ఆండ్రూ నుండి మేము నేర్చుకున్నది
నేను ఉద్యోగ స్థలానికి కారులో వెళ్లుతుండగా, గత కొన్ని రోజుల్లో జరిగిన దానిని గూర్చి తలపోయడం ఆనందాన్నిచ్చింది. ఇటీవలే నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడు నా రెండవ బిడ్డ. ఈ రోజు నా భార్య బెట్టీ జేన్ మరియు నా చిన్నారి ఆండ్రూ ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వస్తారు.
అయితే, వారు బయటకు వచ్చే ముందు, నా భార్య నాకు ఫోను చేసింది. ఆమె స్వరంలో ఏదో వ్యాకులత ఉంది. అందుకే, నేను వెంటనే వెళ్ళాను. నేను వెళ్లగానే, “ఏదో అయింది!” అని ఆమె అన్నది. మేము కలిసి కూర్చుని పెడియాట్రిక్ కన్సల్టెంట్‌తో పాటు డాక్టరు రాక కొరకు ఎదురు చూస్తున్నాం.
కన్సల్టెంట్ మొదట చెప్పింది చాలా కలతనొందించే వార్త. ఆమె ఈ విధంగా చెప్పింది: “మీ బాబుకు డౌన్స్ సిండ్రోమ్ ఉన్నదని మాకు రూఢీ అయ్యింది.” మా బాబుకు మానసిక మాంద్యం ఉండవచ్చునని ఆమె వివరించింది. నిజంగా తరువాత ఆమె చెప్పిన ఏ వివరణ ఇక తలకెక్కలేదు. స్తబ్ధమైన నా మెదడు శ్రవణేంద్రియ ప్రేరణలను తెంచివేసింది. కాని చూసిన విషయాలు మాత్రం మనస్సులో నాటుకున్నాయి.
ఆమె ఆండ్రూను ఎత్తుకుని, వానిలో ఏదో లోపం ఉందని తనకు తెలిపిన విషయాల్లో ఒకదాని వైపుకు మా అవధానాన్ని మళ్ళించింది. బాబు తల వ్రేలాడుతూ ఉంది. కండరాలు ఆరోగ్యంగా లేకపోవడం అనేది డౌన్స్ సిండ్రోమ్ గల క్రొత్తగా జన్మించిన శిశువుల లక్షణం. మేము నిదానంగా మా గ్రహణశక్తిని తిరిగి పొందుతుండగా మా మనస్సులో ఉప్పెనలా తన్నుకొచ్చిన ప్రశ్నలను కన్సల్టెంట్‌ను తరువాత సంప్రదించినప్పుడు ఆమెను అడిగాము. అతనికి ఎంత మేరకు అశక్తత ఉంటుంది? మేం దేనిని అపేక్షించవచ్చు? మేము అతనికి ఎంత వరకు బోధించగలం? అతడు ఎంతమేరకు నేర్చుకునే శక్తిని కలిగి ఉంటాడు? మా ప్రశ్నల్లో ఎక్కువవాటికి జవాబులు అతడు పెరిగే వాతావరణం మీదను మరియు అతడు స్వతస్సిద్ధ సామర్థ్యాల మీదను ఆధారపడి ఉంటాయని ఆమె వివరించింది.
అప్పటి నుండి 20 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా, ఆండ్రూకు కావలసిన ప్రేమానురాగాలను ఇవ్వడానికి, మేము నేర్పగల వాటినన్నింటిని అతనికి నేర్పించడానికి ప్రయత్నం చేశాం. కాని వెనక్కు తిరిగి చూస్తే, కేవలం ఇవ్వడం మాత్రమే జరుగలేదని ఇప్పుడు మేము గ్రహిస్తున్నాము.
