ఆరోగ్యకరమైన ఆహారం మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచగలదు
చక్కగా పోషించబడిన బిడ్డను చూడడం ఎంత సంతోషకరమో! అయితే, బిడ్డ ఆకస్మికంగా ఆరోగ్యంగా ఉండదు. “మా ఇంట్లో ఎల్లప్పుడూ సామాన్యమైనదైనా, పౌష్టికాహారానికి ఆర్థిక బడ్జెట్లో మాత్రమే కాక, దాన్ని తయారు చేసి, కలిసి ఆరగించే సమయాన్ని కేటాయించే విషయంలోను దానికి ప్రాముఖ్యత ఇవ్వబడేది,” అని కాట్ అనే బ్రెజిల్లో నివసిస్తున్న కెనడా దేశస్థురాలు గుర్తుచేసుకుంటుంది. “మా అమ్మ బయట ఉద్యోగం చేసేది కాదు గనుక, మేము ప్రతి రోజు పాఠశాల నుండి వచ్చేసరికి తయారవుతున్న రాత్రి భోజనపు కమ్మని సువాసననో, అమ్మ తయారు చేసిన పిండి వంట లేదా బేక్ చేసిన బ్రెడ్డు యొక్క కమ్మని సువాసననో ఆఘ్రాణిస్తూ ఇంట్లో అడుగుపెట్టేవాళ్ళము.”
అయితే, ఆరోగ్యకరమైన ఆహారంతో పోషించబడేబదులు, ది ఎకానమిస్ట్ ప్రకారం “పేద దేశాల్లోని దాదాపు 78 కోట్ల మంది, అంటే జనాబాలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి తినడానికి కావలసినంత లభించడం లేదు.” “దాదాపు రెండు అరబ్ల (200 కోట్ల) మంది ప్రజలకు కడుపు నింపుకోడానికి సరిపడా ఆహారం దొరుకుతున్నప్పటికీ, వారికి అవసరమైన విటమిన్లు గాని, ఖనిజాలు గాని లభించడం లేదు.” సరైన పోషణ లేనివాడు బలహీనుడౌతాడని మాత్రమే కాదు, అతడు ఇతరులకు మేలు చేయలేడు కూడా. కాబట్టి, సరైన పోషణ లేని పిల్లలను గూర్చి బ్రెజిల్నందలి సావో పౌలో విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్రజ్ఞుడు ఎడ్వార్డో జానెట్టే డా ఫోన్సెకా ఈ విధంగా చెప్పినట్లు నివేదించబడింది: “ఇది [మానవ వనరులు వృథా అవడం] మరి దేనికన్నా ఎంతో హీనము. . . . ఈ పిల్లల్లో పేదరికం వలన నైపుణ్యాలు, సామర్థ్యాలు మరుగున పడిపోతున్నాయని నేను నమ్ముతున్నాను. అలాంటి వారిలో నుండి విభిన్న పరిస్థితుల్లో ఓ ఆల్బర్ట్ ఐన్స్టీన్ రావచ్చు.” వేజా అనే పత్రిక చెప్పేదేమంటే: “సరైన పోషణ లేనందువల్ల ఈ దేశం కండబలాన్ని నష్టపోతోంది, మరియు తెలివి తేటల, సృజనాత్మకత మరియు శక్తుల నిక్షేపాన్ని వ్యయం చేస్తుంది.” కాబట్టి, జీవన వ్యయం అధికంగా ఉన్నప్పటికీ, బుద్ధిగల తల్లిదండ్రులు మంచి పోషకాహారానికి ఖర్చు చేయడం ద్వారా తమ పిల్లలకు సరైన పునాదిని వేస్తారు.
జ్ఞానపూర్వకమైన పెట్టుబడి
“పెట్టుబడి పెట్టడం” అంటే “భవిష్యత్తు లాభాల కొరకు లేదా ప్రయోజనాల కొరకు ఉపయోగించుకోవడం” అని అర్థం. పోషకాహారంలో మీరెలా పెట్టుబడి పెట్టగలరు? అవసరమైతే మీరు విలాసాలను లేదా హోదాను చూపించే వస్తువులను వదిలిపెట్టి, మరి మీ పరిమిత బడ్జెట్ను ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహార పదార్థాలను కొనడానికి ఉపయోగిస్తారా?
“జన్మించే సమయమున ఇంద్రియములను ఆకస్మికంగా మేలుకొలిపే వరకు అవి నిష్క్రియంగా ఉండవు; రుజువులు చెప్పేదేమంటే, జన్మించక ముందే ఇంద్రియ వ్యవస్థలు పని చేయనారంభిస్తాయి,” అని ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెబుతుంది. అలా, తల్లి బాగా పోషించబడడమే బిడ్డను పోషించనారంభించడానికి ఆదర్శ మార్గము.” రెండవ మెట్టు—పుట్టిన తర్వాత—శిశువు తల్లి పాలు త్రాగడం, ఎందుకంటే తల్లి పాలు సంపూర్ణాహారమే కాక, సాధారణ రోగాలనుండి రక్షణనిస్తుంది కూడా. ఫ్యాక్ట్స్ ఫర్ లైఫ్ అనే ఐక్యరాజ్య సమితి ప్రచురణ ఈ విధంగా చెబుతుంది: “బిడ్డ జీవితంలోని మొదటి కొన్ని నెలల్లో, తల్లిపాలు మాత్రమే అతి శ్రేష్ఠమైన ఆహారము, పానీయము. వారికి నాలుగు నుండి ఆరు నెలల వయస్సున్నప్పుడు తల్లిపాలే కాకుండా మరితర ఆహార పదార్థాలు కూడా అవసరము.”
గమనార్హమైన మానవ శరీర వ్యాధి నిరోధక శక్తిని తేలిగ్గా తీసుకోలేము. జీవిత తొలి దశలోనే ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారంతో దానిని వృద్ధి చేసుకోవడం ప్రాముఖ్యము. ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా ఇలా చెబుతుంది: “ఒక వ్యక్తికి 6 ఏండ్ల వయస్సు వచ్చేసరికి, మెదడు దాని పూర్తి పరిమాణానికి అంటే దాదాపు 3 పౌండ్ల (1.4 కిలోగ్రాముల)కు చేరుకుంటుంది. మెదడు కణాల్లో దాదాపు అన్నీ జన్మించేటప్పుడే ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుదల అనేది ముఖ్యంగా కణాల పెరుగుదల వల్ల జరుగుతుంది. ఒక వ్యక్తి ఈ ఆరేండ్ల వ్యవధిలోనే క్రొత్త ప్రవర్తనా మాదిరులను జీవితంలో మరెన్నటికన్నా అతి వేగంగా నేర్చుకుంటాడు, స్వంతం చేసుకుంటాడు.” కాబట్టి, ఒక బిడ్డ ఆరేండ్లు నిండిన తర్వాత మంచి ఆహారాన్ని భుజిస్తున్నట్లయితే, మెదడు కణాలు కొన్ని మాత్రమే వృద్ధిచెందుతాయి. కేట్ ఈ విధంగా అభిప్రాయపడుతున్నాడు: “తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వగల మహా గొప్ప బహుమతులలో ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాహారం ఒకటి.” జీవితావసరాలు అని పిలువబడే వాటిలో తరచూ విలాసాలు మాత్రమైన అనేక వస్తువులను ఇవ్వలేకపోయినా, తమ పిల్లల మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి పెట్టుబడి పెట్టే తల్లిదండ్రులు శైశవం నుండే వారి జీవితాల్లో సాటిలేని ఆరంభాన్నిస్తున్నారు.”
వివిధ రకాల ఆహార పదార్థాలను ఎందుకు భుజించాలి?
శారీరకంగాను, మానసికంగాను ఎదగాలంటే కావలసినన్ని మాంసకృత్తులు గల ఆహారం బిడ్డకు అవసరం. సరైన పోషకాహారం లేకపోవడం బిడ్డ పాఠశాలలో మానసిక ఎదుగుదలను మందగింపజేస్తుంది మరియు బిడ్డ ఉదాసీనంగాను, నీరసంగాను అయ్యి, నేర్పించబడుతున్న వాటిపై శ్రద్ధ నిలపలేక పోతుంది లేదా గుర్తుంచుకోలేక పోతుంది. ప్రాథమిక పోషకాహార పదార్థాల్లో—మాంసకృత్తులు, విటమిన్లు, ఆవశ్యకమైన క్రొవ్వు పదార్థాలు—లేదా పోషక మూల పదార్థాల్లో ఒక్కటి కొరవడడం వలన కనీసం 25 విభిన్న కుపోషణ వ్యాధులు వస్తాయి.
