ఇక ఎంతమాత్రము ఒక రాతిబండ కాదు లేదా ఒక ద్వీపము కాదు
అరవయ్యో దశకంలో వ్రాయబడిన పాటలోని ఓ చరణం యిలావుంది: ‘నేను ఒక బండను/ నేను ఒక ద్వీపాన్ని/ బండకు బాధ అనిపించదు/ద్వీపం ఎన్నడూ ఏడ్వదు.’ ఈ పాట నాకు చాల యిష్టమైంది, ఎందుకంటే నేను అలా జీవించాను కాబట్టి. ఇతరులు తాము అనుభవించామని చెప్పిన ప్రేమ, వాత్సల్యం, జాలి వంటివాటిని నేనెప్పుడుకూడా అనుభవించినట్లు నాకు జ్ఞాపకములేదు. అటువంటి భావాలు మోసపూరితమైనవని నేననుకునేవాణ్ణి, ఇతరులు అలాగే భావిస్తారని నమ్మేవాణ్ణి. పెద్దవాణ్ణి అయినాక నేనెప్పుడైనా ఏడ్చినట్టు నాకు జ్ఞాపకంలేదు. ఇప్పుడు నేను—50 సంవత్సరాల వ్యక్తిగా, క్రైస్తవ సంఘంలో పెద్దగా, నా యింట్లో ఒంటరిగా కూర్చుని, నేను చదువుతున్న ఆ పుస్తకాన్నిబట్టి వెక్కివెక్కి ఏడుస్తున్నాను. ఈ “బండ,”కు “ద్వీపాని”కి సంభవిస్తున్నది ఏమిటి?
నేను 1936లో బోస్టన్ పరిసరప్రాంతంలో జన్మించాను, మొత్తం ఎనిమిది మంది పిల్లలో నాల్గవవాణ్ణి. నా తల్లిదండ్రులు త్రాగుబోతులు. నాకు జ్ఞాపకమున్నంతవరకు ఆప్యాయత, అనురాగం, ప్రేమను వ్యక్తపర్చడంవంటి ఏ భావాలను గూర్చి మేము చర్చించలేదు. నాకు ఆరు మాసాలున్నపుడు, ఎవరో నన్ను స్నానాలతొట్టిలో పడేసి, దానికి బిరడానుకూడా పెట్టి, నీళ్లను దానిలోపలికి వదలి అలాగే వెళ్లిపోయారు. ఒక పనిమనిషి నన్ను చూసి నా ప్రాణాన్ని కాపాడింది. పిల్లవాడిగా నేను భయం, భీతి, ఆవేశం, శారీరక బాధలను మాత్రమే అనుభవించాను.
చిన్నారి శరీరమనుకోకుండా నన్ను మా నాన్న కొట్టి, తన్ని తన కోపాన్ని చూపినప్పుడు ఆయనే వీటిని నాకు నేర్పాడు. ఆ సమయంలో ఆయన చూపిన ముఖకవళికలు యాభై సంవత్సరాలు దాటిన తరువాత కూడా నాకు తరుచుగా జ్ఞప్తికి వస్తుంటాయి. నేను చెడ్డ పిల్లవాణ్ణి కాబట్టి, ఈ దెబ్బలు తగులుతూన్నాయని నా జీవితంలో చాలవరకు నేను నమ్మేవాణ్ణి, అయితే ఆయన నాపై వ్యక్తపర్చిన ప్రచండమైన కోపానికి, నా మంచిచెడ్డలకు ఏమి సంబంధంలేదని యిప్పుడు నాకు తెలిసింది.
నేను అయిదు లేక ఆరు సంవత్సరాల వయస్సులో ఉన్నపుడు, మా కుటుంబ వైద్యుడు నన్ను లైంగికంగా భంగం చేశాడు. నేను పాఠశాలకు వెళ్లటం ప్రారంభించినప్పుడు, 250,000 మంది డబ్ల్యుఎయస్పిలు (వైట్ యాంగ్ల్-స్సాంగ్ ప్రోటస్టెంట్స్)వున్న పట్టణంలో మేము ఉండేవాళ్లం, అక్కడ నేను యూదుని పిల్లవాడిగా వున్నందుకు, నా తోటి విద్యార్థులచేత తరమబడి, బాధింపబడేవాణ్ణి. ఎప్పుడైనా ఈ గుంపులో 10 లేక 12 మంది పిల్లలు నన్ను పట్టుకోగల్గినప్పుడు, వాళ్లు నా బట్టలు ఊడదీసి నన్ను కొట్టుతూ, నా బట్టలను చెట్లపైకి విసురుతుండేవాళ్లు. నా బట్టలను తీసుకోడానికి నేను నగ్నంగా చెట్లపైకి ఎక్కవలసి వచ్చేది.
