మా పాఠకుల నుండి
నాజీలను ఓ కుటుంబం ఎదిరించుట నా వయస్సు 90 సంవత్సరాలు, నేను యెహోవాసాక్షులతో పఠనం చేస్తున్నాను. “ఓ యెహోవా, నా చిన్నారి కూతురును నమ్మకస్థురాలిగా ఉంచుము!” అనే శీర్షికను చదివాను. (జనవరి 8, 1994) సాక్షులైన తల్లిదండ్రులు, వారి కూతురు, హిట్లర్ పెట్టిన తీవ్రమైన హింసలను అనుభవించినప్పటికీ, యెహోవా బోధనలను హత్తుకొనియుండడానికి, వారు వీరోచితమైన పోరాటం పోరాడినట్లు అది చెబుతుంది. నేను దాన్ని చదువుతుండగా నేను ఏడ్చేశాను. యెహోవా బోధనలను మరింత గంభీరమైన దృక్పథంతో నేర్చుకోవాలని నేను తీర్మానించుకున్నాను.
ఎస్. టి., జపాన్.
ఈ అనుభవం నా హృదయాంతరాలను తాకింది. సైమన్ అర్నోల్డ్ లెబ్‌స్టర్, చిన్న అమ్మాయే అయినప్పటికీ, తాను యెహోవాకు విధేయత చూపినందువల్ల తల్లిదండ్రులు లేకుండా నేరస్థుల పాఠశాలలో ఉంచబడింది. నమ్మకానికి ఎంత అద్భుతమైన మాదిరో కదా!
ఎమ్. సి. ఎల్. ఎస్., బ్రెజిల్
యెహోవాను ఆశ్రయించి, ప్రేమతోను, మర్యాదతోను, దార్ఢ్యంతోను, ఆమె, ఆమె తల్లిదండ్రులు జీవించడం యెహోవాతో నాకు గల సంబంధాన్ని మరొక్కసారి మదింపు చేసుకొనేలా చేసింది. నేను తక్కువగా ఉన్నట్లు భావించాను, విశ్వాసానికి, సహనానికి అవసరమైన ఆత్మీయ విలువలయెడల మెప్పును పెంపొందించడానికి అది నాకు సహాయం చేసింది.
వి. బి., ఆస్ట్రేలియా
ఒంటరితనం నేను ఒంటరితనాన్ని గూర్చిన శీర్షికను (జనవరి 8, 1994) మూడు నాలుగు సార్లు చదివాను. గంతులెయ్యాలి, పాడాలి, సంతోషంగా పని చెయ్యాలి అని మీరు సలహా యిచ్చారు. కాని, రసాయనిక అస్థిరత ఒకరు ఆత్మహత్య చేసుకోవాలన్న భావాలను ఎలా కలిగిస్తుందో మీరు ప్రస్తావించలేదు.
పి. సి., అమెరికా
ఆ శీర్షికలు సాధారణంగా ప్రత్యేక శ్రద్ధ అవసరమున్న తీవ్రమైన నిరాశకు గురైనవారికి, లేదా ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా తలంచే వారికొరకు ఏమీ చెప్పడం లేదు. బదులుగా, తమ ప్రియమైన వారు చనిపోవడం వంటి దుఃఖకరమైన పరిస్థితుల వలన తాత్కాలికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారి కొరకే అవి వ్రాయబడ్డాయి. నిరాశను గూర్చి మా అక్టోబరు 22, 1987వ సంచికలో ప్రచురించబడింది, యీ సంచికలోనే “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు. . .” అనే శీర్షికలోను దీన్నిగూర్చి చర్చించాము.—సంపాదకులు.
జాతివైషమ్యం “జాతులన్నీ ఎన్నటికైనా ఐక్యమగునా?” (డిశంబరు 8, 1993) అనే శీర్షికల అద్భుతమైన పరంపరలకు కృతజ్ఞతలు చెబుదామని వ్రాస్తున్నాను. మీరు యీ అతి సున్నితమైన విషయాన్ని చాలా బాగా వివరించారని అనుకుంటున్నాను. మీరు ఎంతో ఔచిత్యంతో, ఎవరూ, ఏ ఒక్కరూ స్వార్థంతో ఏహ్యమైన జాతివిచక్షణలో మునిగి ఉండడాన్ని సమర్థించలేదు.
డి. జి., అమెరికా
మూత్రపిండంలో రాళ్ళు “మూత్రపిండంలో రాళ్ళు—పురాతన రోగానికి చికిత్స” (డిశంబరు 8, 1993) అనే శీర్షికను సకాలంలో వ్రాసినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. తపాలాద్వారా నా పత్రిక లభించిన కొద్ది కాలానికి నా మూత్ర పిండంలో రాళ్ళున్నాయని పరీక్ష చేయించుకొని తెలుసుకున్నాను. మీ శీర్షికకు కృతజ్ఞతలు, నా జబ్బును బాగా అర్థం చేసుకున్నాను, యిప్పుడు శస్త్రచికిత్స కొరకు సిద్ధపడుతున్నాను.
వి. టి., అమెరికా
ఎయిడ్స్ “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు. . .” అనే (జనవరి 8, 1994, ఫిబ్రవరి 8, 1994) పరంపరలోని ఎయిడ్స్‌ను గూర్చిన శీర్షిక చదివి చాలా సంతోషించాను. నాకు 20 సంవత్సరాలు. నేను కన్యగా ఉన్నానే అని ఎప్పుడూ కలవరపడేదాన్ని. కాని యీ శీర్షికలను చదివిన తర్వాత, కన్యాత్వమన్నది యెహోవా యిచ్చిన వరం అని గ్రహించాను.
ఎల్. కె., అమెరికా
మునుపటి మతగురువు “శ్రేష్ఠమైన పరిచర్య కొరకే నేను మతగురువు పదవిని విడిచిపెట్టాను” (డిశంబరు 8, 1993) అని ఆలినియో డీ శాంతా రీటా లేబో చెప్పిన అనుభవాన్ని ముద్రించినందుకు మీకు కృతజ్ఞతలు. ఉన్నత విద్యను అభ్యసించిన ఒక వ్యక్తి పరిశోధించి కనుక్కోవడాన్ని గూర్చిన కథ యిది. యెహోవాసాక్షులుగా, మనం మన పరిచర్యలో బైబిలు విద్యార్థుల్లో సత్యాన్ని గూర్చిన అవగాహనను అంచెలంచెలుగా పెంపొందిస్తాం. ఇక్కడ ఒకరు, దీనికి భిన్నంగా, అబద్ధ బోధలను ఒక్కొక్కటిగా తీసివేస్తూ, చర్చి-ఆధారిత పారంపర్యాల నుండి సత్యాన్ని వేరు చేశారు. ఇది విశ్వాసాన్ని మరింత బలపర్చింది.
బి. సి., అమెరికా