వివాహం—అనేకులెందుకు ఆ బంధాన్ని తెంచుకుంటారు?
తూర్పు, పాశ్చాత్య దేశాల సంస్కృతులు రెండూ నిలయమై ఉన్న హాంకాంగ్‌లో విడాకులపై దృష్టిని సారిస్తూ, ఆసియా మ్యాగజీన్ ఈవిధంగా తెల్పింది: “చైనీయులలోనూ పాశ్చాత్య దేశాల జంటల్లోనూ సంభాషించుకొనక పోవడం, దాంపత్యద్రోహం, లైంగిక సమస్యలు, ఇద్దరికి పొసగక పోవడం అనేవి సాధారణంగా వివాహసంబంధ కొట్లాటలకు కారణాలైయున్నవి.” ప్రపంచంలో యితర ప్రదేశాల్లో కూడ యిదే పరిస్థితి నెలకొనియుంది.
పురుషులు, స్త్రీలు యిద్దరూ కూడ ఉద్యోగమే ప్రధానమనే మనస్తత్వంతో వారి పనికోసం తమ కుటుంబాలను కూడ త్యాగం చేయడానికి సిద్ధపడతారు. ఆవిధంగా, అది కుటుంబ సంభాషణకు అవరోధం కల్గిస్తుంది. రోజంతా పనిచేసిన తర్వాత అలసిపోయి, భర్త వార్తాపత్రిక చదువుటలో లీనమైపోతాడు. జున్ఈచీ, అతని భార్య మూడు రెస్టారెంట్లను నడిపిస్తూ ఉదయం ఎనిమిది గంటలనుండి రాత్రి పది గంటల వరకూ వేర్వేరు స్థలాల్లో పనిచేసేవారు. “భార్యాభర్తలుగా మాయిద్దరి మధ్య యథార్థంగా పరస్పర సంభాషణంటూ లేదు,” అని జున్ఈచీ ఒప్పుకుంటున్నాడు. ఈ సంభాషణ లోపించడమే గంభీరమైన వైవాహిక సమస్యలకు దారితీసింది.
వివాహ బంధాల్ని తెంచుకొనటానికి నడిపించే మరొక కారకమేమంటే వివాహేతర లైంగికత యెడలగల ప్రజల దృక్పథం. వివాహజతతో కాకుండా వేరే వ్యక్తులతో లైంగిక సంబంధాన్ని కల్గియుండుట ప్రస్తుతం ప్రబలంగా వుంది, కనుకనే జపాన్‌లో జరిపిన ఒక సర్వేలో పురుషుల్లో 20 శాతంమంది, స్త్రీలల్లో 8 శాతంమంది వారి ఏకైక పతి లేదా పత్నితో కాకుండా బయటవారితో గడచిన ఒక సంవత్సరంలోపులోనే లైంగిక సంబంధాలను కల్గివున్నామని ఒప్పుకున్నారు. జపాన్‌లో ఉద్యోగం చేసే స్త్రీలు, వారి భర్తలుకాని పురుషులతో లైంగిక సంబంధం కల్గియుండటం అసాధారణమేమీ కాదు. “ఒకవేళ నా భర్త గమనిస్తే, నేను విడాకులిచ్చేస్తానంతే” అని అనుకుంటూ, ఆమె ఒక మగాడిని విడిచి మరొక మగాడితో పోతుంటుంది. ఆధునిక సమాజం ఈ వ్యవహారాలను చూసీ చూడనట్టున్నది.
అదే సమాజం నేనే ముందు అనే దృక్పథాన్ని ప్రోత్సహిస్తున్నందువలన భార్యాభర్తలిద్దరూ స్వాభిమానులుగా తయారౌతున్నారు, ఇందువల్ల ఇద్దరికి పొసగక ఇది విడాకులకు కారణమౌతుంది. “ఒక జంటగా ఆరంభంనుండి మా వివాహం పఠిష్టంగా లేదుగనుక మేము ఎప్పుడైనా విడిపోయివుండేవాళ్లం,” అని కియోకొ చెబుతున్నది. “వివాహమైన వెంటనే, నా భర్త నన్ను ఒక మరమనిషిలానే ఉండాలంటూ, నేను చెప్పేది చేయాలని అన్నాడు. అన్నీ ఆయనకు సవ్యంగా జరిగితే, అది అంత చెడుకాదు, కాని ఆయనకు సవ్యంగా సాగకపోతే, ఆయన తన తప్పుల్ని ఒప్పుకోడు, ప్రతీదానికి యితరులపైనే తప్పుమోపుతాడు. నేను అధికారానికి వ్యతిరేకంగా పోరాడేదాన్ని గనుక, నన్ను కూడ నిందించేవాడు, నా భర్త అన్యాయంగా వ్యవహరించినప్పుడు, ఆయనకు లోబడియుండుట నాకు చాలా కష్టంగా ఉండేది.”
