ప్రపంచ పరిశీలన
కాథోలిక్ అస్పృశ్యులు?
భారతదేశంలో శతాబ్దాలుగా, అస్పృశ్యులని పిలువబడే కులంలో జన్మించిన అనేకులు హైందవ కుల వ్యవస్థను తప్పించుకోవాలనే నిరీక్షణతో కాథోలిక్‌లుగా మారారు. “అయితే దాని భావం వారు తమ కుల ఉచ్చులను తప్పించుకోగలిగారని కాదు” అని పారిస్ వార్తాపత్రికయైన ల మొండె చెబుతుంది. అగ్ర కులానికి చెందిన భారతీయ కాథోలిక్‌లు నిమ్న కులానికి చెందిన కాథోలిక్‌లను అస్పృశ్యులుగా చూడడం కొనసాగించారు. “ఫలితంగా, నిమ్న మరియు అగ్ర కులాలకు చెందిన కాథోలిక్‌లు ప్రార్థించడానికి చర్చికి వెళ్లినప్పుడు, వారు వేర్వేరు విభాగాల్లో కూర్చుంటారు” అని ల మొండె తెలియజేస్తుంది.
బాల శక్తి
“బ్రెజిల్‌కు చెందిన పిల్లలు గృహంలో శాసించేవారిగా ఉన్నారు, వారు తమ తలిదండ్రుల నిర్ణయాలను ప్రభావితం చేస్తారు, సంవత్సరానికి దాదాపు 5,000 కోట్లు ఖర్చుచేస్తారు” అని వేజా పత్రిక నివేదిస్తోంది. “పెద్దలు వేరే పనుల్లో నిమగ్నమై ఉంటారు గనుక పిల్లలే టివి కార్యక్రమాలను ఎంపిక చేసుకుంటారు. తండ్రి లేక తల్లి పర్యవేక్షణ లేకుండానే వారు పాఠశాల క్యాంపులకు వెళతారు. . . వారు పార్టీలకు వెళ్లి, రాత్రిళ్లు స్నేహితుల ఇళ్లవద్ద గడుపుతారు.” నేడు, అనేకమంది తలిదండ్రులు “మునుపటి తరాల పిల్లలకంటే తక్కువ విధేయతగలవారై ఉన్నప్పటికీ, నమ్మకంగా స్వతంత్రంగా ఉండే పిల్లలు కావాలనుకుంటారు.” కాని మానసికారోగ్య నిపుణుడైన ఆల్బెర్టో పెరైరా లీమా ఫీల్యో ప్రకారం, “[తలిదండ్రులు] శిక్షకులుగా తమ పాత్రను విడిచిపెట్టి తమ పిల్లలకు స్పష్టమైన హద్దులను ఏర్పరచలేరు.” “40 శాతంమంది పిల్లలు తమ తలిదండ్రులకంటే ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఎక్కువ ఇష్టపడతారు” అని ఒక అధ్యయనం చూపిస్తుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
ఖరీదైన నిరాయుధీకరణ
జర్మన్ పరిశోధకుల ప్రకారం, “1985 మరియు 1994 మధ్యకాలంలో, ప్రపంచవ్యాప్తంగా సైనిక ఖర్చులు 30 శాతానికి, ‘కేవలం’ 80,000 కోట్ల అమెరికా డాలర్లకు పడిపోయాయి.” బాన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కన్వర్షన్ (బిఐసిసి) ఈ వాస్తవాలను తమ మొదటి వార్షిక పుస్తకంలో కన్వర్షన్ సర్వే 1996 అనే శీర్షికతో ప్రచురించింది. 151 దేశాల్లో 82 దేశాలు తమ సైనిక ఖర్చును తగ్గించుకుంటే, 60 దేశాలు పెంచుకున్నాయి. జర్మన్ పత్రికయైన ఫోకస్ ప్రకారం, “‘శాంతి లాభాల’ కొరకైన నిరీక్షణ, అంటే వర్థమాన దేశాల సహాయార్థం మరియు సాంఘిక కార్యక్రమాల కొరకు వందల కోట్ల డాలర్లను పునర్విభజించడం ఇంకా నిజం కాలేదు.” బిఐసిసి నిపుణులు ఇలా తెలియజేశారు: “సైనిక సామగ్రి యొక్క తగ్గింపు, ఆయుధాల విభాగంలో పొదుపు చేయబడిన డబ్బుకు సరిసమానమైన ఖర్చులను సృష్టించింది.”
శుభ్రపరిచే బట్టలు మిమ్మల్ని అనారోగ్యులను చేయగలవు
ఉపయోగించిన శుభ్రపరిచే బట్టల్లోనూ వంటగది స్పాంజిలలోనూ ఎక్కువ మోతాదులో హానికరమైన సూక్ష్మక్రిములు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. యుసి బెర్కలీ వెల్‌నెస్ లెటర్ ప్రకారం, పరీక్షించబడిన 500 తడిసిన బట్టలు మరియు స్పాంజీలలో “రెండింట మూడొంతులలో ప్రజలను అనారోగ్యులను చేయగల సూక్ష్మక్రిములు ఉన్నట్లు” ఇటీవలి ఒక అధ్యయనం బయల్పరిచింది. దాదాపు నాలుగింట ఒక వంతులో, అమెరికాలో “ఆహార సంబంధిత రోగాలకు రెండు ముఖ్య కారకాలైన సాల్మనెల్లా లేక స్టాఫిలోకోకస్ ఉన్నాయి.” స్పాంజీలను క్రమంగా మారుస్తూ ఉండాలని, శుభ్రపరిచే బట్టలను తరచూ ఉతుకుతూ ఉండాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. “శుభ్రపరిచే బట్టలను స్పాంజీలను మీరు మీ అపరిశుభ్రమైన పాత్రలతోపాటు పాత్రలను కడిగే యంత్రాలలో వేయవచ్చు లేదా వాషింగ్ మెషీన్‌లో వేయవచ్చు” అని వెల్‌నెస్ లెటర్ చెబుతుంది. పచ్చి మాంసాన్ని బల్లలపై పెట్టిన తర్వాత, ఆ బల్లలను మళ్లీ ఉపయోగించగల బట్టలు లేక స్పాంజీలతో శుభ్రపరిచే బదులు కాగితం తువాళ్లతో శుభ్రపరచవచ్చు.
ఓపెన్ హార్ట్ వీడియో శస్త్రచికిత్స
ఒక ముప్పై సంవత్సరాల స్త్రీకి ఓపెన్ హార్ట్ వీడియో శస్త్రచికిత్స చేయడం ద్వారా పారీస్ హాస్పిటల్ ఇటీవల అంతర్జాతీయ ప్రథమ స్థానాన్ని పొందిందని పారిస్ దినపత్రికైన ల మొండె నివేదిస్తోంది. సాధారణ ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స కొరకు ఛాతి ఎముక వెంబడి ఉదరఃకుహరాన్ని ఇంచుమించు 20 సెంటీమీటర్ల వరకు తెరవవలసి ఉంటుంది. అయితే, ఈ క్రొత్త నైపుణ్యం కొరకు కేవలం నాలుగు సెంటీమీటర్ల వరకు కోస్తే సరిపోతుంది, మరో చిన్న రంధ్రం ఫైబర్ ఆప్టిక్ కెమెరా శస్త్రచికిత్సకునికి నడిపింపు నివ్వడాన్ని అనుమతిస్తుంది. ఈ శస్త్రచికిత్సలో రక్త నష్టం, శస్త్రచికిత్సకు ముందు కలిగే షాక్, వ్యాధి సోకే ప్రమాదం ఎంతగానో తగ్గించబడ్డాయి. శస్త్రచికిత్స తరువాత రోగి కేవలం 12 రోజుల్లోనే ఆసుపత్రి విడిచి వెళ్లగలిగింది. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది లక్షలమంది ప్రజలు సాధారణ ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు.
