శీతాకాల కంబళి
మీరెప్పుడైనా కురుస్తున్న మంచును చూసి, సమ్మోహితులయ్యారా? అలాగైతే, ఇది అతి సుందరమైన మరియు ప్రశాంతమైన దృశ్యమనడానికి— ముఖ్యంగా మీరు గదిలోపల సురక్షితంగా, వెచ్చదనంలో ఉంటున్నట్లయితే, ప్రయాణం చేయవలసిన అత్యవసరం లేకున్నట్లయితే మీరు ఒప్పుకుంటారనడంలో సందేహం లేదు. తెల్లని కంబళి మందమౌతున్న కొలది, అది ప్రశాంతతను నిశ్శబ్దతను అన్నిచోట్లకు వ్యాపింపజేస్తున్నట్లు అనిపిస్తుంది. కోట్లకొలది మెత్తని మంచు పొరలు పడడంతో నగర కోలాహలం కూడా తగ్గిపోతుంది.
అయినప్పటికీ, కురిసే మంచంత సున్నితంగా కనిపించేది కూడా ఎలా వినాశకరం కాగలదన్నది ఆశ్చర్యం కలిగించేదిగా లేదా? మంచు మరీ ఎత్తుగా పేరుకుపోయినట్లయితే, “ఎన్నడూ నిద్రపోని నగరం” అని వర్ణించబడిన న్యూయార్క్ వంటి సందడిగా ఉండే నగరాలు కూడా సద్దుమణిగిపోతాయి.
“నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధదినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?” అని నమ్మకస్థుడైన యోబును దేవుడు అడగడంలో ఆశ్చర్యం లేదు. (యోబు 38:22, 23) మంచు అనేది నిజంగా దాని సృష్టికర్తయైన యెహోవా దేవుని నియంత్రణలో భయంకరమైన ఆయుధంగా ఉండగలదు.
అయితే, మంచు అనేది వినాశనాన్ని తెచ్చే బదులు, తరచూ జీవాన్ని పరిరక్షించడంలో ఓ పాత్రను నిర్వహిస్తుంది. ఉదాహరణకు, దేవుడు “గొఱ్ఱెబొచ్చువంటి హిమము కురిపించువాడు” అని బైబిలు చెబుతుంది. (కీర్తన 147:16) మంచు గొఱ్ఱెబొచ్చులా ఎలా అవుతుంది? బైబిలు మంచును మరియు గొఱ్ఱెబొచ్చును తెల్లదనాన్ని స్వచ్ఛతను సూచించడానికి ఉపయోగిస్తుంది. (యెషయా 1:18) మరో ముఖ్యమైన సాదృశ్యం కూడా ఉంది. మంచు మరియు గొఱ్ఱెబొచ్చు రక్షణకవచాలుగా కూడా పనిచేస్తాయి. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఈ విధంగా చెబుతుంది: “గొఱ్ఱెబొచ్చు . . . చలినుండి వేడినుండి రక్షణనిస్తుంది.” మంచును గూర్చి వరల్డ్ బుక్ ఇది కూడా “చక్కని రక్షణకవచంగా పనిచేస్తుంది. మొక్కలను, చురుకుగా లేని మృగాలను చల్లని శీతాకాలపు గాలి నుండి మంచు కాపాడుతుంది” అని చెబుతుంది.
ఆకాశం నుండి మంచు కురవడాన్ని మీరీసారి చూసినప్పుడు, భక్తిపూర్వక భయాన్ని కలిగించే దేవుని శక్తిని గూర్చి తలపోయడానికి మీరు ఇష్టపడవచ్చు. లేదా ప్రేమించే ఒక తండ్రి/తల్లి తన బిడ్డను సురక్షితంగా పడక మీద పడుకోబెట్టి దుప్పటి కప్పినట్లే ఆయన తన సృష్టిపై తెల్లని కంబళిని పరచి సున్నితంగా రక్షణనివ్వడాన్ని మీరు తలపోయవచ్చు.