యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
ఉల్లాసకరమైన సమయాన్ని నేనెలా పొందగలను?
“మేము ఎన్నో ఆహ్లాదకరమైన పనులను చేస్తుంటామని నేననుకుంటున్నాను. మా సంఘంలో మేమందరం కలుసుకునేందుకు నిజమైన ప్రయత్నాన్నే చేస్తాము. మేము ప్రయోజనకరమైన ఆహ్లాదాన్ని పొందుతుంటాం. లోకంలో ఉన్న ఎక్కువ మంది పిల్లలు అలా చెప్పలేరు.”—జెన్నిఫర్.
వినోదం—ప్రతి ఒక్కరికి అది అప్పుడప్పుడు అవసరమే. వినోదం “ఒక వ్యక్తి మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమైన తోడ్పాటు”నివ్వవచ్చు కూడా అని వర్ల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా చెబుతుంది. అందుకే, ‘నవ్వుటకు సమయము కలదు’ అని బైబిలే చెబుతుంది! అంటే ఒకరు ఆనందించే సమయం ఉందన్నమాట.—ప్రసంగి 3:1, 4.a
వినోదము అనే పదానికి ఆంగ్లంలో ఉన్న “రిక్రియేషన్” అనే పదం “మరొకసారి సృష్టించేందుకు, యథాస్థితికి తెచ్చేందుకు, నవోత్తేజాన్నిచ్చేందుకు” అనే భావంగల లాటిన్ పదం నుండి వచ్చింది. (వెబ్స్టర్స్ న్యూ కొలజియేట్ డిక్షనరీ) యౌవనస్థులు “ఆహ్లాదం” కొరకు చేసే అదుపులేని పార్టీలు, మత్తుమందు, మద్యపానీయాల దుర్వినియోగం చేయడం, లేదా అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వంటి చాలా పనులు నిజానికి నవోత్తేజాన్ని ఇవ్వకపోవడమే కాక, వినాశకరం కూడా అన్నది విచారకరం. కనుక, ఆస్వాదించగల మరియు ఆరోగ్యకరమైన వినోద కార్యక్రమాలను కనుగొనడం నిజంగా ఒక సవాలే. పైన ప్రస్తావించబడిన జెన్నిఫర్ సూచించినట్లు అది సాధ్యమే!
కలిసి పనులను చేయడం
తేజరిల్లు! ఈ అంశంపై అనేక మంది యౌవనస్థులను ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. ఇతర యౌవనస్థులతో కలుసుకున్నప్పుడు తాము ఆనందిస్తున్నామని చాలా మంది చెప్పారు. మీరలాగే భావిస్తున్నారా—అయితే తరచూ ఆహ్వానించబడడం లేదని మీరు కనుగొంటున్నారా? అయితే మీరే ఎందుకు చొరవ తీసుకోకూడదు? ఉదాహరణకు, “నాకు ఏదైనా ఒక సినిమా చూడాలని ఉత్సాహం ఉన్నట్లైతే నేను ఎవరైనా ఒక స్నేహితురాలికి ఫోను చేస్తాను, అలా మేము మిగిలిన స్నేహితురాళ్ళకు ఆ మాటను అందిస్తాము” అని లీ అనే ఒక దక్షిణాఫ్రికా అమ్మాయి చెబుతుంది. సాధారణంగా వాళ్ళు ఫస్టు షోకి వెళ్తారు. వాళ్ళను తీసుకువెళ్ళడానికి తరువాత వాళ్ళ తలిదండ్రులు వస్తారు, ఏదైన స్థానిక హోటల్లో వాళ్ళు కలిసి భోజనం చేస్తారు.
క్రీడా కార్యక్రమాలు కూడా ఆరోగ్యదాయకమైన వ్యాయామానికి, ప్రయోజనకరమైన సహవాసాలకు అవకాశాలనిస్తాయి. (1 తిమోతి 4:8) “నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో మొదట మా కుటుంబంతో చర్చిస్తాను, తర్వాత మాతోపాటు రమ్మని కొంత మందిని ఆహ్వానిస్తాము” అని యౌవనస్థురాలైన రోలీన్ అంటుంది. నిజంగా, క్రైస్తవ యౌవనస్థులు ఇతరులతో పాల్గొనగల ప్రయోజనకరమైన క్రీడల ఆకర్షణీయమైన పట్టికను కనుగొన్నారు: స్కేటింగ్, సైక్లింగ్, జాగింగ్ మరియు టెన్నిస్, బేస్బాల్, సోకర్, వోలీబాల్ వంటి ఆటల పేర్లు చెప్పుకోవడానికి కొన్ని మాత్రమే.
