దూసుకుపోయే నక్షత్రాలు ఎక్కడినుండి వస్తాయి?
“ఓహా, అదుగో! ఇంకొకటి వెళ్తోంది!” “ఎక్కడ? ఎక్కడ?” రాత్రి వేళ ఆకాశంలో దూసుకు పోతున్న నక్షత్రాలకై వెతుకుతూ మీరు ఎప్పుడైనా ఆ మాటలు అన్నారా? నక్షత్రాలున్న ఆకాశంలో కాంతి గీతను గీస్తూ వెళ్తున్న ఒకదాన్ని మీరు ఒకవేళ మొదటిసారిగా చూసినప్పుడు, నక్షత్రాల్లో ఒకటి అకస్మాత్తుగా ఆకాశంలో దూసుకుపోతున్నట్లు కనిపించి వుంటుంది. వాస్తవానికి, దూసుకుపోయే నక్షత్రాలకు తప్పు పేరు పెట్టారు. అవి “దూసుకుపోవచ్చు,” కాని అవి నక్షత్రాలు మాత్రం కాదు.
ఖగోళ శాస్త్రజ్ఞులు వాటిని ఉల్కలని పిలుస్తారు. ఒక మోస్తరు పరిమాణంలో ఉన్న నక్షత్రం మన గ్రహాన్నంతటినీ పదిలక్షల సార్లు మింగేయ గలదు, కాని మన గ్రహమే లక్షలాది ఉల్కలను మింగేస్తుంది. ఉల్కలంటే ఏమిటీ, అవి ఎక్కడనుండి వస్తున్నాయి?
వీటికి తోకచుక్కలతో చాలా సంబంధం ఉంది. ఉదాహరణకు, ప్రసిద్ధిచెందిన హేలీ తోకచుక్క, 1986లో సూర్యుని చుట్టూ తిరిగే తన 76 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణంలో భూమికి దగ్గరగా దూసుకు వెళ్లింది. తోకచుక్కల్లో చాలా మటుకు మంచు, దుమ్ము ఉంటుంది కాబట్టి, కొన్నిసార్లు అవి మురికైన మంచురాళ్లు అని పిలువబడ్డాయి. ఒక తోకచుక్క సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు, దాని ఉపరితలం వెచ్చబడి, దుమ్మును వాయువును విడుదల చేస్తుంది. సూర్య రశ్మి యొక్క కిరణ ప్రసార ఒత్తిడి, ఘన రేణువులను ఒక వెలుగుతున్న దుమ్ము తోకలా చేస్తూ వెనక్కి నెడుతుంది. అయితే తోకచుక్క తన పయనంలో దుమ్ము, గుళకరాళ్ల తోకను వదిలేస్తూ వెళ్తుంది. అంటే, ఆ రేణువులే అంతరిక్షంలో మిగిలి ఉన్నప్పుడు, ఉల్క రాశులని పిలువబడతాయి. తోకచుక్కల నుండి వెలువడే దుమలో చాలా భాగం కనిపించనంతటి చిన్నవి. కొన్ని చిన్న రేణువులు ఇసుక రేణువులంత పరిమాణంలో ఉంటాయి, కొంచం పెద్దగా ఉన్నవి చిన్న గులకరాళ్లంత ఉంటాయి.
కొన్నిసార్లు ఒక తోకచుక్క కక్ష్య, భూకక్ష్యను ఛేదిస్తుంది. దాని అర్థం భూమి ప్రతిసారి తోకచుక్క కక్ష్యను దాటుతున్నప్పుడు అదే తోకను కలుస్తుంది. ఇది జరిగినప్పుడు చిన్న ఉల్కల రాశులు అతి వేగంతో—క్షణానికి 71 కిలోమీటర్ల వేగంతో వాతావరణంలోకి దూసుకుపోతాయి. అవి పడబోతుండగా, పెద్దవి వేడెక్కి కాలిపోతూ, ఉల్కలని పిలువబడే తెల్లని, వేడైన రేఖలను ఆకాశంలో సృష్టిస్తాయి.
భూమి తోకచుక్క కక్ష్యను దాటేటప్పుడు, ఆకాశంలోని అదే స్థానం నుండి యీ ఉల్కలు అన్ని వైపులా దూసుకువెళ్తూ, కాంతి కిరణాలు అని పిలువబడతాయి. ఈ కాంతికిరణాల నుండి, సంవత్సరంలో క్రమమైన సమయాలలో ఉల్కల జల్లులు కురుస్తాయి. అందులో పెర్సియైడ్స్ జల్లు ఒక ప్రసిద్ధ ప్రదర్శన, ఎందుకంటే దాని కాంతికిరణం పెర్సియస్ నక్షత్రమండలంలో కనుగొనబడ్డాయి కనుక దానికి ఆ పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 12 లేక 13 ప్రాంతంలో పెర్సియైడ్స్ తమ శిఖరాగ్రం చేరినప్పుడు, అదొక మిరుమిట్లుగొలిపే ప్రదర్శన. ప్రతి గంటకు దాదాపు 60 ఉల్కలు పడతాయి.
అక్టోబర్ 21 ప్రాంతంలో మీరు ఓరియోనిడ్స్ జల్లులను చూడగలరు, అది మునుపటి అక్వారిడ్స్ జల్లులానే, హేలీ తోకచుక్క యొక్క ఉల్క రాశుల మూలంగా కలుగుతాయని చెప్పబడింది. ఆస్ట్రానమీ అనే పత్రిక ప్రకారం, హేలీ తోకచుక్క “తన రేణువులను అన్నింటినీ పూర్తిగా విడుదల చేయకముందు 1,00,000 కక్ష్యలు తిరుగ గలదు” అని వైజ్ఞానికులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వారి ఊహ సరైనదైతే, హేలీ తోకచుక్క రాబోయే 76,00,000 సంవత్సరాలు క్రమంగా తిరుగుతుంది! అది అయిపోయిన చాలాకాలం తర్వాత కూడా, దాని దుమ్ముతో కూడిన తోకలను చాలా యుగాల వరకు భూనివాసులకు దూసుకుపోయో నక్షత్రాల రూపంలో ప్రసాదిస్తూనే ఉంటుంది. మనం ప్రస్తుతం చూస్తున్న చాలామటుకు ఉల్కలు నిజానికి ఎప్పుడో పడిపోయిన తోకచుక్కలకు సంబంధించినవే.
ప్రపంచ వ్యాప్తంగా, ప్రతి రోజు మన వాతావరణంలో చూడగల ఉల్కలు ఇంచుమించు 20 కోట్లు ఉన్నాయని వైజ్ఞానికులు లెక్కలు వేస్తున్నారు. అయితే, ఇంకాకొన్ని విశేషమైన ఉల్కల జల్లుల కొరకు ప్రతిసారి కూడా వచ్చే సంవత్సరం ఉండనే ఉంటుంది—ఇంకా లక్షలు రానైయున్నవి! (g93 3⁄22)