కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 12/8 పేజీలు 14-17
  • పులి! పులి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పులి! పులి!
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పులి కుటుంబ జీవితం
  • ఒక పులిగా పెరగడం
  • తండ్రి పాత్ర
  • మ్యాన్‌-ఈటర్లా?
  • గొప్ప పిల్లి యొక్క భవిష్యత్తు
  • నిజమైన భద్రత—ఒక కష్టసాధ్యమైన లక్ష్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1994
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1993
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 12/8 పేజీలు 14-17

పులి! పులి!

ఇండియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

‘ఒకసారి నేను ఇరుకుగా ఉన్న కొండ బాటలో నడుస్తున్నాను’ అంటూ గుర్తుకు తెచ్చుకుంటున్నాడు డా. ఛార్ల్స్‌ మెక్‌డూగల్‌. ఆయన నేపాల్‌లోని రాయల్‌ చిట్వాన్‌ జాతీయ ఉద్యానవనంలో పులిని గూర్చి అధ్యయనం చేస్తూ అనేక సంవత్సరాలు గడిపాడు. ‘నేను నడుస్తుండగా, ఒక పులి ఎదురుగా వస్తుంది. చెప్పాలంటే మేమిద్దరం కొండ శిఖరాన కలిశాము, మా ఇద్దరి మధ్యనున్న దూరం ఎంతో లేదు—దాదాపు 15 అడుగులు.’ డా. మెక్‌డూగల్‌ నిశ్చలంగా నిల్చున్నాడు. పులిని కళ్లలోనికి తీక్షణంగా చూసే బదులు—అలా చూస్తే పులి దాన్ని ఒక సవాలుగా ఎంచుతుంది—ఆయన పులి భుజాల మీదుగా తన దృష్టిని పోనిచ్చాడు. పులి క్రిందకు వంగివుండిపోయిందే గానీ దాడి చేయడానికి ఎటువంటి కదలికా చేయలేదు. క్షణమొక యుగంలా గడిచిన ఎన్నో నిమిషాల తరువాత డా. మెక్‌డూగల్‌ కొన్ని అడుగులు వెనక్కి వేశాడు. ‘తరువాత’ ఆయన అంటున్నాడు, ‘నేను చక్కగా వెనక్కి తిరిగి నేనెక్కడినుండి వచ్చానో అక్కడికి నడిచివెళ్లాను.’

ఈ శతాబ్దారంభంలో ఇండియాలోని దాదాపు 40,000 పులులతోబాటు వాటి స్వస్థలమైన ఆసియాలో 1,00,000 పులులు ఉన్నాయి. కానీ 1973 కల్లా ఈ అద్భుతమైన జీవుల ప్రపంచవ్యాప్త సంఖ్య ప్రధానంగా వేటాడడం మూలంగా 4,000 కన్నా తక్కువకు తగ్గిపోయింది. భూమిపైని అత్యంత పెద్ద పిల్లి అయిన పులి, మనుష్యుని వలన అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. కానీ పులి మానవులకు ప్రమాదకరమైనదా? ఈ గొప్ప పిల్లి నిజంగా ఎలా ఉంటుంది? అది అంతరించిపోకుండా కాపాడడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయా?

పులి కుటుంబ జీవితం

సంవత్సరాల తరబడి ఓర్పుతో కూడిన పరిశీలనం భౌతికవాదులకు పులి జీవితాన్ని గురించిన మరింత స్పష్టమైన అవగాహనను అందించింది. ఉత్తర ఇండియాలోని అందమైన రన్‌థంబోర్‌ అడవులలోని ఒక సాధారణమైన పులి కుటుంబాన్ని చూస్తున్నామని ఊహించుకుందాము. మగది దాని ముక్కు నుండి తోక చివరి వరకు దాదాపు 3 మీటర్ల పొడవుండి, దాదాపు 200 కిలోగ్రాములు బరువు ఉంది. దాని జత దాదాపు 2.7 మీటర్ల పొడవు, దాదాపు 140 కిలోగ్రాముల బరువు ఉంది.a మూడు కూనలు ఉన్నాయి, ఒకటి మగది, రెండు ఆడవి.