జ్వేయాకిన్ విషయం పరికించండి. ఆయన ఈ విధంగా చెబుతున్నాడు, “మాది పేద కుటుంబం, కాని మాకు భూమి ఉండేది, మేము తినే దాదాపు ప్రతి ఒక్కదాన్ని పండించుకునే వాళ్ళం. ప్రతి భోజనంలో మొక్కజొన్న మరియు రై అనే కాయ ధాన్యములతో తయారు చేసిన బ్రెడ్డు ఉండేది, అది మంచి పోషణకు తోడ్పడింది. మా అమ్మ దాదాపు ప్రతి రోజు చిక్కుడు కాయలతో సహా రకరకాల కూరగాయలతో సూపు తయారు చేసేది, ఇది మా పోషకాహార అవసరతలను తీర్చేది. మాకు మాంసం కూర ఎక్కువ ఉండేది కాదు గాని, ఎక్కువగా సార్డయిన్లు, కాడ్, హెర్రింగ్ వంటి చేపలను తినేవాళ్ళం.” అతడింకా ఇలా చెబుతున్నాడు: “మా అమ్మకు మేము అయిదుగురు పిల్లలం, మాకెవ్వరికి జలుబు, ఫ్లూ జ్వరము తప్ప మరే విధమైన రోగాలు వచ్చినట్లు నాకు గుర్తులేదు. సమతుల్యమైన మా ఆహారమే మా ఆరోగ్యానికి కారణమని నేననుకుంటాను.” ఏడుగురు పిల్లల తల్లి ఈ విధంగా చెబుతుంది: “మాకు పోషకాహారం తక్కువ ధరలో కావాలి. కాబట్టి మేము కూరగాయల తోటను వేశాము, అది చిన్నదే అయినప్పటికీ, మా అవసరాలకు తగినన్ని కాసేవి.” ఆమె ఇంకా ఇలా చెబుతుంది: “మా పిల్లలకు ఎన్నడూ తీవ్రమైన జబ్బులు కలుగలేదు మరి వారు తమ పాఠశాల పనుల్లో ఎల్లప్పుడూ సఫలులే.”
అధికారికంగా గుర్తించబడిన 103 రసాయన పదార్థాల్లో 22 పోషక పదార్థాలు మీ శరీరానికి అవసరం. మీకు వ్యక్తిగతంగా కావలసిన విటమిన్ల, ఖనిజాల, మాంసకృత్తుల కచ్చితమైన పరిమాణాన్ని నిర్ణయించడం అసాధ్యమైనప్పటికీ, మంచి సమతుల్యమైన ఆహారం మీ అవసరాలను తీరుస్తుంది. ఒక పుస్తకం ఇలా చెబుతుంది: “మంచి ఆహారానికి కీలకము ఏమంటే ప్రతి విధమైన పోషక పదార్థం గల విభిన్న ఆహార పదార్థాలను భుజించడమే.”
మీ పిల్లలు చేదైన కూరగాయల వంటి కొన్ని ఆహార పదార్థాలను ఇష్టపడనప్పటి మాటేమిటి? ఒక అనుభవజ్ఞుడైన వంటవాని అభిప్రాయం ప్రకారం, తల్లిదండ్రులు “తమ ప్రాంతంలో లభ్యమవుతున్న కూరగాయలన్నింటిని తమ పిల్లలకు ఇవ్వాలి. అనేకమంది పెద్దవారు కూడా కూరగాయలను తినరు, ఎందుకంటే వారు పిల్లలుగా ఉన్నప్పుడు వారికి అవేమీ పెట్టబడలేదు. కూరగాయలు నారను అలాగే మనకు అవసరమైన అనేక విటమిన్లను ఇస్తాయి, వాటి ఖరీదు కూడా తక్కువే గనుక, తల్లిదండ్రులు తమ పిల్లలకు వాటినెల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.” బహుశా కమ్మని పిండి వంటలను లేదా కలగూర వంటలను చేసేందుకు తాజా కూరగాయలను, పండ్లను చక్కగా ఉపయోగించుకునేలా కొత్త వంటకాలను ఎందుకు నేర్చుకోకూడదు? స్వల్ప పోషకాలు గల కేలరీల గూర్చి ఆయన ఇలా సలహా ఇస్తున్నాడు: “తల్లిదండ్రులు ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఇంట్లో తీపి పదార్థాలను ఉంచకూడదు. [పిల్లలు] అవి దగ్గర లేకపోతే, వాటిని వాళ్ళు తినరు.”
కావలసినంత సరైన ఆహారాన్ని భుజించడం కుపోషణ వలన కలిగే అపాయాన్ని తగ్గిస్తున్నప్పటికీ, కొందరు ప్రజలు అమితంగా తినడం ద్వారా సమస్యలను సృష్టించుకుంటారు. శరీరావసరాలకు మించిన కేలరీలను తీసుకోవడం స్థూలకాయులవ్వడానికి దారి తీయవచ్చు. దానితోపాటు మధుమేహం మరియు హృద్రోగం కూడా వస్తాయి.a మందులు గాని లేదా శారీరక అభ్యాసం గాని సరైన ఆహార అలవాట్లకు ప్రత్యామ్నాయాలు కావు గనుక, క్రొవ్వు, తీపి, ఉప్పు మరియు మద్యం సేవించడాన్ని తగ్గించుకోవాలని మంచి సలహా. సర్వసంగ్రహ నిఘంటువు కూడా చెప్పేదేమంటే, “ఆకలి, ఒంటరితనం, కృంగుదల, విసుగుదల, కోపం, అలసట వంటి మళ్ళీ మళ్ళీ అమితంగా తినడానికి ప్రేరేపించగల ప్రతిదాన్ని తగ్గించడానికి చర్యలను గైకొనాలి.”
ఆహారము మరియు ఆరోగ్యములను గూర్చిన సమతుల్య దృష్టి
బైబిలు పోషకాహారాన్ని గూర్చిన పుస్తకం కాదు; అయినప్పటికీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో సమతుల్యత కలిగి ఉండడానికి అది మనకు సహాయం చేస్తుంది. అపొస్తలుడైన పౌలు “కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని” ఇతరులను ఆజ్ఞాపించే వారిని గూర్చి హెచ్చరించాడు. (1 తిమోతి 4:3) మనం సంతృప్తిగా ఉండాలని, లభ్యమయ్యేవాటిని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. “నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.”—సామెతలు 15:16.
నేడు ఎవరూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించడంలేదు. నిర్లక్ష్యంగాను, అమిత ఆతురత గలవారముగాను ఉండకుండా, ఎందుకు సహేతుకంగా ఉండకూడదు? పోషకాహారంలోనైనా లేదా ఆరోగ్య విషయాల్లోనైనా అమితమైన లేక తీవ్రమైన ఆసక్తి మన సమతుల్యతను మనం కోల్పోయేలా చేయగలదు.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల వలన చివరికి మనం వృద్ధులమై చనిపోతాం. అయితే సంతోషకరంగా, దేవుని రాజ్యం కుపోషణను మరియు వ్యాధిని అంతం చేస్తుందని బైబిలు హామీ ఇస్తుంది. కరవును తీసివేయాలనే మానవ పథకాలు విఫలమైనప్పటికీ, మనందరి కొరకు కావలసినంత పోషకాహారం ఉండే లోకం కొరకు మనం ఎదురు చూడగలం.—కీర్తనలు 72:16; 85:12.
[అధస్సూచీలు]
a “మీ ఎత్తు, శరీర నిర్మాణం, వయస్సుకు . . . ‘సరిపడేంత’ బరువుకన్నా 20 శాతం ఎక్కువైతే, మీరు స్థూలకాయులని కొందరు నిపుణులు భావిస్తారు.”—ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఫ్యామిలీ మెడికల్ గైడ్, పుట 501. అలాగే మే 8, 1994లోని తేజరిల్లు! (ఆంగ్లం), “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేనెలా బరువు తగ్గించుకోగలను?” మరియు మే 22, 1989 (ఆంగ్లం), “బరువు తగ్గించుకోవడం నిష్ఫల యుద్ధమా?” అనే శీర్షికలను చూడండి.
[7వ పేజీలోని బాక్సు]
మీ బిడ్డ మంచి ఆహార అలవాట్లను కలిగి ఉండడానికి సహాయపడే సలహాలు
▫ మంచి మాదిరినుంచండి.
▫ పిల్లలు కావాలనుకునే వాటిని మాత్రమే తినడానికి వారిని అనుమతించకండి.
▫ ఇంట్లో పోషక విలువలు లేని ఆహార పదార్థాలను గాని తీపి పదార్థాలను గాని ఉంచకండి.
▫ విభిన్న ఆహార పదార్థాల విలువను గ్రహించడానికి పిల్లలకు తర్ఫీదునివ్వండి.
▫ ప్రాతఃకాల అల్పాహారంతో పాటు, భోజనానికి సమయాన్ని నిర్ణయించండి.
▫ మీరు ఏమి తింటున్నారనే దానిని టి.వి. ప్రకటనలు ప్రభావితం చేయడానికి అనుమతించకండి.
▫ రెఫ్రరెజిరేటర్ నుండి స్వయంగా ఆహారాన్ని తీసుకోడానికి పిల్లలను అనుమతించకండి.
▫ ఆహారాన్ని తయారు చేయడంలో సహాయపడేందుకు పిల్లలకు తర్ఫీదునివ్వండి.
▫ ప్రతి దిన ఆహారానికి కృతజ్ఞతాభావాన్ని పెంపొందింపజేయండి.