రొమ్ము క్యాన్సర్‌ను గురించి స్త్రీలు తెలుసుకోవలసిన విషయాలు
రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి ఖండంలోనూ పెరుగుతోంది. కొన్ని అంచనాల ప్రకారం, 2000 సంవత్సరంకల్లా, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన పది లక్షల క్రొత్త కేసులు రోగనిర్ధారణ చేయబడతాయని వెల్లడయ్యింది.
ఈ వ్యాధి సోకకుండా ఏ స్త్రీయైనా సురక్షితంగా ఉందా? దాన్ని నివారించటానికి ఏమైనా చేయవచ్చా? ఈ శత్రువుతో పోరాడుతున్న వారికి ఎటువంటి ఓదార్పు మరియు సహాయం అవసరము?
అనేక చర్మ క్యాన్సర్లు సూర్యునినుండి వచ్చే అతినీలలోహిత కిరణాల వలన సంభవిస్తాయి. అనేక ఊపిరి తిత్తుల క్యాన్సర్లు పొగత్రాగటం వలన సంభవిస్తాయి. కాని రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి ఏ ఒక్క ప్రత్యేక కారణం ఇంకా పేర్కొనబడలేదు.
అయితే, ఈమధ్య జరుపబడిన పరిశోధన ప్రకారం, జన్యు, ప్రకృతి మరియు హార్మోనులకు సంబంధించిన కారకాలు రొమ్ము క్యాన్సర్ రావటానికి కారణాలు కాగలవు. ఈ కారకాలకు గురి అవుతున్న స్త్రీలకు ఎక్కువ ప్రమాదం సంభవించగలదు.
కుటుంబ చరిత్ర
ఒక స్త్రీకి తన తల్లి, అక్క, లేక అత్తయ్య లేక అమ్మమ్మకు కూడ రొమ్ము క్యాన్సర్ గనుక ఉండినట్లయితే, ఆమె కూడ దానిని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ వారిలో అనేకమందికి ఈ రోగం ఉంటే, ఆమెకు అది సోకే ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది.
అమెరికాలోని జన్యు శాస్త్రజ్ఞురాలైన డా. పెట్రిషియా కెల్లీ, వంశపారంపర్య కారకాలు ఇమిడివున్నా, అన్నిరకాల రొమ్ము క్యాన్సర్ల విషయంలో కేవలం 5 నుండి 10 శాతం వరకు మాత్రమే అవి ఉండవచ్చునని తేజరిల్లు!కు తెలియజేసింది. “ఇతర క్యాన్సర్లు, పరిసరాలతో సంయోగంగా ఉండే వంశపారంపర్య కారకాలకన్నా తక్కువ ప్రభావం గలిగి ఉండే కారకాల వలన వస్తాయని మేము భావిస్తున్నాము,” అని ఆమె వివరించారు. ఒకే విధమైన జన్యువులు ఉన్న కుటుంబ సభ్యులు ఒకే విధమైన పరిసరాలను కలిగి ఉంటారు.
పరిసర కారకాలు
సైన్స్ అనే పత్రికలో వ్యాఖ్యానిస్తూ, ఆ వ్యాధిని కలిగించడానికి తోడ్పడేవి “పరిసర కారకాలే ఎక్కువగా ఇమిడి ఉన్నాయని స్పష్టమయ్యింది,” అని, డెవ్రా డేవిస్ అనే పండితురాలు అన్నారు. కిరణప్రసార శక్తిని తట్టుకోలేని శరీరభాగాల్లో స్త్రీ రొమ్ము ఎక్కువ సున్నితంగా ఉంటుంది గనుక, ఎలక్ట్రాన్ కిరణప్రసారాలుండే చోట పనిచేసే స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. విషపూరిత రసాయనాలవద్ద పని చేసే స్త్రీలకు కూడ అదే ప్రమాదం ఉంది.
ఇంకొక పరిసర కారకం ఆహారం. కొందరు రొమ్ము క్యాన్సర్ విటమిన్ల లోపం వలన వచ్చే వ్యాధి అని విటమిన్ డి లోపాన్ని గురించి సూచిస్తారు. శరీరం కాల్షియంను గ్రహించడానికి ఈ విటమిన్ సహాయం చేస్తుంది, అది తద్వారా అసంబద్ధ కణవృద్ధిని నిరోధించడానికి సహాయం చేస్తుంది.
ఇతర అధ్యయనాలు క్రొవ్వును, రొమ్ము క్యాన్సర్‌కు కారకంగా కాదు గాని, వృద్ధిపరచేదానిగా పేర్కొంటున్నారు. క్రొవ్వు మరియు జంతు పోషకాలను ఎక్కువగా తీసుకొంటున్న అమెరికా వంటి దేశాల్లో రొమ్ము క్యాన్సర్ వలన సంభవించే మరణాల సంఖ్య చాలా ఎక్కువని ఎఫ్‌డిఎ కన్స్యూమర్ అనే పత్రిక చెబుతోంది. అదిలా వ్యాఖ్యానించింది: “జపాన్ స్త్రీలకు చరిత్రాత్మకంగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదం చాలా తక్కువగా ఉండేది, కానీ ఆహారపు అలవాట్లలో ‘పాశ్చాత్యశైలికి’ దిగటం వలన ఆ ప్రమాదం క్రమేపి పెరగడం మొదలైంది; అంటే తక్కువ క్రొవ్వు ఉండే ఆహారం నుండి ఎక్కువ క్రొవ్వు ఉండే ఆహారానికి వారు మారటం జరిగింది.”
ఎక్కువ క్రొవ్వు ఉండే ఆహారంలోని అధికమైన క్యాలరీలు అసలైన ప్రమాదాన్ని సృష్టించగలవని ఈమధ్యే జరిపిన ఒక అధ్యయనం సూచిస్తుంది. సైన్స్ న్యూస్ యిలా చెబుతుంది: “ప్రతి అదనపు క్యాలరీ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది, క్రొవ్వు వలన వచ్చే ప్రతి క్యాలరీ, ఇతర వాటినుండి వచ్చే క్యాలరీలకన్నా 67 శాతం ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.” అదనపు క్యాలరీలు బరువును పెంచుతాయి, మరీ ఎక్కువ బరువున్న స్త్రీలకు, ప్రాముఖ్యంగా రుతుస్రావం ఆగిపోయిన స్త్రీలకు, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడంతలు ఎక్కువ ఉంది. శరీరంలోని క్రొవ్వు స్త్రీలలో ఉండే హార్మోనైన ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది, మరి అది క్యాన్సర్‌కు దారి తీసే విధంగా రొమ్ము కణజాలంపై తీవ్ర ప్రభావాన్ని చూపగలదు.
వ్యక్తిగత చరిత్ర, హార్మోనులు
ఒక స్త్రీకి తన జీవితమంతటిలో రొమ్ముల్లో మార్పులను తెచ్చే హార్మోనులు ఆమె రొమ్ముల్లో ఉంటాయి. సర్జికల్ వొంకాలజిస్టు అయిన డా. పాల్ క్రే, ఆస్ట్రేలియన్ డాక్టర్ వీక్లీలో యిలా వ్రాశాడు: “అయినప్పటికి, స్త్రీలలో కొందరికి, రొమ్ము కణజాలం దీర్ఘకాలంగా హర్మోనుల ప్రేరకానికి గురికావడమనేది . . . కణాలలో మార్పుల పరంపరకు దారితీస్తుంది, తుదకు అది ప్రాణాంతకంగా [క్యాన్సరుగా] పరిణమిస్తుంది.” ఈ కారణంగా చిన్న వయస్సులోనే అంటే 12 సంవత్సరాలకే రుతుస్రావం మొదలై, లేక 50వపడి మధ్యలో రుతుస్రావం ఆగిపోయిన స్త్రీలకు ఎక్కువ ప్రమాదం ఉందని భావించబడుతోంది.
