యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
అందరికీ వివాహమౌతుంది కాని నాకెందుకు కావడంలేదు?
“నాకు వివాహమౌతే బాగుండు. అప్పుడు నేను సంతోషంగా ఉండొచ్చు.”—శెరల్.a
వివాహం కావాలని కోరుకోవడం కేవలం సహజం. స్త్రీ పురుషులు ఒకరి ఎడల ఒకరు సహజమైన ఆకర్షణ కలిగివుండేలా దేవుడు వారిని కలుగజేశాడు. వివాహం స్త్రీ పురుషుల మధ్యన శాశ్వత బంధంగా ఉండేలా ఆయన ఏర్పాటు చేశాడు.—ఆదికాండము 1:27, 28; 2:21-24.
మీకు ఇంకా వివాహం కాకపోతే, ప్రాముఖ్యంగా మీ తోటివారనేకులు ఇప్పటికే వివాహ జీవితంలోకి అడుగిడి ఉంటే, అప్పుడు మీరు కొంత నిరుత్సాహంగా లేక చివరికి విడిచి పెట్టబడినట్లుగా భావించడం అర్థంచేసుకొనదగినదే. మంచి ఉద్దేశంగల స్నేహితులు ఒత్తిడిని ఇంకా అధికం చేస్తారు. “నాకు 24 సంవత్సరాలు, నేను అవివాహితను, ప్రస్తుతం నేను ఎవరితోను ప్రేమకలాపాలు జరపడం లేదు” అని టీనా చెబుతుంది. “నాకు ఇంకా వివాహం కాలేదని, దాని గురించి నేను బాధపడుతున్నానని ప్రతి ఒక్కరు ఎంతో శ్రద్ధ కలిగివున్నట్లు అనిపిస్తుంది. నేను బ్రహ్మచారిణినన్నట్లు లేదా నాలో ఏదో లోపం ఉందన్నట్లు భావించేలా వాళ్లు చేస్తారు.”
కొంతమంది వ్యక్తులకు అవివాహ జీవితం తమను సంతోషం నుండి వేరుచేసే గోడలా, దాటలేనంత అడ్డంకులా కనిపించడం ప్రారంభిస్తుంది. ఒక్కో సంవత్సరం గడుస్తుంటే, ఆ గోడపై మరో ఇటుకల వరుస పేర్చినట్లు అనిపిస్తుంది. తాను ఆకర్షణీయంగాలేనని లేదా కోరుకొనదగినట్లుగాలేనని ఆ యౌవనస్థుడు లేక యౌవనస్థురాలు భావించడం ప్రారంభిస్తారు. ఇటలీకి చెందిన రోజానా అనే యౌవనస్థురాలు ఇలా చెబుతుంది: “తరచూ నేను ఒంటరిగా, నిరుపయోగకరంగా ఉన్నట్లు భావిస్తాను; నాకు వివాహమయ్యే అవకాశాలే లేనట్లనిపిస్తుంది.” యౌవన పురుషులకు కూడా ఇలాంటి భావాలే ఉండవచ్చు. ఉదాహరణకు, తన స్నేహితులందరూ వివాహమైన తర్వాత మరింత ఆసక్తికరంగా, జ్ఞానవంతులుగా తయారయ్యారని ఫ్రాంక్ భావించడం మొదలుపెట్టాడు. వివాహం తనకు కూడా అదే చేయగలదని ఆయన తలంచడం ప్రారంభించాడు.
మీరు కూడా ఇలాగే ఆలోచిస్తుంటారా? మీరు అవివాహితులైతే, నాలో ఏదైనా లోపం ఉందా లేక నేను ఎప్పటికీ ఈ ఒంటరి జీవితాన్నే గడపాలా అని మీరు కొన్నిసార్లు ఆలోచిస్తారా?
వివాహం—ఊహకు వ్యతిరేకమైన వాస్తవం
మొట్టమొదట, వివాహం దానంతటదే సంతోషానికి దారితీస్తుందనే జనాదరణ పొందిన నమ్మకాన్ని మనం పరిశీలిద్దాము. వివాహం ఒకరి సంతోషానికి దోహదపడగలదన్నది, తరచూ దోహదపడుతుందన్నది నిజమే. అయితే, కేవలం వివాహం చేసుకుంటేనే ఒకరికి సంతోషం కలుగదు. ఎంతో శ్రేష్ఠమైన వివాహం కూడా కొంతమేరకు ‘శరీర సంబంధమైన శ్రమను’ తెస్తుంది. (1 కొరింథీయులు 7:28) వివాహ సంతోషమనేది ఎప్పుడూ చేసే స్వయం త్యాగం మరియు తీవ్ర ప్రయత్నం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే, జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషియైన యేసుక్రీస్తు అవివాహితుడే. ఆయన సంతోషంలేని వాడని ఎవరైనా అనగలరా? ఎంతమాత్రం అనలేరు! యెహోవా చిత్తాన్ని చేయడం ఆయనకు సంతోషాన్ని తెచ్చింది.—యోహాను 4:34.
వివాహం ఒంటరితనానికి కచ్చితమైన చికిత్స అనేది మరో ఊహ. అది నిజం కాదు! వివాహితుడైన ఒక క్రైస్తవ పురుషుడు ఇలా వాపోయాడు: “నా భార్య నన్ను ఎన్నడూ నమ్మలేదు లేదా నాతో ఎన్నడూ, అసలెప్పుడూ అర్థవంతంగా మాట్లాడలేదు!” అలాగే కొంతమంది క్రైస్తవ భార్యలు తమ భర్తలు తమతో మాట్లాడరని లేదా వారు తమ కంటే తమ ఉద్యోగాల్లో లేక స్నేహితుల ఎడల ఎక్కువ ఆసక్తి కలిగివున్నారని ఫిర్యాదు చేశారు. విచారకరంగా, వివాహమై కూడా ఒంటరిగా ఉండడం సర్వసాధారణమైంది.
ఆ తర్వాత, వివాహాన్ని కుటుంబ సమస్యలను తప్పించుకోవడానికి ఒక మార్గంగా భావించేవారు ఉన్నారు. వివాహమైన ఒక యౌవనస్థురాలు ఇలా చెబుతుంది: “నేను ఎదగడానికి నా తలిదండ్రులు నాకు ఒక అవకాశం ఇచ్చివుంటే బాగుండేది. కాని నేను స్నేహితున్ని కలిగివుండడానికి లేదా స్నేహితులతో బయటికి వెళ్లడానికి వాళ్లు అనుమతించలేదు . . . ఒకవేళ నా తలిదండ్రులు నాకు ఒక అవకాశం ఇచ్చివుంటే, నేను 16 సంవత్సరాల వయస్సులోనే వివాహం చేసుకొని ఉండేదాన్ని కాదు. నేను ఎదిగానని వాళ్లకి చూపించాలని నేను కోరుకున్నాను.”
ఇంటి దగ్గర జీవితం మరీ కట్టుదిట్టంగా ఉన్నట్లు మీరు భావించవచ్చు. కాని వివాహం, ఒకరి వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని ఎంతగానో పరిమితం చేయగల బాధ్యతలను తీసుకువస్తుంది. జీవనోపాధి కొరకు పనిచేయడం, బిల్లులు కట్టడం, ఇల్లు మరియు వాహన మరమ్మతులు చేయడం, వంట వండడం, శుభ్రం చేయడం, బట్టలుతకడం, బహుశా పిల్లలను పెంచడం మొదలైన వాటిల్లో ఏమి ఇమిడి ఉంటుందో ఆలోచించండి! (సామెతలు 31:10-31; ఎఫెసీయులు 6:4; 1 తిమోతి 5:8) ఈ పెద్ద బాధ్యతలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, అనేకమంది యౌవనస్థులు అయోమయంలో పడతారు.
పేరుప్రతిష్ఠలు పొందడానికి వివాహం కీలకమని కొందరు విశ్వసిస్తారు. కేవలం మీరు వివాహితులైనంత మాత్రాన మీ సాన్నిధ్యాన్ని లేదా మీ జత సాన్నిధ్యాన్ని ఇతరులు కోరుకుంటారనే దానికి ఏ హామీ లేదు. మీరు వివాహితులైనా, అవివాహితులైనా మీరు దయ, ఉదారత, నిస్వార్థత కలిగివుంటే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడతారు. (సామెతలు 11:25) వివాహజతగా ఉండడం మూలంగా, వివాహితులైన స్నేహితులతో కలిసి ఉండడం కొంచెం సులభమైనప్పటికీ, తాము “ఏక శరీరమై” ఉన్నామని భార్యాభర్తలు గుర్తుంచుకోవాలి. (ఆదికాండము 2:24) తాము తమ స్నేహితులతో కాదుగాని తామిద్దరూ ఒకరితో ఒకరు ఎలా సర్దుకుపోతామన్నది వారి ముఖ్య శ్రద్ధ అయ్యుండాలి.
వివాహానికి సిద్ధమేనా?
అయితే, ఈ విషయాల సహేతుకతను మీరు చూసినప్పటికీ, మీకు కొన్నిసార్లు నిరుత్సాహం కలుగవచ్చు. ఒక ప్రాచీన సామెత దాన్నిలా చెబుతుంది: “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును.” (సామెతలు 13:12) ఉదాహరణకు, యౌవనస్థుడైన టోనీ తాను అవివాహితునిగా ఉన్నందున అతడు దాదాపు కృంగిపోయినట్లు భావించాడు. తాను ఎవరినైనా సరే వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు భావించడం ప్రారంభించాడు. సాండ్రా అనే యౌవనస్థురాలు, ఎదుగుతున్న ప్రేమ గురించి తాను తెలుసుకున్న ప్రతిసారీ నిరుత్సాహపడేది; తనకు అవకాశం ఎప్పుడొస్తుందా అని ఆమె ఆలోచించేది.
మిమ్మల్ని మీరు నిరాశాస్థితిలోకి పడిపోవడానికి అనుమతించే ముందు, మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేను నిజంగా వివాహానికి సిద్ధంగా ఉన్నానా?’ ఒకవేళ మీరు ఇంకా యౌవ్వనారంభంలోనే ఉంటే, లేదు అన్నదే దానికి కచ్చితమైన సమాధానం! అమెరికాలో, యౌవ్వనారంభంలో చేసుకున్న అనేక వివాహాలు ఐదు సంవత్సరాల్లోనే విఫలమౌతున్నాయి.b అయితే కొంతమంది యౌవనస్థులు విశేషంగా తమ వయస్సును మించిన పరిపక్వత కలిగివుండి, వివాహంలో విజయం సాధించగలుగుతారు. కాని దాని భావం మీరు వివాహం చేసుకోవాలని కాదు. వివాహ బాధ్యతలను చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనేదాని గురించి మీరు యథార్థంగా తలంచారా?
యథార్థంగా స్వయం పరీక్ష చేసుకోవడం ఎంతో తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఎంత పరిపక్వత చెంది, బాధ్యత కలిగివున్నారు? మీరు డబ్బు పొదుపు చేయగలుగుతున్నారా, లేదా అది మీ చేతికి వచ్చిన వెంటనే మీరు దాన్ని ఖర్చు చేస్తారా? మీరు మీ బిల్లులు సమయానికి చెల్లిస్తారా? మీరు ఉద్యోగం చేయగల స్థితిలో ఉన్నారా లేదా ఇంటిని నడిపే స్థితిలో ఉన్నారా? మీరు ఇతరులతో అంటే తోటి పనివారితో తలిదండ్రులతో బాగా సర్దుకుపోతారా, లేక వారితో ఎప్పుడూ గొడవ పడుతుంటారా? అలాగైతే, వివాహ జతతో సర్దుకుపోవడం మీకు చాలా కష్టమౌతుంది.
మీరు ఇప్పటికీ యౌవనారంభంలోనే ఉంటే, మంచి భర్తగా లేక మంచి భార్యగా తయారవ్వడానికి కావలసిన పరిపక్వతను, స్థిరత్వాన్ని పొందడానికి మీకు మరి కొన్ని సంవత్సరాల అనుభవం అవసరమని మీరు తెలుసుకోవచ్చు. ఈ వాస్తవాన్ని గుర్తించడం, మీరు మీ తలంపులను సరిచేసుకొని వివాహాన్ని భవిష్యత్ సాధ్యతగా దృష్టించడానికి సహాయం చేస్తుంది. మీ అవివాహ స్థితి గురించి, కనీసం కొంత కాలంవరకైనా, మీరు ‘మనస్సులో మరింత నిశ్చయించుకోవడానికి’ ఇది మీకు సహాయం చేయవచ్చు.—1 కొరింథీయులు 7:37.
సరైన సిద్ధపాటు
అయితే, నాకు “ఈడు మించి” పోయిందని, నేను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మీరు విశ్వసిస్తే, అప్పుడేమిటి? వివాహం చేసుకొనే సాధ్యతగలవారు తక్కువమంది ఉంటే లేదా మీరు ఎవరియందైనా ఆసక్తి చూపిన ప్రతీసారీ మీరు నిరాకరింపబడితే అది నిరుత్సాహకరంగానే ఉండగలదు. అయితే దీని భావం మీరు కోరుకొనదగినవారు కాదనేనా? ఎంతమాత్రం కాదు. జీవించిన వారిలోకెల్లా అత్యంత ధనవంతులు, జ్ఞానవంతులు అయిన వారిలో ఒకడైన సొలొమోను రాజు, తాను ప్రేమించిన యౌవనస్థురాలి హృదయాన్ని చూరగొనలేకపోయాడు! సమస్యేమిటి? కేవలం ఆ అమ్మాయి హృదయంలో ఆయన ఎడల ప్రేమ భావాలు కలుగకపోవడమే. (పరమగీతము 2:7) అలాగే, మీరు నిజంగా ఎవరితో సాంగత్యం చేయగలరో ఆ వ్యక్తిని మీరు ఇంకా కలవకపోవడం కావచ్చు.
ఎవరినైనా ఆకర్షించడానికి వీల్లేనంత అందవికారంగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? నిజమే, మంచి రూపం ప్రయోజనకరమైనదే, కాని అదే అత్యంత ప్రాముఖ్యమైన విషయం మాత్రంకాదు. మీకు తెలిసిన దంపతుల గురించి మీరు తలంచినప్పుడు, వారిలో ఎత్తు, ఆకారం, ఆకర్షణ మొదలైన వాటిలో వివిధ మోతాదులు గల ప్రజలున్నారన్నది నిజం కాదా? అంతేగాక, నిజంగా దేవునికి భయపడే వారు, మీరు అంతర్గతంగా అంటే మీ “హృదయపు అంతరంగ స్వభావము” ఏమైవుందనేదాని గురించి ప్రాథమికంగా శ్రద్ధ కలిగివుంటారు.—1 పేతురు 3:4.
అయితే మీరు మీ భౌతిక రూపాన్ని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు; మీకు వీలైనంత చక్కగా కనిపించడానికి ప్రయత్నించడం సహేతుకమైనదే. అశుభ్రమైన బట్టలు, చక్కగా తలదువ్వుకోక పోవడం ఇతరులకు మిమ్మల్ని గూర్చిన తప్పు ఉద్దేశాన్ని కలిగించవచ్చు.c అంతేగాక, సరైన వాక్‌చాతుర్యం లేకపోవడం లేదా మీ వ్యక్తిత్వంలో లోపాలు ఇతరులు మీ గురించి తెలుసుకోకముందే మిమ్మల్ని అయిష్టపడేలా చేస్తాయి. ఈ విషయాల్లో కొన్ని మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంటే పరిపక్వత చెందిన స్నేహితులుగాని లేక తలిదండ్రులుగాని మీకు చెప్పవచ్చు. వాస్తవం బాధాకరంగానే ఉండవచ్చు, కాని దాన్ని అంగీకరించడం మీరు మార్పులు చేసుకోవడానికి, తద్వారా ఇతరులకు ఇష్టమయ్యేలా ఉండడానికి బహుశా మీకు సహాయం చేయవచ్చు.—సామెతలు 27:6.
అయితే చివరిగా, వ్యక్తిగా మీ యోగ్యత, లేక విలువ మీరు వివాహితులా లేక అవివాహితులా అనే దాన్ని బట్టి నిర్ణయించబడదు. దేవుడు మిమ్మల్ని ఎలా దృష్టిస్తాడనేది నిజంగా ప్రాముఖ్యమైన విషయం, ఆయన “హృదయమును లక్ష్యపెట్టును.” (1 సమూయేలు 16:7) యెహోవా అంగీకారాన్ని పొందడం గురించి మీరు శ్రద్ధ కలిగివుండాలి గాని వివాహం చేసుకోవడం గురించి కాదు. కాబట్టి రెండవది మీ తలంపులను, సంభాషణను అధిగమించనీయకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీ సహవాసాలను, సంగీతం మరియు వినోదం విషయంలో మీరు చేసుకొనే ఎంపికను జాగ్రత్తగా పరిశీలించుకోండి.
నిజమే, వివాహం చేసుకోవాలనే కోరిక సమసిపోక పోవచ్చు కాని, భయపడకండి. సహనం వహించండి. (ప్రసంగి 7:8) మీ అవివాహిత స్థితిని ఒక శాపంగా దృష్టించే బదులు, అవివాహిత స్థితి అందజేసే స్వాతంత్ర్యం నుండి మరియు ధ్యానభంగం లేకుండా దేవున్ని సేవించడంలో అది అందజేసే అవకాశాల నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందండి. (1 కొరింథీయులు 7:33-35, 38) తగిన సమయంలో మీకు వివాహం కావచ్చు—బహుశా మీరు అనుకునేదానికంటే ఎంతో త్వరగా కూడా జరగవచ్చు.
[అధస్సూచీలు]
a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
b మే 8, 1995 యొక్క మా సంచికలోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . మరీ తొందరగా పెళ్లి చేసుకున్నాం—మేము సఫలీకృతమవ్వగలమా?” అనే శీర్షికను చూడండి.
c ఈ విషయాల గురించి ప్రత్యేకమైన సలహాల కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ఇన్‌కార్పొరేటెడ్ వారు ప్రచురించిన యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకంలోని 10 మరియు 11 అధ్యాయాలను చూడండి.
[24వ పేజీలోని చిత్రం]
తోటివారికి వివాహాలు అవుతున్నప్పుడు, ఒంటరివారైనట్లు భావించడం సులభమే