కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 8/8 పేజీలు 17-20
  • విజ్ఞానం—మానవుని నిరంతర సత్యాన్వేషణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విజ్ఞానం—మానవుని నిరంతర సత్యాన్వేషణ
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మొదటి జంతుశాస్త్ర నిపుణుడు దారి చూపుట
  • బబులోను అంతటా వుంది
  • క్రమేపి వృద్ధి చెందుట
  • అవును, ఎల్లప్పుడూ వున్న గ్రీకులు
  • విజ్ఞానశాస్త్రం మానవుని నిరంతర సత్యాన్వేషణ
    తేజరిల్లు!—1993
  • విజ్ఞానశాస్త్రం—మానవుని నిరంతర సత్యాన్వేషణ
    తేజరిల్లు!—1993
  • విజ్ఞానశాస్త్రం—మానవుని నిరంతర సత్యాన్వేషణ
    తేజరిల్లు!—1993
  • విజ్ఞానశాస్త్రం—మానవుని నిరంతర సత్యాన్వేషణ
    తేజరిల్లు!—1993
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 8/8 పేజీలు 17-20

భాగం 2

విజ్ఞానం—మానవుని నిరంతర సత్యాన్వేషణ

అన్వేషణ మొదలు

“మొదట అగ్నిని ఎవరు కనుగొన్నారు, చక్రాన్ని ఎవరు కనిపెట్టారు, విల్లును అంబును ఎవరు రూపొందించారు, సూర్యోదయ సూర్యాస్తమయాలను వివరించటానికి ఎవరు ప్రయత్నించారనే విషయం ఎవరికీ తెలియదు” అని ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా తెలియజేస్తున్నది. అయితే, అవన్నీ కనుగొనబడి, కనిపెట్టబడి, రూపొందింపబడి, వివరించబడ్డాయి, మరి అప్పటి నుండి ప్రపంచం మార్పు చెందుతూనే వుంది.

ఇప్పటికి ఆరువేల సంవత్సరాలుగా సాగుతున్న యీ సత్యాన్వేషణా పయనంలో సాధించిన యీ కార్యాలన్నీ తొలిఅడుగులే. మానవులెప్పుడూ తమ చుట్టూవున్న సజీవ, నిర్జీవ వస్తువులను గూర్చి తెలుసుకోవాలన్న జిజ్ఞాస, కోరిక కలిగివున్నారు. తాము నేర్చుకున్నవాటిని తమకు లాభం కలిగేలా ఆచరణాత్మకమైన రీతిలో అవలంభించాలన్న ఆసక్తిని కూడా వారు ఎల్లప్పుడు కలిగివున్నారు. విజ్ఞాన సత్యం కొరకు మానవుని నిరంతరాన్వేషణలో జ్ఞానం కొరకైన సహజసిద్ధ జిజ్ఞాస, దానిని అవలంభించాలన్న కోరిక పురికొల్పే శక్తులుగా పనిచేసాయి.

వాస్తవమే, వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టే తొలి ప్రయత్నాలు, ఈనాడు పిలువబడుతున్నట్లు సాంకేతిక విజ్ఞానమని ఆనాడు పిలువబడలేదు. అలాంటి ప్రయత్నాలు చేసిన వ్యక్తులు కూడ విజ్ఞాన శాస్త్రవేత్తలని పిలువబడలేదు. వాస్తవానికి, మానవజాతి ఉనికిలోని అధికభాగమందు ఇప్పటి విజ్ఞానశాస్త్రం అసలు లేనేలేదు. ఆంగ్లకవి చౌసర్‌ 14వ శతాబ్దంలో “విజ్ఞానం” అనే పదాన్ని కేవలం వివిధ రకాలైన జ్ఞానాలను వుద్దేశిస్తూ దాన్ని ఉపయోగించాడు. లాటిను పదమైన “తెలుసుకొనుట” అనే వ్యుత్పత్తిశాస్త్ర పదానికి పొందిక కలిగివున్నది.

మొదటి జంతుశాస్త్ర నిపుణుడు దారి చూపుట

ప్రాథమికంగా అది ఏమని పిలువబడినప్పటికీ, ఏదేను తోటలో తమ చూట్టువున్న ప్రపంచాన్ని మానవులు పరిశోధించడం మొదలు పెట్టినప్పుడే, విజ్ఞానశాస్త్రం ప్రారంభమైంది. హవ్వ సృష్టింపబడక మునుపే, జంతువులకు పేర్లుపెట్టే పని ఆదాముకు ఇవ్వబడింది. వాటికి తగినపేర్లు పెట్టడానికి ఆయన వాటి గుణలక్షణాలను, వాటి అలవాట్లను జాగ్రత్తగా పరిశీలించ వలిసిన అవసరత వుండెను. ఈనాడు, దీన్ని మనం జంతుశాస్త్రం అని పిలుస్తున్నాము.—ఆదికాండము 2:19.

ఆదాము, హవ్వల మొదటి సంతానమైన కయీను, “ఒక ఊరు కట్టించెను,” గనుక దానికవసరమైన పరికరాలను రూపొందించు కొనుటకు ఆయన యొద్ద తగిన వైజ్ఞానిక పరిజ్ఞానం వుండియుండవచ్చు. తరువాత, ఆయన వంశస్థుడైన తూబల్కయీను “పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు” అని పిలువబడ్డాడు. అప్పటికి వైజ్ఞానిక పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం బాగా వృద్ధి చెందాయి.—ఆదికాండము 4:17-22.

బైబిలులో మొదటిదిగా తెలుపబడిన ఐగుప్తు, ప్రపంచ ఆధిపత్య మయినప్పుడు, అతిపెద్ద పిరమిడ్లను నిర్మించగలిగే స్థాయికి ఐగుప్తీయుల వైజ్ఞానిక పరిజ్ఞానం ఎదిగింది. ఈ పిరమిడ్ల ఆకృతి విషయంలో “ఎన్నో ప్రయోగాలు చేసిన తరువాత విజయం సాధించారు, దానివల్ల గొప్ప వాస్తుశాస్త్ర సమస్యలు పరిష్కరింపబడ్డాయి” అని ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా అంటున్నది. ఈ సమస్యలను పరిష్కరించుటకు గణితశాస్త్రాన్ని గూర్చిన తగిన పరిజ్ఞానం అవసరమయ్యింది మరియు గణిత శాస్త్రానికి సంబంధించిన కొన్ని వైజ్ఞానిక నైపుణ్యాలు కూడా ఉనికిలోకి వచ్చాయి.

వైజ్ఞానిక జిజ్ఞాస కేవలం ఐగుప్తీయులకే పరిమితం కాదు. బబులోనీయులు క్యాలండర్‌నే గాక, సంఖ్య, కొలమానములను కూడా రూపొందించారు. తూర్పున చైనా నాగరికత వైజ్ఞానికపరంగా ఎంతో విలువైన సహాయం చేసింది. అమెరికాలలోని ఇన్‌కా, మాయా తెగల పూర్వీకులు, “వెనుకబడిన వారి” నుండి అలాంటి కార్యాలను ఎంతమాత్రం ఎదురుచూడని యూరపు అన్వేషకులను చాలా కాలానికి ఆశ్చర్యపరచిన ఒక అధునాతన నాగరికతను రూపొందించారు.