ఈ అడవులలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటగలవు, కానీ పులి కుటుంబము ఆకులతో గుబురుగా ఉన్న చెట్ల క్రింద నీడను కనుగొంటుంది. దగ్గరలో ఉన్న చెరువులో చల్లని నీళ్లలో మునక వేయడాన్ని అవి ఎప్పుడూ ఆనందిస్తాయి. ఈత కొట్టే పిల్లులా? అవును, పులులకు నీళ్లంటే ఎంతో ప్రియం! నిజానికి, అవి ఆగకుండా ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఈదగలవని పేరుగాంచాయి.

సూర్యరశ్మి చెట్ల గుండా పులి యొక్క కాంతివంతమైన నారింజవన్నె చర్మంపై పడుతూ దాన్ని ప్రకాశించేలా చేస్తుంది. నల్లని చారలు నిగనిగలాడుతాయి, వాటి పసుపు వన్నెలోని కళ్లకుపైనున్న తెల్లని మచ్చలు ప్రకాశవంతంగా మెరుస్తాయి. మనం కొంతసేపు మూడు కూనలను చూసిన తర్వాత, వాటి వివిధ చారలు మరియు ముఖ కవళికలనుబట్టి ఒక్కొక్కదాన్ని వేర్వేరుగా గుర్తించడం సులభమౌతుంది.

ఒక పులిగా పెరగడం

తల్లి పులి కూనల్ని ఈనే సమయం వచ్చినప్పుడు, అది గుబురుగానున్న చెట్ల చాటున అనుకూలంగా ఉండే ఒక గుహను వెదుకుతుంది. అక్కడి నుండి ఆ కుటుంబం ఇప్పుడు, ఇతర జంతువులను ఆకర్షించే నీటి బుగ్గ ఉన్న మైదానం మీదుగా చక్కని దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తుంది. ఆడపులి ఆహారం కొరకు వేటాడడానికి తన కూనల నుండి ఎంతో దూరం వెళ్లకుండా ఉండేందుకు వీలుగా ఈ స్థలాన్ని ఎన్నుకుంది.

పుట్టినప్పటి నుండి కూనలు ఎంతో అవధానాన్ని పొందుతాయి. వాటి శైశవ దశయంతటిలో వాటి తల్లి నెమ్మదిగా గుర్రు పెడ్తూ తన పంజాల మధ్య వాటిని హత్తుకుంటుంది, వాటిని ముట్టెతో తోస్తుంది, వాటిని నాకుతుంది. కూనలు పెద్దవైనప్పుడు, అవి దొంగాటలు ఆడడం, ఉత్తుత్తి కొట్లాటలు చేయడం ప్రారంభిస్తాయి. పులి కూనలు సంతృప్తిని తెలుపుతూ మంద్రంగా ధ్వని చేయలేకపోయినప్పటికీ ఒక్క సంవత్సరం వయస్సు నుండి మొదలుకొని అవి తమ తల్లి బయటకు వెళ్లి తిరిగి వచ్చినప్పుడు గొప్ప, పెద్ద శబ్దాలను చేయగలవు.

కూనలు తమ తల్లితో పాటు ఈత కొట్టడానికి, నీటిలో ఆడుకోవడానికి ఎంతో ఇష్టపడతాయి. తన తోకను నీటిలో ఉంచి చెరువు అంచున కూర్చున్న ఆడపులిని చిత్రించుకోండి. అప్పుడప్పుడు, అది తన వేడి శరీరానికి చల్లని చిలకరింపునివ్వడానికి తన తోకను నీటిలో నుండి తటాలున లాగుతుంది. తోకల గురించి చెప్పాలంటే, కూనలు తమ తల్లి తన తోకను అటునిటు ఊపుతుండగా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడంలో ఎన్నడూ అలసిపోవు. ఇలా చేయడం ద్వారా ఆడపులి కేవలం తన కూనలతో ఆడుకోవడం మాత్రమే చేయడం లేదు; అది వాటికి అవి తరువాత వేటాడ్డం మొదలుపెట్టినప్పుడు ఆకస్మికంగా మీదపడి దాడిచేసే మెలకువను కూడా నేర్పుతుంది. కూనలు చెట్లను ఎక్కడానికి కూడా మక్కువ చూపుతాయి. కానీ దాదాపు 15 నెలల వయస్సు వచ్చేసరికి సులభంగా ఎక్కడానికి వీలు కాకుండా అవి చాలా భారీగాను, బరువైనవిగాను తయారౌతాయి.

