“ఆయన దాన్ని పేపరులో ప్రచురించాడు”
మెప్పుదలగల ఒక బాలిక కెనడా నుండి వాచ్‌టవర్ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ వ్రాసిన ఉత్తరంలో అలా వ్రాసింది. ఆమె పాఠశాలలో ఒక వక్తృత్వపు పోటీలో పాల్గొంది, న్యాయనిర్ణేతలలో ఒకరికి ఆమె ప్రసంగం ఎంతో నచ్చింది, దాన్ని స్థానిక వార్తాపత్రికలో ముద్రించడానికి ఆయన అనుమతి కోరాడు.
ఆ బాలిక తన అంశాన్ని ఎలా ఎన్నుకుంది? “మా తరగతిలో, ముఖ్యంగా అమ్మాయిలకు వ్యర్థప్రసంగం చేసే సమస్య ఉండేది” అని ఆమె వివరించింది. కాబట్టి ఆమె తాను చదివిన తేజరిల్లు! పత్రికలోని సమాచారం ఆధారంగా తన ప్రసంగాన్ని సిద్ధం చేసుకుంది. ఆమె ప్రసంగంలోని కొన్ని భాగాలు, ఒంటారియో నందలి నయాగరా జలపాతానికి చెందిన ది రివ్యూ అనే స్థానిక వార్తాపత్రికలో, “వ్యర్థప్రసంగం హానికరమైనది కాగలదు; మీరెలా భావిస్తారు?” అనే శీర్షిక క్రింద ప్రచురించబడ్డాయి.
న్యాయనిర్ణేతలలో ఒకరిని అంతగా ప్రభావితం చేసినదేమిటి? ఆ బాలిక ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని భాగాలను గమనించండి: “నేడు సమాజంలో వ్యర్థప్రసంగం సర్వసాధారణం. అది ఎంతో తలనొప్పిని, నిద్రలేని రాత్రులను, అన్నిటికంటే ముఖ్యంగా బాధాకరమైన భావాలను కలిగించగలదు. . . .
“వ్యర్థప్రసంగం చేయడాన్ని ఆపడం అసాధ్యం ఎందుకంటే మాట్లాడడం మానవ నైజం. మనం చేయగల ఒక పని ఏమిటంటే దాన్ని అదుపులో ఉంచుకోవడమే. దీనికి సంబంధించిన కొన్ని సూచనలు ఇలా ఉన్నాయి: 1. అగ్నికి ఆజ్యం పోయకండి. 2. వ్యర్థప్రసంగాన్ని వినకండి. . . . వ్యర్థప్రసంగాన్ని వినడం ద్వారా, చెప్పబడుతున్నదానితో మీరు ఏకీభవిస్తున్నట్లు అనిపించవచ్చు. 3. హానికరమైన వ్యర్థప్రసంగం మిమ్మల్ని అబద్ధికులను కూడా చేయవచ్చు. 4. అన్నిటికంటే ముఖ్యమైన సలహా ఏమిటంటే, మీరు మాట్లాడే ముందు ఆలోచించండి! ‘నా గురించే ఇలా చెప్పబడితే నేనెలా భావిస్తాను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.”
“నాలుగు చర్యలనూ అమలులో పెడితే, మీరు తప్పకుండా మంచి వ్యక్తిగా తయారౌతారు” అని ఆ బాలిక ముగించింది.
పాఠశాలలో ఉండే యౌవనులకే కాకుండా, ప్రతి ఒక్కరికి ఎంతటి ఆచరణాత్మకమైన సలహా! వివిధ అంశాలపై తేజరిల్లు! సమయానుకూలమైన, తాజా సమాచారాన్ని అందజేయడానికి కృషి చేస్తుంది. మీరు ఈ పత్రికను క్రమంగా పొందాలనుకుంటే, యెహోవాసాక్షులు ఈసారి మీ వద్దకు వచ్చినప్పుడు వారిని అడగండి, లేదా 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో తగినదానికి వ్రాయండి.