అయిననూ, ఈ ప్రాచీన ప్రజలు వైజ్ఞానిక సత్యాలుగా భావించినవన్నీ వైజ్ఞానికపరంగా సరైనవని రుజువుకాలేదు. బబులోనీయులు వైజ్ఞానిక పరిశోధన కొరకు ఉపయోగకరమైన పరికరాలను తయారు చేయడమేకాక “జ్యోతిశ్శాస్త్రం అనే కృత్రిమ విజ్ఞానశాస్త్రాన్ని కూడ రూపొందించారు” అని ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతున్నది.a

బబులోను అంతటా వుంది

బైబిలు విద్యార్థులకు ప్రాచీన బబులోను అంటే అబద్ధ ఆరాధనతో సమానం. అక్కడ ఆచరింపబడే జ్యోతిశ్శాస్త్రంలో, ఆకాశంలోని ఒకొక్క భాగంపై ఒక్కొక్క దేవుడు ఆధిపత్యం వహిస్తాడనే నమ్మకముంది. జ్యోతిశ్శాస్త్రం అని పిలువబడే కృత్రిమ విజ్ఞానశాస్త్రాన్ని నిరాకరించి, ఒకే ఒక సత్యదేవుడున్నాడని బోధించే బైబిలు, వైజ్ఞానికపరంగా సరైనదే.—ద్వితీయోపదేశకాండము 18:10-12; 1 కొరింథీయులు 8:6; 12:6; ఎఫెసీయులు 4:6.

మతం తొలిమానవుని జీవితంలో ఓ అంతర్గత భాగంగా వుండేది. గనుక వైజ్ఞానిక పరిజ్ఞానం మతసంబంధమైన నమ్మకాలు, ఉద్దేశాలను మించి ఎదగలేదని అర్థమౌతుంది. ఇది ప్రాముఖ్యంగా వైద్యశాస్త్ర రంగంలో కనిపిస్తుంది.

“ప్రాచీన పరిపాలనలో ఐగుప్తు యొక్క సమాజాన్ని, వైద్యాన్ని గూర్చి వివరిస్తున్న ప్రాచీనప్రతులు, ఇంద్రజాలం మరియు మతం అనేవి అశాస్త్రీయ, అనుభవపూర్వక హేతువాదసంబంధ వైద్యవిధానంతో అంతర్గతంగా ముడిపడి వున్నాయని, ఫరో సభలో ప్రధాన ఇంద్రజాలికుడు అనేకసార్లు దేశానికి ప్రధానవైద్యుడిగా కూడా సేవచేసేవాడు” అని ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తెలియజేస్తున్నది.

ఐగుప్తు యొక్క మూడవ రాజవంశంలో, ఇంహోటెప్‌ అనే పేరుగల ఒక ప్రముఖశిల్పి, నైపుణ్యంగల వైద్యుడిగా పేరు సంపాదించాడు. ఆయన చనిపోయి శతాబ్దం తిరుగకముందే, అతడు ఐగుప్తు యొక్క వైద్యదేవునిగా ఆరాధింపబడ్డాడు. సా.శ.పూ. ఆరవ శతాబ్దాంతానికి ఆయన ఒక ప్రముఖ దేవునిగా ఉన్నత స్థానాన్ని అలంకరించాడు. ఆయనకు సమర్పించబడిన ఆలయాలు, “తమ రోగాలకు తగిన చికిత్సను దేవుడు తమకు కలలో తెలియజేస్తాడనే నమ్మకంతో ప్రార్థిస్తూ, అక్కడే పడుకునే బాధితులతో ఎప్పుడూ క్రిక్కిరిసి ఉండేవని” బ్రిటానికా తెలియజేస్తున్నది.

ఐగుప్తు, బబులోను దేశాల్లో ఇలా స్వస్థపరిచే వ్యక్తులు, మతసంబంధమైన ఉద్దేశాలతో బాగా ప్రభావితులయ్యేవారు. “ఆ కాలంలో అలాగే రాబోయే తరాలలో, శరీరాన్ని లోబరచుకొనివున్న దుష్టాత్మలు లేక దయ్యాల మూలంగానే జ్వరాలు, అంటురోగాలు, నొప్పులు, బాధలు వస్తాయన్న నమ్మకం సర్వత్రా వుండేది” అని ది బుక్‌ ఆఫ్‌ పాపులర్‌ సైన్స్‌ తెలియజేస్తున్నది. ఆ కారణం వల్లనే సాధారణంగా వైద్యచికిత్సలో మతసంబంధ అర్పణలు, మంత్రోచ్ఛరణములు లేక మంత్రతంత్రములు ఇమిడివుండేవి.

