విడాకులు పాశ్చాత్య దేశాల గాలి తూర్పు దేశాలకు సోకుతున్నది
జపాన్‌లోని అవేక్! కరస్పాండెంట్ ద్వారా
“నేను నా పనిని కూడా విరమించుకుంటాను” అని జపాన్‌లో ఒక పెద్ద వాణిజ్య కంపెనీ నుండి ఉద్యోగ విరమణ కాబోతున్న, ఒక ఎగ్జిక్యూటివ్ మేనేజరు విన్న మాటలివి. ఆయన భార్య అతని సహధర్మచారిణిగా నుండుటకు, భార్యగా నుండుటకు విరమించు కోవాలని కోరుకుంది. ఆ దేశం విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది, ఆశ్చర్యం గొలిపేదిగా, వీరిలో మధ్య వయస్కులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఇరవై సంవత్సరాలలో, 50, 60 సంవత్సరాల మధ్య వయస్కుల్లో, విడాకుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. సంతోషదాయక జీవితాన్ని కనుగొనడానికి వారి వివాహబంధం నుండి బయటపడటమే చివరి తరుణంగా కనబడుతున్నది.
మరో వైపు గమనిస్తే, యౌవన జంటలు వారి హనీమూన్‌లోనే ఒకరినొకరు విసుగుచెంది నారిటా రికోన్ (నారిటా విడాకులు) పొందాలని నిశ్చయించుకుంటున్నారు. నారిటా అనేది టోక్యోలోని అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ పదం, నారిటా విమానాశ్రయానికి తిరిగి చేరుకున్నప్పుడు నూతన వధూవరులు ఒకరికొకరు, మరియు వారి వివాహానికి వీడ్కోలు చెప్పుకునేదాన్ని సూచిస్తుంది. నిజానికి, జపాన్‌లో 4 లేక 5 జంటల్లో ఒక జంట విడాకులు తీసుకోడానికి ఎదురు చూస్తారు. విడాకులు సంతోషదాయక జీవితానికి ఒక మార్గమని వారు దృష్టిస్తున్నారు.
చైనీయుల విలువలు ఇప్పటికీ దృఢంగానున్న హాంకాంగ్‌లో కూడ, 1981, 1987 మధ్యకాలంలో అనగా ఆరు సంవత్సరాలలో విడాకుల రేటు రెట్టింపు కంటే మించిపోయింది. సింగపూర్‌లో, 1980, 1988 మధ్యకాలంలో, ముస్లింలలోనూ ముస్లింలు కానివారిలోనూ విడాకులు తీసుకోవడం దాదాపు 70 శాతం పెరిగింది.
తూర్పు దేశాల్లో స్త్రీల దృక్పథాలు చాలా కాలం నుండి అణచివేయబడ్డాయని ఒప్పుకోవలసిందే. ఉదాహరణకు, పాతకాలంలో జపాన్‌లో, ఒక భర్త కేవలం “మూడున్నర లైన్లు” వ్రాసి అతని భార్యకు విడాకులీయ వచ్చును. అతను చేయవలసిందంతా విడాకులకు సంబంధించి మూడున్నర లైనుల ధృవీకరణ పత్రాన్ని వ్రాసి ఆ కాగితపు ముక్కను తన భార్యకు అందజేయడమే. అతని భార్య, దానికి భిన్నంగా, వేధించే భర్తల నుండి దూరంగా పారిపోయే స్త్రీలకు ఆశ్రయమిచ్చే దేవాలయాలను ఆశ్రయించడం తప్ప, విడాకులు పొందడం అంత సులభమేమీ కాదు. ఏ విధంగానూ తమను తాము పోషించుకోలేని కారణంగా, భార్యలు ప్రేమలేని వివాహాలను, వారి భర్తల జారత్వాన్ని కూడ సహించేవారు.
ఈనాడు, ఉద్యోగంలో లీనమైపోయిన చాలామంది భర్తలు, వాస్తవానికి వారి కుటుంబాలను విడిచిపెడుతున్నారు. భర్త తన ఉద్యోగం కొరకే జీవించడంలో తప్పులేదని భావిస్తాడు. ఆ విధంగా పనియెడల గల నిష్ఠతో, అతను తన భార్యతో సంభాషించ వలసిన అవసరతను నిర్లక్ష్యం చేస్తాడు, తన కొరకు వంటచేసి, ఇల్లు శుభ్రంచేసి, బట్టలు ఉతికే జీతంలేని పనిమనిషిలా చూస్తాడు.
అయినప్పటికి, పాశ్చాత్య భావాలు చొచ్చుకోవడంతో, వివాహం యెడల, వివాహజీవితం యెడల తూర్పు దేశ స్త్రీల దృక్పథాలు మార్పు చెందుతున్నాయి. ఆసియా మ్యాగజీన్ పరిశీలిస్తున్నదేమనగా, “స్త్రీల ‘స్వాతంత్ర్యం’ అనేదే ఆసియాలో విడాకుల రేటును పెంచడానికి నడిపించే ఒకేఒక ప్రాముఖ్యమైన కారకమైనట్లుగా కనబడుతున్నది.” సింగపూర్‌లోని కౌన్సలింగ్ అండ్ కేర్ సెంటర్ డైరెక్టర్, ఆంథోని యాయు యిలా చెప్పాడు: “స్త్రీలు వారి హక్కుల యెడల ఎక్కువ నిశ్చితంగా తయారయ్యారు, వారి ప్రతిభ యెడల మరెక్కువ జాగరూకత కల్గియున్నారు. వారు యిక చెడు పరిస్థితులను మౌనంగా సహించుట కిష్టపడటంలేదు. ఈనాటి స్త్రీలు ఎక్కువ అభీష్టాలు కల్గి, నిర్లక్ష్యతను, కొట్టడాన్ని సహించడంలేదు. వివాహ సంబంధ సంతోషాన్ని పొందలేని వారికి విడాకులే శరణ్యం, ప్రాముఖ్యంగా అందును గూర్చిన అవమానం తగ్గించబడినప్పుడు అదే సరియైన ఎంపిక. ఈ అనుమానం 25 సంవత్సరాల క్రితం ఉన్నంతగా ఇప్పుడులేదు.
పాశ్చాత్య దేశాలు కూడా దాదాపు గత 25 సంవత్సరాలలో తీవ్రమైన మార్పులకు గురయ్యాయి. సామ్యూల్ ప్రెస్టెన్ ఈ మార్పును “గత 20 సంవత్సరాల్లో అమెరికా కుటుంబాన్ని తీవ్రంగా చిన్నాభిన్నం చేసిన భూకంపం” అని పిలిచాడు. అత్యధికంగా విడాకుల కారణంగా, 1985లో దాదాపు కుటుంబాలన్నింటిలో నాలుగో వంతు 18 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలతో తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలైయున్నవి. పందొమ్మిది వందల ఎనభైనాలుగులో జన్మించిన 60 శాతం పిల్లలు, తమకు 18 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వారికి తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న గృహంలో జీవిస్తారేమోనని ముందుగానే చెప్పబడింది.
వివాహం బలహీనమౌతున్న ఈ సమాజంలో, విడాకులనేది నిజంగా సంతోషదాయకమైన జీవితానికి మార్గమా? సమాధానం కొరకు మనం మొదటిగా ప్రజలు తమ కుటుంబ సమస్యలకు విడాకులనే సర్వరోగ నివారిణిలా దృష్టించడానికి గల కారణమేమిటో పరిశీలిద్దాము.
[4వ పేజీలోని బాక్సు]
“విడాకులిచ్చినట్లు కలిసి జీవించుట” వలన వచ్చే ఫలితం
వాస్తవమైన విడాకుల సంఖ్య కంటే “పడకింటి” విడాకులే అధికంగా ఉన్నాయి. జపాన్‌లో, చాలామంది స్త్రీలు యింకనూ ఆర్థికంగా వారి భర్తలపైనే ఆధారపడి, నిరంతరం కొనసాగుతున్న సాంప్రదాయిక పురుషాహంకారానికి గురౌతున్న, “పడకింటి విడాకులు” అని పిలువబడే పరిస్థితి వున్న యింట్లో దంపతులు అయిష్టంతోనే కాపురం చేయవచ్చు. అలాంటి పరిస్థితిలో, భార్యలు వారి శక్తినంతా పిల్లలను పెంచుటలోనే ధారపోయడానికి ఉద్దేశిస్తారు. ఈ తల్లులు తరచు అనవసరమైన శ్రద్ధను కనబరుస్తూ, పిల్లలు పెరిగి పెద్దవారై తమస్వంత కాళ్లపై నిలబడటాన్ని కష్టతరం చేస్తున్నారు.
ఫలితంగా, అలాంటి తల్లుల కుమారులు పెద్దవారై వివాహం చేసుకున్నప్పుడు, వారిలో చాలామంది “ఆప్యాయతతో స్పర్శించకూడదనే” దృక్పథంతో బాధపడుతూంటారు. వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత కూడ, వీరు ఎన్నడూ వారి భార్యలను ప్రేమపూర్వకంగా తాకరు. వారు వాళ్ల తల్లి ప్రేమను వదలలేక తల్లి చాటు బిడ్డల్లా “నేను అమ్మనే ప్రేమిస్తా” నంటారు, తమ తల్లులు చెప్పినందువల్లనే వివాహమాడినవారే తరచూ ఎక్కువమంది ఉన్నారు. ఆసాహి ఈవెనింగ్ న్యూస్ ప్రకారం, ప్రఖ్యాత వివాహ సలహాదారుడైన డా. యాసూషె నారెబాయాషె చెప్పేదేమంటే, ఈ సమస్య ఒక దశాబ్దం నుండి పెరుగుతూనే వుంది, ఎందుకంటే వేలాదిమంది పురుషులు సలహా పొందడానికి సిగ్గుపడుతున్నారు.