ERT (ఈస్ట్రోజెన్ రీప్లేస్మెంట్ థెరపీ) వలన లభించిన అదనపు ఈస్ట్రోజెన్లు రొమ్ము క్యాన్సర్‌కు నడిపిస్తాయన్నది ఒక వివాదాంశంగా ఉంది. ERT ఎక్కువ ప్రమాదాలను సృష్టించదని కొన్ని అధ్యయనాలు చూపుతున్నపటికీ, దీర్ఘకాలంగా వాటిని పొందుతున్న వారు తగినంత ముప్పును కలిగి ఉన్నారని ఇంకొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. పునర్విమర్శింపబడిన అధ్యయనాలను పరిగణలోనికి తీసుకొంటూ, 1992లోని బ్రిటీష్ మెడికల్ బులిటెన్ దీర్ఘకాల వాడుక తరువాత “గర్భ నిరోధకం కాని ఒస్ట్రోజెన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 30-50% వరకు పెంచే” అవకాశం ఎక్కువగా ఉందని చెప్పింది.
నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలకు మరియు రొమ్ము క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాలపై వచ్చిన నివేదికలు, మాత్రలను ఉపయోగించడం వలన కొంత ముప్పు వస్తుందని సూచిస్తున్నాయి. అయితే, ప్రమాదానికి ఎక్కువగా గురయ్యే స్త్రీలు కొంతమంది ప్రత్యేకంగా ఉన్నారు. యౌవన స్త్రీలు, అసలు పిల్లలను కనని స్త్రీలు, మరియు గర్భ-నిరోధక మాత్రలను చాలా కాలం వరకు ఉపయోగించిన వారికి 20 శాతం వరకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
అయిననూ, రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రతి నలుగురు స్త్రీలలో ముగ్గురు స్త్రీలు తమకు ఆ రోగం ఎందుకు వచ్చిందో ఏ నిర్దిష్టమైన కారణాన్ని చూపలేక పోతున్నారు. కావున ప్రశ్నేమంటే, ఏ స్త్రీయైనా తాను రొమ్ము క్యాన్సర్ రాకుండా క్షేమంగా ఉన్నానని భావించగలదా? ఎఫ్‌డిఎ కన్స్యూమర్ యిలా నివేదిస్తుంది: “ఒక వైద్యుని దృష్టినుండి వీక్షిస్తే, స్త్రీలందరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉందనే పరిగణించాలి.”
స్త్రీలు ప్రాముఖ్యంగా, పెద్ద వయస్సుగల వారు ఈ వ్యాధికి గురయ్యే ప్రమాదమున్నది. రొమ్ము క్యాన్సర్‌కు వేర్వేరు కారణాలు ఉన్నా, ‘వృద్ధులు కావటం, మరియు కణాల్లో సరియైన విభజన జరగక పోవటం కొంతవరకు కారణమని నేను అనుమాన పడుతున్నాను’ అని డా. కెల్లీ వ్యాఖ్యానిస్తున్నారు.
ఎందుకు ప్రమాదం పొంచియుంది
స్త్రీ రొమ్ముల రూపాన్ని పరిశీలించటం అది క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎందుకు ఉన్నదో వివరిస్తుంది. దానిలో నాళాలు, పాలను ఉత్పత్తి చేసే సంచులనుండి చనుమొనల వరకు పాలను పంపే సన్నని మార్గాలు ఉంటాయి. ఆ నాళాలకు ఇరువైపులా కణాలు ఉంటాయి, అవి ఒక స్త్రీ యొక్క నెలసరి రుతుక్రమానికి ప్రతిక్రియగా విభజింపబడి ఎడతెగక మార్పుచెందుతూ, అలా ఆమెను గర్భధారణకు, పాలివ్వడానికి, మరియు తన చిన్న పిల్లలను పోషించడానికి సిద్ధం చేస్తాయి. ఈ నాళాల్లోనే రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా వృద్ధి చెందుతుంటాయి.