కొంతకాలానికి, సా.శ.పూ. నాలుగు, ఐదు శతాబ్దాలలో హిప్పోక్రేట్స్‌ అనే పేరుగల ఒక గ్రీకు వైద్యుడు ఈ ఉద్దేశాన్ని సవాలుచేశాడు. ఇప్పటికీ సాధారణంగా, వైద్యపద్ధతికే రూపునిచ్చినట్లుగా భావించబడే హిప్పోక్రటిక్‌ ప్రమాణాన్ని బట్టి ఆయన విశేషమైన పేరు పొందాడు. “మానవుని అనారోగ్యానికి కారణం తెలుసుకోవడంలో యాజకులతో సహితం పోటీపడిన వారిలో హిప్పోక్రేట్స్‌ మొదటివాడని” మూమెంట్స్‌ ఆఫ్‌ డిస్‌కవరీ—ది ఆరిజిన్స్‌ ఆఫ్‌ సైన్స్‌ అనే పుస్తకం తెలియజేస్తున్నది. వైద్యం చేయటానికి వైజ్ఞానిక పద్ధతులను అవలంభించడం ద్వారా ఆయన రోగాలకు సహజ కారణాలను కనుగొన్నాడు. మతసంబంధ మూఢవిశ్వాసం, ఊహాధారిత క్రియల స్థానాన్ని ఆలోచన మరియు అనుభవం ఆక్రమించడం మొదలెట్టాయి.

వైద్యాన్ని మతసంబంధ సిద్ధాంతం నుండి వేరుచేయడంలో హిప్పోక్రేట్స్‌ అనుకున్నది సాధించాడు. అయినప్పటికీ, ఈనాటికి కూడా వైద్యం యొక్క మతపరమైన ఆధారాన్ని మనం చూడవచ్చు. దానికున్న గుర్తు కూడ ఒక పాము ఎస్‌క్లెపియస్‌ అనే గ్రీకుల వైద్య దేవుని చేతికర్రకు చుట్టుకొని ఉన్నట్లు ఉంటూ, పవిత్రసర్పాలను ఉంచే ప్రాచీన స్వస్థతాలయాలకు సంబంధం వుంది. ఈ సర్పాలు “జీవనం పునరుద్ధరింప బడుటకును, ఆరోగ్యంతో పునర్జన్మించే సామర్థ్యాలకు చిహ్నంగా ఉన్నాయని” ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలీజన్‌ తెలియజేస్తున్నది.

ఆ తరువాత హిప్పోక్రేట్స్‌ వైద్యానికి తండ్రిగా గుర్తింపు పొందాడు. అయితే అది కొన్నిసార్లు ఆయన విజ్ఞానపరంగా తప్పిదస్థుడు కాకుండా ఆపలేక పోయింది. ది బుక్‌ ఆఫ్‌ పాపులర్‌ సైన్స్‌ ఆయన వెలిబుచ్చిన కొన్ని సవ్యంకాని అభిప్రాయాలు “ఈనాడు మనకు చాలా విడ్డూరంగా కనిపించవచ్చు” అని చెప్తూ, అయితే “ఇప్పుడు చాలా దృఢంగా స్థాపించుకొనివున్న వైద్యసూత్రాలు, భవిష్యత్‌ తరాలవారికి అంతే విడ్డూరం అనిపించవచ్చు” అని వైద్యపరమైన కాఠిన్యమును గూర్చి హెచ్చరిస్తున్నది.