మంచి సలహా
ఆండ్రూతో సర్దుకుపోయే సమయం మాకు లభించేముందు ప్రేమగల స్నేహితులు, కష్టాల్లో పిల్లలను పెంచిన తమ అనుభవాన్ని బట్టి మాకు సలహా ఇచ్చారు. వాళ్ళు మంచినే ఉద్దేశించారు, కాని ఊహించగలిగినట్లే సలహాలన్నీ జ్ఞానయుక్తమైనవి లేదా ఉపయోగకరమైనవి కావు. అయితే, సంవత్సరాల శోధన తరువాత వారి సలహా జ్ఞానం యొక్క రెండు బిందువులుగా అనిపించింది.
ఆండ్రూ నిజానికి బుద్ధిమాంద్యం కలవాడు కాడు అని చెబుతూ సాంత్వనపరచడానికి కొందరు ప్రయత్నించారు. అయితే ఒక పాత స్నేహితుడు ఈ విధంగా సలహా ఇచ్చాడు: “ఆ వాస్తవాన్ని నిరాకరించవద్దు! అతని పరిమితులను మీరు ఎంత త్వరగా అంగీకరిస్తే, అంత త్వరగా మీ ఆశలను పునరుద్ధరించుకుని, అతనికి తగినట్లుగా సహాయం చేయడానికి ప్రయత్నం చేయగలరు.”
ఈ దుర్దశతో వ్యవహరించినప్పుడు మేము నేర్చుకున్న ముఖ్యమైన పాఠం అది. వాస్తవాన్ని అంగీకరించేంత వరకు పరిష్కారం ఉండదు. నిరాకరించడం తరచూ సహజమైనప్పటికీ, ఎంత దీర్ఘకాలం నిరాకరిస్తూ ఉంటారో, అవసరమైన చర్యలను తీసుకోవడాన్నీ, ‘అనూహ్యంగా అందరికీ కలుగుచున్న’ వాటి పరిమితుల్లో ప్రయత్నం చేయడాన్నీ అంత వాయిదా వేస్తూ ఉంటారు.—ప్రసంగి 9:11, NW.
ఈ సంవత్సరాల్లో, సాధారణ పాఠశాల ప్రణాళికతో సర్దుకుపోలేని లేదా చికిత్సా పాఠశాలలో ఉన్న పిల్లల తలిదండ్రులను మేము కలిసినప్పుడు, నిజానికి ఎంత మంది పిల్లలు బుద్ధిమాంద్యం గలవారై ఉన్నారు లేదా అశక్తులుగా ఉన్నారు అని తరచూ ఆశ్చర్యపోయేవాళ్లం. ఆండ్రూవలెకాక, బాహ్యంగా ఏ తేడాలేని లేక మామూలుగా ఉండే పిల్లల్లా కనిపించే వారిలో కొందరు “కనిపించని వైకల్యత” కలవారై ఉంటారా? డౌన్స్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులను సులభంగా గుర్తుపట్టవచ్చు. కాని ఇతర రకాల వైకల్యాలకు కనిపించని లక్షణాలు ఉండవు. ప్రతి ఒక్కరికీ చికాకు కలిగించేలా, వాస్తవం కాని అపేక్షలకు హత్తుకుని, తమ బిడ్డ పరిమితులను అంగీకరించడానికి నిరాకరించే తలిదండ్రులు ఎంతమంది ఉన్నారు?—కొలస్సీయులు 3:21 పోల్చండి.
మా అనుభవం తేల్చిన రెండవ సలహా ఇది: చాలా మంది ప్రజలు మీ బిడ్డను ఎలా చూస్తారనే దానిని మీరు ప్రభావితం చేస్తారు. మీరు ఎలా చూస్తారో, ఇతరులు కూడా అతనిని అలాగే చూస్తారు.
మానసిక శారీరక అంగవైకల్యతగలవారి ఎడల ప్రజలకుగల దృక్పథంలో గత కొన్ని దశాబ్దాలుగా చాలా మార్పువచ్చింది. ఈ వికలాంగుల ద్వారా, వారి బంధువుల ద్వారా, సామాన్య ప్రజల ద్వారా, నిపుణుల ద్వారానే ఈ మార్పుల్లో అనేకం ప్రేరేపించబడ్డాయి. చాలా మంది తలిదండ్రులు తమ సంతానాన్ని ఇన్‌స్టిట్యూషన్‌లో చేర్చాలన్న సలహాను ధైర్యంగా నిర్లక్ష్యం చేసి, సాధారణ అభిప్రాయాన్ని మార్చివేశారు. యాభై సంవత్సరాల క్రితం డౌన్స్ సిండ్రోమ్‌ను గూర్చి వ్రాయబడిన వైద్య పాఠ్యపుస్తకాలు పిచ్చి ఆసుపత్రుల నుండి సేకరించిన సమాచారంపై ఆధారపడినవి. తరచూ తలిదండ్రులు మరితరులు క్రొత్త మార్గాలను అనుసరించడం వల్లే నేడు నిరీక్షణలన్నీ పూర్తిగా మారాయి.
మరింత సానుభూతి కలిగి ఉండడాన్ని నేర్చుకోవడం
మనం నిజంగా సానుభూతి కలవారమని తలంచి మనల్ని మనం ఎంత సులభంగా మోసం చేసుకోగలం అన్నది ఆశ్చర్యకరం. మనం వ్యక్తిగతంగా ఇమిడి ఉండేంతవరకు అనేక సమస్యలను గ్రహించడమన్నది అంతంత మాత్రమే అయ్యుంటుంది.
వికలులైన వ్యక్తులకు తరచూ పరిస్థితిపై అదుపు ఉండదు అని ఆండ్రూ మూలాన మేము తప్పనిసరిగా గ్రహించవలసి వచ్చింది. నిజానికి, బలహీనులైనవారి ఎడల, నెమ్మదిగా నేర్చుకునేవారి ఎడల, పెద్దవారి ఎడల నా దృక్పథమేమిటి? అనే ప్రశ్నను మేము ఎదుర్కునేటట్లు ఇది చేసింది.
మేము తరచూ ఆండ్రూతో పాటు పబ్లిక్ స్థలాలకు వెళ్ళేవాళ్ళం, ఏ మాత్రం సిగ్గుపడకుండా మా కుటుంబంలోని పూర్తి సభ్యునిగా ఆయనను అంగీకరించడాన్ని చూసిన అపరిచితులు మా దగ్గరకు వచ్చి తమ రహస్య సమస్యలను పంచుకునేవారు. ఆండ్రూ అక్కడ ఉండడం, మేము వారి సమస్యల ఎడల సహానుభూతిని కనబరుస్తామని వారికి హామీనిచ్చినట్లుగా అన్పించింది.
ప్రేమకున్న శక్తి
ప్రేమ అనేది కేవలం మేథాశక్తి యొక్క ప్రవర్తన మాత్రమే కాదు అన్నది ఆండ్రూ ఇంతవరకు మాకు నేర్పిన ముఖ్యమైన పాఠం. నేను దానిని వివరిస్తాను. యెహోవాసాక్షులుగా మన ఆరాధనలో ప్రాథమికమైన విషయాల్లో ఒకటేంటంటే వర్గీయ, సామాజిక మరియు రాజకీయ విభజనలను మరియు నిర్హేతుకమైన మానసిక దృక్పథాలను నిజ క్రైస్తవత్వం అధిగమిస్తుంది. ఈ సూత్రమునందు మాకు నమ్మకముంది, మన ఆత్మీయ సహోదర సహోదరీలు ఆండ్రూను అంగీకరిస్తారని మాకు తెలుసు. ఆరాధనా సమయాల్లో గౌరవపూర్వకంగా అతడు కూర్చుంటాడని అపేక్షించడం అవాస్తవమని చెప్పిన నిపుణుల సలహాను నిర్లక్ష్యం చేసి, అతని జననం నుండి అతడు కూటాలకు మరియు ప్రకటన పనిలో ఇంటింటా మాతో పాటు వచ్చేలా చూసుకున్నాం. ఆశించినట్లే, సంఘం ఆయనను దయతోను సహానుభూతితోను చూసుకుంటోంది.
అయితే దీనిని కూడా మించిపోయేవారున్నారు. వారికి అతనంటే ప్రత్యేక మమకారం ఉంది. ఆండ్రూ బుద్ధిమాంద్యం వలన పూర్తిగా క్షీణంచిపోని ప్రత్యేక సామర్థ్యంతో దీనిని గమనిస్తున్నట్లున్నాడు. ఈ వ్యక్తుల ఎడల సహజమైన తన సిగ్గును సులభంగా అధిగమించాడు, కూటాలు ముగిసిన వెంటనే అతడు నేరుగా వారి దగ్గరకు వెళ్తాడు. అతడంటే ప్రత్యేక మమకారమున్న వారిని గుంపులోను గుర్తించగల అతని సహజ సామర్థ్యాన్ని మేము అనేకసార్లు గమనించాము.
అతడు ప్రేమను చూపించే విషయంలోను అది నిజమే. చిన్న పిల్లలతోను, వృద్ధులతోను, పెంపుడు జంతువులతోను ఆండ్రూ ఎంతో ప్రేమగా ఉంటాడు. కొన్నిసార్లు, మాకు తెలియనివారి బిడ్డ దగ్గరకు ఆండ్రూ బిడియపడకుండా వెళ్ళినప్పుడు, అతడు మొరటుగా అశ్రద్ధగా ఆడితే, ఆ బిడ్డను రక్షించేందుకు సిద్ధంగా మేము దగ్గరలో ఉంటాము. అయితే, అతడు బిడ్డను పాలిచ్చే తల్లిలా ఎంతో ఆప్యాయంగా తాకడం చూసి మా భయాలను బట్టి మేము ఎన్నిసార్లు సిగ్గుపడ్డామో!
మేము నేర్చుకున్న పాఠాలు
డౌన్స్ సిండ్రోమ్‌గల పిల్లలందరూ ఒకేలా కనిపిస్తారు కనుక, వారందరికీ ఒకేలాంటి వ్యక్తిత్వాలుంటాయని మేమనుకున్నాం. అయితే, వారిలో వారికి పోలికలుండే బదులు తమ కుటుంబంలోని వారితో ఎక్కువ పోలికలు కల్గివుండవు. ప్రతి ఒక్కరికి అసమానమైన వ్యక్తిత్వం ఉంది.
మిగిలిన యౌవనస్థుల్లాగే ఆండ్రూ కూడా కష్టపడి పనిచేయడాన్ని ఇష్టపడడు. అయితే ఒక పనిని అతనికి ఒక అలవాటయ్యేంత వరకు అతనితో కలిసి మళ్ళీ మళ్ళీ చేసేంత ఓపిక, సహనం మాకుంటే అది అతనికి ఓ పనిగా అనిపించదని మేము కనుగొన్నాం. ఇంట్లో తను చేయవలసిన పనులు ఇప్పుడు అతనికి అలవాట్లుగాను, అదనపు పనులు మాత్రమే పనిగాను కనిపిస్తున్నాయి.
ఆండ్రూ జీవిత కాలంలో మేము నేర్చుకున్న విషయాలను అవలోకిస్తే ఒక ఆసక్తికరమైన విభిన్నమైన విషయం కనిపిస్తుంది. నిజానికి ఆండ్రూను పెంచడంలో మేము నేర్చుకున్న సూత్రాలు మా మిగిలిన పిల్లలతోను మరియు సాధారణంగా ప్రజలందరితోను ఉన్న మా బంధాల్లో కూడా సమానంగా అన్వయించుకోవచ్చు.
ఉదాహరణకు, యథార్థమైన ప్రేమ ఎడల అనుకూలంగా మనలో ఎవరు ప్రతిస్పందించరు? మిమ్మల్ని మీ సామర్థ్యాలకు, అనుభవానికి చాలా భిన్నంగా ఉన్న ఎవరితోనైనా అననుకూలంగా పోల్చి చూసినట్లయితే, అది అన్యాయంగాను నిరాశ కలిగించేదిగాను ఉన్నట్లు మీకు అనిపించదా? తుదకు, మొదట్లో సంతోషకరంగా అనిపించని పనిని పూర్తి చేసే వరకు గట్టిగా కృషి చేస్తే, చివరికి చేయగలిగినదిగా, సంతృప్తికరమైనదిగా మారుతుందనడం మనలో చాలా మంది విషయంలో నిజం కాదా?
మా సంకుచిత మానవ దృక్కోణం వలన మేము ఆండ్రూ గురించి కన్నీరు కార్చినప్పటికీ, మేం చిన్న పెద్ద ఆనందాలనెన్నింటినో పంచుకున్నాం కూడా. ఆండ్రూకు ఏ మాత్రం సంబంధం లేని రంగాల్లోను మేము అతని వలన పెరిగామని కనుగొన్నాం. ఎంత కఠినమైనప్పటికీ, జీవితంలోని ప్రతి అనుభవమూ, మనలను చెడు వ్యక్తులనుగా కాక, మంచి వ్యక్తులనుగా మలిచే శక్తి కలిగి ఉంటుంది.
మాకు చాలా ప్రాముఖ్యమైనది మరొకటుంది. ఆండ్రూ దుర్బలత లేకుండా పోవడాన్ని మేము చూడగల ఆ గొప్ప క్షణంకోసం ఎదురుచూడడంలో మరెక్కువ సంతోషాన్ని పొందుతున్నాం. త్వరలోనే దేవుని నీతియుక్తమైన నూతన లోకంలో గ్రుడ్డివారు, చెవిటివారు, కుంటివారు, మూగవారు అందరూ చక్కని ఆరోగ్యంలోనికి తేబడతారని బైబిలు వాగ్దానం చేస్తుంది. (యెషయా 35:5, 6; మత్తయి 15:30, 31) మనస్సును శరీరాన్ని స్వస్థపరచడాన్ని అలాగే యావత్ మానవజాతి పూర్తి శక్తికి పునఃస్థాపించబడడాన్ని ప్రత్యక్షంగా చూసి అందరూ ఆనందించడాన్ని ఊహించండి! (కీర్తన 37:11, 29)—ఉచితవ్యాసం.
[12వ పేజీలోని బాక్సు]
వైకల్యతల స్థాయిలు
డౌన్స్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులను కొందరు నిపుణులు మూడు గుంపులుగా విభజిస్తారు. (1) విద్యావంతులు కాగలవారు (అత్యల్పం): వీరు కావలసినంత విద్యా నైపుణ్యాలను పొందగలవారు. ఈ గుంపులో నటులు లేదా లెక్చరర్లు అయినవారు కూడా ఇమిడి ఉన్నారు. కొందరు కొద్దిపాటి పర్యవేక్షణతో స్వతంత్రంగా జీవించడంలో సఫలులయ్యారు. (2) తర్ఫీదు పొందగలవారు (మధ్యస్థం): వీరు ఆచరణాత్మకమైన నిపుణతలను నేర్చుకోగల సామర్థ్యం గలవారు. కొంతమేరకు తమను తాము చూసుకోవడానికి వారికి నేర్పగల్గినప్పటికీ ఎక్కువ పర్యవేక్షణ అవసరం. (3) నిగూఢమైనవారు (తీవ్ర): తక్కువ చురుకుతనం గల గుంపు, వీరికి ఎక్కువ పర్యవేక్షణ అవసరం.
ఆండ్రూ గురించి ఏమిటి? అతడు “తర్ఫీదివ్వబడగల” వారి కోవలో చేరతాడని మాకు ఇప్పుడు తెలుసు.