సెల్షియస్‌ వరకూ తగ్గించగలవు. ఇన్‌ఫెక్షన్‌తో పోరాడేందుకు రక్తంలో ప్రాణవాయువు ప్రవహించవలసిన అవసరముంది. శరీరంలో ఉష్ణోగ్రత తక్కువైతే రక్తంలో ప్రాణవాయువు ప్రవాహం తగ్గుతుంది. “వ్యాధులను నిరోధించే కణాలూ, సేంద్రీయ పదార్థాలూ శరీరం చల్లగా ఉంటే సరిగ్గా పనిచేయవు” అని సెస్లర్‌ అంటున్నాడు. సర్జరీ సమయంలో శరీరాన్ని సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచిన రోగులకు ఇన్‌ఫెక్షన్‌ రేటు తగ్గడమే కాక, వెచ్చదనం లభించని రోగుల కన్నా దాదాపు మూడు రోజులు ముందే వారు ఆసుపత్రి విడిచిపెట్టగల్గారని సెస్లర్‌, సెస్లర్‌ సహోద్యోగులూ కనుగొన్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి