బైబిలు ఉద్దేశము
మీ ప్రార్థనల్లో మీ పాత్ర
ముట్టడించబడిన రాజు కొండమీద నుండి పట్టణాన్ని చూస్తూ తన మహత్తరమైన కోటను గూర్చి, విస్తరిస్తున్న రాజధాని గురించి, తన కుటుంబం యొక్క విచారకరమైన స్థితిని గూర్చి తలంచడానికి మెల్లగా ఆగుతాడు. ఒక పెద్ద సైన్యం దక్షిణాన గుమికూడి, పట్టణంలోనికి ఇప్పుడు ప్రవేశిస్తుంది. ప్రభుత్వ ఉన్నత అధికారులు శత్రువుల పక్షాన చేరారు, ప్రజలందరు తిరుగుబాటు దారులకు మద్దతునిచ్చారు. మానసికంగా కృంగిపోయిన ఆ రాజు దేవునికి ప్రార్థన చేస్తాడు. మతంలో ప్రగాఢమైన విశ్వాసం గల ఈ వ్యక్తికి తన అభ్యర్థనను దేవుడు వింటాడని, కుట్రదారుల పథకాలను నిష్ఫలం చేస్తాడనే నమ్మకం పెరుగుతుంది. దేదీప్యమానమైన తన పట్టణం నుండి వెలుపలికి వచ్చి, కొండ దిగి, నదికి అవతలనున్న అరణ్యప్రాంతంలోని ఉత్తరం వైపుకు వెళ్తాడు. అతడు అంతకన్నా ఎక్కువగా ఏమి చేయగలడు? పరిస్థితి ఇప్పుడు దేవుని చేతిలో ఉంది.
అదేవిధంగా, బైబిలు ఎలా ప్రార్థన చేయాలనే దాని గూర్చిన మార్గదర్శకాలను ఇవ్వడమే కాకుండా, యెహోవా దేవుడు “ప్రార్థన ఆలకించువాడు” అని కూడా తెలియజేస్తుందనే ఓదార్పుకరమైన హామీతో నమ్రతగల విశ్వాసులు కష్ట సమయాల్లో ప్రార్థనలో దేవుని వైపుకు తిరుగుతారు. (కీర్తన 65:2) యథార్థహృదయంతో దేవుని అన్వేషించేవారందరి ప్రార్థనలను ఆయన వింటాడని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు.
అయితే, విశ్వాసం, ప్రార్థన మాత్రం సరిపోతాయా? మన ప్రార్థనల ఫలితంలో మనం ఏ పాత్రను వహిస్తాం?
మన వంతు మనమెలా చేస్తాం?
మొదట పేర్కొనబడిన రాజు ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదే. ఆయన తనను ఉపేక్షించిన అబ్షాలోము అను తన కుమారుని మరియు అతని కపట సలహాదారుడైన అహీతోపేలు కుట్రకు గురైనప్పుడు, యెరూషలేమును వదిలిపెట్టి, యొర్దాను నదికి తూర్పు దిశనవున్న అరణ్యప్రాంతంలో ఉండే మహనయీము అనే నగరంలో తాను తలదాచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగే, ఆయన నిరాశానిస్పృహలతోను వ్యాకులతలతోను కృంగినవాడై “యెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్టుమని” ప్రార్థనలో అభ్యర్థన చేశాడు. (2 సమూయేలు 15:11-15, 30, 31) అయినప్పటికీ, దావీదు ప్రార్థన కంటే మించినదే చేశాడు. తన ప్రార్థనకు మంచి ఫలితాన్ని పొందేందుకు ఆయన అనుకూలమైన విధంగా తన వంతు తాను చేశాడు. అదెలా?
ఆయన ఈ పరీక్షలను ఎదుర్కోవడానికి చాలా కాలం ముందే తన వంతు తాను చేయడం మొదలెట్టాడు. అనేక సంవత్సరాలుగా, అంటే తాను రాజు కాకముందటి నుండే తాను యెహోవా యొక్క నమ్మకమైన ఆరాధికుడని దావీదు రుజువు చేశాడు. (1 సమూయేలు 16:12, 13; అపొస్తలుల కార్యములు 13:22) ఆయన దేవునికి సన్నిహితుడయ్యాడు. అలా, యెహోవా తన ప్రార్థన వింటాడని, సరైన విధంగా ఆయన బదులిస్తాడని శ్రమలో ఉన్న దావీదు నమ్మాడు.
నేడు కూడా అది నిజమే. మన ప్రార్థనలకు ఫలితం దక్కేందుకు మన వంతు మనం చేయాల్సిన మొదటి పద్ధతి ఏమంటే, దైనందిన జీవన విధానంగా బైబిలు సలహాను అనుసరించడమే. దేవుడిచ్చిన సూత్రాలను నమ్మకంగా పాటించడం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగిస్తుంది. శ్రమలు మొదలవ్వక ముందే దేవునితో ఈ విధమైన సన్నిహిత సంబంధాన్ని మరియు విశ్వాసం యొక్క మాదిరిని కలిగి ఉండాలి. అది నిర్మించనున్న ఇంటి పునాదివలె ఉండాలి; కనుక దానిపై ఇల్లు నిర్మించబడక ముందే అది ఉండాలి. కనుక, మనం ఇప్పుడే, శ్రమలు రాక ముందే మన అనేక ప్రార్థనలకు చక్కని ఫలితం లభించేందుకు మన వంతు మనం చేయగలం.
చురుకైన పాత్రను నిర్వహించండి!
దేవునితో దావీదుకున్న సంబంధం ఒక ముఖ్యపాత్రను వహించినప్పటికీ, తన ప్రార్థనా ఫలితం కొరకు తాను నిష్క్రియునిగా పరిశీలించువానిగా ఉండలేడని ఆయన గుర్తించాడు. దానికి భిన్నంగా, దావీదు ప్రార్థించిన తరువాత చేసిన జ్ఞానయుక్తమైన క్రియలో స్పష్టమైనట్లుగా ఆయన చురుకైన పాత్రను నిర్వహించాడు.
దావీదు యొక్క నమ్మకస్థులైన స్నేహితుల్లో అర్కీయుడైన హూషై ఒకడు. హూషై పారిపోతున్న రాజును ఒలీవ కొండ మీద కలిశాడు. దావీదుతో పాటు ప్రవాసానికి వెళ్ళాలని హూషై ఆశించినప్పటికీ, పట్టణంలోనే ఉండాలన్న దావీదు ఆజ్ఞకు ఆయన లోబడ్డాడు. అబ్షాలోముకు నమ్మకాన్ని చూపిస్తున్నట్లు నటించి, విశ్వాసఘాతకుడైన అహీతోపెలు అనే సలహాదారుని ఆలోచనను నిష్ఫలం చేసేందుకు ప్రయత్నిస్తూ, సంగతులను గూర్చి దావీదుకు ఆయన తెలియజేస్తూ ఉండాలి. (2 సమూయేలు 15:32-37) ఆశించినట్లే, హూషై అబ్షాలోము విశ్వాసాన్ని చూరగొనడంలో కృతకృత్యుడయ్యాడు. ఇప్పుడు యెహోవా జోక్యం చేసుకుంటాడు.
అతితెలివిగల, వక్రబుద్ధిగల అహీతోపెలు ఒక బ్రహ్మాండమైన పథకాన్ని వేశాడు. చెల్లాచెదరైపోయి, సులభంగా పట్టుబడే స్థితిలో ఉన్న దావీదుపై ఆయన పారిపోతున్న ఆ రాత్రే దాడిచేసేందుకు తనకు 12,000 మంది పురుషులనివ్వమని, చావుదెబ్బ విజయవంతమైన విప్లవానికి నాంది పలుకుతుందని ఆయన అబ్షాలోముకు చెప్పాడు! అయినప్పటికీ అనేకులకు ఆశ్చర్యం కలిగించే విధంగా, అబ్షాలోము ఈ విషయంలో హూషై సలహాను తీసుకున్నాడు. మరెవరో కాకుండా అబ్షాలోమే నాయకత్వం వహించి పెద్ద సైన్యాన్ని సమకూర్చడానికి సమయాన్ని తీసుకోవాలని అబ్షాలోముకు ఆయన సలహా ఇచ్చాడు. యెహోవా నడిపింపు ద్వారా హూషై సలహా అంగీకరించబడింది. హూషై సలహాను పాటించడం అంటే కచ్చితంగా ఓటమేనని గ్రహించిన అహీతోపెలు ఇంటికి తిరిగివెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు.—2 సమూయేలు 17:1-14, 23.
దావీదు ప్రార్థించినట్లుగానే, యెహోవా ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడనడానికి సందేహం లేదు. తన ప్రార్థనకు అనుగుణంగా పనిచేయడంలో దావీదు చూపిన మాదిరి ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని పొందాలనుకునే వారందరికీ విలువైన పాఠాన్ని నేర్పుతుంది.
యెహోవా తన వంతు చేస్తాడు
నిజమే, తమ అనుదినాహారం కొరకు ప్రార్థించమని యేసు తన అనుచరులకు నేర్పాడు, వారు దేవుని ఆసక్తులను ముందుంచినట్లయితే, ఆయన వారి అవసరతలను తీరుస్తాడని కూడా ఆయన వాగ్దానం చేశాడు. (మత్తయి 6:11, 33) ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఉద్యోగం లేనట్లయితే, అతడు తన జీవనాధారం కొరకు చేసే ప్రార్థనకనుగుణంగా ఒక పనిని సంపాదించడానికి, పని చేయడానికి తనకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి.
మన ప్రార్థనల అంశమేదైనప్పటికీ, ఫలితం కొరకు తోడ్పడే మన సామర్థ్యంలో తేడా ఉంటుంది. ఏ పనైనా మనం మరింత చేయగలిగే సమయాలు, మరింత చేయలేని సమయాలు ఉంటాయి. మనం ఏం చేయగలం, ఏమి చేయలేం అన్నది కాదు గాని, మనం చేయగలిగినంత మనం చేస్తున్నామా అన్నదే ముఖ్యం.
మన పరిస్థితులు మరియు సామర్థ్యాలు యెహోవాకు తెలుసని మనం నమ్మకం కలిగి ఉండగలం. మనకు ఏమి చేయడం సాధ్యం అనేది ఆయనకు పూర్తిగా తెలుసు, మనం చేయగలిగే దానికన్నా ఎక్కువగా మనం చేయాలని ఆయన ఎన్నడూ కోరడు. మనం మరింత చేయగలిగినా, లేదా కొంతే చేయగలిగినా మనకు తక్కువైనదాన్ని ఆయన పూరిస్తాడు. ఆయన మన ప్రయత్నాలను విలువైనవిగా ఎంచుతాడు, మద్దతునిస్తాడు, ఇమిడి ఉన్న వాటన్నింటి కొరకైన శ్రేష్ఠమైన ఫలితం కొరకు మన ప్రయత్నాలతో పాటు ఆయన కూడా పనిచేస్తాడు.—కీర్తన 3:3-7.
“రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక” అని దావీదు రాజు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నమ్మకంగా ప్రకటించగలిగాడు. (కీర్తన 3:8) మనం చేసే వంతు చిన్నదైనా, పెద్దదైనా దానితో పాటు యెహోవా శక్తియందలి మన నమ్మకం మన ప్రార్థనల మంచి ఫలితానికి నడుపును గాక.