తండ్రి పాత్ర

ఇటీవల వరకూ, తల్లి పులి తన కూనలను ఒంటరిగా పెంచుతుందని, ఒకవేళ అవకాశమిస్తే మగది కూనలను చంపుతుందని అనేకమంది విశ్వసించారు. అయితే అనేక పులుల విషయంలో అలా జరగలేదు. తండ్రి పులి తన ప్రదేశంలో 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుదీర్ఘమైన కాలాలపాటు అడవిలోనికి అదృశ్యమౌతుంది. కానీ అది తన కుటుంబాన్ని సందర్శిస్తుంది కూడాను. అది సందర్శించినప్పుడు వేటాడడంలో ఆడపులిని, కూనలను చేర్చుకుంటుంది, చివరికి వేటను వాటితో పంచుకుంటుంది కూడా. మరింత ఆక్రమణపూర్వకంగా ఉండే మగ కూన తినడానికి మొదట వంతు తీసుకుంటుండవచ్చు. అయితే, ఒకవేళ అది అత్యాశతో తన ఇద్దరు సహోదరీలను చాలాసేపు దూరంగా ఉంచితే దాని తల్లి ఆడ కూనలు విందులో తమకు రావలసిన వాటాను పొందడానికి దానిని త్రోసివేస్తుంది లేక తన పంజాతో ఒక్క దెబ్బ కొడుతుంది.

తమ భారీ తండ్రితో ఆడుకోవడంలో కూనలు ఆనందిస్తాయి. ఇందుకు అభిమానమైన స్థలం దగ్గరలోనున్న నీటి బుగ్గలోనే. తండ్రి పులి తన తల వరకు మునిగేంతవరకు వెనుకవైపు నుండి నీటిలోనికి నెమ్మదిగా వెళ్తుంది. (పులులు తమ కళ్లలో నీళ్లు చిందిపడడాన్ని ఇష్టపడవు!) తరువాత అది తన కూనల ముఖాలను నాకుతుండగా అవి తనను ముట్టెలతో పొడిచేందుకు అనుమతిస్తుంది. స్పష్టంగా, పటిష్ఠమైన కుటుంబ బంధం ఉంది.

మ్యాన్‌-ఈటర్లా?

పుస్తకాలు, చిత్రాలు తరచూ పులులను భీకరమైన, ఆక్రమణపూర్వకంగా ఉండే జీవులుగా, మాటువేసి మనుష్యులపై దాడి చేసి, తర్వాత చీల్చి చెండాడి వారిని తినివేసేవిగా చిత్రిస్తాయి. ఇది సత్యదూరం. పులులన్నీ మ్యాన్‌-ఈటర్లు కావు. సాధారణంగా, ఒకవేళ ఒక పులి అడవిలో ఒక మనిషిని చూస్తే అది నిశ్శబ్దంగా జారుకోవడానికి ఇష్టపడుతుంది. ఆసక్తికరంగా, నర వాసన దానిపై ఏమాత్రం ప్రభావం కలిగివున్నట్లు కనిపించడం లేదు.

అయినా, కొన్ని పరిస్థితులలో ఆకలితో ఉన్న ఒక పులి ప్రమాదకరం కాగలదు. అది వృద్ధాప్యం మూలంగా లేక మనుష్యులు గాయపర్చడం మూలంగా పండ్లను కోల్పోతే అది సాధారణంగా వేటాడలేదు. అదేవిధంగా, పులుల నివాస స్థలాలను మనుష్యుల నివాసాలు ఆక్రమిస్తే పులి యొక్క సహజ వేట తగ్గిపోగలదు. ఇటువంటి కారణాల వల్ల, ఇండియాలో ప్రతి సంవత్సరం దాదాపు 50 మంది వ్యక్తులు పులుల చేత చంపబడుతున్నారు, అయితే పాముల చేత చంపబడేవారి సంఖ్య కన్నా ఇది వంద రెట్లు తక్కువే. పులుల దాడులు ప్రాముఖ్యంగా గంగా నది డెల్టాలోని చిత్తడి నేలలో సంభవిస్తుంటాయి.

డా. మెక్‌డూగల్‌ ప్రకారం పులులు అనేకమంది ప్రజలు తలంచేంతటి ప్రమాదకరమైనవి కావు. దగ్గరలో ఉండి ఒక పులిని అకస్మాత్తుగా ఆశ్చర్యంలో ముంచెత్తడం దాడిని పురికొల్పేలా చేసినప్పటికీ, “పులి చాలా నెమ్మదైన, శాంతమైన, గంభీరమైన జంతువు” అని అంటున్నాడు ఆయన. “సాధారణంగా మీరు పులిని ఎదుర్కొంటే—అతి చేరువలో ఉన్నప్పటికీ—అది దాడి చేయదు.”

పులుల మధ్య కలహాలు అరుదు. ఉదాహరణకు, వేరే పులి ప్రాంతంలో తిరుగుతున్న ఒక యౌవన పులి ఆ ప్రాంతంలోని మగపులికి ఎదురుపడవచ్చు. దీర్ఘంగా గుర్రుమంటూ, రక్తాన్ని గడ్డకట్టించే గాండ్రింపులతో, ముక్కుతో ముక్కును తాటించుకుంటూ రౌద్రంతో గుర్రుపెడుతూ ఉంటాయి. కానీ వయస్సులో పెద్దదైన మగది ఆధిక్యతను చూపించినప్పుడు చిన్నది సాధారణంగా విధేయతా సూచకంగా తన పంజాలను గాలిలోకి పెట్టి వెల్లకిల్లా పడుకుంటుంది, పోరాటం సమాప్తమైంది.

గొప్ప పిల్లి యొక్క భవిష్యత్తు

పులి వల్ల ప్రమాదంలో పడే బదులు, మానవుడే పులికి అసలైన ప్రమాదంగా తయారయ్యాడు. ప్రస్తుతం, పులి అంతరించిపోకుండా కాపాడడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అనేక ఆసియా దేశాలు పులి సంరక్షక కేంద్రాలను స్థాపించాయి. 1973లో ఉత్తర ఇండియాలో కార్బెట్‌ జాతీయ ఉద్యానవనంలో ప్రాజెక్ట్‌ టైగర్‌ అనే పేరుతో ప్రత్యేక ప్రయత్నం చేయబడింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రాజెక్ట్‌ టైగర్‌ కొరకు నిధులు, సామగ్రి వెల్లువలా వచ్చాయి. చివరికి, 28,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యంతో ఇండియాలో 18 పులి సంరక్షక కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడ్డాయి. 1978 కల్లా అంతరిస్తున్న జాతుల పట్టికలో పులులు కూడా చేర్చబడ్డాయి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయి! పులుల వేట నిషేధించబడక ముందు మనుష్యుని భయం మూలాన పులులు కన్పించేవికావు, ప్రధానంగా రాత్రుల పూట సంచరించేవి. కానీ కొన్ని సంవత్సరాల సంరక్షణ తరువాత పులులు సంరక్షక కేంద్రాలలో తిరుగనారంభించాయి, పగటి వెలుగులో వేటాడనారంభించాయి!

ఇంకా, పులికి కొనసాగుతున్న ప్రమాదం ఒకటి ఉంది: పులి శరీర భాగాల నుండి తయారు చేయబడుతున్న సాంప్రదాయిక ఆసియా చికిత్సలకు అంతర్జాతీయ గిరాకీ ఉంది. ఉదాహరణకు ఒక బస్తా పులి ఎముకలు ఇండియాలో 500 డాలర్లు ఆర్జించగలవు; ఎముకలు విధాయితం చేయబడి దూర ప్రాచ్యంలోని మార్కెట్లకు చేరుకునే లోపలే వాటి విలువ 25,000 డాలర్లకు మించిపోతుంది. ఇంత డబ్బు సంపాదించే సాధ్యత ఉన్నప్పుడు, బీద గ్రామీణులు అడవి కాపలాదారులను బోల్తాకొట్టించడంలో పులులను వేటాడే వారితో సహకరించే ప్రలోభంలో పడిపోతారు. మొదట్లో, పులిని రక్షించడానికైన ప్రయత్నాలు సఫలమయ్యాయని పరిగణించబడింది. కానీ 1988 నుండి పరిస్థితిలో ఘోరమైన మార్పు వచ్చింది. 20 సంవత్సరాల క్రితం అక్కడున్న 40 పులులతో పోల్చుకుంటే రన్‌థంబోర్‌లో నేడు కేవలం 27 పులులు మాత్రమే సంచరిస్తున్నాయి. ప్రపంచ పులుల సంఖ్య కేవలం 5,000 మాత్రమే ఉండవచ్చు!

గత శతాబ్దపు ముగింపు వరకు పులులతో మానవులు సాపేక్షికంగా సామరస్యంతో సహజీవనం సాగించారు. వారు మరల అలా చేయగలుగుతారా? ఇప్పటికైతే, “పులి! పులి!” అనే ఉత్తేజకరమైన అరుపులకు ఇంకా ప్రపంచంలో పిల్లి జాతికి చెందిన అత్యంత పెద్ద పులిని చూడడమనే అర్థం కావచ్చు. సంరక్షణ కార్యక్రమాలు భవిష్యత్తులో పులి యొక్క సురక్షతకు హామీనిస్తుందా లేదాయన్నది ఇంకా వేచి చూడవలసివుంది. కానీ ఒకరోజు భూమి అంతా ఏదెను వనంలా ఒక పరదైసుగా ఉంటుందని బైబిలు హామీనిస్తుంది. అప్పుడు మానవుడు మరియు పులివంటి వన్య ప్రాణులు శాంతియుతమైన భూమిపై సహజీవనం చేస్తారు.—యెషయా 11:6-9.

[అధస్సూచి]

a ఉపప్రజాతులలో అత్యంత పెద్దవి అయిన సైబీరియా పులులు 320 కిలోగ్రాములకు పైగా బరువుండవచ్చు, మరి 4 మీటర్ల పొడవు ఉండవచ్చు.

[16వ పేజీలోని బాక్సు/చిత్రం]

తెల్ల పులి

అంతర్గత ఉత్పరివర్తన జన్యువుల ఫలితమైన అరుదైన తెల్ల పులి ఇండియాలోని జాతీయ సంపద. 1951లో ఒక తెల్ల మగ కూన ఇండియాలోని రేవ అడవిలో పట్టుబడింది. సాధారణ రంగులోని ఆడపులితో జతకట్టించినప్పుడు సాధారణ పిల్లలు పుట్టాయి. అయితే, ఈ పిల్లల్లోని ఒక ఆడదాన్ని తెల్ల మగపులితో జతకట్టించినప్పుడు అది నాలుగు తెల్ల కూనలకు జన్మనిచ్చింది. జాగ్రత్తగాపెంచడం మూలంగా అనేక స్థలాల్లోని ప్రజలు అరుదైన ఈ అందాన్ని తమ జంతు ప్రదర్శనశాలల్లో వీక్షించడం సాధ్యమయ్యింది.

[15వ పేజీలోని చిత్రం]

ఈత కొట్టే పిల్లులా? అవును!

[16వ పేజీలోని చిత్రం]

పులులు అనేకమంది ప్రజలు తలంచేంతటి ప్రమాదకరమైనవి కావు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి