భాగము 1
విజ్ఞానశాస్త్రం మానవుని నిరంతర సత్యాన్వేషణ
“మీరు . . . సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహాను 8:31, 32) తరచూ ఉదహరించబడే జ్ఞానయుక్తమైన ఈ మాటలను, జీవించిన వారిలోకెల్ల మహాగొప్ప మనిషి అని లక్షలాది మంది పరిగణించే వ్యక్తి పలికాడు.a ఆయన మత సత్యాన్ని గూర్చి మాట్లాడుతున్నప్పటికీ, కొన్ని విషయాల్లో, ఏ రంగంలోనున్న సత్యమైనా ప్రజలను స్వతంత్రులుగా చేయగలదు.
ఉదాహరణకు, భూమి బల్లపరుపుగా ఉంది, భూమి విశ్వమునకు మధ్యలో ఉంది, వేడి అంటే కాలొరిక్ అని పిలువబడే ద్రావకమని, కలుషితమైన గాలి రోగాలకు కారణమని, పదార్థంలో పరమాణువు అత్యంత సూక్ష్మమైన కణమనే తప్పుడు ఉద్దేశాలనుండి విజ్ఞానశాస్త్ర సత్యం ప్రజలను స్వతంత్రులుగా చేసింది. పరిశ్రమ, వార్తాసౌకర్యాలు, రవాణా వంటి రంగాలలో విజ్ఞానశాస్త్ర సత్యాల ప్రయోగం వల్ల ప్రజలు అనవసరమైన వెట్టిచాకిరి నుండి విడుదల పొందారు. మరియు ఇది కొంతవరకు కాలవ్యవధిని, దూరపరిధులను కూడ తగ్గించింది. వ్యాధినిరోధక మందులు, ఆరోగ్యనియమాలలో విజ్ఞానశాస్త్ర సత్యాలను అమలుచేయడం వల్ల ప్రజలు రోగభయం లేకుండ లేదా అకాలమరణం చెందకుండ వారికి సహాయపడినవి.
విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?
ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా ప్రకారం, “సూత్రాలతో (నియమాలు) ఐక్యం చేయబడిన వాస్తవాలకు సంబంధించిన విస్తారమైన మానవ పరిజ్ఞానపు రంగమంతా విజ్ఞానమే.” అనేక రకాలైన విజ్ఞానశాస్త్రాలున్నాయి. ది సైంటిస్ట్ అనే పుస్తకం ఇలా అంటుంది: “సిద్ధాంతంలో, ఏవిధమైన పరిజ్ఞానాన్నైనా విజ్ఞానంగా చేయవచ్చు, వైజ్ఞానిక పద్ధతి అనుసరించినప్పుడు జ్ఞానం యొక్క భాగం, ఒక విజ్ఞానశాస్త్ర భాగమౌతుంది.”
ఒక విజ్ఞానం ఎక్కడ మొదలవుతుంది, ఇంకొకటి ఎక్కడ ముగుస్తుంది అనే విషయాన్ని కచ్చితంగా నిర్వచించడానికి కొందరికి కష్టంగా వుంటుంది. వాస్తవానికి, ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా ప్రకారం, “కొన్ని సందర్భాలలో, విజ్ఞానాలు ఒకదానినొకటి ఎంతగా అధిగమిస్తాయంటే, రెండు లేక ఎక్కువ విజ్ఞానభాగాలను కలిపే వివిధవిద్యావిధాన రంగాలు స్థాపించబడ్డాయి.” అయిననూ, అనేక రెఫరెన్సు పుస్తకాలు నాలుగు ముఖ్యమైన విభాగాలను తెలుపుతాయి: భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం, గణిత, తర్కశాస్త్రం.
గణితం కూడ ఒక విజ్ఞానశాస్త్రమా? అవును, సరైన కొలత విధానం లేకుండా ఏదెంతపెద్దదీ, చిన్నదీ, ఏదెక్కువ, తక్కువ, ఏదెంతదూరం, దగ్గర, ఏదెంతవేడిగా, చల్లగా వుంది నిర్ణయించడానికి ఫలవంతమైన వైజ్ఞానిక పరిశోధన అసాధ్యమైయుండేది. అందుకే గణితశాస్త్రం కారణసహితంగానే “విజ్ఞానశాస్త్రపు రాణి మరియు సేవిక” అని పిలువబడింది.
భౌతికశాస్త్రాలలో రసాయనశాస్త్రం, పదార్థవిజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రం ఇమిడి ఉన్నాయి. జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం అనేవి ముఖ్యమైన భాగాలు. మరి సాంఘికశాస్త్రంలో మానవశాస్త్రం, మానవ సంఘాభివృద్ధి శాస్త్రం, ఆర్థికశాస్త్రం, రాజనీతిశాస్త్రం మరియు మనస్తత్వశాస్త్రం చేరివున్నాయి. (8వ పేజీలోని బాక్స్‌ను చూడండి.)
స్వచ్ఛమైన విజ్ఞానానికి అనువర్తిత విజ్ఞానానికి మధ్య భేదమును గుర్తించాలి. మొదటిది కేవలం వైజ్ఞానికవాస్తవాలకు సూత్రాలకు సంబంధించింది; రెండవది వాటిని ఆచరణలో పెట్టేదానికి సంబంధించింది. ఈనాడు అనువర్తిత విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం అని కూడ పిలువబడుతోంది.
సర్వ విధ ప్రయత్నం ద్వారా నేర్చుకొనుట
సత్యం తెలుసుకోవాలన్న మానవుని తపనకు మతం, విజ్ఞానం ఈ రెండు ఉదాహరణలే. అయితే మతసత్యాన్ని ఒక మూలం నుండి విజ్ఞానసత్యం ఇంకొక మూలం నుండి పొందేదాంట్లో చాల తేడా వుంది. మతసత్యం కొరకు వెతికేవ్యక్తి, తాను క్రైస్తవుడా, మహమ్మదీయుడా, యూదుడా, హైందవుడా, లేక బౌద్ధుడా అనేదాని ఆధారంగా అతడు బహుశా పరిశుద్ధ బైబిలు, ఖురాన్, టాల్ముడ్, వేదాలు, లేక త్రిపీటికల వైపు తిరుగుతాడు. అక్కడ అతడు తన మతసత్యాలని పరిగణించబడే వాటిని కనుగొంటాడు అంటే బహుశ అది దైవికమూలం నుండి పొందుతూ దాన్ని అత్యున్నత అధికారంగా భావిస్తాడు.
అయితే, వైజ్ఞానికసత్యాన్ని వెతికేవ్యక్తికి అలా ఆధారపడదగిన అత్యున్నత అధికారగ్రంథంకాని, వ్యక్తికాని లేవు. వైజ్ఞానిక సత్యం వెల్లడికాదు; గాని అది కనుగొనబడింది. దీనికి సర్వ విధప్రయత్న విధానం అవసరం ఎందుకంటే అనేకసార్లు వైజ్ఞానిక సత్యాన్ని వెతికేవ్యక్తి విఫల ప్రయత్నం చేస్తాడు. అయితే క్రమంగా నాలుగు పద్ధతులను అనుసరిస్తే అతని పరిశోధన సఫలమవుతుంది. (“వైజ్ఞానిక పద్ధతిలో సత్యాన్ని కనుగొనుట” అనే బాక్స్‌ను చూడండి.) అయినప్పటికీ, దాదాపు సరియైనవేనని అనుకొనబడే కొత్త వాటికి తావిచ్చుటకు ముందు అంగీకరించబడిన అభిప్రాయాలను తిరస్కరించుట ద్వారా వైజ్ఞానిక ఓటమి యొక్క శిధిలాలపై వైజ్ఞానిక విజయోత్సవాలు జరుపుకొన బడుతున్నాయి.
ప్రయత్నించి ఫలించని ఈ పద్ధతిననుసరించిననూ, వైజ్ఞానికులు శతాబ్దాలుగా మెచ్చుకోదగినంత విజ్ఞానాన్ని పెంపొందించారు. తరచూ పొరపాటు పడినప్పటికీ తీవ్రమైన నష్టం వాటిల్లకముందే లోపంగల పలు నిర్ణయాలను వారు సరిచేసుకున్నారు. వాస్తవానికి, తప్పుడుజ్ఞానం స్వచ్ఛమైన విజ్ఞానరంగంలో ఉన్నంత వరకు తీవ్రమైన హానిజరిగే ప్రమాదం అతితక్కువే. కాని, తీవ్రలోపంగల స్వచ్ఛమైన విజ్ఞానాన్ని అనువర్తిత విజ్ఞానానికి మార్చాలని ప్రయత్నాలు చేసినప్పుడు ఫలితాలు వినాశనకరంగా ఉండగలవు.
ఉదాహరణకు, క్రిమిసంహారకాలను తయారు చేయడానికి దోహదపడిన విజ్ఞానాన్ని తీసుకోండి. వాటిలో కొన్ని మానవ ఆరోగ్యానికి హాని కలుగజేసే పదార్థాలను మిగుల్చుతున్నవని తరువాతి వైజ్ఞానిక పరిశోధనలు వెల్లడిచేసేంత వరకు అవి ఎంతో విలువైనవిగా ఎంచబడేవి. ఉజబెకిస్తాన్, ఖజఖస్తాన్ల సమీపానగల అరల్ సముద్రం దగ్గర నివసించే కొన్ని జాతులవారు క్రిమిసంహారకాలను విస్తృతంగా ఉపయోగించడానికిని, సగటుజాతీయ రేటుకంటె ఏడురెట్లు ఎక్కువగా వారికి ఆహారవాహిక క్యాన్సరు రావడానికి సంబంధం ఉన్నట్లు నిర్థారించబడింది.
భూమిని భద్రపరిచే ఓజోన్ పొర నిజానికి ఒకప్పుడు అనుకున్న దానికంటె అతిత్వరగా నాశనమౌతున్నదని వైజ్ఞానిక పరిశోధన తెలియజేసేంత వరకు గగనతల పిచికారి చేసే క్రిమిసంహారకములు చాల జనాదరణ పొందాయి. గనుక, వైజ్ఞానికసత్యం కొరకు చేసే పరిశోధన నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఈనాటి వైజ్ఞానిక “సత్యాలు” రేపు, నిన్నటి పొరపాటులుగా లేదా ప్రమాదకరమైన ఉద్దేశాలుగా దృష్టించబడవచ్చును.
విజ్ఞానం యెడల మనమెందుకు ఆసక్తి కలిగివుండాలి
మన ఆధునిక ప్రపంచ రూపాన్ని మలచడంలో విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞానం పాత్ర ఎంతో ఉంది. అమెరికా నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్ మాజీ ప్రెసిడెంట్ అయిన ఫ్రెడరిక్ జిట్స్ ఇలా అన్నారు: “మొదట మానసిక అన్వేషణతో ప్రారంభమైన విజ్ఞానం, ఇప్పుడు మన జీవనవిధానపు మూలస్తంభంగా తయారవుతున్నది.” అలా, ఈనాడు వైజ్ఞానిక పరిశోధన, అన్ని రంగాల పురోగతికి సమాంతరంగా తయారయింది. ఆధునిక వైజ్ఞానిక అభివృద్ధిని గూర్చి ప్రశ్నించేవారెవరినైనా “అభివృద్ధికి వ్యతిరేకులు” అనే అనవలసి వస్తుంది. చివరికి, వైజ్ఞానిక అభివృద్ధి అంటే నాగరికుల నుండి అనాగరికులను వేరు చేసేదేనని కొందరి అభిప్రాయం.
ఇరవైవ శతాబ్దపు బ్రిటిషు కవి డబ్లు. హెచ్. ఆడెన్ ఇలా అనడం అంత వింతేమీకాదు: “ప్రపంచాన్ని మార్చేసేవారు అనగా మనకాలంలో నిజమైన పనివారెవరంటే, రాజకీయవేత్తలు, లోకనాయకులు కాదు గాని వైజ్ఞానికులే.”