నా 18వ పుట్టినరోజుకు ఒక మాసం ఉన్నదనగా, యిల్లు విడిచివెళ్లాలని నేను మిలటరీలో చేరాను. అప్పటివరకు ఎన్నడూకూడా మద్యపానాన్ని నేను రుచి చూడలేదు, అయితే వెంటనే నేను త్రాగటం మొదలుపెట్టాను, వెనువెంటనే దానికి బానిసనయ్యాను. నేను 20 సంవత్సరాలు మిలటరీలో ఉన్నాను, ఏ విధంగానైనా అప్పోసప్పో చేసి, లేదా దొంగతనమైనా చేసి మద్యం తెచ్చుకొని త్రాగేవాణ్ణి. నాకు 24 సంవత్సరాలున్నపుడు వివాహమయింది, నాకు ఒక కుమారుడున్నాడు, అయితే నా భార్య మరియు నా కుమారుడుకూడ ఒక మద్యపాని ఆదుపాజ్ఞలక్రింద—అంటే నా క్రింద—బ్రతకవలసి వచ్చింది, నేను వాళ్లిద్దరినీకూడా ఒక భారంగా మరియు అనవసరమైన ఖర్చుగా దృష్టించేవాణ్ణి.
నేను 1974లో మిలటరీనుండి రిటైరయ్యి, కొంతకాలం వ్యాపారం చేయటానికి ప్రయత్నించానుగానీ నేను దానిని త్వరలోనే విడిచిపెట్టాను. నా శరీరం మద్యాన్ని ఎంతమాత్రం సహించలేక పోతున్నందున, నేను త్రాగడం మానేశాను. ఒకటి లేక రెండు గ్లాసుల బీరు త్రాగేటప్పటికీ, నాకు అకస్మికంగా చర్మమంతా ఎర్రని దద్దుర్లు వచ్చేవి కాబట్టి నేను త్రాగడం మానేశాను. ఇపుడు నేను మాదకద్రవ్యాలకు బానిసనై—ఎక్కువగా మార్జూనా, అందుబాటులోవున్నప్పుడు యితర రకాలను తీసుకునేవాణ్ణి. ఇది నేను ఉద్యోగం చేయడానికి సాధ్యపడనియ్యలేదు. కాబట్టి, నా భార్య డోనా ఉద్యోగానికి వెళ్తే, నేను యింటిలోనే వుండి యింటి పని చేసేవాణ్ణి.
యెహోవాసాక్షులు యింటిని దర్శించారు
ఒకరోజు ప్రాతఃకాలాన నా భార్య పనికి వెళ్లటానికి బయలుదేరింది. అది ఉదయం 7:30, నేను అప్పటికే మత్తెక్కి ఉన్నాను. ఇది ఆమె కోపాన్ని రేపింది. ఆమె వెళ్తూ ముందు గుమ్మంలోంచి ఒక పోస్టర్‌ను నాపైకి విసురుతూ, యిలా అరిచింది: “వాళ్లు నిన్ను పీడించి చంపితే బాగుంటుంది.” ఆ పోస్టర్‌ను కిటికీలో నుండి కనబడునట్లుగా ఆమె దాన్ని పెట్టివుంచేది మరియు అందులో పెద్ద అక్షరాలతో యిలావుంటుంది, “యెహోవాసాక్షులు, రాకూడదు.” నేను దానిని తీసుకొని చెత్తకుండీలో వేశాను. మరుసటిరోజుననే యిద్దరు స్త్రీలు మా గుమ్మంలోనికి వచ్చారు. వాళ్లు యెహోవాసాక్షులే.
ఈ సమయానికి నేను బౌద్ధమతాన్ని నా మతంగా స్వీకరించాను. నా యూదా కాథోలిక్ తల్లిదండ్రుల వేషధారణ మూలంగా, చాలకాలం క్రిందనే నేను బైబిలును త్రోసిపుచ్చాను. నేను కొంతకాలం దేవుడ్ని గూర్చి అన్వేషించాను, ఏ దేవుడు లేడని తలంచి నా అన్వేషణను విడిచిపెట్టేశాను. నేను పరిణామాన్ని నమ్మాను, మరియు మెరుపులు మెరిసే వర్షాకాలంలో బయట నిలబడి పైకి చూస్తూ, దేవుడ్ని నాకు తోచిన ప్రతి అసహ్యమైన పేరుతో పిలుస్తూ: “నీవు ఉనికిలోవుంటే, నన్ను చావగొట్టు” అని అడగడం ద్వారా దేవుడు లేడని నేను నిరూపించానని భావించాను. నేనే దేవుడ్ని అయితే, అలా తప్పకుండా చేసివుండేవాడ్ని. ఆయన అలా చేయలేదు కాబట్టి, నేను దేవుడు లేడనే ముగింపుకు వచ్చాను. లోకనాశనాన్ని ఆపేశక్తి మానవునికి లేనందున అది తప్పక నాశనమౌతుందని ఆలోచిస్తూ, మరి నేను మత్తులోనే ఉంటూ జరగబోయే దాన్నంతటిని దూరదర్శినిలో చూడాలని నేనెదురు చూశాను.
ఇది జరిగిన తరువాత, ఆ మరుసటిరోజునే యిద్దరు స్త్రీలు వచ్చారు. నేను మత్తులో వుండి, ఏదైనా తమాషా జరగాలని ఎదురు చూస్తున్నాను. మేము అర్థరహితమైన సంభాషణను 20 నిముషాలపాటు కొనసాగించాము, ముగింపునందు 25 సెంట్లుకు ఒక చిన్న నీలి రంగు పుస్తకము అందించడం జరిగింది. నేను 20 నిముషాల తమాషాను 25 సెంట్ల వెలగలదిగా తలంచాను, అందుచేత ఆ పుస్తకాన్ని తీసుకొన్నాను, ఏ విధమైన ఆసక్తిలేకుండా దాన్ని టేబులుపైకి విసిరివేశాను.
మరుసటిరోజు ఉదయం నేను కొంతసేపటివరకు మార్జూనాను తీసుకోకుండా ఉండడంకోసం ఏదో ఒకటి చదవాలని వెదికాను. నేను ఆ నీలి రంగు చిన్న పుస్తకాన్ని చూసి, ఒక గంట లేక అంతకంటే ఎక్కువ సమయం వరకు నన్ను వినోదపరుస్తుందన్న ఆశతో దాన్ని తీసుకున్నాను. నాలుగు గంటల తరువాత నేను ఆ పుస్తకాన్ని ముగించాను, నిత్యజీవమునకు నడుపు సత్యము అనే దాని ముఖ్యాంశము తెల్పినది సత్యమేనని నేను నమ్మాను. మాదకద్రవ్యాలు మా యింట్లో ఉన్నాయి, మరి నేను చదవడం మానేస్తే మరల వాటికి బానిసనై చదివిందంతా మర్చిపోతానని నాకు తెలుసు. చివరి పేజీలో బైబిలు కేవలం ఒక డాలరుకే అందించబడుతుందని ఉంది, అందుచేత నేను ఒక డాలరును ఒక కవరులో పెట్టి, పోస్టులో పంపుతూ, దేవునితో యిలా అన్నాను—నేను జీవితములో ఎన్నడుకూడా ప్రార్థించలేదు—“దేవా, యిది మాత్రమే నేను చేయగలను, మిగిలినది మీరే చేయాలి.” దాన్ని నేను పోస్టులో పంపించాను, ఎంతో లోతుగా కదిలించబడిన దానినంతా త్రోసివేసి, మళ్లీ నేను మత్తులోపడ్డాను.
బైబిలు పోస్టులో వచ్చింది, అయితే దాన్ని ఒకప్రక్కన పెట్టేశాను. దాని తరువాత కొద్దికాలంలోనే, యిద్దరు సాక్షులు వచ్చి, నాతో బైబిలు పఠనాన్ని చేస్తామన్నారు, నేను దానికి అంగీకరించాను. పఠనాలు ఉత్సాహపూరితంగానే సాగాయి, కాని అభివృద్ధి చెందలేదు ఎందుకంటే నాకున్న తత్త్వశాస్త్రపు జ్ఞానంచేత నేను వారిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించాను. అంతేగాక వాళ్లు వెళ్లిన వెంటనే నేను మాదకద్రవ్యాలనుపయోగించేవాణ్ణి, ఆ రోజు సాధించిన అభివృద్ధి దీని మూలంగా వ్యర్థమయ్యేది.
చివరకు, ఒక సంవత్సరం తరువాత, యెహోవాసాక్షుల్లో ఒకరైన జిమ్, వచ్చి నన్ను యెహెజ్కేలు 33:9వ వచనాన్ని చదవమని చెప్పాడు. నేను యిలా చదివాను: “ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరికచేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు.” ఆయన దాని అర్థం ఏమిటని నేను భావిస్తున్నానని నన్ను అడిగాడు. “నేను చనిపోబోతున్నాను, మీరు మళ్లీ రారని దాని అర్థం,” అని నేను సమాధానమిచ్చాను. “కచ్చితముగా అదే,” అని ఆయన చెప్పి వెళ్లిపోయాడు.
ఆ సాక్షి తిరిగివచ్చుట
నేను నా మనస్సాక్షిని చాలా కాలం క్రితమే చంపేశానని విశ్వసించాను గనుక నాకు యింకా మనస్సాక్షి ఉందని కనుగొన్నానని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. బైబిలులో నేను కనుగొన్న భవిష్యత్తు పట్ల నాకు కొంత ఆశ కల్గింది. గనుక నేను మాదకద్రవ్యాలును విడిచిపెట్టే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. కొన్ని వారాలు నాకు నేనే ప్రయత్నించి విఫలుడనైనాను. ఒక సాయంత్రం నా భార్య, సాక్షియైన జిమ్‌ను సూచిస్తూ “ఆ స్నేహితున్ని,” పిలువమని సలహానిచ్చింది. ఆయన మళ్లీ తిరిగి రానని చెప్పాడని, అంతేకాక ఆయన ఫోను నెంబరుకూడా నా దగ్గరలేదని నేను ఆమెతో చెప్పాను. నేను పూర్తిగా నిరాశచెందాను.
ఆ మరుసటిరోజునే, మా యింటి ముందు గుమ్మంలో జిమ్ యొక్క నెంబరును వ్రాసి వదలిపెట్టిన కావలికోటను మేము చూశాము. ఆయన భార్య “ఏ ప్రత్యేక కారణం లేకుండానే” దానిని అక్కడ విడిచిపెట్టింది. నేను ఆయనకు ఫోను చేసి, నా మద్యపాన వ్యవసనాన్నిగూర్చి మాదకద్రవ్యాల సమస్యనుగూర్చి ఒప్పుకొని, ఆయన నాకు సహాయము చేయగలడేమో అడిగాను. నేను మాదకద్రవ్యాలను వాడడం మానేస్తే, ఆయన వచ్చి ప్రతిరోజు నాతో పఠనం చేస్తానని చెప్పాడు.
రాత్రింబవళ్లు గడిచిపోయే రీతిగా పట్టుదలతో కూడిన పఠనం కొనసాగింది. ఆయన ప్రతిరోజు నాతో పఠనం చేయటమేకాక యితర బైబిలు పఠన పుస్తకాలను, కావలికోట శీర్షికలనుకూడా యిచ్చేవాడు. నేను కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాణ్ణి—యిది త్రాగుబోతులకు ఉన్న సాధారణమైన సమస్యే—మిగిలిన నా సమయమంతాకూడా బైబిలు పఠనానికే అంకితం చేసేవాణ్ణి. మాదకద్రవ్యాలు తీసుకోవటం అగిపోయింది, గత సంవత్సరంనుండి నేను నేర్చుకొన్న దానితోపాటుగా, యిప్పుడు ప్రతిరోజు 18 లేక 20 గంటల పఠనంద్వారా నేర్చుకొంటున్నది, అంతాకలిసి ఒకేసారి నాలో జీర్ణించుకుపోయింది.
మరియు, నేను సాక్షుల కూటాలకు వెళ్లటం ప్రారంభించాను. కొన్ని వారాలలోపుననే, నా జీవితంలోని మొదటి వాస్తవమైన ప్రార్థనచేసేంతగా నేను అభివృద్ధి చెందాను, అది నా సమర్పణనుగూర్చిన ప్రార్థనకూడ. ఇంటింటి సువార్తకు వెళ్లటం ప్రారంభించి నాకు తెలిసినవారికి ప్రకటించేవాణ్ణి. ఏడు బైబిలు పఠనాలను మొదలుపెట్టగా, అందులో అయిదు బాప్తిస్మం తీసుకోనటానికి అభివృద్ధి చెందాయి, వాళ్లలో నా భార్య, నా కొడుకుకూడా ఉన్నారు. నేను 1976, మే 23న ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మం పొందాను, అంటే నేను “ఆ స్నేహితునికి,” ఫోను చేసిన మూడు నెలల్లోనే అన్నమాట. నేను పయనీర్సేవ (పూర్తికాల ప్రకటనపని) మొదలుపెట్టి, 13 సంవత్సరాలు కొనసాగించాను.
ఇది నేను కథను ఎక్కడ మొదలుపెట్టానో అక్కడకు నన్ను తీసుకు వస్తుంది—50 సంవత్సరాల వయస్సు, యింటిలో ఒంటరిగా కూర్చొని, ఒక పుస్తకం చదివి ఏడ్చాను. స్వయం వృద్ధి కొరకు సహాయపడే పుస్తకాలు 80వ దశకంలో ప్రసిద్ధి చెందాయి, దానిలో ఒకటి నేను చదివాను. స్పష్టముగా అది నాకు సహాయాన్ని అందించలేదు, అది అందించిన లోకజ్ఞానమును అనుసరించాలని నేను యిష్టపడలేదు. కాని నేను నా బాల్య జీవితంలో గాయపడిన సంవత్సరాలు, ప్రేమకొరకు తపించిన భావోద్రేకావసరతలు నన్ను భావోద్రేకపరంగా ఎలా అవిటివాన్ని చేశాయో మొదటిసారిగా చూసేందుకు నాకు వీలు కలిగించింది. రెండు విధాల కన్నీళ్లు వచ్చాయి, ఒకటి సంతోషకరమైన కన్నీళ్లు నేను భావోద్రేకతను వ్యక్తపర్చుటలో నా అసమర్థతను నేను అర్థం చేసుకోగల్గినందుకు వచ్చాయి, రెండు దుఃఖపడే కన్నీళ్లు ఏవనగా భావోద్రేకపూరిత మానవునిగా భావోద్రేకాలకు ప్రతిస్పందించలేక పోవడం ద్వారా నా 50 సంవత్సరాలు జీవితంలో అపరిమితమైన నష్టాన్ని అనుభవించినందుకు వచ్చాయి. నా జీవితమంతటిలో నేను తరచూ అనుభవించిన కృంగుదలను అది వివరించింది.
నేను బైబిలులో యెహోవాను గురించి, నేను మునుపెన్నడూ వ్యక్తిగతంగా అనుభవించని, నా పట్ల కూడా ఆయన చూపిన ప్రేమను గురించి చదివినప్పుడు, క్రమంగా భావోద్రేక ఆలోచనలు నాలో కలిగాయి. నా భార్యయెడల నా కుమారునిపై, దేవుని సంఘంలోని నా సహోదరీ సహోదరులయెడల, నేను ఎవ్వరికైతే దేవుని రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటిస్తానో వారియెడల ప్రేమ ఉప్పొంగుతుంది, ఎందుకంటే వారికి కూడా యెహోవా వాగ్దానము చేసిన భూమిపై నీతియుక్త నూతన లోకములో నిత్యము జీవించే అవకాశం కలుగవచ్చును.
ప్రేమించడానికి మరియు ప్రేమించబడడానికి సృష్టించబడ్డాము
మనము ప్రేమించడానికి మరియు ప్రేమించబడటానికి సృష్టించబడ్డాము. పిల్లవాడు పుట్టినప్పుడు, వానికి యీ ప్రేమ అవసరం, వాడు అంగీకరించబడవలసిన అవసరముంది. పిల్లవాడు తల్లిదండ్రులచేత ప్రేమింపబడక, అంగీకరించబడకపోతే, తాను ప్రేమకు అనర్హుడనని భావిస్తాడు అంతేకాక తాను నిష్ప్రయోజకుడననే భావాలను కలిగివుంటాడు. నేను మరి చిన్నగావున్నపుడు, ఎవరైన నన్ను ఎత్తుకోవాలని దగ్గరికి తీయాలని, లాలించాలని ఎంతగానో ఆశించేవాణ్ణి. ఇంటికి ఎవరైన అతిధులు వచ్చినపుడు, నన్ను వాళ్లు ఊయలలో చూసేవారు, అపుడు వాళ్లు నన్ను ఎత్తుకొంటారేమోనని ఆశగా చూసేవాన్నని నాకు యిప్పటికికూడా జ్ఞాపకమున్నది. వాళ్లు ఎప్పుడుకూడా అలా చేసేవారుకాదు, నన్ను ఎవరూ ఎత్తుకోలేదు కాబట్టి అది చూసి నేను ఏడ్పు మొదలుపెట్టేవాణ్ణి.
అటువంటి చిన్ననాటి గాయాలు నన్ను భర్తగాను, కుటుంబ యాజమానిగా నా స్థానమందు నన్ను అవిటివానిగా చేసి, పరలోక తండ్రియైన యెహోవా నన్ను ప్రేమిస్తాడని విశ్వసించుటకు నన్ను అసమర్థునిగా చేసింది. యెహోవానుగూర్చిన సత్యము నన్ను క్రమముగా మార్చింది, ఆయననుగూర్చిన భావననేది నా మెదడునుండి హృదయము వరకు నన్ను కదిలించింది, యెహోవా నన్ను నిస్వార్థపూరితంగా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. అంతటి ప్రేమను పొందగల్గుటకు మనకు మార్గము లేదని నాకు బాగా తెలుసు. అది ప్రేమా స్వరూపియైన, యెహోవా దేవునినుండి వచ్చే కృపాబాహుళ్యత.
యెహోవాయొక్క ఆశీర్వాదాలలోని అన్నింటియందు అధిక ఆసక్తివున్నది కాబట్టి నా భార్య, నేను యిప్పుడు మంచి జీవితాన్ని కలిగివున్నాము. మేము ప్రస్తుతము రాజ్యప్రచారకుల అవసరత ఎక్కడ ఎక్కువగావుందో అక్కడ సేవచేస్తున్నాం, అరిజోనా పర్వత ప్రాంతములోని సుందరమైన దృశ్యాలుగల ఒక చిన్న పట్టణమందు, ప్రేమపూరిత చిన్న సంఘంలోవున్నాము. నేను సంఘంలో సంఘాధ్యక్షునిగా సేవచేస్తూ, సంఘ పుస్తక పఠనమును నిర్వహిస్తున్నాను మరియు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలనుకూడా నిర్వహించడంలో నేను అధిక సంతోషమును పొందుతున్నాను. మా వస్తుదాయక అవసరతలను తీర్చడానికి సరిపోయేలా నేను కిటికీలను కడిగే చిన్న వ్యాపారాన్ని చేస్తూన్నాను, మిగిలిన సమయాన్ని మా పరిచర్యలో గడుపుతూ, మిగిలిన మా సేవతో ప్రేమగల మా పరలోక తండ్రిని ఆరాధిస్తున్నాము.
వెనుకకు ఒకసారి ఆ రోజు ఉదయాన నా భార్య విసిరిన కాగితంలోని “యెహోవాసాక్షులు రాకూడదు,” అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకొంటే, నా పరలోక తండ్రి నా యెడల చేసిన దానికి నేను ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను. ఒక ఉద్యోగమునుకూడా చేపట్టలేని అసమర్థుడుగాను, మత్తుకు బానిసనుగాను, నాతోపాటు ప్రతివ్యక్తి చంపబడాలని ఆశతో ఎదురుచూసేవానిగా ఉన్న నేను, యిప్పుడు భూమిపైగల యెహోవా దృశ్య సంస్థలో ఒక సభ్యునిగాను, లోకానికి ఏకైక నిరీక్షణయైన, దేవుని రాజ్య సువార్తను ఎంతమందికి వీలైతే అంతమందికి తెలియజేయుటకు అంకితమయ్యాను. నేను ఎప్పుడూ కోరుకొనే: ప్రేమ, దృఢనమ్మకము మరియు అంగీకారాన్ని అందించే ప్రజలతో కూడ యెహోవా నా జీవితాన్ని నింపాడు.
నేను యిక బాధను అనుభవించలేని “రాతిబండ” గాను, లేక ఎన్నడూ ఏడ్వని “ద్వీపము” గాను ఉండడానికి ఎంత మాత్రం ప్రయత్నించడం లేదు.—లారీ రూబేన్ చెప్పినది.
[17వ పేజీలోని చిత్రం]
లారీ రూబేన్ ఆయన భార్య, డోన్నా