ప్రపంచ పరిశీలన
చదివే, వ్రాసే సామర్థ్యాన్ని పోగొట్టుకోవడం
చక్కగా చదివే, వ్రాసే విషయంలో అభ్యాసం లేకపోవడం మూలంగా జర్మనీలోని దాదాపు 30 లక్షలమంది ఆ సామర్థ్యాన్ని పోగొట్టుకున్నారు. ఎలక్ట్రానిక్ ప్రసార మాద్యమం పురోభివృద్ధి చెందడమే సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని రీడింగ్ ఫౌండేషన్ సెక్రటరీ జొహానెస్ రింగ్ వివరించాడు. దూరదర్శిని, కంప్యూటర్‌లు మరియు వీడియో ఆటల సర్వవ్యాప్త ఉపయోగం వలన పాక్షికంగా ఈ విధమైన నిరక్షరాస్యత పెరుగుతోందని నిరక్షరాస్యతకు విరుద్థంగా సలిపే పోరాటాన్ని గూర్చిన ప్రపంచ మహాసభలో రింగ్ పేర్కొన్నాడని ప్రాంక్‌ఫర్టర్ అల్‌జిమీన్ జీటంగ్ పత్రిక నివేదిస్తోంది.
ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నీళ్లు త్రాగండి
మీరు అవధానం నిలపలేక పోతున్నారా? బహుశా మీరు ఎక్కువ నీళ్లు త్రాగవలసి ఉందేమో అని ఏషియావీక్ సలహా ఇస్తోంది. పుష్కలంగా నీళ్లు త్రాగడం విద్యార్థులు చదువు ఎడల అలసత్వ దృక్ఫథాన్ని ఎదిరించేందుకు సహాయం చేయగలదని హాంకాంగ్‌లోని కొందరు పాఠశాల పిల్లల అధ్యాపకులకు, తలిదండ్రులకు సలహా ఇవ్వబడిందని ఈ పత్రిక నివేదిస్తోంది. పిల్లలు దినానికి 8 నుండి 15 గ్లాసుల నీళ్లు త్రాగాలని తలిదండ్రులకు చెప్పబడింది. నేర్చుకునే మెదడు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఉదహరిస్తూ, నిర్జలీకరణ హీనంగా నేర్చుకునేందుకు దారి తీస్తుందని సూచించే అధ్యయనాలను ఆ నివేదిక పేర్కొంటోంది. స్వచ్ఛమైన, శుభ్రమైన నీళ్లు త్రాగడం వాస్తవానికి శరీరంలోని ద్రవాన్ని శరీరం బయటకు పంపేందుకు శరీరాన్ని ప్రేరేపించే సాఫ్ట్ డ్రింక్‌లు, కాఫీ, టీ లేక చివరకు రసాలు త్రాగడం కంటే మంచిదని ఏషియావీక్ పేర్కొన్నది.
అద్భుతమైన చెట్టు
ఖరీదైన రసాయనాలు ఉపయోగించకుండానే త్రాగే నీటిని శుభ్రపరచే విత్తనాలను బ్రిటీష్ వైజ్ఞానికులు కనుగొన్నారు. ఉత్తర భారతదేశంలోని మోరింగా ఓలిఫేరా చెట్టు యొక్క నలగగొట్టిన విత్తనాలు బ్యాక్టీరియా మరియు వైరస్‌లను ఆకర్షించి వాటిని పట్టుకుని ఉంచుతాయి. ఆ విత్తనాలను తర్వాత తీసేయవచ్చు లేక ఫిల్టర్ పొరల్లో పట్టి ఉంచవచ్చు అని లండన్‌కు చెందిన ద టైమ్స్ వార్తాపత్రిక నివేదిస్తుంది. ఈ బహుముఖ విత్తనాలను వంట నూనె, సబ్బు, అలంకరణ సామాగ్రి, దీపం నూనె మరియు చర్మ వ్యాధికి ఔషధాన్ని చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఈ చెట్టును పెంచడం సులభం, అది అనావృష్టిని తట్టుకుంటుంది, గాలిని ఆపేందుకు తోడ్పడుతుంది, చివరకు వంట చెరకుకు మరియు కాగితం చేసేందుకు పనికి వస్తుంది. గనుక, మురికి నీరు త్రాగడం ద్వారా ప్రతి సంవత్సరం సంభవిస్తున్న లక్షలాది మరణాలను నివారించడంలో సహాయాన్ని అందించగల విత్తనాల కొరకు ఈ చెట్లను నాటమని పరిశోధకులు సలహా ఇచ్చారు.
