మా పాఠకుల నుండి
క్రెడిట్ కార్డులు ముఖ్యంగా “ప్లాస్టిక్ మనీ—మీ కొరకేనా?” (మార్చి 8, 1994) అనే శీర్షికను చదివి నేను చాలా సంతోషించాను. కొన్ని సంవత్సరాల క్రిందట మా క్రెడిట్ కార్డులను చింపేసిన తర్వాత కూడా, నేను, నా భార్య ఆ క్రెడిట్ కార్డుపై తీసుకున్న అప్పు తీర్చడానికి చాలా కాలం పట్టింది. అయినప్పటికీ, సౌలభ్యం కోసం, యీ మధ్యే మేము కొత్త కార్డును సంపాదించాము. ఈసారి క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేయకూడదనే నిర్ణయానికి మేము రావడానికి, వాటిని గూర్చి, వాటి అపాయాలను గూర్చిన సమయానుకూలమైన మీ హెచ్చరికలు తోడ్పడ్డాయి.
ఎమ్. బి. ., అమెరికా
సంభాషణ “కమ్యూనికేషన్ ఇన్ మ్యారేజ్” అనే అంశాన్ని గూర్చిన శీర్షికల పరంపర ఉన్న జనవరి 22, 1994వ సంచిక నాకు యీ రోజు అందింది. దానిలో, నేను క్రితం చదివిన వాటన్నింటికన్నా యిది మంచి పరంపర. మా పెళ్ళి జరిగి ఒకటిన్నర సంవత్సరం అయ్యింది. మాది చాలా మంచి అనుబంధము, ఎంతో సంతోషంగా ఉంటాము. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోము. అలా జరగడానికి గల కారణాలను అవేక్! చక్కగా చెబుతుంది. నేను యీ శీర్షికలను మూడవసారి చదవనారంభిస్తుండగా, యెహోవాకు, సమయోచితమైన యిలాంటి వివరాలను ప్రచురిస్తున్న మీకు కృతజ్ఞతలు చెప్పనివ్వండి.
సి. ఎమ్., అమెరికా
నా భర్త క్రైస్తవ పెద్దగా, పూర్తికాల సేవకునిగా చక్కగా పని చేస్తున్నాడు. అయినప్పటికీ, మా వివాహం జరిగినప్పటి నుండి, విపత్కరమైన పరిస్థితులు ఏర్పడినప్పటి నుండి కొన్నిసార్లు మాట్లాడుకోకపోవడం జరిగేది. ఈ శీర్షికలు నిర్మొహమాటంగా, అసలు సమస్యలకు గల కారణాలను చూపించింది. అవి మా అనుబంధాన్ని బలపర్చడానికి సహాయపడతాయని మేము నిశ్చయంగా నమ్ముతాము.
సి. ఎ., జపాన్
“పామ్” ప్రతిస్పందనలను చదివినప్పుడు, నేను నా భావాలను అంతకన్నా చక్కగా వర్ణించలేనని గ్రహించాను. నా భర్తను గూర్చి, “జెరీ”ని గూర్చి కూడా అదే చెప్పవచ్చు. ఈ శీర్షిక, ఫలితాలను మాత్రమే గాక, కారణాలను కూడా గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ముఖ్యమైన అంశాన్ని ఆకర్షణీయమైన విధంగా వర్ణించడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇ. ఎఫ్., ఇటలీ
ఇప్పుడు నాకు 17 ఏండ్లే అయినప్పటికీ, యింకా కొన్ని సంవత్సరాల వరకు నేను పెళ్ళి చేసుకోదలచుకోనప్పటికీ, ప్రజలు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటో పరిశీలించడాన్ని, నేను చాలా ప్రశంసిస్తున్నాను. నేను యీ శీర్షికలను జాగ్రత్తగా పెట్టుకుని, తర్వాతి సంవత్సరాల్లో అప్పుడప్పుడు చదవాలని అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా నేను ఎప్పుడు పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడతానో అప్పుడు దీని అవసరం ఎంతైనా ఉంటుంది!
ఎన్. బి., అమెరికా
మా నాన్న దాదాపు “జెరి” లాగే ఉంటారు. ఆయన మౌనంగా ఉండిపోవడం, నాతో మాట్లాడకపోవడం అనేది ఆయన హక్కని యిప్పుడు నేనర్థం చేసుకుంటున్నాను. ఈ శీర్షిక జ్ఞానాభివృద్ధి కలుగజేసినప్పటికీ, ఆయన తాను చేస్తున్నది సరైనదని రూఢిపరచుకోడానికి యీ శీర్షికను ఉపయోగిస్తాడేమోనని నేను భయపడుతున్నాను.
ఎ. బి., అమెరికా
కొందరు స్త్రీ, పురుషులు కొన్ని రకాలుగా భావించడానికి, మెలగడానికి కారణాలేంటో పాఠకులు అర్థం చేసుకోడానికి సహాయపడేందుకు యీ శీర్షికలు ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ, స్త్రీలకు లేదా పురుషులకు మాట్లాడకుండా ఉండడానికి, అనుచితంగా ప్రవర్తించడానికి హక్కున్నదని మా అర్థం కాదు. తండ్రులారా ‘పిల్లలకు కోపము పుట్టించకుండా’ ఉండుడి అని లేఖనము నొక్కి చెబుతుంది. (కొలొస్సయులు 3:21) పిల్లలు తల్లిదండ్రుల నడిపింపును కోరుతున్నప్పుడు, అది వారికి అవసరమైనప్పుడు, అనవసరంగా దీర్ఘకాలం మౌనంగా ఉండకుండా యిది నివారిస్తుంది.—సంపాదకుడు.
ఈ శీర్షికలను మెచ్చుకుంటూ ఉత్తరాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. దయచేసి, నా వ్యాఖ్యానాన్ని కూడా చేర్చండి. “జెరి,” “పామ్”లను గూర్చిన శీర్షికల్లో ఆ పేర్ల స్థానంలో నా పేరు నా భార్య పేరు రాయవలసింది. నా భార్య భావాలను నేను అర్థం చేసుకోగలిగి ఉంటే బాగుండునని నేను ఎంతగా ఆశిస్తున్నానో! నేను “జెరి”లాగే, నా అవసరాలను తీర్చుకోవాలనే దృష్టితో, నా భార్య అవసరాలను తీర్చాలని ప్రయత్నం చేసేవాణ్ణి. ఇరవై ఏండ్ల నా భార్య నా నుండి విడాకులు తీసుకుంది. బహుశా, యీ శీర్షికలు నా భార్య హృదయాన్ని స్పర్శించి ఉండవచ్చు, మేము మా వివాహంలో తిరిగి కలుసుకునే ప్రయత్నం చేయగలం.
జె. కె., అమెరికా