నాజూకైనదే కానీ సాహసియైన ప్రయాణికురాలు
కెనడాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
కళాకారులు వాటి చిత్రాలు గీస్తారు, కవులు వాటి గురించి వ్రాస్తారు. అనేక రకాలు ఉష్ణమండల వర్షారణ్యాల్లో జీవిస్తాయి. అనేకం అడవుల్లో, పొలాల్లో, పచ్చిక బయళ్లలో జీవిస్తాయి. కొన్ని పర్వత శిఖరాల చల్లదనాన్ని తట్టుకుంటాయి; మరికొన్ని ఎడారుల వేడిని తట్టుకుంటాయి. అవి కీటకాలన్నిటిలోకెల్లా అత్యంత అందమైన వాటిగా వర్ణించబడ్డాయి.
అందంగా, హుందాగా ఉండే ఈ జీవి మీకు బాగా తెలుసు—అదే సీతాకోక చిలుక. అయితే, ఒక రకమైన సీతాకోక చిలుక అద్భుతమైన తన ప్రయాణ సామర్థ్యాలనుబట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. నాజూకైనదే కానీ సాహసియైన ఈ ప్రయాణికురాలు మోనార్క్ సీతాకోక చిలుకే. ఈ అద్భుత సృష్టి వైపు, అత్యంత ఆశ్చర్యకరమైన దాని వలస ప్రయాణం వైపు ఒకపరి పరికిద్దాం.
సృష్టి యొక్క సున్నితమైన అద్భుతం
వేడిగానున్న, ఎండ కాస్తున్న దినాన మీరు ఓ పచ్చిక బయలులో ఉన్నారని ఊహించుకోండి. తిండి, నీరు కొరకైన వాటి ఎడతెగని వేటలో అవి అడవి పూలపై ఇక్కడా అక్కడా ఎగురుతుండగా, ఈ హుందాయైన రెక్కలుగల అద్భుతాలపై మీ దృష్టిని నిల్పండి. మీ చేయి చాచి కదలిక లేకుండా నిలబడండి. ఒకటి దగ్గరకు వస్తోంది. ఓహ్, అది మీ చేతిపై వాలబోతోంది! అది ఎంత సున్నితంగా వాలుతుందో గమనించండి.
ఇప్పుడు దగ్గరనుండి చూడండి. పుప్పొడి అతుక్కుని, నారింజరంగుపై నల్ల చారికలు, వాటికున్న నల్లని అంచుల్లో తెల్లరంగు మచ్చలు ఉన్న, సున్నితమైన రెండు జతల రెక్కలను గమనించండి. ఆంగ్ల నివాసులు అమెరికాలో స్థిరపడినప్పుడు, ఆరంజిలోని తమ విలియం చక్రవర్తి (మోనార్క్)తో దాన్ని పోల్చి వారు దానికి మోనార్క్ అనే పేరు పెట్టారని చెప్పబడుతోంది. వాస్తవానికి, ఈ సీతాకోక చిలుక ఎంతో “రాజసమైనది.” అయితే, ఓ అర గ్రాము బరువు మాత్రమే ఉండి, ఎనిమిది నుండి పది సెంటీమీటర్ల వెడల్పున్న రెక్కలుగల నాజూకైన ఈ అందాలరాశి, సుదీర్ఘమైన, దుష్కరమైన ప్రయాణాలు చేసే సామర్థ్యంగలది.
ముగ్ధులను చేసే ప్రయాణాలు
కొన్ని సీతాకోక చిలుకలు శీతాకాలం మొదలైన వెంటనే చాలా దూరం వలస వెళ్తాయని చెప్పబడుతున్నప్పటికీ, కేవలం మోనార్క్ మాత్రమే నిర్దిష్టమైన గమ్యాలతో, అంత పెద్ద సంఖ్యల్లో అంతంత దూరాలు ప్రయాణిస్తుంది. మోనార్క్ వలస వెళ్లడం నిజంగా సీతాకోకచిలుక జీవితంలో ఓ అద్భుతమే. ఈ సాహసికులైన ప్రయాణికుల ముగ్ధులను చేసే ప్రయాణ సామర్థ్యాలను కొన్నింటిని పరిశీలించండి.
శరదృతువులో కెనడానుండి కాలిఫోర్నియా లేక మెక్సికోలోని తమ శీతాకాల వాతావరణానికి అవి చేరే సరికి 3,200 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరాన్నే అవి పూర్తి చేస్తాయి. అవి పెద్ద సరస్సులను, నదులను, బయళ్లను మరియు పర్వతాలను దాటి వెళ్తాయి. లక్షలకొలది సీతాకోక చిలుకలు మధ్య మెక్సికోకు చెందిన సెయిరా మాడ్రే పర్వతాలలో ఉన్నత శిఖరాలుగల తమ గమ్యాన్ని చేరి తమ ప్రయాణాన్ని విజయవంతంగా ముగిస్తాయి.
చిన్న సీతాకోక చిలుకలు మునుపెన్నడూ అలా ప్రయాణించి రాలేదనే విషయాన్ని మరి చలికాలాన్ని గడిపే స్థలాలను అసలు అవి చూడలేదనే విషయాన్ని మీరు పరిశీలించినప్పుడు, అవి అలా ప్రయాణించడం ఇంకా ఎక్కువ ఆశ్చర్యకరమైన విషయంగా అనిపిస్తుంది. అయితే అవి ఎగిరే దిశను తప్పిపోకుండా గమనిస్తాయి మరి తమ శీతాకాల నివాసానికి తామెప్పుడు రావాలో కూడా వాటికి తెలుసు. దానినవి ఎలా చేస్తాయి?
కనేడియన్ జియోగ్రాఫిక్ ఇలా పేర్కొంటుంది: “వాటి అల్పమైన చిన్ని మెదళ్లలో ఏదో కొంత ప్రతిభావంతమైన జన్యుకణ కార్యక్రమం ఉందన్నది స్పష్టమౌతుంది, అది తేనెటీగలవలె సూర్యుని కిరణాల కోణాన్ని గమనించి దానికి తగినట్టు ప్రతిస్పందించడం లేక పక్షులకు దారి చూపుతుందని భావించబడుతున్న భూమి అయిస్కాంత క్షేత్రాన్ని గమనించి దానికి తగినట్టు ప్రతిస్పందించడం వంటి ఏదో కొంత ప్రక్రియ అయివుంటుంది. ప్రత్యేక ఉష్ణోగ్రత మరియు తేమ ఎంత పాళ్లలో ఉందో గమనించగల సామర్థ్యం ప్రయాణం చివర్లో సహాయం చేయగలదు. అయితే ఇంత వరకూ సరైన సమాధానం విజ్ఞాన శాస్త్రానికి లభించలేదు.” బైబిలు గ్రంథమైన సామెతల పుస్తకంలో ప్రస్తావించబడిన జీవులవలె, “అవి మిక్కిలి జ్ఞానముగలవి.”—సామెతలు 30:24.
మోనార్క్‌లు చాలా నిపుణతతో ఎగరగలవు. అవి గంటకు 12 కిలోమీటర్ల వరకూ రెక్కలాడించకుండా ఎగురగలవు, మరి గంటకు 18 కిలోమీటర్ల వరకూ పైకి ఎగురగలవు—మరి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన వారెవరికైనా తెలిసే ఉన్నట్లు, అవి గంటకు 35 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలవు. అవి గాలులను చక్కగా ఉపయోగించుకోవడంలో ఎంతో సామర్థ్యంగలవి, నైరృతి వైపుకు తమ గమ్యానికి చేరేందుకు అవి జోరుగా వీస్తున్న వెస్టర్లయిస్కు ఎడంగా అలా ఎగిరిపోగలవు. సంక్లిష్టమైన ప్రయాణ ప్రక్రియలను ఉపయోగిస్తూ, గాలిలోని వేగం మరియు దిశతో అవి సరిగ్గా పని చేయగలవు. గ్లైడర్ పైలట్లు మరియు గ్రద్దల వలెనే అవి తాప ప్రవాహంపై (వెచ్చని గాలులు పైకి వీచడం) ప్రయాణిస్తాయి. ఒక మూలం ప్రకారం, మోనార్క్‌లు దినానికి సాధారణంగా 200 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలవు. అవి పగటివేళ మాత్రమే ఎగురతాయి. అవి రాత్రివేళ, తరచూ ప్రతి సంవత్సరం అదే ప్రాంతంలో ఆగి అక్కడే ఉంటాయి.
మోనార్క్ అప్పుడప్పుడూ ఎగరడం లేక గ్లైడ్ చేయడంకంటే ఎక్కువే చేస్తుందని టొరంటో విశ్వవిద్యాలయంలోని వైజ్ఞానికుడైన డేవిడ్ గిబో తెలుసుకున్నాడు. అతనిలా నివేదిస్తున్నాడు: “వలస వెళ్లే బాతులకంటే ఎంతో తెలివైన రీతిగా సీతాకోక చిలుకలు గాలిని ఉపయోగించుకోవలసి ఉంటుందని నేను భావిస్తున్నాను.” రెక్కలు రెపరెపలాడించడం, పైకెగరడం, మరియు తినడం వంటి దిన చర్య, శీతాకాలమంతటికీ సరిపోయేంత మరియు వసంత ఋతువులో తిరిగి ఉత్తరానికి తిరుగు ప్రయాణం సాగించేందుకు సరిపోయేంత క్రొవ్వుతో మెక్సికో చేరుకునేందుకు మోనార్క్లకు వీలు కలిగిస్తుంది. ప్రొఫెసర్ గిబో ఇలా కూడా చెబుతున్నాడు: “అవి తమ సుదీర్ఘ ప్రయాణాన్ని రెక్కలాడించకుండా సాగిస్తాయి గనుక అవి ఇక్కడికి బలంగా మరియు ఆరోగ్యకరంగా చేరుకుంటాయి.”
సామూహిక వలస
రాకీ పర్వతాలకు పశ్చిమాన ఉండే మోనార్క్‌లు దక్షిణం వైపుకు వలస వచ్చి కాలిఫోర్నియాలో శీతాకాలాన్ని గడుపుతాయని ఎంతో కాలంగా తెలిసిన విషయమే. కాలిఫోర్నియా దక్షిణ తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లోని పైన్ మరియు యూకలిప్టస్ చెట్లకు అవి వేలాడుతూ ఉండటాన్ని చూడవచ్చు. అయితే తూర్పు కెనడాలోని మోనార్క్‌ల పెద్ద సంఖ్య ఎక్కడికి వలస వెళ్తుందనే విషయం చాలా కాలం వరకూ ఒక రహస్యంగానే ఉండిపోయింది.
1976లో ఈ రహస్యం ముడివిప్పబడింది. వాటి శీతాకాల నివాసాలు తుదకు కనుగొనబడ్డాయి, అవి మెక్సికోలోని సెయిరా మాడ్రే పర్వతాల అంచులపైనున్న అడవులే. పొడుగ్గా బూడిద-పచ్చ వర్ణంలోని ఫర్ చెట్ల కొమ్మలూ, కాండాలపై కోట్ల సంఖ్యలోనున్న ఆ సీతాకోక చిలుకలు విస్తారంగా వాలియున్నట్లు కనిపించాయి. ఈ అద్భుతమైన దృశ్యం సందర్శకులకు కనులవిందు చేస్తూనే ఉంది.
మోనార్క్‌ల గుంపులను చూసేందుకు కెనడాలోని అత్యంత చక్కని చోటు ఒంటారియోలోని పాయింట్ పీలీ జాతీయ పార్క్, అవి దక్షిణానికి వెళ్లే తమ వలస ప్రయాణానికి సిద్ధపడుతూ అక్కడ కోకొల్లలు ఉంటాయి. వేసవి చివరి భాగంలో, మెక్సికోలోని తమ శీతాకాల స్థలాలకు వెళ్లే తమ దక్షిణవైపు ప్రయాణానికి గాలి మరియు వాతావరణం సరైన రీతిలో ఉండేంత వరకూ ఇరీ సరస్సు యొక్క ఉత్తర తీరంలో వేచి ఉండి అవి కెనడాలోని ఈ దక్షిణ భాగంలో సమావేశమౌతాయి.
గమ్య స్థానాలు
పాయింట్ పీలీలో మొదలై, అమెరికా ఖండంపైగా సాగే తమ సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు అవి ఇరీ సరస్సుపైగా ఒక ద్వీపం నుండి మరో ద్వీపానికి ఎగురుతాయి. మార్గమధ్యంలో, మోనార్క్‌ల ఇతర గుంపులు వలస వెళ్లేందుకు వాటితో కలుస్తాయి. మెక్సికో పట్టణానికి వాయవ్యానున్న పర్వత శిఖరాల మీద, శీతాకాలాన్ని గడిపేందుకు పది కోట్ల వరకూ సమకూడుతాయని అంచనా వేయబడింది.
మరికొన్ని ఫ్లారిడా నుండి, కరబీయన్పైగా వలస వెళ్తాయి, మరియు యూకటన్ ద్వీపకల్పంలోని లేక గ్వాటమాలలోని ఇంకా కనుగొనబడవలసిన గమ్యాలకు అవి చేరుకోవచ్చు. అటు మెక్సికోలో ఉన్నా లేక వాటి ఇతర శీతాకాల ప్రాంతాల్లో ఉన్నా, ఈ మోనార్క్‌లు పర్వత ప్రాంత అడవులు కొద్ది మొత్తంలో ఉన్న చోటికి గుమిగూడుతాయి.
తమ శీతాకాల గృహానికి చేరుకునేందుకు సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చి, అవి వేడిగానున్న, ఎండకాస్తున్న పచ్చిక బయళ్లలో విశ్రాంతి తీసుకుంటాయని ఎవరైనా అనుకోవచ్చు. అయితే అది నిజం కాదు. అవి వెళ్లే మెక్సికోలోని ట్రాన్స్వాల్కానిక్ రేంజ్ చాలా చల్లగా ఉంటుంది. అయితే పర్వత అంచులపై ఉండే వాతావరణం అవి శీతాకాలాన్ని అక్కడ గడిపేందుకు సరిగ్గా తగినది. దాదాపు పూర్తి క్రియాశూన్యతా స్థితిలో అవి తమ సమయాన్ని గడిపేలా చేసేంత చల్లదనం అక్కడ ఉంటుంది, అలా మెక్సికోకు ఎగిరి వెళ్లి, అక్కడ శీతాకాలాన్ని గడిపి మళ్లీ వెనక్కి వచ్చేందుకు వాటికి వీలు కలిగించేలా వాటి జీవితాయుస్సును ఎనిమిది నుండి పది నెలలకు హెచ్చిస్తుందది. ఇది ఒక విధమైన విశ్రాంతే అని మీరు అనవచ్చు.
వసంత ఋతువు వస్తుంది, మరి మోనార్క్‌లు మళ్లీ క్రియాశీలమౌతాయి. పగటి వేళ ఎక్కువ అవుతుండగా, ఆ సీతాకోక చిలుకలు సూర్య రశ్మిలో రెక్కలు రెపరెపలాడిస్తాయి, జత కట్టడం ప్రారంభిస్తాయి మరి ఉత్తర దిశకు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. కొన్ని తమ తిరుగు ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చని నమ్మబడుతోంది, అయితే సాధారణంగా కెనడా మరియు ఉత్తర అమెరికాలోని వేసవి ప్రదేశాలకు తిరిగి వచ్చేది కేవలం సంతానమే. సాధారణంగా గ్రుడ్లు, గొంగళిపురుగులు, ప్యూపాల దశలు దాటిన సీతాకోక చిలుకల మూడవ లేక నాలుగవ తరం క్రమేపి తిరిగి ఖండాన్ని చేరుకుంటుంది. ఒక సీతాకోక చిలుక—వంద లేక అంతకంటే ఎక్కువ ఫలదీకరణం చెందిన గ్రుడ్లతో బరువెక్కి—అడవి పువ్వులున్న స్థలాలన్నిటి పైనా తిరుగాడుతుంది, మెత్తగా ఉండే మిల్క్‌వీడ్ యొక్క లేత ఆకుల వెనక భాగాన తన గుడ్లను ఒక్కొక్కటి చొప్పున పెడుతుంది. అలా ఆ చక్రం కొనసాగుతుంది, మరి మోనార్క్ యొక్క వేసవి గృహానికి ప్రయాణం కొనసాగుతుంది.
నిజంగానే, మోనార్క్ చాలా ఆసక్తికరమైన జీవి. దాని కార్యకలాపాలను గమనించి వాటిని అధ్యయనం చేయగల ఎంత గొప్ప ఆధిక్యత మానవులకు ఉంది. ఎంతో కాలం ఒక రహస్యంగా ఉండిపోయిన మోనార్క్ యొక్క మెక్సికోలోని శీతాకాల ప్రాంతాలు అలాగే కాలిఫోర్నియాలోని గమ్య స్థానాలు మానవ సంస్థల ద్వారా ప్రమాదానికి గురౌతున్నాయంటే అందులో ఆశ్చర్యం లేదు. సృష్టి యొక్క ఈ సున్నితమైన అందాలరాశులు మరెక్కడికో వెళ్లిపోవాలని అపేక్షించడం అవి అంతరించి పోయేందుకు దారితీస్తుంది. వాటికి అలాంటి దుస్థితి పట్టకుండా వాటిని కాపాడేందుకు ప్రయత్నాలు జరగడం ఎంతో ప్రశంసనీయం. సృష్టికర్త వాగ్దానం చేసిన, త్వరలో రానైయున్న పరదైసు భూమిలో, నాజూకైనవే కానీ సాహసికులైన ఈ ప్రయాణికులకు ఒక సురక్షితమైన స్థావరం లభించినప్పుడు అదెంత గొప్పగా ఉంటుందో కదా!
[Picture Credit Line on page 15]
Butterfly: Parks Canada/J. N. Flynn
[Picture Credit Lines on page 17]
Page 16 top and bottom: Parks Canada/J. N. Flynn; middle: Parks Canada/D. A. Wilkes; page 17 top: Parks Canada/J. N. Flynn; middle and bottom: Parks Canada/J. R. Graham