బైబిలు ఉద్దేశము
మీరు ఎవరి నడిపింపును నమ్మగలరు?
“మనం వెళ్లాల్సిన సమయమైంది!” అని తండ్రి తన ఐదేళ్ల బాబుకు చెబుతాడు. తండ్రి చెయ్యి చాపుతాడు, కుమారుడు సంకోచించకుండా ముందుకు వచ్చి తన చిన్ని చేతిని తన తండ్రి వ్రేళ్ల చుట్టూ వేసి పట్టుకుంటాడు. వాళ్ల పయనం ఎటు వెళ్లినా సరే, ఆ పిల్లవాడు తన తండ్రి నడిపింపును నమ్ముతాడు, ధైర్యంగా ఆయనను వెంబడిస్తాడు. ఏమి జరిగినా సరే ఆ పిల్లవాని గట్టిపట్టు సడలదు.
ఆర్థిక, రాజకీయ మరియు వ్యక్తిగత అస్థిరతగల ఈ దినాల్లో జీవిస్తుండగా, మీరు విశ్వసనీయంగా నమ్మగల మూలం నుండి నడిపింపు హస్తం రావడాన్ని మీరు ఆహ్వానించరా? అయినప్పటికీ, మోసగించే ప్రజలు అనుభవం లేనివారిని వంచించే కాలంలో మనం జీవిస్తున్నాము. కాబట్టి, మనం ఎవరిని నమ్ముతున్నామనే విషయంలో జాగ్రత్త వహించేందుకు ఎంతో మంచి కారణం ఉంది. నడిపింపు కొరకు మీరు గతంలో ఆధారపడిన వ్యక్తి మీకు ఆశాభంగం కలిగించినందున మీరు బహుశ చాలా నిరాశ చెంది ఉన్నారేమో.
ఏదేమైనప్పటికీ, మనం దేవునియందు నమ్మకం ఉంచాలని బైబిలు మనలను ప్రోత్సహిస్తుంది. “నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను” అని ప్రవక్తయైన యెషయా వ్రాశాడు. (యెషయా 41:13) మరి అపొస్తలుడైన పేతురు ఇలా సలహా ఇచ్చాడు: “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతురు 5:6, 7.
అయినప్పటికీ, మీరు ఇలా అడుగవచ్చు, ‘నడిపింపు కొరకు నేను దేవున్ని నమ్మేందుకు నాకు ఏ కారణం ఉంది?’ ప్రాచీన ఇశ్రాయేలీయుల వృత్తాంతంలో క్రింద ఇవ్వబడిన ఈ చక్కని కారణాలు లభిస్తాయి.
దేవుని హస్తం ఆయన ప్రజలను నడిపిస్తుంది
సా.శ.పూ. 1513 నీసాను 14 రాత్రి సంభవించిన సంఘటనల పరంపర అహంకారి మరియు నిర్బంధ బానిసత్వం చేయించుకునే ఫరో మరియు ఐగుప్తీయుల ఉద్దేశాన్ని వమ్ము చేసింది, కాబట్టి వారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను దాసత్వం నుండి విడుదల చేశారు. (నిర్గమకాండము 1:11-13; 12:29-32) నీసాను 15న, ఇశ్రాయేలీయుల ఉత్సాహభరిత జనాంగం, వాగ్దాన దేశానికి వెళ్లే మార్గంలో ఉన్న అరణ్యం వైపు వెళ్లారు. మెంఫీస్‌కి ఉత్తరంగా మధ్యదరా సముద్రం తీరం వెంబడి, భీతిగొల్పే ఫిలిష్తీయుల ఆక్రమిత దేశానికి దగ్గరగా వెళ్తూ వాగ్దాన దేశంలోకి ప్రవేశించడం చాలా సూటైన మార్గం. అయితే, దేవుని మనస్సులో మరో మార్గం ఉంది.—నిర్గమకాండము 13:17, 18; సంఖ్యాకాండము 33:1-6.
దేవుడు ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి ఒక దృశ్య నడిపింపును ఇచ్చాడు, అది పగటి వేళ మేఘ స్తంభం మరియు రాత్రివేళ అగ్ని స్తంభంగా ఉండేది. (నిర్గమకాండము 13:21, 22) ఇటువంటి సహజసిద్ధంకాని సంభవంతోపాటు, యెహోవా తన భూసంబంధ ప్రతినిధిగా, నమ్మకస్థుడైన మోషేను ఉపయోగించాడు. (నిర్గమకాండము 4:28-31) కాబట్టి, దేవుని హస్తం ఇశ్రాయేలీయులకు నడిపింపును ఇస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
వారి రెండవ క్యాంపు స్థలమైన, “అరణ్యము దగ్గరనున్న” ఏతామువద్ద, వారు వెనక్కి మరలి పీహహీరోతువద్ద ఎర్ర సముద్ర తీరాన బస చేయాలని యెహోవా మోషేకు సూచించాడు. (నిర్గమకాండము 13:20) అనాలోచిత చర్యగా కనిపించే ఈ ప్రయాణం, “వారు ఈ దేశములో చిక్కుబడి యున్నారు” అని ఫరో భావించేందుకు దారి తీసింది. ఫరో ధైర్యం తెచ్చుకొని మనస్సు మార్చుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులను మళ్లీ తన దాసులనుగా చేసుకోవాలని తీర్మానించుకుని, అతను తన సైన్యాన్ని సమకూర్చి వారిని తరిమేందుకు బయలుదేరాడు.—నిర్గమకాండము 14:1-9.
జనాంగాన్ని మరో దారిలో, అంటే ఎర్ర సముద్రం వైపుకు దారితీసే పల్లపు ప్రాంతానికి తీసుకురావడం ద్వారా, మోషే పీహహీరోతునందున్న బసకు ఇరువైపులా ఉన్న పర్వతాల మధ్య అటు ఎర్ర సముద్రం ఇటు దూసుకొస్తున్న ఫరో సైన్యాలకు మధ్య ఇశ్రాయేలీయులను ఇరికిస్తున్నాడని అనిపించింది. ఇశ్రాయేలీయులు త్వరగా లొంగిపోయేందుకు లేక నాశనం చేయబడేందుకు సులభంగా లభిస్తారని అనిపించింది.
ఇది వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? వారు యెహోవా నడిపింపు ఎడల నమ్మకాన్ని ప్రదర్శిస్తారా? వారి పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. కాబట్టి, కొందరు ఆందోళన చెందారు. మరి కొందరు మోషేకు విరుద్ధంగా సణగడం ప్రారంభించారు. కొందరైతే లొంగిపోయి ఐగుప్తు దాస్యానికి తిరిగి వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డారు!—నిర్గమకాండము 14:10-12.
యెహోవా హస్తాన్ని గట్టిగా పట్టుకోండి!
ఈ పరిస్థితిలో ఇశ్రాయేలీయులు సర్వోన్నతునియందు ఒక పిల్లవాని వంటి నమ్మకాన్ని ప్రదర్శించవలసి ఉండిరి. ఆ జనాంగానికి అంతటికీ తెలియకుండా, పీహహీరోతు వద్ద ఎర్ర సముద్రాన్ని దాటమని మోషేకు సూచననివ్వడంలో యెహోవా మంచి కారణాన్నే కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల దేశానికి దక్షిణం వైపునుండి వాగ్దాన దేశానికి వెళ్లేలా చేయడం ద్వారా యెహోవా ప్రేమపూర్వకమైన అంతర్దృష్టిని చూపాడు. ఐగుప్తులో 215 సంవత్సరాలు గడిపిన తర్వాత, భీకర యోధులుగల దేశంతో యుద్ధం చేసేందుకు ఇశ్రాయేలీయులు సిద్ధంగాలేరనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, అలాంటి పోరాటాన్ని నివారించే మార్గాన్ని యెహోవా ఎన్నుకున్నాడు.a—నిర్గమకాండము 13:17, 18.
జనాంగాన్ని విడిపించడం మరియు ఎర్ర సముద్రం వద్ద ఫరో, అతని సేనల ఓటమి, దేవుని రక్షణ శక్తికి మహత్తరమైన నిదర్శనం. అంతేకాకుండా, దేవుడు తమను ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపించేందుకుగల కారణాన్ని గుర్తించకపోయినప్పటికి దేవుని హస్తాన్ని వదలకుండా ఉన్న ఇశ్రాయేలీయులు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారో కదా! వారు గట్టిగా పట్టుకుని ఉండి, ఎర్ర సముద్రం అద్భుతరీతిలో పాయలు కావడం అలాగే తమ శత్రువులు సమూల నాశనమవ్వడాన్ని చూశారు. యెహోవా నడిపింపు ఎడల వారి నమ్మకం ప్రతిఫలాన్ని పొందింది.—నిర్గమకాండము 14:19-31.
మళ్లీ, ఒక పిల్లవాడు తన తండ్రి చెయ్యిని పట్టుకోవడాన్ని గురించిన ఉదాహరణను పరిశీలిద్దాము. పిల్లవానికి చింత కలిగితే వాడు ఎలా ప్రతిస్పందిస్తాడు? వదిలేసే లేక పట్టు సడలించే బదులు ఆ పిల్లవాడు తన చిన్ని చేతిని తన తండ్రి వ్రేళ్ల చుట్టూ గట్టిగా బిగించి పట్టుకుంటాడు. అలా చేయడం ద్వారా, కష్ట సమయాల్లో తన తండ్రి తనకు ఎడతెగని నడిపింపును మరియు శక్తిని అందజేస్తాడనే తన నిశ్చలమైన నమ్మకాన్ని వాడు ప్రదర్శిస్తాడు.
అదే విధంగా, మనం మన జీవితంలో కలతలను అనుభవిస్తే, దేవుని నడిపింపును ఇంకా ఎక్కువగా నమ్ముతూ మనం గట్టిగా బిగించి పట్టుకోవలసిన అవసరం ఉంది! ఆయన వాక్యమైన బైబిలు మనకు నడిపింపునిచ్చే వెలుగు కాగలదు. (కీర్తన 119:105) ఇంకా, నమ్మకంతోపాటు సహనం కూడా వస్తుందని జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి, ఆయన మనల్ని ఒక ప్రత్యేక మార్గంలో ఎందుకు నడిపిస్తున్నాడో మనం కొంత సమయం వరకూ పూర్తిగా అర్థం చేసుకోకపోయినప్పటికీ, సమస్యను పరిష్కరించేందుకు మనం యెహోవాకు సమయాన్ని ఇవ్వాలి. అవును, మనం దేవుని నడిపింపునందు నమ్మకముంచగలము.—నిర్గమకాండము 15:2, 6; ద్వితీయోపదేశకాండము 13:4; యెషయా 41:13.
[అధస్సూచి]
a పీహహీరోతును గురించిన అదనపు సమాచారం కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి, (ఆంగ్లం) సంపుటి 2, 638-9 పేజీలను చూడండి.