కీటకనాశిని హెచ్చరిక
బర్కలేనందలి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం, అమెరికా ప్రజలు మందు జల్లిన పళ్లు, కూరగాయల కంటే ఇంట్లో ఉపయోగించే ఉత్పత్తుల ద్వారానే కీటకనాశినులకు ఎక్కువ గురౌతున్నారు. బొద్దింకల స్ర్పేలు, ఈగలను చంపే వ్రేలాడే కాగితాలు, మిణ్ణల్లిని చంపే పొగ, కలరా ఉండలు అలాగే అటువంటి మరితర ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో విష పదార్ధాలను ఉత్పత్తి చేయడమే కాకుండా, అందులో అనేకం దీర్ఘకాల ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. యుసి బర్కలే ఆరోగ్య పత్రిక (ఆంగ్లం) సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తోంది: కిటికీ తెరలను (దోమ తెరల వంటివి) బాగు చేయించుకోండి, కీటకాలు రాకుండా చేసేందుకు నేల మరియు గోడల్లోని చీలికలను మూయండి; ఆహార పదార్ధాలను, చెత్తను ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి సీల్ చేయండి; ఈగలను చంపే దాన్ని ఉపయోగించండి; ఆహార ముక్కలను ఊడ్చి వేయండి; రగ్గులను స్టీమ్‌లో శుభ్రం చేయండి; ఉన్నిని తరచూ శుభ్రం చేయండి, వాటిని మూత వేయబడిన సంచీలో భద్రపరచండి. ఒకవేళ బొద్దింకలు ఇంకా ఉంటే, అతుక్కునే ట్రాప్‌ను ఉపయోగించి లేక అలమరాల వెనుక బోరిక్ ఆసిడ్‌ను జల్లి చూడండి, అయితే పిల్లలు లేక పెంపుడు జంతువులు ఈ పదార్ధాలను ముట్టకుండా చూడండి అని ఆరోగ్య పత్రిక సలహా ఇస్తోంది.
పాము కాట్లు—ఏమి చేయ కూడదు
పాము కాటు బాధితులకు చికిత్స చేసే విషయంలో నిపుణులు అన్ని వేళలా ఏకాభిప్రాయాన్ని కలిగిలేరు. అయితే, ఎఫ్‌డీఏ కన్జ్యూమర్ పత్రిక ప్రకారం, “ఏమి చేయ కూడదు అనే విషయాన్ని గూర్చిన తమ అభిప్రాయాల్లో మాత్రం” అమెరికాలోని వైద్య వృత్తిగల వారు “ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.” వైద్య సౌకర్యాలు మీకు 30 నుండి 40 నిముషాల దూరంలో ఉంటే, ఆ సందర్భం కొరకు సలహా ఏమంటే: కాటుకు ఐసును పెట్టకండి, టార్నికెట్‌లను (స్క్రూ ఒత్తిడితో ధమని ద్వారా వచ్చే రక్త ప్రవాహాన్ని అరికట్టె సాధనం) లేక విద్యుత్ షాక్‌ను ఉపయోగించకండి, గాయంలో కాట్లు చేయకండి. అందరిచేత అంగీకరించబడే ప్రతిపాదన ఏమంటే, ఆ పాము విషపూరితమైన దానిలా కనిపించినా లేకపోయినా, అన్ని పాము కాటులను వైద్యపరమైన ప్రాముఖ్యతగల వాటిగా పరిగణించాలి, బాధితున్ని తక్షణమే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. శ్రేష్ఠమైన నివారణా చర్య ఏమంటే, “పామును వదిలేయండి. ఆ పామును చంపేందుకు లేక దాన్ని దగ్గిరగా చూసేందుకు ప్రయత్నించడం వలననే అనేకమందిని అవి కాటు వేశాయని” ఎఫ్‌డీఏ కన్జ్యూమర్ చెబుతుంది.
జంతు ప్రేమికులకు జ్ఞాపిక
మీరు జంతు ప్రేమికులా? అయితే, స్నేహపూర్వకమైన కుక్క మీ మొహాన్నో లేక మీ చేతినో తప్పకుండా నాకి ఉంటుంది. గానీ, మనిటోబా విశ్వవిద్యాలయం నందు సూక్ష్మక్రిమి శాస్త్రజ్ఞుడైన లేన్ గ్రహం ప్రకారం, మీరు లార్వా రూపంలోని పరాన్న జీవులను లేక రౌండ్‌వార్మ్‌లను మీలోకి తీసుకునే సాధ్యత ఉంది. “మీ కుక్క మూతి మీ మూతికి మరీ దగ్గరగా రానివ్వకపోవడం మంచిదని” విన్నీపెగ్గ్ ఫ్రీ ప్రెస్స్ నివేదిస్తోంది. తమను శుభ్రం చేసుకునేందుకు కుక్కలు తమ నాలుకలను ఉపయోగిస్తాయి; వాటి నాలుకలు శుభ్రపరిచే బండ వంటివి గనుక, అవి మల మురికితో పాటు ఇతర పదార్ధాలను వాటి నాలుకలపై కలిగి ఉంటాయి. కుక్క పిల్లలు “క్రిములుగల బొచ్చు ఉండలుగా పేరుగాంచాయని” ఆ వార్తాపత్రిక పేర్కొన్నది. అనారోగ్యులు అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, “భద్రతా కారణాల వలన, కుక్క నాకిన తర్వాత మీ మరియు మీ పిల్లల చేతుల్ని, ముఖాన్ని కడుగుకోమని” సలహా ఇవ్వబడుతుంది.