ప్రపంచానికి మార్పు అవసరం లేదనేవారు బహు కొద్దిమందే. అయితే విజ్ఞానం దానికి తగినదేనా? అది 21వ శతాబ్దపు విశేషమైన సవాళ్లను ఎదుర్కొనటానికి అవసరమైన వైజ్ఞానిక సత్యాలను కనుగొనగలదా? త్వరలో రాబోవు ప్రపంచ సర్వనాశన భయంనుండి మానవులను స్వతంత్రులుగా చేసేందుకు తగినంత త్వరగా ఈ సత్యాలను నేర్చుకొనుటకు వీలవుతుందా?
రెండుసార్లు నోబుల్ బహుమతి పొందిన లైనస్ పాలింగ్ ఇలా అన్నారు: “ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు ప్రకృతిని గూర్చి, వైజ్ఞానిక ప్రభావాలను గూర్చి కొంత అవగాహన కలిగివుండాల్సిన అవసరముంది.” మా పాఠకులకు ఈ అవసరమైన అవగాహన కొంత కలుగజేయాలనే సంకల్పంతోనే మేము “విజ్ఞానం—మానవుని నిరంతర సత్యాన్వేషణ” అనే శీర్షికపరంపరను అందజేస్తున్నాము. మా తదుపరి సంచికలోని 2వ భాగాన్ని తప్పక చదవండి.
[అధస్సూచీలు]
a క్రీస్తు యేసు. వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ వారిచే 1991లో ప్రచురించిన జీవించిన వారిలోకెల్ల మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని చూడండి.
[7వ పేజీలోని బాక్సు/చిత్రం]
వైజ్ఞానిక పద్ధతిలో సత్యాన్ని కనుగొనుట
1. ఏం జరుగుతుందో గమనించండి.
2. గమనించిన వాటిని బట్టి, ఏది నిజమైయుండ వచ్చో అనేదాని కొరకు ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకొనండి.
3. ఇంకా గమనించడం ద్వారా, ప్రయోగాల ద్వారా ఆ సిద్ధాంతాన్ని పరీక్షించండి.
4. ఆ సిద్ధాంతంపై ఆధారపడిన ఊహలు నిజమౌతాయో లేదో కనిపెట్టండి.
[8వ పేజీలోని బాక్సు/చిత్రం]
విజ్ఞానశాస్త్ర నిర్వచనాలు
ఖగోళశాస్త్రం అంటే నక్షత్రాలు, గ్రహాలు, అంతరిక్షంలోని ఇతర గ్రహాలకు సంబంధించిన అధ్యయనం.
గణితశాస్త్రం అంటే అంకెలు, పరిమాణాలు, ఆకారాలు, వాటివాటి సంబంధాలను గూర్చిన అధ్యయనం.
జంతుశాస్త్రం అనేది జీవశాస్త్రపు రెండవ ముఖ్యభాగం, ఇది జంతు జీవన అధ్యయనం
జీవశాస్త్రం అంటే జీవులు ఎలా పనిచేస్తాయి, చెట్లు, జంతువుల వర్గీకరణము యొక్క అధ్యయనం
భౌతికశాస్త్రం అంటే వెలుగు, శబ్దం, వత్తిడి మరియు ఆకర్షణశక్తి వంటి వాటి లక్షణాలను గూర్చిన అధ్యయనం.
మనస్తత్వశాస్త్రం అంటే మానవ మేధస్సు, మానవ ప్రవర్తనకు గల కారణాలను గూర్చిన అధ్యయనం.
మానుషశాస్త్రం అంటే జీవన, సాంఘిక, సాంస్కృతిక దృక్కోణముల నుండి మానవులను పరిశీలించే అధ్యయనం.
రసాయనశాస్త్రం అంటే పదార్థాల గుణలక్షణాలు, అవి ఒకదానితో ఒకటి ప్రతిస్పందించే విధానాలను గూర్చిన అధ్యయనం.
వృక్షశాస్త్రం అనేది జీవశాస్త్రంలోని రెండు ముఖ్యభాగాలలో ఒకటి, ఇది వృక్ష జాతి అధ్యయనం.