నిజంగా, ఉల్లాసకరమైన సమయం కొరకు మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయనక్కరలేదు, లేదా ఖరీదైన పరికరాల కొరకు పెట్టుబడి పెట్టనవసరం లేదు. “నేను, నా తలిదండ్రులు, నా స్నేహితులు దగ్గర్లో ఉన్న పర్వతాల్లోను అరణ్యంలోను ఎన్నో గంటలు పాదయాత్ర చేసేవాళ్ళం. బయట స్వచ్ఛమైన గాలిలో మంచి స్నేహితులతో ఉండడం ఎంత ఆనందదాయకమో!” అని కౌమార ప్రాయంలోని ఒక క్రైస్తవ అమ్మాయి చెబుతుంది.
నిర్మాణాత్మకమైన సామాజిక సమావేశాలు
అయితే, చాలా మందికి ఆహ్లాదమంటే సామాజిక సమావేశాలకు వెళ్లడమే. “తినడానికి, సంగీతం వినడానికి స్నేహితులను పిలవడంలో మేము ఆనందిస్తాము” అని ఒక యౌవనస్థురాలైన ఆవేడా అంటోంది. క్రైస్తవుల మధ్య సామాజిక సమావేశాలకు ఉండవలసిన స్థానముంది. యేసుక్రీస్తు కూడా ప్రత్యేక విందులకు, పెళ్ళిళ్ళకు, మరితర సామాజిక కలయికలకు హాజరయ్యేవాడు. (లూకా 5:27-29; యోహాను 2:1-10) అలాగే తొలి క్రైస్తవులు భోజనాలకు నిర్మాణాత్మక సహవాసాలకు కలుసుకునే సందర్భాల్లోను ఆనందించేవారు.—యూదా 12 పోల్చండి.
అతిధులను పిలిచేందుకు మీ తలిదండ్రులు అనుమతిస్తే సమస్యలను నివారించి, అందరికీ ఆహ్లాదకరమైన సమయంగా ఉండేలా చూసేందుకు మీరేమి చేయగలరు? శ్రద్ధాపూర్వకంగా పథకం వేయడమే కీలకము. (సామెతలు 21:5) ఉదాహరణకు: పర్యవేక్షించగలిగినంత మందిని మాత్రమే ఆహ్వానించడం అర్థవంతంగా ఉంటుంది. చిన్న కలయికలు “అల్లరితోకూడిన ఆటపాటలు”గా లేదా “అదుపులేని పార్టీలుగా” మారే అవకాశం చాలా తక్కువ.—గలతీయులు 5:21; బైయింగ్టన్.
“అక్రమముగా నడుచుకొను” వారితో సహవసించవద్దని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు హెచ్చరించబడ్డారు. (2 థెస్సలొనీకయులు 3:11-15) రౌడీలని, అదుపులేని వారని పేరుగాంచిన యౌవనస్థులను ఆహ్వానించడం నేడు కచ్చితంగా కలయికలను ధ్వంసం చేసే మార్గమే. ఎవరిని ఆహ్వానించాలి అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంటుండగా, ఒకే గుంపులోని స్నేహితుల వరకు మాత్రమే మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. “విశాలపరచుకొనుడి” మరియు సంఘంలోని వృద్ధులైన వారితో సహా మరి కొందరితో పరిచయమేర్పరచుకోండి.—2 కొరింథీయులు 6:13.
మీరు అల్పాహారాన్నిస్తారా? అలాగైతే, మీ అతిధులు ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపేందుకు అది మరీ అధికంగా లేదా చాలా ఖరీదైనవిగా ఉండనవసరం లేదు. (లూకా 10:38-42) “కొన్నిసార్లు మేము రాత్రి పిజా తినేవాళ్ళం” అని దక్షిణాఫ్రికాలోని సాన్చా చెబుతుంది. తరచూ అతిధులు కొన్ని ఆహార పదార్థాలను స్వచ్ఛందంగా తెస్తారు.
కేవలం టివి చూడడం, సంగీతం వినడం లేదా సంభాషించడమే కాక, ఇలాంటి కలయికల్లో మీరు చేయగల మరి కొన్ని విషయాలేవి? “మేము సాధారణంగా ఆ సాయంకాలాన్ని గూర్చి ముందుగానే పథకం వేస్తాము. మేము ఆట్లాడేవాళ్ళం లేదా ఎవరో ఒకరు పియానో వాయించేవారు, అలా మేమందరం కలిసి పాటలు పాడేవాళ్ళం” అని సాన్చా చెబుతుంది. “మేము కొన్ని సార్లు పేకాట, డ్రాట్స్ [చెక్కర్స్], చెస్స్ ఆడుతాం” అని మాసేన్ అనే ఆఫ్రికా యౌవనస్థుడు చెబుతున్నాడు.
“మా సంఘంలోని ఒక పెద్ద బైబిలు గేమ్స్ ఆడడాని కోసం మమ్మల్ని ఆహ్వానిస్తాడు. మీరు బాగా ఆడాలంటే మీకు మంచి బైబిలు జ్ఞానం ఉండాలి” అని మొదట్లో ప్రస్తావించబడిన జెన్నిఫర్ తేజరిల్లు!తో చెప్పింది. “బైబిలు ఆటలు ఆడడమనేది పాతకాలం సంగతి అని మీరనుకోవడం లేదా?” అని తేజరిల్లు! ప్రతినిధివేరే యౌవనస్థులను అడిగాడు. వారిలో చాలామంది “లేదు!” అని బిగ్గరగా జవాబు చెప్పారు.
“అదొక సవాలు” అని కౌమార ప్రాయంలోని ఒక అమ్మాయి చెప్పింది. అది “ఆహ్లాదకరం!” అని మరో అమ్మాయి చెప్పింది. బైబిలు గేమ్స్ ఆహ్లాదం కోసం ఆడినప్పుడు, పోటీ స్ఫూర్తిని అదుపులో ఉంచాలి, అవి ఆహ్లాదకరంగాను విద్యనందించేవిగాను ఉండగలవు!—జూన్ 22, 1972 తేజరిల్లు! (ఆంగ్లం) సంచికలోని “సామాజిక కలయికలను ఆస్వాద్యమైనవిగాను అయితే ప్రయోజనకరమైనవిగాను చేయడం” అనే శీర్షికను చూడండి.
కుటుంబ ఆహ్లాదం
కుటుంబాలు కొన్ని రకాల వినోదాల్లో కలిసి ఆనందించడం బైబిలు కాలాల్లో అసాధారణమేమీ కాదు. (లూకా 15:25) అయినప్పటికీ, “కార్యకలాపాలకు పథకం వేసుకోలేనంతగా తలిదండ్రులు మరియు పిల్లలు ఈ రోజుల్లో ఎంతో బిజీగా ఉంటారు . . . తలిదండ్రులు మరియు పిల్లలు ప్రతివారం ఆహ్లాదం కోసం కొంత సమయం కలిసి గడిపేందుకు నిశ్చయపరచుకోవడం ప్రాముఖ్యమని మేమనుకుంటున్నాం” అని ది కిడ్స్ బుక్ అబౌట్ పేరెంట్స్ అనే పుస్తకపు యౌవన రచయితలు అభిప్రాయపడుతున్నారు.
“శుక్రవారం మా కుటుంబ దినం, మేము సాధారణంగా కలిసి ఆడుతాం” అని పాకీ అనే పేరుగల ఆఫ్రికా యువతి చెబుతుంది. మీ తోబుట్టువులను మరువకూడదు. “నేను బొమ్మలు గీయడంలోను నా చెల్లెలుతో కళాపరమైన కార్యాలను చేయడంలోను ఆనందిస్తాను” అని బ్రాన్వన్ అనే యౌవనస్థురాలు చెబుతుంది. మీ కుటుంబంతో ఏదైన ఆహ్లాదకరమైన పనిని చేయడానికి చొరవ తీసుకోవడమో లేక సలహా ఇవ్వడమో చేస్తారా?
మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు
మీరు ఏకాంతంగా ఉండేటప్పటి విషయమేమిటి? దాని భావం మీరు విసుగ్గానో లేదా ఒంటరిగానో భావించాలని కాదు. అలాంటి సమయాలను ఉపయోగించేందుకు ఫలవంతమైన ఆస్వాద్యమైన అనేక మార్గాలున్నాయి. సరదా పనులు ఒక ఉదాహరణ. సంగీతాన్ని నేర్చుకోవడం అభిరుచిని పెంచేదిగా చేస్తుందని స్త్రీ పురుషులు బైబిలు కాలాల నుండే కనుగొన్నారు. (ఆదికాండము 4:21; 1 సమూయేలు 16:16, 18) “నేను పియానో వాయిస్తాను. ఏమీ తోచనప్పుడు మీరు చేయగల ఒక పనది” అని రేచల్ చెబుతుంది. మీకు సంగీత అభిరుచి లేనట్లైతే, బట్టలు కుట్టడాన్ని, తోట పనిని, స్టాంపులను సేకరించడాన్ని, లేదా విదేశీ భాషను నేర్చుకునే పనిని చేపట్టవచ్చు. అదనపు లాభంగా, తరువాతి సంవత్సరాల్లో ఉపయుక్తమని నిరూపించబడే కొన్ని నైపుణ్యాలను మీరు పెంపొందించుకోవచ్చు కూడా.
ఇస్సాకు వంటి విశ్వాసం గల పురుషులు ధ్యానం కొరకు ఏకాంత సమయాలను అన్వేషించేవారని బైబిలు మనకు చెబుతుంది. (ఆదికాండము 24:63) “అప్పుడప్పుడు, నేను తోటలో నిశ్శబ్దంగా ఉండేచోటకు వెళ్లి కూర్చుని సూర్యాస్తమయాన్ని చూసేందుకు బయటికి వెళ్ళేవాడిని. ఇది నాకు మరింత ఆనందాన్ని తెచ్చిపెట్టి నా దేవుడైన యెహోవాకు నేను మరింత సన్నిహితునిగా భావించేందుకు సహాయపడింది” అని హాన్స్ అనే ఒక ఆస్ట్రియా యువకుడు చెబుతున్నాడు.
యెహోవా సేవలోని “ఆనందం”
యెహోవా దేవుని సేవలో క్రీస్తు ‘ఆనందాన్ని’ కనుగొంటాడని బైబిలు ప్రవచించింది. (యెషయా 11:3) దేవునికి పరిశుద్ధ సేవ చేయడమనేది నిజానికి వినోదం కాకపోయినప్పటికీ, అది నవోత్తేజాన్ని కలిగించేదిగాను ఆహ్లాదకరంగాను ఉండగలదు.—మత్తయి 11:28-30.
ముందు ఉదాహరించబడిన హాన్స్ మరో ఆస్వాద్యమైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. “నేను, నా స్నేహితులు [ఆరాధన కొరకైన] సమావేశ మందిరపు నిర్మాణ స్థలంలో పనిచేయడానికి గడిపిన వారాంతాలను గుర్తు చేసుకోవడానికి ఇష్టపడతాము. ఎలా కలిసి పని చేయాలో నేర్చుకున్నాము, మేము ఒకరినొకరం మరెక్కువ తెలుసుకోగలిగాము. వెనక్కు తిరిగి చూస్తే, మేము చేసిన పని ప్రయోజనకరమైనదని అలాగే ఆహ్లాదకరమైనది అన్న సంతృప్తితో కూడిన అనుభూతి ఉంది.”
ఈ క్రైస్తవ యౌవనస్థుల సాక్ష్యం నాటకీయంగా ఈ వాస్తవాన్ని స్పష్టం చేసింది: మీరు ఆహ్లాదకరమైన సమయాలను ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోనవసరం లేదు. బైబిలు సూత్రాలను అనుసరించండి. భావనా శక్తిగలవారై ఉండండి! ప్రయోజనకరమైనవాటికి చొరవ తీసుకోండి! మిమ్మల్ని ఆత్మీయంగా నిర్మించేవిగాను అలాగే మిమ్మల్ని కృంగదీయనివిగాను ఉండే మార్గాల్లో మీరు ఆనందించగలరని మీరు కనుగొంటారు.
[అధస్సూచి]
a ఆగస్టు 8, 1996 సంచికలోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ఇతర యౌవనులు అంత సరదాగా ఎందుకు ఉంటారు?” అనే శీర్షికను చూడండి.
[23వ పేజీలోని చిత్రం]
“మంచి స్నేహితులతో బయట స్వచ్ఛమైన గాలిలో ఉండడం చాలా ఆస్వాద్యంగా ఉంటుంది!”
[24వ పేజీలోని చిత్రం]
స్నేహితులతో మీరు ఆహ్లాదకరమైన సమయాలను గడిపేందుకు మీరు డబ్బు ఎక్కువ ఖర్చు చేయనవసరం లేదు