క్రమేపి వృద్ధి చెందుట

అలా, శతాబ్దాలుగా పొరపాటుపడిన సూత్రాలలో నుండి వాస్తవాలను సమకూర్చుకొను ఆవశ్యకతను ఏర్పరచుకొని వైజ్ఞానిక సత్యాలను కనుగొనడమన్నది క్రమేపి జరుగుతూ వస్తున్నది. అయితే ఇది సాధ్యపడటానికి ఒక తరం కనుగొన్న వాటిని ఇంకొక తరానికి ఖచ్చితంగా అందజేయవలసి వుంటుంది. ఇలా చేయటానికి నోటితో చెప్పడమే ఒక మార్గమైంది, ఎందుకంటే, మానవులు మాట్లాడగలిగే శక్తితో సృష్టించబడ్డారు.—ఆదికాండము 2:23 పోల్చండి.

ఇలా తెలుసుకున్న వాటిని ఇతరులకు అందజేసే పద్ధతి, వైజ్ఞానిక, సాంకేతిక అభివృద్ధి కోరేవిధంగా, ఖచ్చితంగా నమ్మదగినదిగా లేదు. అందుకే సమాచారాన్ని వ్రాతరూపంలో భద్రపరచాల్సిన అవసరత స్పష్టంగా కనబడింది.

మానవులు ఎప్పుడు వ్రాయడం మొదలెట్టారన్నది తెలియదు. కాని ఒకసారి మొదలెట్టారు, ఇక ఇతరులు దానిని అభివృద్ధి చేయగలిగేలా సమాచారాన్ని అందజేసే అద్భుతమైన పద్ధతి వారికి లభించింది. పేపరు కనుగొనబడక పూర్వం బహుశా సా.శ. 105లో చైనాలో బంకమట్టి పత్రాలు, రెల్లు, చర్మం వంటి వాటిపై వ్రాసేవారు.

సంఖ్యలు మరియు కొలమాన పద్ధతులు లేకుండా సరైన వైజ్ఞానికాభివృద్ధి సాధ్యమైయుండేది కాదు. వాటి అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత వుంది. గణితశాస్త్ర అన్వయింపులు “విశ్వమంతట అవసరమైనవేననియు, వాటి పరిశీలన ఎన్నో అత్యంత ప్రాముఖ్యమైన వైజ్ఞానిక అభివృద్ధులకు దారితీసింది.” అని ది బుక్‌ ఆఫ్‌ పాపులర్‌ సైన్స్‌ మనకు గుర్తుచేస్తున్నది. గణితశాస్త్రం “రసాయన శాస్త్రజ్ఞునికి, భౌతిక శాస్త్రవేత్తకు, ఖగోళశాస్త్రజ్ఞునికి, ఇంజినీరుకు మరియు ఇతరులకు అమూల్యమైన పరికరంగా” కూడా పనికి వస్తుంది.

శతాబ్దాలుగా ఇతర అంశాలు కూడ వైజ్ఞానిక సత్యాన్వేషణా వేగాన్ని పెంచాయి. ది బుక్‌ ఆఫ్‌ పాపులర్‌ సైన్స్‌ ఇలా వివరిస్తున్నది: ఉదాహరణకు ప్రయాణమనేది, “క్రొత్త దృశ్యాలు, శబ్దాలు, వాసనలు, రుచుల వల్ల విదేశాలకు వెళ్లే ఒకవ్యక్తి యొక్క ఆసక్తిని ఇంకా పెంచుతుంది. క్రొత్త ప్రదేశంలో విషయాలు ఎందుకు వేరుగా వున్నాయి అని అడగటానికి మానవుని కుతూహలం పెరుగుతుంది. తన ఆసక్తిని తృప్తిపరచుకొనే ప్రయత్నంలో మానవుడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ప్రాచీన గ్రీకుల విషయంలో అదే జరిగింది.”