దౌర్జన్యం, త్రాగుబోతుతనం, ఆర్థిక సమస్యలు, అత్తమావలు, వారి పిల్లలతో ఎదుర్కొనే కష్టాలు, మానసిక క్షోభ అనేవి విడాకులకు దారితీసే యితర కారణాలు.
విడాకుల వెనుకనున్న కారణమేమిటి?
విడాకులకు వేర్వేరు కారణాలున్నప్పటికిని, ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రరూపం దాల్చడానికి వీటికంటే మరెక్కువైన మరో కారణం ఉంది. తూర్పు ప్రాంతాలు తమ దుష్పరిణామాలకు పాశ్చాత్య సమాజ ప్రభావాన్ని నిందిస్తున్నప్పటికీ, పాశ్చాత్య దేశాల్లో విడాకులకు అంగీకారం తెల్పడమనేది ఇటీవలనే కనబడుచున్నది. నిజానికి, గత కొన్ని దశాబ్దాలలో కంటే అమెరికాలో విడాకుల సంఖ్య మూడింతలు కాగా, బ్రిటన్‌లో నాలుగింతలు ఎక్కువైంది. విడాకులు పెరగటానికిగల కారణాలను సరిగ్గా అర్థం చేసుకోలేక పోయినప్పటికీ, “స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యత వృద్ధిచెందడమనేది, సామాజికంగా సమాజంలో మారుతున్న దృక్పథాలనేవి” విడాకుల ధోరణికి కారకాలని అర్బన్ ఇన్స్టిట్యూట్కు (అమెరికాలో సాంఘిక, ఆర్థిక స్థితిగతులను అన్వేషించే ఒక పరిశోధన సంస్థ) చెందిన ఆండ్రూ జె. చెర్లిన్ ఒప్పుకుంటున్నాడు.
అమెరికాలో, అలాగే యితర పారిశ్రామిక దేశాల్లోని స్త్రీలు, వివాహమాడటం, బయట పనిచేయడమనేది యిక ఎన్నటికీ అసాధారణమేమీ కాదు. అయినప్పటికి, యింట్లో చేయవలసిన పనులలో భర్త వంతు మందగొండిగా సాగుతుంది. కాబట్టి కొందరు స్త్రీలు “ఉద్యోగంచేసే ప్రతీ స్త్రీకి యింట్లో ఆమె చేసే పనులను చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా!” అంటూ సణుగుకొనడం ఆశ్చర్యాన్ని కల్గించదు.
అమెరికాలో, స్త్రీలు బట్టలుతకడం, యింటిని శుభ్రం చేయడం, వంటచేయడం, పిల్లలను చూచుకోవడం మొదలైన పనులను చేతులరిగేలా చేస్తుండగా “చాలామంది పురుషులు వృధాగా ‘కాలక్షేపం చేయడంలో’ ఆనందిస్తారు” అని ది చేంజింగ్ అమెరికన్ ఫ్యామిలి అండ్ పబ్లిక్ పాలసి అనే పుస్తకం చెబుతున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నదేనని మానవ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జపాన్‌లో పని అయిన తర్వాత బయటకు వెళ్లి యితరులతో సహవసించడం పురుషజాతికి అసాధారణమేమీ కాదు. వారు గృహంలో మంచి మానవ సంబంధాలను నిర్లక్ష్యం చేస్తూనే, ఉద్యోగ స్థలాల్లో మంచి మానవ సంబంధాల కొరకు అలా చేయడం ఖచ్ఛితంగా కోరదగినదని వారంటున్నారు. పురుషుల తర్కన ప్రకారం, వారే పోషణకర్తలు గనుక, స్త్రీలు పిల్లలు ఫిర్యాదులు చేయకూడదు. అయినప్పటికి, చాలామంది స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు గనుక, అలాంటి ఆలోచన కేవలం సాకులు చెప్పడానికి మాత్రమే చూపించబడింది.
వైవాహిక వైఫల్యానికి మరొక ముఖ్య కారకమేమనగా “సామాజికంగా సమాజంలో మారుతున్న దృక్పథాలనేవి” లేదా జర్నల్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ది ఫ్యామిలి వ్రాసినట్లుగా ఇది, “ఆదర్శ వైవాహిక స్థిరత్వాన్ని నిరాకరించడమే.” ఈ 1990వ దశకంలోని వధూవరులకు “మరణ పర్యంతం ఒకరికొకరు విడిపోము” అనే సాంప్రదాయిక వివాహ ప్రమాణం యిక ఎన్నటికీ అదే భావాన్ని కల్గిలేదు. వారెప్పుడూ మరోమంచి సహవాసి కొరకే అన్వేషిస్తుంటారు. ఒకవేళ అదే రీతిలో క్రొత్తగా వివాహమైన జంటలు వారి వివాహ బంధాన్ని దృష్టిస్తే, అది ఎంత దృఢంగా ఉంటుంది?
ఈ సాంఘిక మార్పులు బైబిలు విద్యార్థులకు ఏ మాత్రం ఆశ్చర్యాన్ని కల్గించవు. మనము 1914 నుండి “అపాయకరమైన కాలములు” ఉన్నటువంటి “అంత్యదినములలో” జీవిస్తున్నామని ఈ ప్రేరేపిత గ్రంథం తెల్పుతుంది. మనుష్యులు “స్వార్థప్రియులు, . . . కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, గర్వాంధులునైయుందురు.” (2 తిమోతి 3:1-3) కాబట్టి వారి సహవాసులకంటే తమ్మునుతామే ప్రేమించే ప్రజలకు, వారి భర్త లేదా భార్యతో యథార్థంగా లేనివారికి, వారి వివాహంలో ఏవిధమైన ఒప్పందానికి రాలేనివారికి, కేవలం విడాకులనేది మాత్రమే వారి వైవాహిక సమస్యలను దూరం చేసుకోడానికిగల ఏకైక మార్గమౌతుంది.
ఇది సంతోషదాయకమైన జీవితానికి ఒక మార్గమా?
విడాకులనేది చాలా సందర్భాల్లో, సంతోషానికి ఒక మార్గమని అది నిరూపించుకోలేదు.a “విడాకులనేది మోసకరమైనది,” అని మానసిక ఆరోగ్య పరిశోధకురాలైన జూడిత్ వాలర్స్టిన్, 60మంది విడాకులు పొందిన జంటలపై జరిపిన 15 సంవత్సరాల సర్వే అనంతరం చెబుతున్నది. “చట్టపరంగా ఇది ఒక సంఘటన మాత్రమే, కాని మానసికంగా ఇది ఒక గొలుసులాంటిది, అనగా కొన్నిసార్లు చాలాకాలం అటుఇటు మారే, ఎన్నటికీ అంతంకాని సంఘటనల పరంపరలైయున్నవి.” ఆమె అధ్యయనాలు చూపెట్టేదేమంటే, నాలుగింట ఒకవంతు స్త్రీలు, పురుషులలో ఐదువంతులమంది, విడాకులు పొందిన ఒక దశాబ్దం తర్వాత కూడ సాధారణ జీవనపద్ధతికి తిరిగి చేరుకోలేదు.
ముఖ్యంగా విడాకులు పొందినవారి పిల్లలే దాని ప్రభావానికి అనువైన వారు. ఇదే పరిశోధనద్వారా, వాలర్స్టిన్ గుర్తించిందేమంటే, యిమిడియున్న పిల్లలందరిమీద యీ విడాకులు “బలమైన, పూర్తిగా కోరదగని ప్రభావాలనే” తెచ్చిపెట్టింది. వారి తలిదండ్రుల విడాకులను గూర్చిన ఏ వ్యతిరేక భావాలనైనా వ్యక్తపరచని పిల్లలు కొందరు వారి జీవితాల్లో వారు వివాహ జతకొరకు ఎదురుచూచినప్పుడు, హఠాత్తుగా అలాంటి భావాలను వ్యక్తం చేయవచ్చును.
ఇది విడాకులకు గురైనవారంతా యిక ఎన్నడూ సంతోషం పొందలేరని సూచించుట కాదు, ఎందుకంటే కొందరు సంతోషంగానే ఉన్నారు. వీరిలో, ఒక నూతన రూపందాల్చిన వ్యక్తిత్వం ఉద్భవిస్తుంది, సాధారణంగా ఇది పాత వ్యక్తిత్వం నుండే వస్తుంది. ఉదాహరణకు, ఒకసారి విడాకులకు సంబంధించిన విభ్రాంతి, దానితోపాటు వచ్చే వేదన, స్వయం విలువను గూర్చిన అనుమానాలన్నీ పోయిన తర్వాత, ఒక దృఢమైన, అత్యంత విలువగల్గిన, సంపూర్ణమైన ఒక అమాయక సహవాసి అందులోనుండి ఉద్భవించవచ్చును.
తన భర్త వేరొక స్త్రీ నిమిత్తం తనను వదిలేసిన ఒక భార్య, తన బాధ, కోపం తగ్గడం మొదలైన తర్వాత వివరించేదేమంటే, “మీరు లోపల వేరుగానున్నట్లు కనుగొంటారు. మీ భావాలు మారిపోయాయి. మీరు యిక ఎన్నడూ మీరు క్రితమున్న వ్యక్తి కాలేరు.” ఆమె యిలా సలహా యిస్తున్నది: “మరలా మీకై మీరు ఒక వ్యక్తిలా అర్థంచేసుకోడానికి సమయం తీసుకోండి. వివాహంలో జతలు వేరే వ్యక్తికంటే తేడాగా, సాధారణంగా వారి అభీష్టాలను, కోరికలనే ధారపోస్తారు, కాని విడాకులు పొందిన తర్వాత, ప్రస్తుతం మీ యిష్టాయిష్టాలను తెలుసుకోడానికి సమయం వెచ్చించాలి. మీరు మీ భావాలను సమాధి చేస్తే, మీరు వాటిని సజీవంగానే సమాధిచేయండి. ఒకరోజు అవి మరలా తిరిగి వస్తాయి, మీరు వాటిని ఎదుర్కోవలసియుంటుంది. కాబట్టి మీరు మీ భావాలను ఎదుర్కొని, వాటిని జయించవలసి వస్తుందేమో.”
విడాకులు తెచ్చే సమస్యలు తెలిసి రావడంవల్ల, దీన్ని ఎన్నుకోవడానికి సముఖత వ్యక్తం కావడం లేదు. పెరుగుతున్న సలహాదారులు, విపత్తుల్లో చిక్కుకున్న జంటలను: “కలసి జీవించండి” అని ప్రస్తుతం ప్రోత్సహిస్తున్నారని టైమ్ పత్రిక నివేదిస్తున్నది. టఫ్ట్ యూనివర్శిటీకి చెందిన డేవిడ్ ఎల్కిండ్ యిలా వ్రాశాడు: “విడాకులను అనుభవించడం అనేది మంచుకొండల్లో పయనిస్తూ కాళ్లు విరగ్గొట్టుకోవడంలా ఉంటుంది. చాలామంది మీతోపాటు వచ్చినవారు కూడ వాళ్ల కాళ్లు విరగ్గొట్టుకోవడంతో, విరిగిన మీ కాలినొప్పి తక్కువకాదు కదా.”
విడాకులనేది వైవాహిక సమస్యల పరిష్కారానికి సులభమైన మార్గం కాదు. అయితే, వైవాహిక ఒడుదుడుకులను సరిచేయుటకు శ్రేష్ఠమైన మార్గమేమిటి?
[అధస్సూచీలు]
a చట్టబద్ధమైన విడాకులు లేదా చట్టబద్ధమైన పరిత్యాగం అనేది ఒకవేళ విపరీతమైన దెబ్బల బారినుండి లేదా యిష్టపూర్వకంగా మద్దతు యివ్వకపోవడం నుండి కొంతమేరకు సంరక్షణను ఇవ్వవచ్చు.
[7వ పేజీలోని చిత్రం]
భార్యాభర్తలు ఈనాడు ఒకరితోనొకరు తరచు సంభాషించుకోలేరు.