ట్యూబర్‌క్యులోసిస్ ఉపద్రవము
“ప్రపంచ జనాభాలోని మూడోవంతుకు టిబి [ట్యూబర్‌క్యులోసిస్] సోకిందని,” ఈ దశాబ్దంలో ఆ వ్యాధి మూడు కోట్లమందిని చంపుతుందని అంచనా వేయబడుతోందని లండన్‌కు చెందిన ది టైమ్స్ నివేదిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని క్రొత్త మహామారి అని పిలుస్తుంది, ఇది ఎయిడ్స్ కంటే ఎక్కువగా వ్యాపిస్తుందని, నాశనకరమైనదని, రానున్న పది సంవత్సరాల్లో 30 కోట్లమందికి ఇది సోకే అవకాశముందని ఆ సంస్థ నొక్కి తెలియజేస్తుంది. బెసిల్లీ గాలి ద్వారా వ్యాపిస్తుంది గనుక, టిబి మరెంతో సోకే గుణం గలదని తెలుస్తుంది. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అంటువ్యాధిగా ఉంది. టిబి రోగులు తమ ఆరునెలల మందుల వాడుకను ముగించనందున బాసిలస్స్‌కు చెందిన మందును తట్టుకొనే అనేక సూక్ష్మజీవులు ఉద్భవించాయని, ఒక బ్రిటిష్ మెడికల్ రిలీఫ్ ఏజెన్సీ నివేదిస్తోంది. ఫలితంగా, బెసిల్లీ మందును తట్టుకొనే శక్తిని పెంపొందించుకొని, బ్రదుకుతుంది.
ప్రసవ సమయ దుర్ఘటన
ప్రతి సంవత్సరం దాదాపు 5,85,000 మంది స్త్రీలు గర్భధారణ లేక ప్రసవ సమయంలో మరణిస్తారని యునిసెఫ్ (ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి) నిర్వహించిన ఒక క్రొత్త విస్తృత సర్వే చెబుతుంది. ది ప్రోగ్రెస్ ఆఫ్ నేషన్స్ 1996 రిపోర్టు ప్రకారం, ప్రసవసమయ దుర్ఘటనలలో అధికశాతాన్ని నివారించవచ్చు. అదిలా తెలియజేస్తుంది: “ఈ మరణాల్లో ఎక్కువగా అనారోగ్యుల లేక మరీ వృద్ధుల, లేక మరీ యౌవనుల మరణాలు ఇమిడి లేవు, కాని అవి తమ జీవితపు ప్రౌఢస్థితిలో ఉన్న ఆరోగ్యవంతమైన స్త్రీల మరణాలు.” అవకతవక గర్భస్రావాల మూలంగా ప్రతి సంవత్సరం ఇంచుమించు 75,000 మంది స్త్రీలు మరణిస్తున్నారు; నొప్పులకు అవరోధం కలిగించడం మూలంగా 40,000 మంది; రక్తం విషపూరితమవ్వడంవల్ల 1,00,000 మంది; ఎక్లాంప్స్యా (గర్భధారణ అంతిమ సమయంలో కంపనములు, అధిక రక్తపోటు) మూలంగా మెదడు మరియు మూత్రపిండం చెడిపోవడంతో 75,000 మంది; హెమరేజ్ మూలంగా 1,40,000 కంటే ఎక్కువమంది మరణిస్తున్నారు. అనేక దేశాల్లో ప్రసూతి సంబంధంగా సరైన శ్రద్ధ తీసుకోకపోవడం ఎక్కువగా కారణమౌతోంది. దక్షిణాసియాలోని 35 మందిలో ఒక స్త్రీ, సబ్‌సహారన్ ఆఫ్రికాలో 13 మందిలో ఒక స్త్రీ గర్భధారణ మరియు ప్రసవ సంబంధ విషయాల మూలంగా మరణిస్తుందని, పోల్చి చూస్తే కెనడాలో 7,300 మందిలో ఒకరు, అమెరికాలో 3,300 మందిలో ఒకరు, యూరప్‌లో 3,200 మందిలో ఒకరు మరణిస్తున్నారని డాటా సూచిస్తోందని యునిసెఫ్ అధికారులు చెబుతున్నారు. సంవత్సరానికి దాదాపు 5,00,000 మంది మరణిస్తున్నట్లు మునుపు వేయబడిన అంచనాలకంటే ఈ సంఖ్యలు ఇంచుమించు 20 శాతం ఎక్కువ.
ఎయిడ్స్ రోగులు ఇంకా పెరిగిపోతున్నారు
“ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ప్రాముఖ్యంగా ఆసియా మరియు దక్షిణ ఆఫ్రికాలలో ఎయిడ్స్‌ను కలిగించే వైరస్ త్వరగా వ్యాప్తి చెందడం కొనసాగిస్తోంది, ఎయిడ్స్‌తో బాధపడుతున్న ప్రజల సంఖ్య కూడా త్వరితంగా పెరిగిపోయిందని” ది న్యూయార్క్ టైమ్స్ నివేదిస్తోంది. 1995లో దాదాపు 13 లక్షలమంది ఎయిడ్స్ లక్షణాలతో అనారోగ్యులయ్యారని, అది గత సంవత్సరంకంటే 25 శాతం పెరుగుదలని యునైటెడ్ నేషన్స్ జాయింట్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్.ఐ.వి.-ఎయిడ్స్ సమకూర్చిన డాటా చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్లమంది హెచ్.ఐ.వి.కి గురయ్యారని, వారిలో 42 శాతంమంది స్త్రీలేనని ఇప్పుడు అంచనా వేయబడుతోంది. ప్రతిరోజు అదనంగా 7,500 మంది గురౌతున్నారు. అనేక కోట్లమంది పిల్లలకు కూడా సోకినట్లు చెప్పబడుతోంది. సోకినప్పటి నుండి తీవ్ర అనారోగ్యం ఏర్పడడానికి దాదాపు పది సంవత్సరాలు పడుతుంది. 1995లో ఎయిడ్స్ సంబంధిత రోగాలవల్ల 9,80,000 మంది మరణించారని, ఇది 1996లో 11,20,000కు పెరిగిపోతుందని యు.ఎన్ నివేదిక అంచనా వేస్తోంది. ఈ వైరస్ ఇటీవల దక్షిణ ఆఫ్రికా మరియు భారతదేశాలలో విపరీతంగా వ్యాపించింది, చైనా మరియు వియత్నామ్‌లలో కూడా అలాగే జరుగుతుందని అంచనా వేయబడుతుంది. కొన్ని ఆఫ్రికా దేశాలలో వ్యాధి సోకడం యొక్క రేటు ఇప్పటికే 16 నుండి 18 శాతమంత అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి సోకిన యౌవన స్త్రీల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్త్రీలకు జన్మించే పిల్లల్లో మూడొంతుల మందికి కూడా ఈ వైరస్ ఉంటుంది.
ఏమి వ్యర్థం చేయబడడం లేదు
ఒక ఆవు నుండి దాదాపు 270 కిలోల మాంసాన్ని తీసుకున్న తర్వాత మిగిలినదంతా ఏమౌతుంది? థైరాయిడ్ గ్రంథి, క్లోమము, ఊపిరితిత్తులు, ప్లీహము, అడ్రినల్ గ్రంథి, అండాశయములు, పీనస గ్రంథి, కాలేయము మరియు పిత్తాశయము నుండి పైత్యరసము వంటివి మందుల తయారీలో ఉపయోగించబడతాయి. ఎముకలు, డెక్కలు, చర్మాల నుండి కొల్లేజన్ తీయబడుతుంది, అది తైలముల్లోను ద్రవాలలోనూ ఉపయోగించబడుతుంది. మెత్తని ఎముకలు మరియు కొవ్వు అనేక మేకప్ సామగ్రిలలో మరియు వెండ్రుకలకు సంబంధించిన ఉత్పాదకాలలో ఉపయోగించబడే బూటిల్ స్టీరెట్, పిఇజి-150 డిస్టీరెట్, గ్లైకోల్ స్టీరెట్ వంటి పదార్థాలుగా రూపొందుతాయి. జంతు కొవ్వుల నుండి అనేకమైన సబ్బులు తయారు చేయబడతాయి. ఐస్‌క్రీమ్, కొన్ని రకాల మిఠాయిలు, అనేక “కొవ్వు రహిత” ఉత్పాదకాలతో సహా వందలాది రకాల తినుబండారాల్లో ఉపయోగించబడే జెలాటిన్‌ను తయారు చేసేందుకు ఎముకలు మరియు డెక్కలు మెత్తగా పొడి చేయబడతాయి. ఇతర భాగాలు రంగు పెన్సిళ్లు, అగ్గిపుల్లలు, నేల కొరకు ఉపయోగించే పాలిష్‌లు, నేలపై పరిచే ఒకరకం మైనపుగుడ్డలు, ఆంటీఫ్రీజ్, సిమెంటు, కలుపు మొక్కల నాశకాలు, సెల్లోఫేన్, ఫోటోగ్రాఫిక్ కాగితము, క్రీడా సంబంధిత వస్తువులు, గృహోపకరణాల కొరకైన మెత్తలు మరియు వస్త్రాలు వంటి అనేకానేక ఉత్పత్తులలో కూడా ఉపయోగించబడతాయి. పిత్తాశయంలో ఏర్పడే రాళ్లకు అత్యంత అధిక వెల ఇవ్వబడుతుంది—ఒక ఔన్సుకు 600 (అమెరికా) డాలర్లు! దూరప్రాచ్యంనందలి వ్యాపారులు వాటిని కామోద్దీపక ఔషదంగా ఉపయోగించడానికి కొంటారు.