ఆల్టర్నేటివ్స్: న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ది వార్ ఆన్ బ్రెస్ట్ క్యాన్స్ర్ అనే పుస్తకంలో, పరిశోధకుడైన రోజ్ కుష్నెర్ యిలా వివరిస్తున్నాడు: “ఏ నియమిత పద్ధతి అయినా ఒకటి లేక ఇతర అభ్యంతరాల వలన తరచుగా తలక్రిందులు చేయబడుతూ ఉంటే—అది ఎంతో పరిపూర్ణంగా సహజంగా ఉన్ననూ . . . —అది చాలా ఎక్కువ సమస్యలకు దారితీయగల ప్రమాదాన్ని ఎక్కువ కలిగి ఉంది.” ఆమె ఇంకా యిలా చెబుతుంది: “చాలా అధికంగా పని చేసిన రొమ్ము కణాలు, ‘దాన్ని చేయటం ఆపు. దీన్ని చేయటం మొదలుపెట్టు,’ అని ఆజ్ఞాపించే ఏదో ఒక హార్మోనులో ఎల్లప్పుడూ తడుస్తుంటాయి. కావున విభజింపబడిన కణాల్లో చాలావరకు అదుపు తప్పుతాయంటే ఆశ్చర్యం లేదు.”
ఒక అస్వాభావికమైన కణం విభజింపబడి, దాని పెరుగుదల ప్రక్రియ అదుపు తప్పి, అసంబద్ధంగా విభజింపబడటం జరిగినప్పుడు రొమ్ము క్యాన్సర్ మొదలౌతుంది. అటువంటి కణాలు పునరుత్పత్తి చెందడం మానవు, మరి అవి తగిన సమయానికి చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణజాలాన్ని ఆక్రమించి, ఆరోగ్యకరమైన అవయవాన్ని ఒక వ్యాధిగ్రస్థమైన దానిగా మారుస్తాయి.
వ్యాధి పాకుట
క్యాన్సర్ రొమ్ములోనే గనుక ఉంటే, ఆ ప్రాణాంతక పదార్థాన్ని తీసివేయవచ్చు. కాని రొమ్ము క్యాన్సర్ శరీరంలోని యితర అవయవాలకు పాకినప్పుడు, అది మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ అని పిలువబడుతుంది. రొమ్ము క్యాన్సర్ రోగుల్లో బహుశా ఈ విధమైనదే మరణానికి దారి తీస్తుండవచ్చు. క్యాన్సర్ కణాలు రొమ్ములో వృద్ధి చెంది గ్రంథి పరిమాణంలో పెరుగుతున్న కొద్ది, క్యాన్సర్ కణాలు తమ మొదటి స్థానాన్ని నిశ్శబ్దంగా మరియు రహస్యంగా వదలి రక్త నాళాల గోడలను, శోషరస గ్రంథులను ఛేదిస్తాయి.
ఈ స్థితిలో గ్రంథి కణాలు శరీరం యొక్క సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు. అవి రక్తంలో మరియు శోషరసంలో ప్రసరిస్తూ సహజమైన సంహారక కణాలు ఉండే, శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థను కూడ చేరితే, ఈ ప్రాణాంతక కణాలు కాలేయం, ఊపిరి తిత్తులు, మరియు మెదడు వంటి ముఖ్యమైన అవయవాల్లో నెలకొనగలవు. ఆ అవయవాలను విషపూరితం చేసిన తరువాత, అవి అక్కడ విభజనచెంది, మళ్లీ వ్యాపించగలవు. వ్యాధిపాకడం ఒక్కసారి మొదలైతే, ఒక స్త్రీ యొక్క జీవితం ప్రమాదంలో పడుతుంది.
కావున, ప్రమాదాన్ని తప్పించుకొనడానికి ఒక కీలకమేమంటే, అది వ్యాపించే అవకాశం దానికి లభించక ముందే, తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టడమే. తొలి దశలోనే కనిపెట్టడానికి అవకాశాలను మెరుగుపర్చటానికి ప్రతి స్త్రీ కూడ ఏమి చేయగలదు? అసలు రొమ్ము క్యాన్సర్‌ను రూపుమాపడానికి సహాయకం ఏదైనా ఉందా?
[4వ పేజీలోని చిత్రం]
రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రతి నలుగురు స్త్రీలలో ముగ్గురు స్త్రీలు తమకు ఆ రోగం ఎందుకు వచ్చిందో నిర్దిష్టమైన కారణాన్ని దేనినీ చూపలేకపోతున్నారు