తల్లికి తన కూనల ఎడల ఉన్న అనురాగం
తూర్పు న్యూయార్క్‌లోని మురికి వీధుల్లో తన ఐదు కూనలతో జీవించేందుకు ప్రయత్నిస్తున్న దారి తప్పిన, చిన్న వెంట్రుకలుగల, పేరులేని పిల్లి అది. అది తన కాపురాన్ని పాడుబడిన, వదలివేయబడిన గరాజ్‌లో పెట్టింది, ఆ గరాజ్ ఎప్పుడూ అనుమానాస్పద అగ్నిప్రమాదాలకు గురయ్యే అవకాశం చాలా ఉంది. తన పెరిగే పిల్లలకు పోషకాన్నిచ్చేందుకు వీలు కలిగేలా అది ఇరుగుపొరుగున ఉన్న చెత్తా చెదారాన్ని వెదుకుతూ తిరిగింది.
మార్చి 29, 1996, ఉదయం 6:06కి ఇదంతా కూడా మారిపోబోతోంది. ఒక అనుమానాస్పదమైన అగ్నిప్రమాదం ఆ గరాజ్‌ను చుట్టుముట్టింది. ఆ పిల్లి కుటుంబం యొక్క ఇల్లు కూడా మంటల్లో చిక్కుకుంది. లాడర్ కంపెనీ 175 రంగంలోకి దిగి, వెంటనే మంటలను అదుపులోకి తీసుకుంది. అగ్ని మాపక దళ సిబ్బందిలో ఒకరైన డేవిడ్ జానల్లీ కూనల అరుపులు విన్నాడు. అతను మూడు కూనలను భవనం వెలుపల, మరొక దాన్ని వీధికి అవతల మూడంతల దూరాన, ఐదవ దాన్ని ఫుట్‌పాత్ పైన కనుగొన్నాడు. ఆ కూనలు తమకై తామే తప్పించుకోలేనంత చిన్నవి. తల్లి పిల్లి వాటిని ఒకదాని తర్వాత ఒకటి చొప్పున రక్షించింది గనుక వాటిలో కొన్ని అంతసేపు వేచి ఉండాల్సి వచ్చింది, అందుకు ఒక్కో కూనకు కాలిన గాయాలు ఎక్కువ అవుతున్నాయని జానల్లీ గమనించాడు.
ఏప్రిల్ 7, 1996 నాటి న్యూయార్క్ డెయిలీ న్యూస్‌లోని వృత్తాంతం, తల్లి ఆచూకీ గురించి మరియు అదెలా శ్రద్ధ వహించిదనే విషయాన్ని గురించి ఈ నివేదికను ప్రచురించింది: “ఆ తల్లి సమీపానున్న ఒక కాళీ స్థలంలో నొప్పితో బాధపడుతూ పడివుండటాన్ని జానల్లీ చూశాడు, ఆ దృశ్యం అతని హృదయాన్ని ద్రవింపజేసింది. దాని కనురెప్పలు పొగ వలన ఉబ్బి మూసుకుపోయాయి. దాని పాదాలు బాగా కాలిపోయాయి. దాని మొహం, చెవులు మరియు కాళ్లపై తీవ్రంగా కాలిన గుర్తులున్నాయి. జానల్లీ ఒక కార్డ్‌బోర్డ్ పెట్టిని కనుగొన్నాడు. అతను నెమ్మదిగా తల్లి పిల్లిని, కూనలను లోపల ఉంచాడు. ‘అది తన కళ్లను కూడా తెరవలేకుండా ఉంది. అయితే అది వాటిని ఒకదాని తర్వాత ఒకటి చొప్పున తన కాలితో ముట్టి లెక్కబెట్టింది’ అని జానల్లీ చెబుతున్నాడు.”
నార్త్ షోర్ ఆనిమల్ లీగ్‌కి అవి చేరేసరికి, పరిస్థితి ఊహించలేనిదిగా ఉంది. ఆ వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “షాక్‌ను తట్టుకునేందుకు మందులు ఇచ్చారు. ఈ సాహసియైన పిల్లికి ఆంటీబయాటిక్‌లతో నింపబడిన ట్యూబును రక్తనాళాల్లోకి పెట్టారు. దాని కాలిన గాయాలపై ఆంటీబయాటిక్ క్రీములు మెత్తగా రాయబడ్డాయి. తర్వాత, ఆనిమల్ లీగ్ సిబ్బంది అంతా తమ ఊపిరిబిగబట్టి ఎదురు చూస్తుండగా, అది ఊపిరి పీల్చుకునేందుకు దాన్ని ఆక్సీజన్-టాంక్ కేజ్‌లో ఉంచడం జరిగింది . . . 48 గంటల్లోపు అది లేచి కూర్చోగల్గింది. దాని ఉబ్బిన కళ్లు తెరుచుకున్నాయి, వైద్యులు దానికి ఏ ప్రమాదం లేదని కనుగొన్నారు.”
ఆగండి, ఆలోచించండి. ధైర్యవంతురాలైన ఈ తల్లి, మంటలంటే తనకు సహజంగానే భయం ఉన్నప్పటికీ, ఏడుస్తున్న తన పిల్లలను రక్షించేందుకు కాలుతున్న కట్టడంలోకి వెళ్లడాన్ని ఓ నిముషం ఊహించండి. తన చిన్ని నిస్సహాయ కూనలను తెచ్చేందుకు ఒకసారి లోపలికి వెళ్లడమే నమ్మలేనంతటి విషయం; అలాంటిది దాన్ని ఐదుసార్లు చేయడం, మరి ప్రతిసారి తన కాళ్లకు, మొహానికి అదనపు గాయాలు అవుతుంటే వెళ్లడం అనేదాన్ని ఊహించనేలేము! ఈ సాహసియైన జంతువుకు స్కార్లెట్ అని పేరు పెట్టబడింది ఎందుకంటే కాలిన గాయాలు చర్మం క్రిందనున్న భాగాలను సింధూరవర్ణంగా లేక ఎర్రగా మార్చాయి.
తల్లికి తన కూనల ఎడల ఉన్న అనురాగాన్ని గురించిన ఈ హృదయవిదారక గాథ నార్త్ షోర్ ఆనిమల్ లీగ్‌నుండి ప్రపంచమంతటా ప్రసారమయ్యినప్పుడు, టెలీఫోన్‌లు ఎడతెగక మ్రోగడం ప్రారంభించాయి. 6,000 కంటే ఎక్కువమంది ప్రజలు, స్కార్లెట్ పరిస్థితి ఎలాగుందో తెలుసుకునేందుకు జపాన్, నెదర్లాండ్స్ మరియు దక్షిణాఫ్రికా అంత దూరంనుండి కూడా ఫోన్ చేశారు. స్కార్లెట్‌ను దాని కూనలను దత్తత తీసుకుంటామని దాదాపు 1,500 మంది ప్రజలు అడిగారు. తర్వాత ఒక కూన చనిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మనస్సులను స్కార్లెట్ స్పృశించింది. తల్లికి తన పిల్లలకు మధ్య ఉన్న అనుబంధానికి స్కార్లెట్ చూపిన మాదిరినిబట్టి, గర్భంలోనే ఉండగా తమ పిల్లల్ని చంపివేయడం లేదా పుట్టిన వెంటనే చంపివేయడం ద్వారా తమ పిల్లలను విసర్జించే కోట్లాదిమంది తల్లుల హృదయాలు కలత చెందడం లేదా అని మీరు ఆశ్చర్యపోయేలా చేస్తుందది.
[Picture Credit Line on page 27]
North Shore Animal League