నూతన లోకం—ఎన్నటికైనా వస్తుందా?
ఏప్రిల్ 13, 1991న, ఆనాటి అమెరికా అధ్యక్షుడైన జార్జ్ బుష్, అలాబామా నందలి మోంట్‌గోమెరిలో “నూతన లోక విధాన సాధ్యత” అనే ప్రసంగాన్నిచ్చారు. ముగింపులో ఆయనిలా అన్నారు: “మనకు రాబోతున్న నూతన లోకం . . . పరికించుటకు అద్భుతమైన లోకం.”
రెండు నెలల తరువాత, తూర్పు యూరపులో కమ్యూనిస్ట్ పరిపాలనలు పడిపోవడంతో, “శాంతి, న్యాయం, ప్రజాస్వామ్యాలపై ఆధారపడిన నూతన లోక విధానం సమీపంలోనే ఉన్నట్లుంది” అని ది బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ తెలియజేసింది.
నూతన లోకాన్ని గూర్చిన అలాంటి సంభాషణ 1993లో కూడా కొనసాగింది. జనవరి నెలలో ది న్యూయార్క్ టైమ్స్, అణు ఆయుధాలను తగ్గిస్తామని చేసిన వాగ్దాన ఒప్పందాన్ని గురించి నివేదించింది. ఆ వార్తాపత్రిక ఇలా తెలిపింది: “అధ్యక్షుడైన బుష్ ప్రత్యేకంగా ఎన్నుకొన్న మాటల్లో చెప్పాలంటే, అది అమెరికా, రష్యాలను, ‘నిరీక్షణకు సంబంధించిన నూతన లోక ద్వారం వద్ద’ ఉంచుతుంది.”
రెండు వారాల తరువాత, అమెరికా నూతన అధ్యక్షుడైన బిల్ క్లింటన్, ప్రారంభోత్సవ ప్రసంగంలో ఇలా అన్నాడు: “ఈనాడు, ఒక పాత విధానం గతించిపోతుండగా, నూతన లోకం ఎంతో స్వతంత్రంగా ఉంది కాని, అది అస్థిరమైంది.” ఆయన ఇంకా ఇలా నొక్కిచెప్పాడు: “ఈ నూతన లోకం ఇప్పటికే లక్షలాదిమంది అమెరికన్ల జీవితాలను సుసంపన్నం చేసింది.”
కాబట్టి, ఓ భిన్నమైన, మేలైన నూతన లోకాన్ని గురించి ఎంతోమంది చెప్పడం వింటున్నాము. ఒక నివేదిక ప్రకారం, స్వల్పకాల వ్యవధిలోనే, జార్జ్ బుష్ బహిరంగంగా 42 సార్లు “నూతన లోక విధానం” గురించి మాట్లాడారు.
కాని అలాంటి చర్చ విశేషమైనదా? అది మునుపు కూడా వినిపించిందా?
నిజంగా క్రొత్తదేమి కాదు
మొదటి ప్రపంచ యుద్ధానంతరం అనతికాలంలోనే, అమెరికాలోని ది ఫెడరల్ కౌన్సిల్ ఆఫ్ ది చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ మే 1919లో ఒహాయో, క్లెవ్‌ల్యాండ్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందులో ‘ఒక నూతనమైన, మేలైన లోక సాధ్యత’ను గురించి ప్రకటించింది. ఒక ప్రసంగీకుడు ఇలా నొక్కిచెప్పాడు: “అది పోటీ సిద్ధాంతానికి బదులు మైత్రి, స్నేహశీల సిద్ధాంతాలు గల నూతన లోకమై ఉంటుంది. అది భిన్నత్వానికి బదులు ఏకత్వ సిద్ధాంతం ఉండే నూతన లోకమై ఉంటుంది . . . చెడుతనానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధం తప్ప, అది సమస్త వైరుధ్యాలకు బదులు సహోదరత్వం, స్నేహభావం నిండియుండే నూతన లోకమై ఉంటుంది.”
ఈ నూతన లోకం ఎలా వస్తుందని చర్చీలు నమ్ముతున్నాయి? బైబిలులో వాగ్దానం చేయబడిన దేవుని రాజ్య ప్రభుత్వం ద్వారా వస్తుందనా? లేదు. అలాంటి నూతన లోకం రాజకీయ సంస్థ నుండి వస్తుందని వారు ఎదురుచూశారు. ఒక చర్చి నాయకుడు ఇలా అన్నాడు: “ఈనాడు మనం నానాజాతి సమితి అని పిలిచేది, మనందరి క్రైస్తవ విశ్వాసానికి, లోకంలో మనం పడిన ప్రయాసకు, ఆవశ్యకమైన, అనివార్యమైన పరిణామమే.” ఆ కాలంనాటి చర్చి నాయకులు నానాజాతి సమితిని “భూమిపై దేవునిరాజ్య రాజకీయ ప్రతిరూపమని” కూడా కొనియాడారు.
మరోవైపు, జర్మనీలో శక్తివంతమైన నాయకుడైన అడాల్ఫ్ హిట్లర్, నానాజాతి సమితిని వ్యతిరేకించి, 1930వ దశాబ్దంలో నాజీ పరిపాలనను స్థాపించాడు. నాజీ పరిపాలన వెయ్యేండ్లు నిలుస్తుందని, కేవలం దేవుని రాజ్యం మాత్రమే సాధించగలదని బైబిలు చెబుతున్న దానిని అది సాధిస్తుందని ఆయన నొక్కి చెప్పాడు. హిట్లర్ ఇలా అన్నాడు: “నేను యౌవనస్థులతో ప్రారంభిస్తున్నాను, వారితో నేను ఒక నూతన లోకాన్ని తయారు చేయగలను.”
నాజీ బలపరాక్రమాన్ని చాటిచెప్పేందుకు న్యూరెంబర్గ్‌లో హిట్లర్ ఒక పెద్ద స్టేడియం నిర్మించాడు. గమనించదగినదేమంటే, దాదాపు 1,000 అడుగుల పొడవున్న వేదికపై 144 బారీ స్తంభాలను నిలబెట్టాడు. ఈ 144 స్తంభాలు ఎందుకు? “గొర్రెపిల్ల” అయిన యేసుక్రీస్తుతోపాటు 1,44,000 మంది పరిపాలిస్తారని, వారి పరిపాలన వెయ్యేండ్లు ఉంటుందని బైబిలు తెలియజేస్తుంది. (ప్రకటన 14:1; 20:4, 6) నాజీ అధికారులు బైబిలు భాషను, సూచనలను వాడారనుటకు కావలసినంత ఆధారముంది కనుక న్యూరెంబర్గ్ స్టేడియంలో 144 స్తంభాలను నిలబెట్టడమన్నది యాదృచ్చికంగా జరగలేదనుట స్పష్టమే.
కేవలం దేవుని రాజ్యం మాత్రమే సాధించగలదని బైబిలు చెబుతున్న దానిని తాము సాధించాలని మానవులు చేసిన ప్రయత్నాల ఫలితమేమిటి?
మానవ ప్రయత్నాల వైఫల్యం
సమాధానకరమైన నూతన లోకాన్ని రూపొందించడంలో నానాజాతి సమితి విఫలమైందని చరిత్ర దృఢంగా సాక్ష్యమిస్తుంది. దేశాలు రెండవ ప్రపంచ యుద్ధంలో నిమగ్నమైనప్పుడు, ఆ సంస్థ కూలిపోయింది. ఆ పిదప కేవలం 12 సంవత్సరాలకే, నాజీ పరిపాలన అంతమైంది. అది పూర్తిగా విఫలమైంది, అది మానవ కుటుంబానికే అవమానకరమైంది.
సమాధానకరమైన నూతన లోకాన్ని సృష్టించాలనే మానవ ప్రయత్నాలు చరిత్రంతటిలో ఒకేరీతిగా విఫలమయ్యాయి. అమెరికా మాజీ విదేశాంగ మంత్రియైన హెన్రీ కిస్సింగర్ ఇలా అన్నారు: “గతంలోవున్న ప్రతి నాగరికత చివరికి పతనమైంది. ఫలించని ప్రయత్నాలు, నెరవేరని ఆశల కథలతో నిండిందే చరిత్ర.”
మరి, నూతన లోక విధానాన్ని గూర్చి ఇటీవల ప్రపంచ నాయకులు పలికిన ప్రగల్భాల మాటేమిటి? జాతివైషమ్యాల పెరుగుదల అలాంటి నూతన లోకాన్ని గూర్చిన ఆలోచననే వెక్కిరించింది. ఉదాహరణకు, ఈ గడిచిన మార్చి నెల 6న, విలియం ఫాఫ్ అనే పత్రికా రచయిత ఇలా అపహసించాడు: “నూతన లోక విధానం వచ్చేసింది. దాడిని, దురాక్రమణను, జాతివిభేదాలను అంగీకరించదగిన అంతర్జాతీయ ప్రవర్తనగా పవిత్రంచేస్తూ, అది చక్కగా పనిచేస్తుంది, నిజంగా అది సరిక్రొత్తది.”
సామ్యవాదం పతనమైనప్పటి నుండి సంభవించిన ఘోరమైన పోరాటాలు, క్రూరకృత్యాలు భయంకరమైనవి. జనవరి నెలలో తన పదవి నుండి విరమణ పొందడానికి కొద్దికాలం ముందు జార్జ్ బుష్ కూడా ఇలా అన్నారు: “కొంతకాలానికి, నూతన లోకం కూడా పాతదానిలా భయంకరంగానే ఉంటుంది.”
నిరీక్షించడానికి కారణం?
పరిస్థితి మరీ నిరాశాజనకంగా ఉందని దీని భావమా? ఒక నూతన లోకం కేవలం ఆపేక్షతో కూడిన స్వప్నమేనా? నిజమే, మానవులు ఒక నూతన లోకాన్ని సృష్టించలేక పోయారు. కాని, అలా చేస్తానన్న సృష్టికర్త వాగ్దానం మాటేమిటి? బైబిలు ఇలా చెబుతుంది: “మనమాయన [దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము.”—2 పేతురు 3:13.
దేవుడు వాగ్దానం చేస్తున్న క్రొత్త ఆకాశములంటే భూమిపై ఓ క్రొత్త పరిపాలనే. ఈ క్రొత్త పరిపాలన అంటే దేవుని రాజ్యమే, ఆయన పరలోక ప్రభుత్వమే, దీని కొరకు ప్రార్థించమనే యేసు ప్రజలకు నేర్పించాడు. (మత్తయి 6:9, 10) ఆ పరలోక ప్రభుత్వం, యేసుక్రీస్తు, 1,44,000 మంది సహపరిపాలకులతో రూపొందుతుంది క్రొత్త భూమి అంటే నూతన మానవ సమాజమై ఉంటుంది. అవును, దేవుని పరిపాలనకు యథార్థంగా మద్దతునిస్తూ వారు మహిమాన్వితమైన నూతన లోకంలో జీవిస్తారు.
వాగ్దానం చేయబడిన నూతన లోకాన్ని దేవుని రాజ్యప్రభుత్వం పరిపాలిస్తుంది. కాబట్టి ఈ నూతన లోకం మానవ నిర్మితం కాదు. ఒక బైబిలు విజ్ఞాన సర్వస్వం ఇలా వివరిస్తున్నది: “దేవుని రాజ్యమంటే, మానవులు లేక ఒక రాజ్యం గైకొనే చర్య కాదు. అది మానవులు సాధించేది కాదు, సమర్పిత క్రైస్తవులు సాధించేది కూడా కాదు. ఆ రాజ్యం దైవిక చర్య.”—ది జోన్‌డెర్‌వెన్ పిక్‌టోర్యల్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ది బైబిల్.
దేవుని రాజ్యం ద్వారా నూతన లోకం తప్పక వస్తుంది. అది వస్తుందన్న వాగ్దానాన్ని మీరు నమ్మవచ్చు ఎందుకంటే, ఆ వాగ్దానం చేసింది “అబద్ధమాడనేరని దేవుడు.” (తీతు 1:2) దేవుని నూతన లోకం ఏ విధంగా ఉంటుందో దయచేసి పరిశీలించండి. (g93 10/22)
[Picture Credit Line on page 3]
NASA photo