మాటలే ఈటెలుగా మారినప్పుడు
“కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.”—సామెతలు 12:18.
“వివాహమైన కొన్ని వారాలకే ఆ ధోరణి మొదలైంది. అవి దయలేని మాటలు, కించపరిచే వ్యాఖ్యానాలు, నన్ను అవమానించేందుకు చేసే ప్రయత్నాలు. నేను నా భర్తకు ఏ విధంగానూ సాటిరాను. అతని మానసిక చురుకుదనం, త్వరపడే నాలుక నేను పలికే ప్రతి మాటనూ వక్రీకరిస్తాయ్, పెడర్థాలు తీస్తాయ్” అని ఇలేన్a చెబుతుంది.
ఇలేన్ తన వైవాహిక జీవితమంతటిలోనూ, ఎలాంటి మచ్చలను మిగల్చని మరియు సానుభూతిని ఎంతమాత్రం కనుపర్చని వంచనాత్మక దాడికి గురైంది. కాలగమనంలో ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడం దుఃఖకరం. “మాకు పెళ్లై 12 సంవత్సరాలు గడిచాయి. అతను కఠినమైన, అసభ్యమైన పదాలు ఉపయోగిస్తూ నన్ను విమర్శించకుండా, దెప్పిపొడవకుండా ఒక్క రోజు కూడా గడవలేదు” అని ఆమె చెబుతుంది.
నాలుక ‘మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వంతో’ నిండి ఉండగలదు అని బైబిలు చెప్పినప్పుడు అది గోరంతలను కొండంతలుగా చేయలేదు. (యాకోబు 3:8; కీర్తన 140:3 పోల్చండి.) విశేషంగా ఇది వైవాహిక జీవితంలో నిజం. “‘కర్రలూ రాళ్లూ నా ఎముకలను విరుగగొట్టగలవు కానీ మాటలు నాకు ఎన్నడూ హాని చేయలేవు’ అని ఎవరు అన్నారో గానీ అది శుద్ధ తప్పు” అని లీసా అనే పేరుగల ఓ భార్య అంటుంది.—సామెతలు 15:4.
మౌఖిక ఆక్రమణకు భర్తలు కూడా గురి కాగలరు. “నువ్వో అబద్ధాల కోరువి, చేతకాని శుంఠవి అని లేక అంతకన్నా ఘోరమైన వాడివని మిమ్మల్ని తదేకంగా సంభోదించే ఆడదానితో జీవించడం ఎలా ఉంటుందో మీకు తెలుసా?” అని మైక్ అడుగుతున్నాడు, ట్రేసీతో అతని నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితం విడాకులకు దారితీస్తోంది. “ఆమె నన్ను అనే మాటలను నేను మర్యాదస్థుల ఎదుట ప్రస్తావించలేను. అందుకే ఆమెతో నేను మాట్లాడలేకపోయేది, రాత్రి వరకూ ఆఫీసులోనే ఉండిపోయేది కూడా అందు గురించే. ఇంట్లోకంటే అక్కడే చాలా ప్రశాంతంగా ఉంటుంది” అని అతను అంటున్నాడు.—సామెతలు 27:15.
మంచి కారణంతో, అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఇలా సలహా ఇచ్చాడు: ‘అల్లరిని దూషణను మీరు విసర్జించుడి.’ (ఎఫెసీయులు 4:31) అయితే “దూషణ” అంటే ఏమిటి? దానికి, కేవలం స్వరాన్ని హెచ్చించడమైన “అల్లరి”కి (గ్రీకు, క్రావుగి) వ్యత్యాసముందని పౌలు చూపుతున్నాడు. “దూషణ” (గ్రీకు, బ్లాస్పేమియా) అనేది ఎక్కువమట్టుకు మాటల్లోని విషయాన్ని సూచిస్తుంది. నిరంకుశత్వంతో, ద్వేషంతో, ఖిన్నపరిచే లేక అవమానపరిచేదిగా ఉంటే అప్పుడు అది, గట్టిగా అరిచినా లేక గొణిగినా దూషణే అవుతుంది.
మాటల పోట్లు
మహాసముద్ర తరంగాలు దృఢమైన రాయిని హరించి వేసే రీతిలోనే కఠినమైన మాటలు మాట్లాడే విధానం ఒకరి వైవాహిక బంధాన్ని బలహీనపర్చగలదు. “అదెంత తీవ్రంగా, ఎడతెగక ఉంటుందో ప్రమాదం అంత పెద్దగా ఉంటుంది. . . . విమర్శించే అలవాట్లు, తృణీకారం లేక అసహ్యమనేవి ప్రమాద సూచకాలు ఎందుకంటే ఒక భర్త లేక భార్య తన భాగస్వామి గురించి చెడుగా మౌన తీర్పును చేశారని అవి సూచిస్తాయని” డా. డేనియల్ గోల్‌మన్ వ్రాస్తున్నాడు. ఆప్యాయత సన్నగిల్లే కొలది, “చట్టపరంగానే వివాహితులు గానీ భావోద్రేకంగా కాదు” అని ఒక పుస్తకం పేర్కొన్న విధంగా భార్యాభర్తలు ఉంటారు. కొంత కాలానికి, వారిక జతగా ఉండలేకపోవచ్చు.
అయితే, దూషణకరమైన సంభాషణ వైవాహిక జీవితానికంటే ఎక్కువ సంగతులనే ప్రభావితం చేయగలదు. ఒక బైబిలు సామెత ఇలా చెబుతుంది: “మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.” (సామెతలు 15:13) గాయపరిచే మాటల ఎడతెగని ఉప్పెన వలన కలిగే ఒత్తిడి, ఒకరి ఆరోగ్యానికి తీవ్రంగా హాని కలిగించగలదు. ఉదాహరణకు, ఎడతెగక ధిక్కారాన్ని సహిస్తున్న స్త్రీకి జలుబు, మూత్రాశయ సమస్యలు, తెలుపు స్రవం మరియు జీర్ణకోశము మరియు ప్రేగులకు సంబంధించిన అస్వస్థతలు కలిగే అవకాశం ఎక్కువగా ఉండవచ్చని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం (అమెరికా) ద్వారా నిర్వహించబడిన ఒక అధ్యయనం తెలియజేసింది.
పిడి గుద్దులకంటే పదాలే ఎక్కువ గాయపరచగలవని మాటలతోను, శారీరకంగాను బాధింపబడటాన్ని సహించిన అనేకమంది భార్యలు అంటున్నారు. “అతను కొట్టినందువల్ల కలిగిన గాయాలు తుదకు మానిపోయి కనిపించకుండాపోతాయి, అయితే నా రూపం, నా వంట, పిల్లలను పెంచే తీరును గురించి అతను నన్ను అనిన ఘోరమైన మాటలను నేను ఎన్నటికీ, మరెన్నటికీ మర్చిపోలేను” అని బెవర్లీ అంటుంది. జూల్య కూడా అదే విధంగా భావిస్తుంది. “నేననే మాటలు మీకు పిచ్చిదాని మాటల్లా అనిపించవచ్చు, అయితే అతను నన్ను కొట్టినా నేను భరిస్తాను గానీ ఈ మానసిక యాతనను, పన్నాగాలు పన్నడాన్ని నేను భరించలేను” అని ఆమె అంటుంది.
అయితే కొందరు వ్యక్తులు తాము ప్రేమిస్తున్నామని చెప్పే వ్యక్తులపై ఇలా దాడి చేసి వారిని ఎందుకు చులకన చేస్తారు? తదుపరి శీర్షిక ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుంది.
[అధస్సూచి]
a ఈ శీర్షికల పరంపరలోని కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
[4వ పేజీలోని చిత్రం]
“అతను నన్ను కొట్టినా నేను భరిస్తాను గానీ ఈ మానసిక యాతనను, పన్నాగాలు పన్నడాన్ని నేను భరించలేను”
[4వ పేజీలోని చిత్రం]
“నువ్వో అబద్ధాల కోరువి, చేతకాని శుంఠవి అని లేక అంతకన్నా ఘోరమైన వాడివని మిమ్మల్ని తదేకంగా సంభోదించే ఆడదానితో జీవించడం ఎలా ఉంటుందో మీకు తెలుసా?”