అవును, ఎల్లప్పుడూ వున్న గ్రీకులు

మత, రాజకీయ, లేక వాణిజ్యం యొక్క చరిత్ర చదివితే, గ్రీకులను గూర్చి ఎక్కువగా చెప్పబడినట్లు గమనిస్తారు. పేరుగాంచిన వారి తత్వవేత్తల గురించి, “జ్ఞానం యెడల ప్రేమ” అనే భావంగల గ్రీకు పదమే ఫిలసోఫియా అని తెలియని వారెవరు? మొదటి శతాబ్దంలో క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వారి దేశాన్ని దర్శించినప్పుడు, జ్ఞానం యెడల గ్రీకులకున్న ప్రేమ, తెలివి కొరకు వారికున్న దాహం పేరుగాంచాయి. వారు “ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు” అని ఆయన ఎపికూరీయులు, స్తోయికులను గూర్చి మాట్లాడుతూ అన్నాడు.—అపొస్తలుల కార్యములు 17:18-21.

ప్రాచీన ప్రజలందరిలోకి గ్రీకులే విజ్ఞానశాస్త్రానికి ఎంతో దోహదం చేశారనడంలో ఆశ్చర్యం లేదు. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా దానినిలా విశదీకరించింది: “విశ్వనైజాన్ని, ఆరంభాన్ని గూర్చిన కల్పనా కథల స్థానంలో విశ్వనైజం మరియు ఆరంభాన్ని గూర్చిన సిద్ధాంతాన్ని వివరించుటకు గ్రీకుతత్వశాస్త్రం చేసిన ప్రయత్నం ఆచరణాత్మక వైజ్ఞానిక అన్వేషణలకు దారితీసింది.”

వాస్తవానికి, వైజ్ఞానిక సత్యాన్వేషణకు కొందరు గ్రీకు తత్వవేత్తలు చెప్పుకోదగిన మేలు చేశారు. వారు తమ పూర్వీకుల తప్పుడు అభిప్రాయాలను సిద్ధాంతాలను, తీసివేయటానికి పోరాడారు, అదే సమయంలో వారు సరైనవని తెలుసుకున్న పునాదిపై వాటిని స్థాపించారు. (ఉదాహరణల కొరకు బాక్సు చూడండి) అలా, పూర్వపు గ్రీకు తత్వవేత్తలు ఈనాటి శాస్త్రవేత్తల మాదిరిగానే ప్రాచీన ప్రజల వంటి ఆలోచనే చేసేవారు. ఇటీవలి కాలాల వరకు, “సహజ తత్వశాస్త్రం” అనే పదం విజ్ఞానశాస్త్రం యొక్క వివిధ శాఖలను గూర్చి వివరించటానికి ఉపయోగించ బడింది.

కొంతకాలానికి, తత్వాన్ని ప్రేమించే గ్రీసుదేశం నూతనంగా కనుగొనబడిన రోమా సామ్రాజ్య రాజకీయ ప్రభావం క్రిందికి వచ్చింది. ఇది వైజ్ఞానికాభివృద్ధిపై ఏమైనా ప్రభావం చూపిందా? లేదా క్రైస్తవత్వం రావడం వల్ల మార్పేమైనా వచ్చిందా? మా తదుపరి సంచికలోని మూడవ భాగం దీనికి జవాబిస్తుంది. (g93 4/22)

[అధస్సూచీలు]

a సూర్యచంద్ర నక్షత్రాల కదలికలు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి లేక భవిష్యత్తును చెప్తాయనే నమ్మకాన్ని గూర్చిన అధ్యయనమనబడే జ్యోతిశ్శాస్త్రాన్ని నక్షత్రాలు, గ్రహాలు, ఆత్మసంబంధమైన అర్ధమివ్వని అంతరిక్షంలోని ఇతర సహజ వస్తువులను గూర్చిన వైజ్ఞానిక అధ్యయనమైన ఖగోళశాస్త్రంతో పోల్చి గలిబిలి చేయకూడదు.

[19వ పేజీలోని బాక్సు]

క్రైస్తవకాలానికి ముందున్న గ్రీకు “విజ్ఞానశాస్త్రవేత్తలు”

మిలేటస్‌ యొక్క థేల్స్‌ (ఆరవ శతాబ్దం), ముఖ్యంగా గణితశాస్త్రంలో ఆయన చేసిన పని గురించి, పదార్థమంతటికీ మూలం నీరేనన్న ఆయన నమ్మకానికి ఆయన పేరుగాంచాడు. “వైజ్ఞానిక తలంపులను పెంపొందించుటలో కీలకమైనదని” ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్పిన కాస్మిక్‌ ఆకారాన్ని గూర్చి జాగ్రత్తగా అంచనావేసే పద్ధతిని ఆయన అవలంభించాడు.

సోక్రటీస్‌ (ఐదవ శతాబ్దం) ఆయనను “నిజమైన వైజ్ఞానిక పద్ధతి యొక్క మూలానికి అతిదగ్గరగా వున్న మాండలికం అనే పరిశోధనా పద్ధతికి సృష్టికర్త” అని ది బుక్‌ ఆఫ్‌ పాపులర్‌ సైన్స్‌ పిలిచింది.

అబ్దిరాకు చెందిన డెమోక్రిటస్‌ (ఐదు నుండి నాలుగవ శతాబ్దం) విశ్వ అణు సిద్ధాంతం, పదార్థ అవినాశ్యత, శక్తిని ఆదాచేయడం వంటి సూత్రాలకు పునాది వేయటానికి సహాయం చేశాడు.

ప్లాటో (ఐదు నుండి నాల్గవ శతాబ్దం) తత్వజ్ఞాన సంబంధ, వైజ్ఞానిక పరిశోధనల క్రమబద్ధమైన అనుసరణ కొరకైన సంస్థగా ఏథెన్సులో ఒక విద్యాసంస్థను స్థాపించాడు.

అరిస్టోటిల్‌ (నాలుగవ శతాబ్దం) జ్ఞానంగల జీవశాస్త్రజ్ఞుడు, ఎన్నో రంగాలలో పరిశోధన చేసిన వైజ్ఞానిక సంస్థ అయిన లైసియను స్థాపించాడు. దాదాపు 1,500 సంవత్సరాలకుపైగా ఆయన ఆలోచనలు వైజ్ఞానిక తలంపులపై ఆధిపత్యం వహించాయి, ఆయన అత్యున్నత వైజ్ఞానిక అధికారంగా ఎంచబడ్డాడు.

యుక్లిడ్‌ (నాలుగవ శతాబ్దం), ప్రాచీన కాలపు పేరుపొందిన గణితశాస్త్రవేత్త, “భూమి కొలత” అని భావంగల గ్రీకుపదం నుండి వచ్చిన “రేఖాగణితము”నకు సంబంధించిన జ్ఞానసంకలన కర్తగా పేరుపొందాడు.

నైసియా యొక్క హిపార్‌కస్‌ (రెండవ శతాబ్దం) ఖ్యాతికెక్కిన ఖగోళశాస్త్రజ్ఞుడు, త్రికోణశాస్త్రమును కనుగొన్నాడు, వాటి ప్రకాశాన్ని బట్టి నక్షత్రాలను పరిమాణాలుగా వర్గీకరించాడు. ఈనాటికి ఆ పద్ధతి వాడుకలో వుంది. సా.శ. రెండవ శతాబ్దపు ప్రముఖ భౌగోళికుడు, ఖగోళశాస్త్రవేత్త, హిప్పార్‌కస్‌ యొక్క ముగింపులను విస్తృతపరిచి, విశ్వానికి భూమి మధ్యగా వుందని బోధించిన వాడు అయిన టాల్మీకి పూర్వజ్ఞుడు.

[20వ పేజీలోని చిత్రం]

వైజ్ఞానిక సత్యం మత ప్రభావానికి వేరుగా అభివృద్ధి చెందలేదని గుర్తు చేస్తున్న ఎస్‌క్లెపియస్‌ చేతికర్రను చుట్టుకొని ఉన్న ఒక సర్పం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి