నిరుద్యోగ మహామారి
ఇటలీలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో అది అత్యవసర పరిస్థితి—కాని అది వర్ధమాన దేశాలను కూడా కలవరపరుస్తుంది. ఒకప్పుడు అది ఉనికిలోనే లేదనిపించిన చోట అది దెబ్బతీసింది. అది కోట్లాదిమందిని ప్రభావితం చేస్తుంది—వారిలో అనేకులు తల్లులు, తండ్రులు. ఇటలీ దేశస్థుల్లోని మూడింట రెండొంతుల మందికి, అది “మొట్టమొదటి బెదిరింపు.” అది క్రొత్త సాంఘిక రుగ్మతలను సృష్టిస్తోంది. కొంతమేరకు అది, మాదక ద్రవ్యాలకు అలవాటుపడే అనేకమంది యౌవనస్థుల సమస్యలకు మూలంగా ఉంది. లక్షలాదిమంది నిద్రను అది భంగం చేస్తుంది, లక్షలాదిమంది ఇతరులు బహుశా త్వరలోనే దానికి గురౌతారేమో . . .
“నిరుద్యోగం బహుశా మన కాలంలోని అత్యంత ఎక్కువ భయాన్ని కలిగించే అసాధారణ విషయమై ఉండవచ్చు” అని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓ.ఇ.సి.డి.) నొక్కి చెబుతుంది. “ఈ అసాధారణ విషయం యొక్క విస్తృతి, ఫలితాలు తెలిసినవే” కానీ, “దానితో వ్యవహరించడం కష్టసాధ్యం” అని యూరప్ సమాజాల సమాఖ్య వ్రాస్తోంది. అది “పురాతన యూరప్ ఖండంలోని వీధుల్లో విహరించడానికి తిరిగి వస్తున్న పిశాచి” అని ఒక నిపుణుడు చెబుతున్నాడు. యూరప్ సమాఖ్యలో (ఇ.యు.), ఇప్పుడు దాదాపు రెండు కోట్లమంది నిరుద్యోగులున్నారు, 1994 అక్టోబరులో కేవలం ఇటలీలోనే 27,26,000 మంది ఉన్నట్లు అధికారికంగా లెక్కించబడింది. యూరప్ సమాఖ్య కమీషనర్ పాద్రిక్ ఫ్లిన్ అభిప్రాయమేమిటంటే, “నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే మనం ఎదుర్కొంటున్న అతి ప్రాముఖ్యమైన సాంఘిక, ఆర్థిక సవాలు.” మీరు నిరుద్యోగులైతే లేక మీ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉంటే, అది కలుగజేసే భయమేమిటో మీకు తెలుస్తుంది.
కాని నిరుద్యోగం కేవలం యూరప్‌కు సంబంధించిన సమస్యే కాదు. అది అమెరికా దేశాలన్నిటినీ పీడిస్తోంది. ఆఫ్రికా, ఆసియా, లేక ఓషియానియానూ అది విడిచిపెట్టడం లేదు. ఇటీవలి సంవత్సరాలలో తూర్పు యూరప్ దేశాలు ఈ సమస్యనెదుర్కోవలసి వచ్చింది. నిజమే, అది ప్రతిచోట ఒకేలా దెబ్బకొట్టదు. కాని కొంతమంది ఆర్థికశాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం, యూరప్ ఉత్తర అమెరికాలలో నిరుద్యోగ రేట్లు చాలాకాలం వరకు గత దశాబ్దాల కంటే ఎంతో ఎక్కువగా ఉంటాయి.a “పాక్షికనిరుద్యోగ పెరుగుదల మూలంగా, అందుబాటులోవున్న ఉద్యోగాల నాణ్యతలో సాధారణ తగ్గుదల మూలంగా,” పరిస్థితి “మరింత క్షీణిస్తుందని” ఆర్థికశాస్త్రవేత్త రేనాటొ బ్రూనెట్టా తెలియజేస్తున్నాడు.
అనివార్య పెరుగుదల
ప్రజలకు పనిలేకుండా చేసే యాంత్రికీకరణ పెరుగుదలతో, మొదట వ్యవసాయ రంగాన్ని; ఆ తర్వాత, 1970వ దశాబ్దం నుండి శక్తి సంక్షోభంతో ప్రభావితం చెందిన పరిశ్రమ రంగాన్ని; ఇప్పుడు, మునుపు తిరుగులేనిదిగా పరిగణింపబడిన రంగమైన—వాణిజ్యం, విద్య—ఉద్యోగ రంగాన్ని ఇలా, నిరుద్యోగం ఒకదాని తర్వాత మరోదాని చొప్పున ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలను ప్రభావితం చేసింది. ఇరవయ్యేళ్ల క్రితం నిరుద్యోగ రేటులో 2 లేక 3 శాతం పెరుగుదల అత్యంత భయాన్ని కలిగించి ఉండేది. నేడు నిరుద్యోగం 5 లేక 6 శాతం కంటే తక్కువగా ఉంచబడితే, ఒక పారిశ్రామిక దేశం తాను విజయవంతమైనట్లు భావిస్తుంది, కాగా అభివృద్ధి చెందిన అనేక దేశాలు అత్యధిక రేట్లు కలిగివున్నాయి.
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ.) చెప్పేదాని ప్రకారం, పని చేయడానికి సిద్ధంగా ఉండి, పని కొరకు చురుకుగా వెదుకుతూ, పనిలేకుండా ఉన్న వ్యక్తే నిరుద్యోగి. అయితే శాశ్వత పూర్తికాల ఉద్యోగంలేని వ్యక్తి లేక వారంలో కేవలం కొన్ని గంటలే పనిచేయగలిగే వ్యక్తి సంగతేమిటి? స్వల్పకాల ఉద్యోగం పరిగణింపబడే విధానంలో ఒక దేశం నుండి మరో దేశానికి తేడా ఉంది. కొన్ని దేశాల్లో వాస్తవంగా నిరుద్యోగులైన కొందరు అధికారికంగా ఉద్యోగస్థులుగా లెక్కింపబడుతున్నారు. ఉద్యోగానికి మరియు నిరుద్యోగానికి మధ్యనున్న సరిగా నిర్వచించబడని పరిస్థితులు నిజంగా ఎవరు నిరుద్యోగులో నిర్ధారించడాన్ని కష్టతరం చేస్తాయి, ఈ కారణాన్నిబట్టి గణాంకాలు వాస్తవాన్ని పూర్తిగా వివరించవు. “[ఓ.ఇ.సి.డి. దేశాల్లోని] మూడు కోట్ల 50 లక్షల నిరుద్యోగులను గూర్చిన అధికారిక సంఖ్య కూడా నిరుద్యోగం యొక్క పూర్తి విస్తృతిని ప్రతిబింబించదు” అని ఒక యూరప్ అధ్యయనం చెబుతుంది.
నిరుద్యోగం యొక్క అధిక మూల్యం
కాని సంఖ్యలే మొత్తం విషయాన్ని తెలియజేయవు. “నిరుద్యోగం యొక్క ఆర్థిక, సాంఘిక మూల్యం అసంఖ్యాకం,” అవి “నిరుద్యోగులకు ఇచ్చే బత్తెముల ప్రత్యక్ష వ్యయం నుండేగాక నిరుద్యోగులు ఒకవేళ ఉద్యోగస్థులైవుండి పన్నులు కట్టడం ద్వారా దోహదపడి ఉండగలిగే ప్రభుత్వాదాయ కోశసంబంధ నష్టం నుండి కూడా” ఉత్పన్నమౌతాయని యూరప్ సమాజాల సమాఖ్య చెబుతుంది. నిరుద్యోగ సహాయకాలు ప్రభుత్వాలకే కాదు, విపరీతంగా పన్నులు కట్టవలసివస్తున్న ఉద్యోగులకు కూడా అత్యధిక భారమౌతున్నాయి.
నిరుద్యోగం కేవలం గణాంకాలకు, వాస్తవాలకు సంబంధించిన విషయమే కాదు. ఈ మహామారి ప్రజలపై—ప్రతి సామాజిక తరగతికి చెందిన పురుషులు, స్త్రీలు, యౌవనస్థులపై దాడి చేస్తుంది గనుక వ్యక్తిగత సంఘర్షణలు జరుగుతున్నాయి. ఈ “అంత్యదినముల” అనేక ఇతర సమస్యలతో కలిసి, నిరుద్యోగం పెద్ద భారం కాగలదు. (2 తిమోతి 3:1-5; ప్రకటన 6:5, 6) ప్రాముఖ్యంగా “దీర్ఘకాల నిరుద్యోగాన్ని” అనుభవిస్తున్నప్పుడు, పరిస్థితిని ప్రభావితం చేసే మరే ఇతర కారణాలు లేనప్పుడు, ఎక్కువకాలం పనిలేకుండా ఉన్న వ్యక్తి ఒక ఉద్యోగాన్ని కనుగొనడం మరింత కష్టమౌతుంది. దుఃఖకరంగా, కొంతమందికి ఇక ఎప్పటికీ ఉద్యోగం దొరకదు.b
నేటి నిరుద్యోగులలో మానసిక రోగ సంబంధ మరియు మనస్తత్వ సంబంధ సమస్యలు, అలాగే భావోద్రేక అస్థిరత, కృంగుదల, పెరిగే ఉదాసీనత, స్వయం గౌరవం తగ్గిపోవడం వంటివి ఎక్కువవుతున్నాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. శ్రద్ధ తీసుకోవలసిన పిల్లలుగల ఒక వ్యక్తి ఉద్యోగాన్ని కోల్పోతే, అది ఘోరమైన వ్యక్తిగత దుఃఖకర సంఘటనే. వారి చుట్టూ ఉన్న ప్రపంచం కూలిపోతుంది. భద్రత లేకుండా పోతుంది. వాస్తవానికి, నేడు, ఒకరు తమ ఉద్యోగాన్ని కోల్పోగల సాధ్యతకు సంబంధించిన “రాబోయే చింత” యొక్క అత్యవసరత గురించి కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఈ చింత కుటుంబ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయగలదు, ఇటీవల జరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు సూచిస్తున్నట్లుగా, మరింత దుఃఖకరమైన ఫలితాలను కూడా తీసుకురాగలదు. అంతేగాకుండ, హింసకు మరియు యౌవనస్థులు సమాజానికి దూరం కావడానికి గల కారణాల్లో ఉద్యోగాన్ని కనుగొనడం కష్టం కావడం కూడా ఒక కారణమే.
‘వక్ర విధానపు ఖైదీలు’
తమ ఉద్యోగాలను కోల్పోయిన అనేకమందిని తేజరిల్లు! ఇంటర్వ్యూ చేసింది. అది తనకు “30 సంవత్సరాల ఉద్యోగపు ప్రయాసలు నిష్ఫలమైపోయినట్లుగా, తిరిగి మొదలు పెట్టవలసినట్లుగా” అనిపించిందని, “వక్ర విధానపు ఖైదీ వంటి” భావన కలిగించిందని యాభై సంవత్సరాల అర్మండో చెప్పాడు. ‘ప్రపంచం తనపై కూలిపడినట్లు’ ఫ్రాన్సెస్కో భావించాడు. స్టెఫానో “ప్రస్తుత జీవన పరిస్థితుల్లో అత్యధిక నిరుత్సాహాన్ని పొందాడు.”
మరో వైపున, ఇటలీకి చెందిన వాహన సంబంధ పరిశ్రమలోని సాంకేతిక నిర్వహణలో దాదాపు 30 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఉద్యోగం నుండి తొలగింపబడిన లూసియానో, “అన్ని సంవత్సరాల ఉద్యోగసమయంలోని తన ప్రయాసలు, మంచి నడవడి, విశ్వాస్యత విలువలేనివిగా పరిగణింపబడినప్పుడు ఆయన కోపాన్ని, నిరాశను అనుభవించాడు.”
భవిష్యత్ సూచనలు మరియు నిరుత్సాహాలు
కొంతమంది ఆర్థికశాస్త్రవేత్తలు ఎంతో భిన్నమైన సంఘటనలను ఎదురుచూశారు. 1930లో, ఆర్థికశాస్త్రవేత్తయైన జాన్ మేనార్డ్ కేన్స్ ఆశాజనకంగా, రాబోయే 50 సంవత్సరాల్లో “అందరికీ పని” అని భవిష్యత్ సూచన చేశాడు, దశాబ్దాల వరకు పూర్తి ఉద్యోగం అన్నది సాధించదగిన లక్ష్యంగానే పరిగణింపబడింది. 1945లో, పూర్తి ఉద్యోగాన్ని సత్వరంగా పొందడాన్ని ఐక్య రాజ్య సమితి యొక్క శాసన పత్రం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలి కాలం వరకు అభివృద్ధి అంటే అందరికీ ఒక ఉద్యోగం మరియు కొన్ని గంటల పని అని భావించబడేది. కాని విషయాలు అలా జరుగలేదు. గత దశాబ్దపు తీవ్ర ఆర్థిక క్షీణత, “30వ దశాబ్దంలో గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటి నుండి విశ్వవ్యాప్తంగా తీవ్ర ఉద్యోగ సంక్షోభాన్ని” కలుగజేసిందని ఐ.ఎల్.ఓ. చెబుతుంది. దక్షిణ ఆఫ్రికాలో కనీసం 30.6 లక్షలమంది పని లేకుండా ఉన్నారు, వారిలో దాదాపు 30 లక్షలమంది నల్ల ఆఫ్రికన్లున్నారు. జపాన్ కూడా—గత సంవత్సరం 20 లక్షలకంటే ఎక్కువమంది పని లేకుండా ఉన్నందున—సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.
నిరుద్యోగం ఎందుకంత వ్యాప్తి చెందిన మహామారిగా ఉంది? దానితో వ్యవహరించడానికి ఏ పరిష్కారాలు ప్రతిపాదించబడ్డాయి?
[అధస్సూచీలు]
a నిరుద్యోగ రేటు అంటే ఉద్యోగం లేకుండావున్న మొత్తం కార్మిక శక్తి యొక్క శాతం.
b పన్నెండు నెలలకంటే ఎక్కువకాలం పని లేకుండా ఉండేవాళ్లు “దీర్ఘకాల నిరుద్యోగులు.” యూరప్ సమాఖ్యలోని నిరుద్యోగులలో దాదాపు సగం మంది ఈ వర్గానికే చెందుతారు.
[2,3వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
కెనడా 9.6 శాతం
అమెరికా 5.7 శాతం
కొలంబియా 9 శాతం
ఐర్లాండ్ 15.9 శాతం
స్పెయిన్ 23.9 శాతం
ఫిన్‌లాండ్ 18.9 శాతం
అల్బేనియా 32.5 శాతం
దక్షిణ ఆఫ్రికా 43 శాతం
జపాన్ 3.2 శాతం
ఫిలిప్పీన్స్ 9.8 శాతం
ఆస్ట్రేలియా 8.9 శాతం
[క్రెడిట్ లైను]
Mountain High Maps™ copyright © 1993 Digital Wisdom, Inc.