కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 1/8 పేజీలు 8-10
  • భవిష్యత్తులో నిజంగా ఏమి జరుగనైయుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భవిష్యత్తులో నిజంగా ఏమి జరుగనైయుంది
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అవి నిరర్థకమవ్వడం
  • బాహ్య అంతరిక్షంలో వలస స్థాపించడమా?
  • మానవ కుటుంబ భవిష్యత్తు
  • నిజమైన వైజ్ఞానిక ఆవిష్కరణ
  • నేటి కాల్పనిక విజ్ఞానశాస్త్రం వైపు ఒకపరి పరికించుట
    తేజరిల్లు!—1996
  • కాల్పనిక విజ్ఞానశాస్త్రం అది ప్రజాదరణ పొందడం
    తేజరిల్లు!—1996
  • విశ్వాసం, మీ భవిష్యత్తు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉన్నత జ్ఞానానికి సర్వోన్నత మూలం
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 1/8 పేజీలు 8-10

భవిష్యత్తులో నిజంగా ఏమి జరుగనైయుంది

కాల్పనిక విజ్ఞానశాస్త్ర ఔత్సాహికులనేకులు విచారణా మనస్సును, మానవ సమాజంలో మార్పు కొరకైన కోరికను మరియు భవిష్యత్తు ఎడల ఒక గొప్ప ఆసక్తిని కలిగివున్నారు. బైబిలు భవిష్యత్తు గురించి ఎంతో చెబుతుంది, కానీ మానవ విధిని గురించిన బైబిలు ఉద్దేశము, కాల్పనిక విజ్ఞానశాస్త్ర రచయితల ఊహాకల్పనలకు చాలా తక్కువ పోలికను కలిగి ఉంది.

భవిష్యత్తు ఎలా ఉండగలదో అన్నదాని గురించి కాల్పనిక విజ్ఞానశాస్త్రం చాలా చాలా రకాల కథనాలను అందిస్తుంది. కానీ వీటిలో ఏదైనా ఒకదానిపై మీ జీవితాన్ని పణంగా పెడతారా? మీ ఎంపికను దేనిపై ఆధారం చేస్తారు? ఈ దృశ్యవివరణలు, లేక తయారు చేయబడిన సంఘటనల గమనాలు, అన్నీ కూడా నిజం కాలేవు. నిజానికి, వాటన్నింట్లో ఇమిడి ఉన్నది ఊహ—కల్పన—గనుక మీరు వాటిలో ఒక్కటైనా సత్యమైయుండవచ్చని నమ్మకంతో చెప్పగలరా? బహుశా వాటిలో ఏ ఒక్కటీ నిజం కాకపోయుండవచ్చు.

అవి నిరర్థకమవ్వడం

ఇప్పటికే, అనేక కాల్పనిక విజ్ఞానశాస్త్ర ఊహాదృశ్యవివరణలు నిరర్థకమౌతున్నాయి. ఏవిధంగా? ఇదే భూమిపై ఒక మేలైన నాగరికతవైపుకి విజ్ఞానశాస్త్రం ఎలా నడుపగలదో అనే దానితో వ్యవహరించేవి వాస్తవ రూపం దాల్చలేదు. నాగరికత మెరుగవ్వడానికి బదులు ఈనాటి వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. జర్మన్‌ రచయిత కార్ల్‌ మిఖాయేల్‌ ఆర్మర్‌ ఇలా గమనించాడు: “భవిష్యత్తు మనల్ని నిశ్చేష్టులను చేసింది.” ఆయన, “అణుమృత్యువు, వాతావరణ విపత్తులు, ఆకలి, బీదరికం, శక్తి సంక్షోభం మరియు రాష్ట్రాలచే మద్దతు చేయబడుతున్న ఉగ్రవాదం వంటి భూగోళ విపత్తులను” సూచిస్తున్నాడు.

వేరేమాటల్లో చెప్పాలంటే, భూమి కొరకు మరియు మానవ కుటుంబం కొరకు కాల్పనిక విజ్ఞానశాస్త్ర కథల్లో వర్ణించబడిన భవిష్యత్తు వాస్తవరూపం దాల్చేందుకు ముందుకు సాగడం లేదు. దానికి విరుద్ధంగా, భూమిపై పరిస్థితులు దిగజారుతుండగా, మానవ స్థితి వ్యతిరేక దిశలో వెళుతుంది. ఏవిధమైన వైజ్ఞానిక లేక సాంకేతిక అభివృద్ధి జరిగినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా మానవ సమాజం అత్యధికమైన నేరం, హింస, బీదరికం, జాతి విద్వేషాలు, మరియు కుటుంబ విచ్ఛిన్నాలను అనుభవిస్తుంది.

