యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
ఇతర యౌవనులు అంత సరదాగా ఎందుకు ఉంటారు?
“మేము కేవలం సరదాగా ఉండాలనుకుంటున్నాము, కానీ అది ఎంతో కష్టంగా ఉంది,” 15 సంవత్సరాల జేసన్ ఫిర్యాదు చేశాడు.
సరదాగా ఉండాలనుకోవడం కేవలం సహజం—ప్రాముఖ్యంగా మీరు యౌవనులుగా ఉన్నప్పుడు! అనేకమంది యౌవనులకు తినడం, నిద్రపోవడం ఎంత ప్రాముఖ్యమో సరదాగా ఉండడం అంత ప్రాముఖ్యం. వారి సహవాసులు, ప్రచార మాధ్యమము ద్వారా ప్రేరేపింపబడిన యౌవనులు వైవిధ్యంగల వినోద కార్యకలాపాల వెంబడిపడతారు. ఒక సర్వేక్షణ ప్రకారం, టీనేజర్లలో సాయంత్రాలు గడపడానికి చేసే పనుల్లో స్నేహితులను సందర్శించడం, దూరదర్శని చూడడం, సినిమాలకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం, నృత్యం చేయడం లిస్టులో అన్నింటికన్నా ముందున్నాయి. చదవడం, క్రీడలు, ఆటలు ఆడడం, సంగీతం వినడం వంటివి కూడా ప్రజాదరణ గలవే.
అన్ని సరదా కార్యకలాపాలు అందుబాటులో ఉన్నప్పుడు, జేసన్‌వంటి కొంతమంది యౌవనులు తమకు తగినంత సరదా ఉండడం లేదని ఎందుకు భావిస్తారో అర్థం చేసుకోవడం పెద్దలకు కష్టం కావచ్చు. కానీ కొంతమంది క్రైస్తవ యౌవనులు సరిగ్గా అలాగే వాదించారు! యెహోవాసాక్షి అయిన కేసీ అనే యువతి, ఈ విధంగా వ్యక్తం చేసింది: “మీ స్నేహితులందరూ పాఠశాలలో పార్టీలు జరుపుకుంటూ, అనేక విషయాలు చేయడాన్ని మీరు చూస్తారు, మరి మీరు నిజంగా ఒంటరిగా, అదంతా పోగొట్టుకుంటున్నట్లు భావిస్తారు.” కానీ పరిస్థితి నిజంగా అంత చెడుగా ఉందా?
మంచి సమయాన్ని గడపడాన్ని బైబిలు నిషేధిస్తుందా? అది అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. బైబిలు యోహోవాను “సంతోషంగల దేవుడు” అని పిలుస్తుంది. (1 తిమోతి 1:11, NW) అందువలన రాజైన సొలొమోను ఇలా అనడం మిమ్మల్ని ఆశ్చర్యపరచకూడదు: “ప్రతిదానికి సమయము కలదు. . . . ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు” (ప్రసంగి 3:1, 4) ఇక్కడ ఉన్న “నవ్వు” అనేదానికి, మరితర సంబంధిత పదాలకు మూల హెబ్రీ పదం “ఉత్సవం చేయు,” “ఆడు,” “క్రీడించు,” ‘వినోదం అందించు,’ “మంచి సమయాన్ని గడుపు” అనే అర్థాలు కూడా ఇవ్వగలదు.”—2 సమూయేలు 6:21; యోబు 41:5; న్యాయాధిపతులు 16:25; నిర్గమకాండము 32:6; ఆదికాండము 26:8, NW.
వెనుకటికి బైబిలు కాలాల్లో, దేవుని ప్రజలు సంగీత వాద్యాలను వాయించడం, పాడడం, నాట్యమాడడం, సంభాషించడం, ఆటలు ఆడడం వంటి వైవిధ్యంగల ఆరోగ్యకరమైన కార్యకలాపాలను ఆనందించారు. వారు విందులకు, వినోదభరిత సహవాసాలకు ప్రత్యేక సందర్భాలను కూడా కలిగివున్నారు. (యిర్మీయా 7:34; 16:9; 25:30; లూకా 15:25) అంతెందుకు, యేసుక్రీస్తు తానే ఒక వివాహ మహోత్సవానికి హాజరయ్యాడు!—యోహాను 2:1-10.
అందువలన ఈనాడు క్రైస్తవ యౌవనుల మధ్య ఆరోగ్యకరమైన సరదా నిషేధించబడలేదు. నిజానికి, బైబిలు ఇలా చెబుతుంది: “యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము.” అయితే సొలొమోను ఆ మాటలతో ఈ హెచ్చరికను చేరుస్తున్నాడు: “అయితే వీటన్నిటినిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము.” (ప్రసంగి 11:9) అవును, మీరు చేసుకునే ఎంపికలకు దేవుని ఎదుట మీరే బాధ్యులు. అందువలన వినోదం విషయానికి వచ్చేసరికి మీరు ‘అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకోవాలి.’ (ఎఫెసీయులు 5:15, 16) కారణం? ఈ విషయంలో చాలామంది యౌవనులు ఎంతో హీనమైన ఎంపికలు చేసుకుంటారు.
సరదా అదుపు తప్పినప్పుడు
వెనుకటికి బైబిలు కాలాల్లో ఏమి జరిగిందో పరిశీలించండి. వినోదం విషయం వచ్చేసరికి, రాత్రంతా జరిగే విశృంఖల విందులను జరుపుకుంటూ కొంతమంది ఇశ్రాయేలీయులు సమతుల్య భావాన్నంతటినీ కోల్పోయారు! ప్రవక్తైన యెషయా ఇలా చెప్పాడు: “మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు.” ఒక దగ్గరచేరి ఆహారం తిని, సంగీతం విని, నాట్యమాడి ఆనందించడం తప్పని కాదు. కానీ అల్లరితో కూడిన ఆటపాటలాడే వీరిని గూర్చి యెషయా ఇలా చెబుతున్నాడు: “యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.”—యెషయా 5:11, 12.
నేడు చాలామంది యౌవనులు అదే చేస్తారు—వినోదం కావాలనుకున్నప్పుడు వారు దేవున్ని ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోరు. వివాహపూర్వ లైంగికత, విధ్వంసనం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అంతేకాక “సరదా” కోసం ఇతర నిర్లక్ష్య ప్రవర్తన వంటి వాటిలో పాల్గొంటూ కొంతమంది దేవుని ప్రమాణాలను మొండిగా తిరస్కరిస్తారు. అయితే ఇతర సందర్భాల్లో, యౌవనులు నిజానికి దుష్టులుగా ఉండడానికి ప్రయత్నించడం లేదు. కానీ వారు పనులను చేయడంలో మితంగా ఉండడంలోను, సంయమాన్ని పాటించడంలోను విఫలమౌతారు. (సామెతలు 23:20; 1 తిమోతి 3:11) కాబట్టి, వారు ఒక దగ్గర చేరి మంచి సమయాన్ని గడపాలనుకున్నప్పుడు, విషయాలు అదుపు తప్పిపోతుంటాయి.—1 కొరింథీయులు 10:6-8 పోల్చండి.
ఇటీవల, “లోకంలోని పార్టీలలో నేడు ఏమి జరుగుతుంది?” అని కొంతమంది యౌవనులను తేజరిల్లు! అడిగింది. ఒక టీనేజి అమ్మాయి ఇలా జవాబిచ్చింది: “మాదక ద్రవ్యాలు, త్రాగుడు. అవి నిజంగా జరుగుతున్నాయి.” తన పాఠశాలలోని, పార్టీలకు వెళ్లే కొంతమంది అబ్బాయిలను గూర్చి యౌవనుడైన ఆండ్రూ ఇలా అన్నాడు: “వారెప్పుడూ చేసేదల్లా తామెంత తాగామన్నదాని గురించి గొప్పలు చెప్పుకోవడమే.” జేసన్ ఇలా చెప్పేంత వరకూ వెళ్లాడు: “లోకంలోని ఒక పార్టీలో దాదాపు ఎప్పుడూ చెడు విషయాలు జరుగుతూనే ఉంటాయి.” “అల్లరితో కూడిన ఆటపాటలు,” లేక “విశృంఖల విందులు” బైబిలులో ఖండించబడ్డాయి గనుక, దైవ భయంగల యౌవనులు అటువంటి అభ్యాసాలు ఉన్న సాంఘిక సమావేశాలలో పాల్గొనరు.—గలతీయులు 5:21; బైయింగ్‌టన్.
హానికరం కావన్నట్లు కనిపించే వినోదాలలో కూడా ప్రమాదాలు పొంచివుండవచ్చు. ఉదాహరణకు, నేటి ప్రజాదరణ పొందిన సినిమాలనేకం నగ్నత్వాన్ని, స్పష్టమైన రీతిలో లైంగికతను, కంపరం పుట్టించే హింసను చూపిస్తున్నాయి. జనాదరణ పొందిన పాటల్లో తరచూ అశ్లీల పదజాలం ఉంది. రాక్ ప్రదర్శనలు సాధారణంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి, గలాభాకు, హింసకు వేదికలవుతున్నాయి.a
తలిదండ్రులు వద్దని చెప్పినప్పుడు
ఈ విషయంలో ప్రాథమిక వాస్తవమేమిటి? మీరొకవేళ క్రైస్తవుడు(రాలు) అయితే, మీ సహవాసులు చేసి ఆనందించే విషయాలన్నింటినీ మీరు ఎంతమాత్రం చేయలేరు. తన శిష్యులు “లోకసంబంధులు”గా ఉండరు అని యేసు చెప్పాడు, అంటే ఇతర ప్రజల నుండి వేరుగా ఉండడమని దానర్థం. (యోహాను 15:19) మీ తలిదండ్రులు దైవభయం గలవారైతే, వారీ వాస్తవం బాగుగా ఎరుగుదురు. అందువలన కొన్నిసార్లు, మిమ్మల్ని కాపాడాలనే కోరికతో కొన్ని పనులను అంటే ఇతర యౌవనులు చేయడానికి అనుమతింపబడిన పనులను చేయడం నుండి మీ తలిదండ్రులు మిమ్మల్ని నిరుత్సాహపర్చవచ్చు లేక దృఢంగా ఆపవచ్చు. దీన్ని అంగీకరించడం ఎల్లప్పుడూ సులభం కాదు. “ప్రజలు సరదాగా ఉండాలనుకుంటారు!” అని ఒక టీనేజి అమ్మాయి నొక్కి చెప్పింది. “మా తలిదండ్రులు వారు యౌవనులుగా ఉన్నప్పుడు సరదాగా ఉండగలిగారు, కానీ కొన్నిసార్లు, వారు మమ్మల్ని ఇంట్లోపెట్టి తాళం వేయాలనుకుంటారని అనిపిస్తుంది” అని ఆమె అంటుంది.
ప్రాథమికంగా మీరు మీ తలిదండ్రుల దృష్టికోణాన్నే కలిగివున్నప్పుడు కూడా, అటువంటి విషయాల్లో వారి సలహాను గైకొనడం సుళువుగా ఉండకపోవచ్చు. అథ్లెట్‌లా కనిపించే ఒక యౌవనుడు—మనమాయన్ని జారడ్ అని పిలుద్దాము—ఇలా గుర్తు తెచ్చుకుంటున్నాడు: “పాఠశాల జట్టులో నేను బాస్కెట్‌బాల్ ఆడాలనుకున్నాను. చాలామంది ఆడమని నన్ను బలవంతపెట్టారు, ఆ విషయం నన్ను కొంత బాధించింది. కానీ అప్పుడు నేను నా తలిదండ్రులతో మాట్లాడాను.” జారడ్ తలిదండ్రులు “దుష్టసాంగత్యము”యొక్క ప్రమాదాలను ఎత్తిచూపి, ఆయన క్రీడా కార్యకలాపాలు ఎంతగా సమయాన్ని తీసుకుంటాయో ఆయనకు గుర్తు చేశారు. (1 కొరింథీయులు 15:33) “ఇక నేను ఆడలేకపోయాను” అంటున్నాడు జారడ్ విచారంగా. ఆయన తన తలిదండ్రుల సలహాకు విధేయత చూపాడు, అయినప్పటికీ బాస్కెట్‌బాల్ ఆడడం కుదరనందుకు ఆయన దుఃఖించాడు.
‘నేను పోగొట్టుకుంటున్నాను!’
మీ పరిస్థితి ఏమైనప్పటికీ, మీ తోటి పాఠశాల విద్యార్థులు తమ మంచి సమయాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మీరూ అదేవిధంగా అప్పుడప్పుడు నిరుత్సాహపడవచ్చు. ‘ఇతర యౌవనులు ఎందుకు అంత సరదాగా ఉంటున్నారు?’ అని మీరడగవచ్చు. అవును, మీరేదో పోగొట్టుకుంటున్నారనే భావాన్ని మీరెలా అధిగమించవచ్చు?
73వ కీర్తన చదివి, ఆసాపు అనే బైబిలు రచయిత అనుభవాన్ని ధ్యానించినట్లైతే మీకు సహాయకరంగా ఉండవచ్చు. 2, 3 వచనాలలో ఆయన ఇలా అంగీకరిస్తున్నాడు: “నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమాయెను. . . . గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.” అవును, ఆసాపు నిర్బంధిత జీవితం గడుపుతున్నప్పుడు ఇతరులు, స్పష్టమైన దుష్ఫలితాలేమీ లేకుండానే తమకు ఇష్టం వచ్చింది తాము చేయగలమని గొప్పలు చెప్పుకున్నారు. వారికి మంచి వస్తుసమృద్ధి ఉందన్నట్లు, మరింకా ఎక్కువ వస్తుందన్నట్లుగా కనిపించింది. (12వ వచనం) ఆ విధంగా ఆసాపు ఎంతో నిరుత్సాహం చెంది ఇలా బిగ్గరగా చెప్పాడు: “అందువలన నన్ను నేను స్వచ్ఛంగా ఉంచుకుని, పాపం చేయక ఉన్నది వ్యర్థమేనా?”—కీర్తన 73:13, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్.
భాగ్యకరంగా, ఆసాపు తొందరపాటు పనులు ఏమీ చేయకముందే స్పృహలోకి వచ్చాడు. ఆయన “దేవుని పరిశుద్ధ స్థలము”ను సందర్శించాడు, ఆ ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆయన విషయాలను గురించి గంభీరంగా ఆలోచించాడు. త్వరలోనే, దైవరహిత సుఖభోగాలను వెంబడించే వారిని గురించి ఆసాపు ఒక అసాధారణమైన ముగింపుకు వచ్చాడు: “నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు. వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు.”—కీర్తన 73:17, 18.
సుఖభోగాలననుసరించే మీ సహవాసులనేకమంది గురించి కూడా అదే చెప్పవచ్చు. మంచి సమయాన్ని అనుభవిస్తున్నామని వారు ఇప్పుడు అనుకోవచ్చు. కానీ పాప భోగం అల్పకాలము మాత్రమే ఉంటుంది! (హెబ్రీయులు 11:25) వారు బైబిలు ప్రమాణాలను అనుసరించరు కాబట్టి, వారు “కాలుజారు చోట” నిల్చున్నారు, అంతేగాక అకస్మాత్తుగా ఏమాత్రం హెచ్చరిక లేకుండానే ఘోరమైన వినాశనం అనుభవించే నిరంతర ప్రమాదంలో వారున్నారు. దేవుని వాక్యం ఇలా ప్రకటిస్తుంది: “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” (గలతీయులు 6:7) “సరదా” దుస్సాహసాల ఫలితంగా, మీ వయస్సుగల యౌవనులు ఇప్పటికే అకాల మరణానికి, లైంగికంగా సంక్రమించే వ్యాధులకు గురి కావడం, అవాంఛనీయ గర్భం, లేక జైలు పాలవ్వడం వంటివి మీరు నిశ్చయంగా విని ఉండవచ్చు. మరి, అటువంటి విషయాలలో నిమగ్నమవ్వకుండా ఉండడం మీకు ప్రయోజనకరంగా లేదా?—యెషయా 48:17.
సొలొమోను ఇలా చెబుతున్నప్పుడు మంచి సలహా ఇస్తున్నాడు: “పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు.” (సామెతలు 23:17, 18) అవును, పరదైసు భూమిపై నిరంతరము జీవించే ఒకరి నిరీక్షణను పోగొట్టుకునేందుకు ఎటువంటి “మంచి” సమయమైనా యోగ్యమైనది కాదు.
ఈలోగా, అప్పుడప్పుడు నిజంగా మంచి సమయం గడపాలన్న మీ సహజ కోరికను మీరెలా తృప్తిపరచుకోవచ్చు? అలా చేయడానికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన మార్గాలేమైనా ఉన్నాయా? డబ్బు, మరితర వనరులు పరిమితంగా ఉన్నట్లైతే అప్పుడేమిటి? కొన్ని సూచనలు, ఆలోచనల కొరకు తేజరిల్లు! ప్రపంచం నలుమూలలా ఉన్న యౌవనులను అడిగింది. ఈ పరంపరలోని భవిష్యత్తు శీర్షికలో ఇవి చర్చించబడతాయి.
[అధస్సూచి]
a మా డిశంబరు 22, 1995 (ఆంగ్లం) సంచికలోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేను రాక్ ప్రదర్శనలకు హాజరవ్వాలా?” అనే శీర్షికను చూడండి.
[22వ పేజీలోని చిత్రం]
లోకం సరదా అని పిలిచేదానిని మీరు అనుభవించలేరు గనుక మీరేదో పోగొట్టుకుంటున్నట్లు భావించాలా?