కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 10/8 పేజీలు 15-18
  • వలసవెళ్లడంలోని రహస్యాలను పరిశోధించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వలసవెళ్లడంలోని రహస్యాలను పరిశోధించడం
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • “వానకోవెలా, నీవు నీ గూటిని ఎందుకు విడిచివెళ్తావు?”
  • కొన్ని సమాధానాలు
  • “పక్షుల పటముకు” సంబంధించిన రహస్యం
  • రహస్యం వెనుకనున్న మెదడు
తేజరిల్లు!—1995
g95 10/8 పేజీలు 15-18

వలసవెళ్లడంలోని రహస్యాలను పరిశోధించడం

స్పెయిన్‌లోని తేజరిల్లు! విలేఖరి చెప్పినది

అమెరికా యొక్క కాలిఫోర్నియా నందలి సాన్‌ జువాన్‌ కాపిస్ట్రానో పట్టణంలోని సాన్‌ జువాన్‌ కాపిస్ట్రానో అనే పాత మిషన్‌కు వానకోవెలలు తిరిగి రావడం గురించి తెలియజేసే ఒక పాత గీతమున్నది. ప్రతి సంవత్సరం మార్చి 19న అక్కడున్న తమ గూళ్లకు అవి తప్పకుండా తిరిగివస్తాయని చెప్పబడుతుంది.

ఐరోపాకు చెందిన వానకోవెలలు కూడా అదే కాలపట్టికను అనుసరిస్తాయి. మార్చి 15 నాటికి వానకోవెల గీతం మళ్లీ వినిపిస్తుందని ఒక స్పెయిన్‌ దేశపు సామెత ప్రవచిస్తుంది.

ఉత్తర అర్థగోళంలో, వసంతాగమనాన్ని సాంప్రదాయబద్ధంగా ముందే ప్రకటించే వానకోవెల పునరాగమనాన్ని గ్రామస్థులు ఎల్లప్పుడూ ఆహ్వానించేవారు. చలికాలంలో ఉండకుండా అవి ఎక్కడికి వెళ్లాయని కూడా కాని కొంతమంది ఆసక్తిగలవాళ్లు ఆశ్చర్యపోయారు. అవి శీతాకాలంలో నిద్రాణస్థితిలో ఉంటాయని కొందరు భావించారు. అవి చంద్రమండలానికి వెళ్లాయని కొందరు సూచించారు—అక్కడికి రెండు నెలల్లో అవి ఎగరగలవని ఒకరు లెక్కలు వేసారు. వానకోవెలలు అన్నీ సమూహంగా చేరి సరస్సులు మరియు బురద గుంటల అడుగున నీటిక్రింద శీతాకాలాన్ని గడుపుతాయని పదహారవ శతాబ్దానికి చెందిన స్వీడన్‌ దేశపు ఆర్చిబిషప్పు అన్నాడు. వానకోవెలలతో నిండివున్న వలను జాలరులు లాగుతున్నట్లు చూపించే చిత్రం కూడా ఆయన కథనంలో ఉండేది. ఇప్పుడు ఈ తలంపులు విచిత్రంగానే అనిపించినప్పటికీ, వాస్తవం మాత్రం దాదాపు కల్పనంత వింతగానే ఉన్నట్లుంది.

పక్షి శాస్త్రజ్ఞులు ఈ శతాబ్దంలో వేలకొలది వానకోవెలల కాళ్లకు రింగులు వేశారు. రింగులు వేయబడిన ఈ పక్షుల్లో కొద్ది శాతమే అయినా చెప్పుకోదగినంత శాతం పక్షులు తమ శీతాకాలపు విడిదిలో కనుగొనబడ్డాయి. నమ్మలేనట్లు అనిపించినప్పటికీ, బ్రిటన్‌ మరియు రష్యాల నుండి అంటే తమ ఇంటి నుండి వేలకొలది కీలోమీటర్ల దూరంలో అంటే ఆఫ్రికా ఆగ్నేయ భాగంలో శీతాకాలాన్ని గడుపుతూ కనుగొనబడ్డాయి. ఉత్తర అమెరికాకు చెందిన వాటి ప్రతిజతలు కొన్ని దక్షిణంగా దాదాపు అర్జెంటీనా లేక చిలీ వరకు ప్రయాణిస్తాయి. వానకోవెలలు మాత్రమే కాదు వేరే పక్షులు కూడా అలాంటి వీరోచితమైన ప్రయాణాలు చేస్తాయి. కోట్లాది పక్షులు ఉత్తరార్ధగోళం నుండి దక్షిణార్ధగోళానికి వెళ్లి శీతాకాలాన్ని గడుపుతాయి.

వానకోవెలంత చిన్న పక్షి మరుసటి సంవత్సరం వసంతకాలానికి అదే గూటికి తిరిగి రాకముందు 22,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కనుగొనడానికి పక్షిశాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు. వానకోవెలలు ఎక్కడికి వెళ్లాయన్నది తెలుసుకోవడం మరిన్ని జటిలమైన ప్రశ్నలను రేకెత్తించింది.

“వానకోవెలా, నీవు నీ గూటిని ఎందుకు విడిచివెళ్తావు?”

ఒక పక్షి ఎందుకు భూగోళం యొక్క మరో చివరికి ప్రయాణిస్తుంది? లేదా, స్పెయిన్‌ దేశపు సామెత ఒకటి అంటున్నట్లు, “వానకోవెలా, నీవు నీ గూటిని ఎందుకు విడిచివెళ్తావు?” చలివల్లనా లేక ఆహారం కొరకా? నిస్సందేహంగా, శీతాకాల వాతావరణ ఆగమనం కంటే నమ్మదగిన ఆహార సరఫరా కొరకైన వాటి అవసరతే దానికి సమాధానం, ఎందుకంటే చల్లని శీతాకాలాలను తట్టుకోవడం కష్టమైన అనేక చిన్న పక్షులు వలసవెళ్లవు. కాని పక్షులు వలసవెళ్లడమనేది కేవలం ఆహారం కొరకు వెదకడం మాత్రమే కాదు. వలసవెళ్లే మానవుల వలెకాకుండా, పరిస్థితులు చెడుగావున్నా లేకపోయినా పక్షులు వలస వెళుతూనే ఉంటాయి.

పగటి వేళ తక్కువగా ఉండడం వలస వెళ్లాలనే కోరికను కలిగిస్తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. శరదృతువులో పగటి గంటలు తక్కువైనప్పుడు బంధింపబడివున్న పక్షులు అవిశ్రామంగా అవుతాయి. అలాంటి ప్రభావాన్ని కృత్రిమంగా కల్పించినప్పుడు, పక్షులను పరిశోధకులు పెంచినప్పుడూ కూడా అలాగే జరిగింది. పంజరంలో ఉన్న పక్షి కూడా వలస వెళ్లాలంటే తాను ఏ దిశగా వెళ్లాలో తనకు సహజజ్ఞానంతో తెలిసిన ఆ దిశగానే తిరుగుతుంది. స్పష్టంగా, సంవత్సరంలోని ఒక ప్రత్యేకమైన సమయంలో, ఒకానొక దిశగా వలసవెళ్లాలన్న కోరిక స్వతహాగా కలిగేదే.

పక్షులు అంత పెద్ద దూరాలను ఎలా విజయవంతంగా ప్రయాణిస్తాయి? వాటిలో అనేకం సరిహద్దు గుర్తులులేని సముద్రాలు, ఎడారులపై నుండి వలస వెళతాయి, అది కూడా రాత్రి పగలు అలా వెళతాయి. కొన్ని జాతులలోని చిన్న పక్షులు అనుభవంగల పెద్ద పక్షుల సహాయం లేకుండానే ప్రయాణిస్తాయి. తుపానులు లేక ప్రక్క గాలులు వీచినప్పటికీ, అవి ఎలాగో తమ మార్గాన్ని అంటిపెట్టుకొనే ఉంటాయి.

ప్రాముఖ్యంగా విస్తారమైన సముద్రాలు లేక ఎడారులను దాటి ప్రయాణించడం సులభమేమి కాదు. మానవుడు దానిలో నైపుణ్యం సాధించేందుకు వేల సంవత్సరాలు పట్టింది. నిస్సందేహంగా, ఆస్ట్రోలాబ్‌, అయస్కాంత దిక్సూచి వంటి జలమార్గయాన సహాయకాలు లేకుండా క్రిస్టఫర్‌ కొలంబస్‌ సముద్రంపై అంత దూరాన్ని ఎన్నడూ దాటగలిగేవాడు కాదు.a అయితే కూడా, తన మొదటి ప్రయాణ ముగింపు సమయంలో బహమాస్‌కు వెళ్లడానికి ఆయనకు మార్గం చూపింది పక్షులే. ప్రాచీన నావికుల పద్ధతిని అనుసరిస్తూ, వలసవెళుతున్న పక్షులు నైరుతి దిశగా ఎగరడాన్ని చూసి ఆయన తన మార్గాన్ని ఆ వైపుగా మార్చుకున్నాడు.

విజయవంతమైన ప్రయాణానికి స్థిరమైన వేగాన్ని కలిగివుండేందుకు ఒక విధానం, స్థానాన్ని తెలుసుకోవడానికి ఒక మార్గం అవసరమౌతాయి. వివరంగా చెప్పాలంటే, మీ గమ్యానికి సంబంధించి మీరు ఎక్కడ ఉన్నారో, గమ్యాన్ని చేరడానికి ఏ దిశను తీసుకోవాలో మీరు తెలుసుకోవడం అవసరం. పరికరాలు లేకుండా అలాంటి పనిని చేపట్టగల సామర్థ్యం మానవులమైన మనకు లేదు కాని పక్షులకు ఉంది. తాము వెళ్లవలసిన సరైన మార్గాన్ని పక్షులు ఎలా నిర్ణయించుకొంటాయో వివరించే సమాచారాన్ని శాస్త్రవేత్తలు సహనంతో సమీకరించారు.

కొన్ని సమాధానాలు

పక్షుల ప్రయాణాన్ని గూర్చిన రహస్యాలను వెలికితీయాలని నిశ్చయించుకొన్న శాస్త్రజ్ఞులకు, తమ గూళ్లకు తిరిగి వచ్చే పావురాలు “పరీక్షకు ఉపయోగపడే మంచి సాధనాలు.” ఓర్పుగల పావురాలకు, అవి ప్రత్యేకమైన సరిహద్దు గుర్తులను చూడలేని విధంగా వాటి కళ్లకు శీతలీకరింపబడిన “కళ్లద్దాలు” పెట్టబడ్డాయి. మార్గనిర్దేశం కొరకు భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకోకుండా వాటిని ఆటంకపరిచేందుకు కొన్నిటికి వెనుకభాగాన అయస్కాంతం పెట్టబడింది. అవి విడుదల చేయబడే వైపుకు ప్రయాణిస్తుండగా వెలుపలి మార్గం వాటికి తెలియకుండా ఉండేలా చేయడానికి కొన్నిటికి మత్తుమందు ఇవ్వబడింది. ఒకేసారి కొన్ని అవాంతరాలను కలిగించినప్పుడు అవి విజయవంతంగా గమ్యం చేరలేకపోయినప్పటికీ, యుక్తిగల పావురాలు ప్రతి ఆటంకాన్ని విడిగా అయితే అధిగమించగలిగాయి. స్పష్టంగా, పక్షులు ఒకే ప్రయాణ విధానంపై ఆధారపడవు. అవి ఏయే విధానాలను ఉపయోగించుకుంటాయి?

పక్షులు పగటి సమయంలో సూర్యున్ని రాత్రి సమయంలో నక్షత్రాలను బట్టి ప్రయాణిస్తాయని కృత్రిమమైన సూర్యుళ్లను లేక రాత్రి ఆకాశాలను ఉపయోగించి చేయబడిన పరిశోధనలు చూపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటే? భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటూ, తమలోనే నిర్మింపబడిన దిక్సూచి ఉన్నట్లుగా పక్షులు తమ ప్రయాణ మార్గాన్ని ఏర్పరచుకోగలవు. అదే గూటికి తిరిగిరావడానికి, అవి పరిచితమైన సరిహద్దు గుర్తులను గుర్తించగలిగి కూడా ఉండాలి. అంతేగాక, వినికిడి, వాసన విషయాల్లో పక్షులు మానవులకంటే ఎంతో ఎక్కువ సామర్థ్యం కలిగివుంటాయని పరిశోధకులు కనుగొన్నారు, అయితే ప్రయాణించేందుకు ఇవి ఎంత మేరకు ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటాయో వారికి తెలియదు.

“పక్షుల పటముకు” సంబంధించిన రహస్యం

పక్షులు ఒక నిర్దేశిత మార్గంలో ఎలా ప్రయాణించగలవనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పరిశోధనంతా ఎంతో సహాయకరమైనదే అయినప్పటికీ, ఒక కలవరపర్చే సమస్య ఇంకా మిగిలివుంది. మరొక నమ్మదగిన దిక్సూచిని కలిగివుండడం ఒక ఎత్తు, అయితే మీరు ఎక్కడ ఉన్నారో మొదట నిశ్చయించుకొని ఆ తర్వాత అక్కడి నుండి ఇంటికి శ్రేష్ఠమైన మార్గాన్ని కనుగొనడానికి మీకు ఒక పటము కూడా అవసరం.

పక్షులకు ఏ “పక్షుల పటము” ఉంది? ఇంటి నుండి తెలియని స్థలానికి వందల కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన తర్వాత తాము ఎక్కడున్నామన్నది అవి ఎలా తెలుసుకుంటాయి? వాటికి నడిపింపునిచ్చేందుకు ప్రదేశవివరాలను తెలియజేసే స్పష్టమైన పటములు లేక సూచికలు లేకపోయినప్పటికీ, అవి శ్రేష్ఠమైన మార్గాన్ని ఎలా నిశ్చయించుకుంటాయి?

పక్షి యొక్క “పటమును గూర్చిన జ్ఞానం, జంతు ప్రవర్తనలోని అత్యంత గుప్తమైన, దొరకని రహస్యంగా ఉంటూ ఆ రహస్యాన్ని కాపాడుకొనేలా ఉందని” జీవశాస్త్రవేత్త అయిన జేమ్స్‌ ఎల్‌. గాల్డ్‌ చెబుతున్నాడు.

రహస్యం వెనుకనున్న మెదడు

స్పష్టమైన విషయం ఏమిటంటే, వలసవెళ్లడమన్నది సహజసిద్ధ ప్రవర్తన. అనేక జాతులు సంవత్సరంలోని ఒక ప్రత్యేకమైన కాలంలో వలసవెళ్లేందుకు జన్యు సంబంధంగా రూపొందించబడ్డాయి, విజయవంతంగా ప్రయాణించేందుకు అవసరమైన సామర్థ్యాలు మరియు భావాలతో అవి జన్మించాయి. ఆ సహజసిద్ధ సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చింది?

కారణసహితంగా, పక్షి యొక్క జన్యు సంబంధ వివరాలను “రూపొందించ” గల జ్ఞానవంతుడైన సృష్టికర్త నుండి మాత్రమే ఈ సహజసిద్ధ జ్ఞానం రాగలదు. పితరుడైన యోబును దేవుడు సూటిగా ఇలా అడిగాడు: “డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?”—యోబు 39:26.

పక్షులు వలస వెళ్లడంపై వంద సంవత్సరాల వరకు తీవ్రమైన పరిశోధన జరిపిన తర్వాత, శాస్త్రవేత్తలు పక్షుల బుల్లి మెదళ్లను గౌరవించడం మొదలుపెట్టారు. వలసవెళ్లడం కొరకు ప్రాథమికమైన మార్గాలను ఏర్పరచుకున్న తర్వాత, కొన్ని పక్షులు ప్రయాణించే విశేషమైన దూరాలను బట్టి శాస్త్రవేత్తలు ఎంతో ఆశ్చర్యపోయారు. తరం తర్వాత తరం, వసంత ఋతువులోను శరదృతువులోను కోట్లకొలది వలసవెళ్లే పక్షులు భూగోళాన్ని చుట్టివస్తాయి. అవి పగటి సమయంలో సూర్యున్ని, రాత్రి సమయంలో నక్షత్రాలను బట్టి ప్రయాణిస్తాయి. ఆకాశం మేఘావృతమైవున్న సమయంలో అవి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకొని, సుపరిచిత సరిహద్దులను గుర్తించడం వెంటనే నేర్చుకుంటాయి. బహుశా అవి వాసన ద్వారా లేక పరశ్రావ్య తరంగాల ద్వారా కూడా తమను తాము అనుకూలం చేసుకుంటాయి.

అవి తమ ప్రయాణాలను ఎలా “ఏర్పాటు” చేసుకుంటాయన్నది ఇంకా ఒక రహస్యంగానే ఉంది. వానకోవెలలన్నీ ఎక్కడికి వెళతాయో మనకు తెలుసు; అవి అక్కడికెలా చేరతాయో మనకు తెలియదు. అయినప్పటికీ, వానకోవెలలన్నీ శరదృతువులో గుంపులు కూడుతున్నప్పుడు, అవి వలసవెళ్లడాన్ని సాధ్యపరచిన దేవుని జ్ఞానాన్ని బట్టి ఆశ్చర్యపోవడం కంటే ఏమీ చేయలేము.

[అధస్సూచీలు]

a అక్షరేఖను గణించేందుకు ఆస్ట్రోలాబ్‌ ఉపయోగించబడుతుంది.

[18వ పేజీలోని బాక్సు]

వలసవెళ్లే ప్రపంచ విజేతలు

దూరం. గ్రేట్‌ బ్రిటన్‌ నందలి ఉత్తర వేల్స్‌లో, 1966 ఉత్తర వసంతకాలంలో ఒక రీవపిట్ట కాళ్లకు గుర్తుగా రింగు వేయబడింది. అదే సంవత్సరం డిశంబరులో, దాదాపు ఆస్ట్రేలియా నందలి న్యూ సౌత్‌ వేల్స్‌ దగ్గర అది కనిపించింది. అది ఆరునెలల్లో 18,000 కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించింది. అలాంటి చర్య రీవపిట్టలకు బహుశా సర్వసాధారణమైనది కావచ్చు. ఒక సంవత్సర కాలంలో, ఈ పక్షుల్లోని కొన్ని క్రమంగా భూగోళాన్ని చుట్టివస్తాయి.

వేగం. ఉల్లంకిపిట్ట బహుశా అత్యంత వేగంగా వలసవెళ్లే పక్షి. ఈ పక్షుల్లో కొన్ని ఎల్యూట్యన్‌ ద్వీపాలు, అలాస్కా నుండి హవాయిని వేరుపర్చే 3,200 కిలోమీటర్ల సముద్రాన్ని కేవలం 35 గంటల్లో అంటే గంటకు 91 కిలోమీటర్ల సగటు వేగంతో చుట్టివచ్చాయి!

సహనం. కేవలం 20 గ్రాముల బరువుండే, ఉత్తర అమెరికాకు చెందిన జిట్టలు అత్యంత గొప్పగా ఎగిరే మారథాన్‌లు. దక్షిణమెరికాకు తమ ప్రయాణంలో అవి 3,700 కిలోమీటర్లు అంటే కేవలం మూడున్నర దినాల్లో ఎక్కడా ఆగకుండా అట్లాంటిక్‌ మహా సముద్రాన్ని దాటుతాయి. ఈ విశేషమైన సహన పరీక్ష, ఎక్కడా అగకుండా నాలుగు నిమిషాల్లో ఒక కిలోమీటరు చొప్పున 1,900 కిలోమీటర్లు పరుగెత్తే మనిషితో పోల్చబడింది. అలా ఎగరడమనేది తమ శరీర బరువు గురించి శ్రద్ధకలిగి ఉండేవారికి స్వప్నం వంటిదే, ఎందుకంటే జిట్ట తన శరీరపు బరువులో దాదాపు సగం బరువును కోల్పోతుంది.

సమయపాలనము. వానకోవెలే కాకుండా, (పైన చూపబడిన) సంకుబుడి కొంగ కూడా సమయపాలన గురించి పేరుపొందినదే. సంకుబుడికొంగ “తన కాలమునెరుగును,” అలాగే “రావలసిన” కాలమును ఎరుగును అని ప్రవక్తయైన యిర్మీయా వర్ణించాడు. (యిర్మీయా 8:7) ఇప్పటికీ ప్రతి వసంత కాలంలో దాదాపు ఐదు లక్షల సంకుబుడి కొంగలు ఇజ్రయేల్‌ను దాటివెళతాయి.

ప్రయాణ నైపుణ్యాలు. నీళ్లపక్షికి ఇంటివంటి స్థలం మరొకటి లేదు. గ్రేట్‌ బ్రిటన్‌లో దాని గూడు నుండి తీసుకొనబడిన ఒక ఆడ పక్షి దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలో, అమెరికాలోని బోస్టన్‌లో విడిచిపెట్టబడింది. అది అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని పన్నెండున్నర రోజుల్లో దాటి, దానికి సంబంధించిన వివరాలుగల లేఖ విమానం ద్వారా చేరేలోపలే అది తిరిగి ఇంటికి వచ్చేసింది. సాధించబడిన విషయం మరింత ఉత్తేజకరంగా ఉండింది ఎందుకంటే ఈ పక్షులు తమ వలస ప్రయాణాల్లో ఎన్నడూ ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని దాటవు.

[16వ పేజీలోని చిత్రం]

సంకుబుడి కొంగ ప్రతి సంవత్సరం సమయపాలనతో తన గూటికి తిరిగి చేరుతుంది

[17వ పేజీలోని చిత్రం]

ఆంగ్ల అక్షరం వి ఆకారంలో వలసవెళుతున్న కొంగలు

[Picture Credit Line on page 15]

Photo: Caja Salamanca y Soria

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి