తపాలాబిళ్ళల సేకరణ—మనస్సునాకట్టుకునే అలవాటు, పెద్ద వ్యాపారం
బ్రిటన్‌లోని తేజరిల్లు! ప్రతినిధి చెప్పింది
తపాలాబిళ్ళలసేకరణ, లేదా పోస్టేజ్బిళ్ళలను సేకరించటం, “ప్రపంచంలో గొప్ప సరదాగా” చెప్పబడుతుంది. బ్రిటీష్ తపాలా సంస్కర్తయైన సర్ రోలాండ్ హిల్ (1795-1879) చెప్పిన ప్రకారంగా మొదటి తపాలాబిళ్ళలు కేవలం ‘చిన్న కాగితాల ముక్కల వెనుకభాగాన జిగట పదార్థం అంటించబడి ఉంటుంది, ఉపయోగించే వ్యక్తి దానికి కొద్దిగా తడి పెట్టి, ఉత్తరం పై భాగాన అంటిస్తాడు.’ ఆయన ‘చిన్న కాగితాల ముక్కలు’ అని పిలవబడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా సమాచార విభాగాన్ని మార్చివేసిన ఆవిష్కరణగా ప్రశంసించబడుతున్నాయి.
సేకరించే వ్యక్తులకు మరియు వర్తకులకు, తపాలాబిళ్ళల విలువ దాదాపు శూన్యంనుండి కోటాను కోట్ల డాలర్ల వరకు ఉంటుంది. పోస్టేజ్బిళ్ళలు అంత సర్వసాధారణమైనవైనప్పుడు యిదెలా సాధ్యము? మరి వాటికి ఏది ఆకర్షణను, విలువను యిస్తుంది?
అపూర్వమైన పెన్నీ బ్లాక్
ముందుగా రూకలు కట్టడాన్ని సూచించే, చేతితో చేసిన మొదటి తపాలాబిళ్ళలను వ్యాపారియైన విలియమ్ డొకావ్రా కనుగొన్నాడు, ఆయన 1680లో లండన్ పెన్నీ పోస్టును ప్రారంభించాడు. ఈ బట్వాడా యివ్వబడే యింట్లో ఒక త్రికోణంలో మరో త్రికోణంవున్నగుర్తును ముద్రిస్తూ దానిపై పెన్నీ పోస్టు పెయిడ్ అని లిఖించటం జరుగుతుంది, అంటే యిప్పుడు అది డొకావ్రాయొక్క వార్తాహరులకు పంపబడటానికి సిద్ధంగా ఉందన్నమాట. అయితే యితర వార్తాహరులు, కూలీలు యీపద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించారు, ఎందుకంటే వాళ్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వాళ్లు భావించారు. ప్రభుత్వ తపాలాకార్యాలయంకూడ డొకావ్రా తపాలాను చూసి అది వారి గుత్తాధిపత్యాన్ని ఉల్లంఘించడంగా భావించారు.
ఇది 19వ శతాబ్దంలోని తొలిదశవరకు కూడ పెన్నీ పొస్టేజిని దేశమంతటా అందుబాటులో ఉండేలా చేయడంలో తపాలా సంస్కరణలు విజయవంతం కాలేదు. మే 1840లో అంటించే మొదటి పోస్టేజ్బిళ్ళ బ్రిటన్‌లో అమ్మబడి, త్వరలోనే పెన్నీ బ్లాక్‌గా ప్రసిద్ధి చెందింది. (చిత్రాన్ని చూడండి.) దానికి రంధ్రాలుండేవి కావు, ప్రతి తపాలాబిళ్ళ పెద్ద షీటునుండి కత్తిరించుకోవలసి ఉండేది.
బ్రిటన్ తర్వాత, బ్రెజిల్ అంటించే తపాలాబిళ్ళలను దేశమంతటా చట్టబద్ధమైన రీతిలో ఉపయోగించే విధంగా 1843లో ఏర్పాటు చేసింది. క్రమేణా యితర దేశాలుకూడా దానిని దేశాంతర తపాలాకొరకు ఉపయోగించడాన్ని ప్రారంభించాయి. తర్వాత, సముద్రాంతర బట్వాడాను సుగమంచేయటానికి, ఒక ప్రపంచవ్యాప్త తపాలా సంఘం రూపొందించబడింది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండునందలి బ్రెన్లోగల ప్రపంచ తపాలా సంఘం, నేడు ఐక్యరాజ్యసమితికి ఒక ప్రత్యేక ఏజన్సీగా పనిచేస్తుంది.
సేకరింపులు ఒక కథను చెబుతాయి
అంతర్జాతీయ సమాచార మాధ్యమాలు వృద్ధి అవుతున్న కొలది, ప్రతి దేశంకూడా విభిన్నమైన తపాలాబిళ్ళలను రూపొందించి, ముద్రిస్తున్నాయి. కొన్ని, స్మారకాలు అని పిలువబడేవి విశేషమైన సంగతులను మరియు వ్యక్తులను వివరిస్తాయి; వేరేవి, నిర్వచనాత్మకమైనవి అని పిలువబడేవి, వేరువేరు తపాలా అవసరతలను తీర్చడానికి విభిన్న విలువలతో క్రమంగా ఉపయోగించడానికి చక్కగా ఏర్పర్చబడ్డాయి. అనేక సంవత్సరాలుగా 600 తపాలా వ్యవస్థలు కలిసి ప్రతి సంవత్సరం అంచనా వేయబడిన 10,000 క్రొత్త తపాలాబిళ్ళలను విడుదల చేశాయి. తపాలాబిళ్ళలను ఆసక్తితో పఠించేవాడు (తపాలాబిళ్ళలను సేకరించేవ్యక్తి) మరియు ఏదో సరదాకోసం తపాలాబిళ్ళలను సేకరించడంలో ఆనందించే వ్యక్తికూడ అంటే యిరువురుకూడా యిప్పటి వరకు విడుదల చేయబడిన రెండు వందల యాభై లక్షల వివిధ తపాలాబిళ్ళలలో తమ అభిరుచులకు తగినదేదో కనుగొనవచ్చు!
స్పష్టంగా, పరిమాణంలోను మరియు వైవిధ్యంలోను వివిధ రకాల తపాలాబిళ్ళలు ఉన్నందున, సేకరించే ఏ ఒక్క వ్యక్తికూడ విడుదల చేయబడిన ప్రతి తపాలాబిళ్ళయొక్క ఒక కాపీని తన సొంతంగా కలిగివుండగలడని ఎదురుచూడలేము. దానికి బదులుగా, చాలామంది అంశాలవారిగా తపాలాబిళ్ళలను సేకరించటాన్ని ఎంపిక చేసుకొంటారు. అంటార్కిటికా, అగ్ని, ఒలంపిక్ క్రీడలు, ఐరోపా, ఐక్యరాజ్యసమితి, క్రీడలు, గుహలు, జంతువులు, తపాలా సేవలు, దేశం, పరిశ్రమ, పక్షులు, పుట్టగొడుగులు, పువ్వులు, ఫోటోగ్రఫీ, బైబిలు, బొగ్గు, భ్రమరాలు, భూగర్భశాస్త్రం, మతం, మందులు, రవాణా, రెడ్‌క్రాస్, వంతెనలు, వ్యవసాయం, వ్యవహారిక భాష, వాతావరణం, విమానాలు, విశ్వం, సంగీతం, సినిమా, శక్తి, యివన్నీ సేకరణాంశాలే. మనం ఊహించగలిగిన అన్ని అంశాలపై తపాలాబిళ్ళలున్నాయి.
మరి కొంతమంది విభిన్నమైన తపాలాబిళ్ళలను సేకరించటంలో శ్రద్ధను కేంద్రీకరిస్తారు. అయితే యిందులో యిమిడి ఉన్నది ఏమిటి? మళ్లీ ఒకసారి పెన్నీ బ్లాక్‌ను పరిశీలించి చూడండి. తపాలాబిళ్ళ అడుగు భాగాన ముద్రితమైన అక్షరాలను మీరు గమనించారా? ప్రాథమికంగా, ఒక్కొక్క వరుసలో 12 ఉండే 20 సమతల వరుసలలో అమర్చబడిన 240 తపాలాబిళ్ళలు ఒకే షీటపై ముద్రించబడతాయి. మొదటి వరుసలోని మొదటి తపాలాబిళ్ళ అక్షరాలు ఎఎ; వరుసలోని చివరి అక్షరాలు, ఎఎల్, అదేమాదిరిగా అక్షరమాల ప్రకారంగా, 20వ వరుస ప్రారంభంలో టిఎ అనే అక్షరాలు వరుస చివరన టిఎల్ అనే అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలను ప్లేట్మెకింగ్ అంతిమ దశల్లో, వీటి నమూనాయొక్క మూలల్లో అక్షరాలను చేతితో ముద్రిస్తారు. తాను తీసుకువెళ్లే అనేక ఉత్తరాలపైనుండే తపాలాబిళ్ళలు రెండూ ఒకే మాదిరి అక్షరాలను కలిగివుంటే, తపాలా కార్యాలయ ఉద్యోగి ఆ తపాలాబిళ్ళలు దొంగముద్రలని సంశయించవచ్చు.
అంచనా ప్రకారం 6 కోట్ల 80 లక్షలకంటె ఎక్కువ పెన్నీ బ్లాక్ తపాలాబిళ్ళలను విడుదల చేసినప్పటికీ, యీనాడు సేకరణాదారుని వద్దవున్న ఉపయోగించని తపాలాబిళ్ళలు అరుదైనవి మరియు విలువైనవి అంటే వాటి విలువ 4,200 డాలర్లనుండి 6,800 డాలర్లవరకు వుంటుంది.
వీటి నమూనాల్లో సూక్ష్మమైన వ్యత్యాసాలుండడమేకాదు, వివిధ పలకలపై ముద్రించిన తపాలాబిళ్ళలు, కాగితంపై వివిధమైన నీటిగుర్తులు గలవి (కాగితంపై రంగులతో నమూనా గీసినవి, వాటిని వెలుతురుకు పెట్టిచూస్తే కనిపించేలా ఉంటాయి) భిన్నమైన సంఖ్యలలో రంధ్రాలు గలవికూడా. (వాటి చివర్లలో రంధ్రాలు) యివన్నికూడ నైపుణ్యంగల సేకరణాదార్లకు ఆసక్తిని రేకేత్తిస్తాయి. దానిలో విజయవంతం కావాలంటే, అలాంటి నిపుణులకు చిమటాలు, ఆకారవృద్ధి చేసే అద్దాలు మాత్రం సరిపోవు. (మీ చేతి వ్రేళ్లు ఎన్నడూ ఉపయోగించకూడదు!) కొలమానంద్వారా యీ రంధ్రాల్లోని వ్యత్యాసాన్ని కనిపెడతారు; అతినీలలోహిత దీపాలు పాడైపోయిన భాగాన్ని, దానిలో దాగివున్న దీప్తిమంతాన్ని, యితర అతి సూక్ష్మ వివరాలను తెలియజేస్తాయి.
కొంతమంది సేకరణాదారులు తపాలాబిళ్ళలోని నమూనాలో, దానిని ముద్రించిన విధానంలోవున్న తప్పులను కనిపెట్టడంలో ఆసక్తిని చూపుతారు. ఇతర సేకరణాదార్లు తప్పిపోయిన దాన్ని తాము పొందడమే వాళ్లకు ప్రాముఖ్యమైన విషయము. వాటి విలువలలోవున్న వ్యత్యాసాన్ని గమనించండి. పందొమ్మిది వందల తొంభైలోవేసిన అంచనాల ప్రకారం, ఎ అనే అక్షరం లేకుండా ముద్రించబడిన 1841వ సంవత్సరపు పెన్నీ రెడ్, అంటే షీటు యొక్క రెండవ వరుసలోని మొదటి తపాలాబిళ్ళపైనున్న పొరపాటువల్ల, దాని విలువ అటువంటి తప్పు లేకుండా ఉన్నదానికన్నాకూడ దాదాపు 1,300 రెట్లు ఎక్కువ.
తపాలాబిళ్ళలు ఒక పెద్ద వ్యాపారం
ఈ రోజుల్లో తపాలాబిళ్ళలను సేకరించటమనే సరదా విభిన్నమైన పెట్టుబడిదార్లను ఆకర్షిస్తుంది. నిర్ణీత కాలంలో వాటి విలువ పెరుగుతుందని డీలర్లు విశ్వసించిన అరుదైన, విశేషమైన తపాలాబిళ్ళల రేఖాచిత్రాలను ఒక నిజమైన పెట్టుబడిదారుడు కొంటాడు. పెట్టుబడి కాలవ్యవధి ముగిసినప్పుడు, వాటి డీలరు తన క్లయింటుయొక్క తపాలాబిళ్ళలను వీలైనంత ఎక్కువ ధరకు అమ్మకం చేస్తాడు. “చిన్నగావుండి, సుస్పష్టమైన తపాలాగుర్తులు గలవాటిని తపాలాబిళ్ళలుగా ఉపయోగించటానికి ఆవశ్యకం—విశేషమైన లేక అసాధారణమైన తపాలాగుర్తులతోవున్న అత్యంత సాధారణమైన తపాలాబిళ్ళలను పోల్చి చూస్తే తరచూ అరుదుగానే ఉంటాయి. తపాలాబిళ్ళయొక్క స్థితిని దాని విలువను నిర్ణయించడం చాలా అవసరం,” అని తపాలాధికారియైన జేమ్స్ వాట్సన్ రాస్తున్నారు.
లండన్ డైలీ మెయిల్ 1979లో “గత అయిదు సంవత్సరాల్లో, విలువైన తపాలాబిళ్ళలు (అంటే 1840 నుండి 1870 వరకున్నవి) ఆస్తిలో భాగంకన్నకూడా ఎక్కువగా ప్రశంసింపబడుతూ, అనేక సందర్భాల్లో యితర విధాలైన పెట్టుబడులకన్నా, యింటి ఖరీదు కంటేకూడ ఎక్కువ విలువైనవిగా ఉన్నాయి” అని నివేదించింది. అరుదైన ఏడు తపాలాబిళ్ళలయొక్క రేఖా చిత్రాల మూల్యం 1974లో, 84,700 డాలర్లుగావుండి వాటి విలువ 306,000 డాలర్లుగా పెరిగిపోయింది.
టైమ్ ఇంటర్నేషనల్ ప్రకటన 1990లో యిలా నివేదించింది: “తపాలాబిళ్ళల పెట్టుబడి విలువలు ఎంతగానో మారాయి. అరుదైన తపాలాబిళ్ళలనుండి లాభం పొందాలనుకున్న సట్టావ్యాపారులు పెట్టుబడి రేఖాచిత్రాలు పెంచుతుండగా, 1970లో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే 1980లో లండన్‌నందు ప్రపంచ తపాలాబిళ్ళల ప్రదర్శనలో, వాళ్ల ఆశలన్నీకూడ అడియాశలై పోయాయి, మార్కెట్టుకు మద్దతు యిచ్చేవారు కేవలం సేకరణాదారులేనని సట్టావ్యాపారులు అనుకున్నారు కాని వారు, తెలివిగా విరమించుకొన్నారు. ‘పెట్టుబడిదార్లు వాళ్ల రేఖాచిత్రాలను అమ్మి డబ్బు చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, చాలా తపాలాబిళ్ళలు తాము అనుకున్నంత అరుదైనవేమి కాదని వాళ్ళు కనుగొన్నారు,’” వాళ్లు అనుకున్నంత లాభం పొందలేకపోయారు. తపాలాబిళ్ళలపై పెట్టుబడి పెట్టేవారికి యిది ఎంత మంచి హెచ్చరికనిస్తుంది!
సేకరణదారునిగా లేదా తపాలాబిళ్ళలసేకరణ దారునిగా సమతుల్యత కలిగివుండడానికి చూడండి. మీ తపాలాబిళ్ళలయందు మీరు సంతోషించండి. వాటినుండి ప్రపంచాన్నిగూర్చి, దాని భౌగోళికాన్నిగూర్చి, ప్రజలనుగూర్చి మరియు సాంప్రదాయాలనుగూర్చి—నేర్చుకోండి. సేకరించడం ఒక వ్యసనం అవటానికి అనుమతించకండి. వాటిపైనున్న మీ ఆసక్తిని జాగ్రత్తగా తూచండి, జీవితంలో యింకా అత్యంత ప్రాముఖ్యతగల విషయాలతో వాటిని కొలవండి.
[19వ పేజీలోని చిత్రం]
పెన్నీ బ్లాక్
[20వ పేజీలోని చిత్రాలు]
ఆస్ట్రియా, బ్రిటన్ మరియు స్పెయిన్‌ల నుండి తపాలాబిళ్ళలు