“పిచ్చి ఆవు వ్యాధి”
▪ బ్రిటన్‌లో “పిచ్చి ఆవు వ్యాధి” వ్యాపించడం పశుసంవర్ధనాన్ని గూర్చిన ఒక దీర్ఘకాల వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. జంతువులకు ఇతర జంతువుల భాగాలను ఆహారంగా ఇవ్వడం ద్వారా వాటిని సహజ శాకాహారుల నుండి మాంసాహారులుగా మార్చడం జరిగింది. ఎండబెట్టిన రక్తం, పొడి చేసిన ఎముకలు, పొడిచేయబడిన పేగులు వెన్నెముకలు మెదళ్లు మరియు క్లోమం, ట్రెక్యా, మూత్రపిండాలు వంటి ఇతర అంతర్గత భాగాలుగల మాంసం దానా లేక ఫీడ్ వంటివి వనరులను కాపాడడానికి, లాభాలను అధికం చేయడానికి, జంతు పెరుగుదలను త్వరితం చేయడానికి, ఎప్పుడూ ఉపయోగించబడతాయి. ఒక సగటు దూడ ఆరు నెలల వయస్సుకు చేరుకునే సరికి దానికి ఇతర జంతువుల మిగిలిన భాగాల నుండి తయారు చేయబడిన దాదాపు పన్నెండు కిలోల ఆహారం ఇవ్వబడుతుందని ఈ వ్యాధి గురించి మొదట హెచ్చరించిన నిపుణులలో ఒకరైన డా. హరాష్ నారంగ్ చెబుతున్నాడు. తాను ఒక వధశాలను సందర్శించడం గురించి చెబుతూ “నేను చకితుడనయ్యాను, మనం వాస్తవంగా పశువుల నుండి పశువులను పునరావృతం చేస్తున్నాము. నా దృష్టిలో అది స్వజాతి మాంసభక్షణే” అని ఆయన చెప్పాడు.
▪ తక్కువ గంభీరమైన విషయం ఏమిటంటే, ఒక బ్రిటిష్ పాల ఉత్పాదన రైతు “పిచ్చి ఆవు వ్యాధి” భయం మూలంగా తాను మంచి లాభాలకు అమ్మలేకపోతున్న ముసలి ఆవులను ఉపయోగించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. న్యూస్ వీక్‌లో నివేదించబడినట్లుగా, ఆయన వాటిని వ్యాపార ప్రకటనా బోర్డులుగా ఉపయోగిస్తున్నాడు. రద్దీగా ఉండే ఒక రహదారి ప్రక్కన గడ్డి మేసే తన ఆవులపై ఆయన వ్యాపార ప్రకటనలు వేస్తాడు, ఆయన ఒక్కో ఆవు మీద ఒక వారానికి 40 డాలర్లు సేకరిస్తాడు. “మనం ఆర్థికపరమైన క్రొత్త విషయాల కొరకు చూడాలి. అవి తమ కొరకు తాము సంపాదించుకోవడానికి ఇది మంచి మార్గంలా కనిపిస్తుంది” అని ఆ రైతు తెలియజేశాడు.