మీ తోటలో ఫ్రిటిలరీ ఉందా?
ఒకవేళ ఉన్నట్లయితే, దాని అందానికి మీరు సమ్మోహితులౌతారు. ఫ్రిటిలరీ అంటే ఏంటి? మన ప్రపంచానికి అందంతెచ్చే వేలాది వివిధ రకాల సీతాకోకచిలుకల్లో అది ఒకటి, అమెరికా మరియు కెనడాల్లో కనుగొనబడే 750 కంటే ఎక్కువ జాతుల్లో ఒకటి. ఇక్కడ చూపబడిన గ్రేట్ స్పాంగ్‌ల్డ్ జాతికి చెందినది, వర్జీనియా రాష్ట్రపు పైరుపచ్చని గ్రామీణ ప్రాంతమందలి ఒక తోటలో ఫోటో తీయబడింది. గ్రేట్ స్పాంగ్‌ల్డ్ జాతికి చెందిన వాటికి వెనుక ఉండే రెక్కల అడుగుభాగం వెండి రంగులతో మెరుస్తుంటుంది. తోటమాలి ఉద్దేశపూర్వకంగానే తోటలో ఒక భాగమందు అడవిపువ్వులను అంటే పసుపు రుబిక్సా మరియు మావ్ ఫీల్సో పువ్వులను నాటాడు, అవి ఎత్తుగా పెరిగి, సీతాకోకచిలుకలను ఆకర్షిస్తాయి.
మీరు కూడా సీతాకోకచిలుకలను ఆకర్షించి, వాటిని మీ తోటలోకి రప్పించాలనుకుంటే, ఒక మూలలో అడవిపువ్వులను పెంచి చూడండి. బహుశా మీరు ఒక ప్యాకెట్ అడవిపువ్వుల విత్తనాలను కొని పెంచితే అవి, ఈ సుకుమారమైన ప్రాణులను ఆకర్షించగల వివిధ రంగుల పువ్వులను పూయవచ్చు. మీరు ప్రపంచంలో ఆ సరైన స్థలంలో నివసిస్తున్నట్లయితే, బుడిలీయా అనే పొద సీతాకోకచిలుకలను అయస్కాంతంలా రప్పించగలదు. అప్పుడు మీరు బైనాక్యులర్స్, కెమెరాను తీసుకుని వినోదం పొందండి!