కొన్ని వైజ్ఞానిక ప్రయత్నాలు మానవ సమస్యలను అధికం చేశాయి. కేవలం కొన్ని ఉదాహరణలను పరిగణించండి: గాలి, నీరు మరియు ఆహారం రసాయనికంగా కలుషితమవ్వడం; భారతదేశంలోని భోపాల్‌నందలి విపత్తులో అంటే ఒక పరిశ్రమ కేంద్రంలోని ప్రమాదంలో, విష వాయువు వెలువడి దాదాపు 2,00,000 మంది గాయపడ్డారు మరియు 2,000 మంది మరణించారు; యుక్రెయిన్‌లో ఛెర్నోబిల్‌ వద్ద పరమాణు విద్యుత్‌ ప్లాంటు కరిగిపోవడం, అనేక మరణాలకు, ఒక విస్తారమైన పరిధిలో క్యాన్సర్‌ మరియు ఆరోగ్య సమస్యలు పెరగడానికి దారి తీసింది.

బాహ్య అంతరిక్షంలో వలస స్థాపించడమా?

భవిష్యత్తును గూర్చిన కాల్పనిక విజ్ఞానశాస్త్ర కథలలో అనేకం, భూమిపై, జీవిత దుర్దశల నుండి మరియు మానవ పథకాల విఫలతల నుండి ఇంకా భిన్నమైన రీతిలో విముక్తిని అందజేస్తాయి. అవి ఔత్సాహికులను బాహ్య అంతరిక్షంలోని ఊహాత్మక దృశ్యవివరణల్లోకి తీసుకెళ్తాయి. ఇతర గ్రహాలలో మరియు విశ్వంలోని ఇతర భాగాలలో వలస స్థాపించడానికి అంతర్‌ నక్షత్ర వీధి వ్యోమనౌకలను మానవులు ఉపయోగించడం వంటివి సాధారణ అంశాలు. అటువంటివి, “మానవజాతి యొక్క భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలోనే ఉంది” అని న్యూయార్క్‌లోని ఒక వార్తాపత్రిక సంపాదకునికి వ్రాసిన వ్యక్తి భావించిన విధంగానే అనేకమంది భావించేలా ప్రోత్సహిస్తాయి.

నిజమే, భూమికి దగ్గర రోదసీ వాహకముల ప్రయాణాలు మరియు అంతరిక్షాన్ని పరీక్షించడానికి పరికరాల ప్రయోగాలతో అంతరిక్ష పరిశోధన కొనసాగుతూనే ఉంది. కానీ బాహ్య అంతరిక్షంలో జీవించేదాని సంగతేమిటి? మానవులచే విస్తరించబడ్డ రోదసీ ప్రయాణాల గురించిన చర్చ ఉన్నప్పటికీ చంద్రునిపై లేక దగ్గరలో ఉన్న ఇతర గ్రహాలపై వలస స్థాపించడానికి నిశ్చయమైన కార్యనిర్వాహక పథకాలు ప్రస్తుతం లేవు—ఇతర నక్షత్ర వీధుల్లో వలస స్థాపించడానికి కార్యనిర్వాహక పథకాలు అసలే లేవు. నిజంగా, సమీప భవిష్యత్తులో మానవ ప్రయాత్నాలవల్ల బాహ్య అంతరిక్షంలో వలస స్థాపన వాస్తవిక ఎంపికగా లేదు. వివిధ దేశాల ప్రస్తుత అంతరిక్ష కార్యక్రమాలు ఎంత ఖర్చుతో కూడినవంటే వాటిని తగ్గింపు చేయడం లేక విడిచిపెట్టడం జరుగుతుంది.

వాస్తవమేమంటే మానవజాతి భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మానవులచే వృద్ధిచేయబడుతున్న ఏ అంతరిక్ష సాహసకృత్యాలలో లేదు. మీ భవిష్యత్తు ఇక్కడే ఇదే భూమిపై ఉంది. మరియు ఆ భవిష్యత్తు శాస్త్రవేత్తలు, మానవ ప్రభుత్వాలు, లేక లేఖకులచే నిర్ణయించబడదు. మనమెందుకంత నిశ్చయతను కలిగి ఉండగలము?

ఎందుకంటే భవిష్యత్తు, భూమికి సృష్టికర్తయైన యెహోవా దేవునిచే నిర్ణయించబడుతుంది. బైబిలులో అందివ్వబడ్డ వాగ్దానాలను ఏ కాల్పనిక విజ్ఞానశాస్త్ర దృశ్యవివరణా అనుకరించలేదు. ఆ పుస్తకంలో—మానవజాతికి ఆయన అందించిన దేవుని ప్రేరేపిత వాక్యంలో—మానవుల కొరకు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన మనకు చెబుతున్నాడు. (2 తిమోతి 3:16, 17; 2 పేతురు 1:20, 21) అదేం చెబుతుంది?

మానవ కుటుంబ భవిష్యత్తు

యేసుక్రీస్తు చేతులలోని ఒక క్రొత్త ప్రభుత్వం ద్వారా మానవ సమాజం యొక్క పూర్తి మరమ్మతు చేయడమే సృష్టికర్త యొక్క సంకల్పం అని దేవుని వాక్యం స్పష్టంగా వివరిస్తుంది. బైబిలులో ఆ పరలోక ప్రభుత్వం దేవుని రాజ్యం అని పిలువబడింది.—మత్తయి 6:9, 10.

ఆ రాజ్యమును గూర్చి దానియేలు 2:44 లోని ప్రేరేపిత ప్రవచనం ఇలా ప్రకటిస్తుంది: “ఆ రాజుల [నేడున్న పాలకుల] కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన [ప్రస్తుత దినపు] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”

అపొస్తలుడైన పేతురు కూడా శక్తివంతమైన దేవుని చురుకైన శక్తి యొక్క ప్రేరేపణతో, దేవుని రాజ్యం క్రింద భూమిపై భవిష్యత్తు జీవితం గురించి వ్రాశాడు. ఆయనిలా అన్నాడు: “[మనం దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల [దేవుని పరలోక రాజ్యము] కొరకును క్రొత్త భూమి [ఆ రాజ్యము క్రింద ఒక క్రొత్త మానవ సమాజం] కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.”—2 పేతురు 3:13.

దేవుని పరలోక రాజ్య పరిపాలన క్రింద భూమిపై జీవించే ఆధిక్యత గల వారికి జీవితమెలా ఉంటుంది? సృష్టికర్త వాగ్దానమేమంటే: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు—ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.”—ప్రకటన 21:4, 5.

సృష్టికర్త వాగ్దానం చేసేటువంటి భవిష్యత్తు అద్భుతమైనది. విచిత్రమైన, విడ్డూరమైన జీవులు మరియు పరిసరాలచే తరచూ చిత్రీకరించబడే, కాల్పనిక విజ్ఞానశాస్త్ర రచయితల లేక శాస్త్రవేత్తల కాల్పనిక దృశ్యవివరణలకు అది పూర్తిగా వేరైయున్నది. నిజ క్రైస్తవులు భవిష్యత్తు కొరకైన దేవుని కచ్చితమైన వాగ్దానాలయందు విశ్వాసం ఉంచుతారు. నిజానికి వారు దానికంటే ఇంకా ఎక్కువే చేస్తారు. వాటిపై తమ జీవితాన్ని పణంగా పెడతారు.

వారావిధంగా అంత విశ్వాసంతో ఎందుకు చేస్తారు? ‘దేవుడు అబద్ధమాడనేరడు’ గనుక “ఈ నిరీక్షణ . . . సిగ్గుపరచదు” అని, దేవుని వాక్యంనుండి వారికి తెలుసు. నిజానికి “దేవుడు . . . అబద్ధమాడజాల” డు. (రోమీయులు 5:5; తీతు 1:2-4; హెబ్రీయులు 6:17, 18) దేవుని సేవకుడైన యెహోషువ ఎంతో కాలం పూర్వం చెప్పినట్లు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.”—యెహోషువ 23:14.

కాల్పనిక విజ్ఞానశాస్త్రంలోని అధికభాగం ఈ దుష్ట పాత విధానపు సిద్ధాంతాలను ప్రతిబింబిస్తుంది. అదెలా? అనేకమంది సాంప్రదాయిక అధికారాన్ని తిరస్కరించి, మానవుడు తన స్వంత భవిష్యత్తును తానే తయారుచేసుకొనగలడు అని విశ్వసించిన పునర్జాగారణోద్యమ కాలం అని పిలువబడుతున్న కాలంలో, కాల్పనిక విజ్ఞానశాస్త్రం మొదలైంది. వారు సమాజ సమస్యలకు కారణమైన ప్రాపంచిక మతాన్ని యుక్తంగానే నిందించారు, కానీ తరువాత వారు దేవుని ఉనికి మరియు ఉద్దేశాన్ని గూర్చిన సత్యాన్ని కూడా విసర్జించారు. వారు విషయాలు పరిష్కరించబడే విధానాన్ని బట్టి నిరుత్సాహం చెందారు కాబట్టి ఇతర ఆలోచనల కొరకు వెదికారు.

అయినప్పటికిని, మానవ ఆలోచనలు ఎంతగా అధ్యయనం చేయబడినప్పటికి, క్రియలలో పరిమితమైనవే. మన సృష్టికర్త ఇలా చెబుతున్నాడు: “ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.”—యెషయా 55:9.

నిజమైన వైజ్ఞానిక ఆవిష్కరణ

దేవుని నూతన లోకంలో, మానవజాతి యొక్క సహజమైన జ్ఞానదాహం యథార్థమైన వైజ్ఞానిక పరిశోధన ద్వారా కొంతమట్టుకు తీర్చబడుతుంది. వాస్తవం మనస్సును వశం చేసుకొంటుంది మరియు ఆరోగ్యకరమైన, నిజమైన మార్గంలో బోధిస్తుంది గనుక, దృశ్యవివరణలను కనుగొనవలసిన అవసరమే ఉండదు.

ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త ఐజక్‌ న్యూటన్‌, “సత్యము మహా సముద్రము వలె బయలుపరచబడకుండా [తన] ముందుండగా . . . సముద్రపు ఒడ్డున ఆడుకునే బాలుని” తో తనను తాను పోల్చుకున్నప్పుడు ఆయన ఎలా భావించాడో అనేకమంది అర్థం చేసుకోగలరు. నిస్సందేహంగా, దేవుని నూతన లోకంలో ఒక ఉత్తేజకరమైన ఆవిష్కరణ తరువాత ఇంకొకదానికి ఆయన నమ్మకమైన మానవులను నడిపిస్తాడు.

అవును, అప్పుడు వైజ్ఞానిక పరిశోధన పూర్తిగా సత్యంపైనే ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే యెహోవా ‘సత్య దేవుడు.’ ఆయన మానవుని భూ వాతావరణం మరియు జంతుప్రపంచం నుండి కూడా నేర్చుకోవడానికి మనలను ఆహ్వానిస్తాడు. (కీర్తన 31:5; యోబు 12:7-9) సత్య దేవుని నిర్దేశంలో, యథార్థమైన వైజ్ఞానిక ప్రయత్నం, నిశ్చయంగా దేవుని నూతన లోకం యొక్క ఆకర్షణీయమైన లక్షణమై ఉంటుంది. అప్పుడు నూతన కల్పనలు, ఆవిష్కరణలు, మానవ జీవితంలోని మరియు జీవన ప్రమాణాలలోని అద్భుతమైన పురోభివృద్ధి, వీటన్నిటికి ఘనత ఏ మానవునికీ కాదు గానీ, విశ్వానికి సృష్టికర్త, యెహోవా దేవునికే చెందుతుంది.

వేగంగా సమీపిస్తున్న ఆ నూతన లోకంలో, విధేయత చూపే మానవులు ప్రేమతో కూడిన శ్రద్ధ మరియు నడిపింపు విషయమై దేవుని మహిమపరుస్తారు. వారు ఆయనను గొప్ప ఉత్సాహంతో సేవిస్తారు మరియు ప్రకటన 4:11 లో వివరించబడినట్లు వారు ఇలా చెబుతారు: ‘ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.’

[9వ పేజీలోని చిత్రం]

మానవజాతి భవిష్యత్తు భూమ్మీదే ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి