ఆండ్రూ తుఫాను నాశనం చేయలేనివి
కొన్ని తుఫానులు ఇతరవాటికంటే నాశనకరమైనవి.a కొన్ని బలమైన గాలులకంటే తీక్షణమైనవి, పెద్దవర్షాలు పడి చెట్లను పెకిలిస్తాయి. దక్షిణ ఫ్లోరిడా (ఆగస్టు 24, 1992) మరియు లూసియానాలో (ఆగస్టు 26, 1992) వచ్చిన ఆండ్రూ తుఫాను, హవాయిలోని కువాయిలో, (సెప్టెంబరు 12, 1992) వచ్చిన ఇనెకె తుఫాను, మరియు గ్వామ్‌లో (ఆగస్టు 28, 1992) వచ్చిన ఒమర్ తుఫానులు ఇలాంటివే.
ఈ తుఫానుల వలన కొన్ని కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఫ్లోరిడాలో డజన్ల కొలది ప్రజలు మరణించారు. వేలకుటుంబాలకు ఇల్లు లేకుండా పోయాయి. భీమా ఏజెంట్లు ఇంటియజమానుల కొరకు కూలిపోయిన ఇళ్లచుట్టూ హడావిడిగా పరిగెత్తుతూ జరిగిన నష్టానికి భీమా చెల్లింపులు అందజేయడం జరిగింది.
ఆ ప్రాంతంలోని 1,033 యెహోవా సాక్షుల ఇళ్లలో 518 ఇళ్లు బాగుచేయబడగలవని ఫోర్ట్ లాడర్‌డెల్‌లోని యెహోవాసాక్షుల సహాయ సమితి యొక్క నివేదిక చెప్పింది. అదే నిష్పత్తి సాధారణ జనాబాకు అన్వయిస్తే, ఆండ్రూ తుఫానుకు గురైన ఇళ్లలో కనీసం 50 శాతం ఇళ్లు నాశనమయ్యాయని దీని అర్థం. తరువాత, నివాసయోగ్యమైన ఇళ్లు మిగిలిన వారు సామాన్లు మరియు పరదాలు ఆరబెట్టడం మరియు వర్షాలకు తడిసి పాడైన పైకప్పు నుంచి వచ్చిపడ్డ సున్నాన్ని శుభ్రపరచడం వంటిపనులు చేయడానికి ప్రయత్నించారు. చాలామంది నాశనమైన తమ ఇళ్లను చూసి తట్టుకో లేకపోయారు. బహుశా ఎక్కువగా నష్టపోయింది వాహనాలు మరియు బలహీనమైన సంచార గృహాలలో జీవిస్తున్న వారే అయ్యుండ వచ్చును.
ఆండ్రూ తుఫాను ఎవరినీ కనికరించలేదు
లెనార్డ్ మరియు టెర్ కెఫర్ దంపతులు వారిలో ఒకరు. ఫ్లోరిడా పట్టణంలోని తమ సంచార గృహాన్ని పునర్దర్శించడానికి వెళ్లినప్పుడు, ఆ ప్రాంతంలో ప్రవేశించడానికి సైనిక చెక్‌పోస్ట్ వద్ద తమ ఆచూకీ తెలియజేసుకో వలసి వచ్చింది. చాలా శక్తివంతమైన బాంబులచే నేలమట్టంగా ధ్వంసం చేయబడిన దానిలా కనిపించే ఒక సంచార గృహాన్ని వాళ్లు చూశారు. చెట్లు పెకలించ బడ్డాయి. పూర్వం సంచార గృహాల గోడలు మరియు పైకప్పులుగా ఉపయోగింపబడి చిన్నాభిన్నమైన అల్యూమీనియం రేకులు, చెట్లకు చుట్టుకుపోయి కొన్ని కొమ్మలకు వ్రేలాడుతూ బాగా అలంకరించబడిన పండుగ అలంకరణలా ఉన్నాయి. కరెంటు తీగలు క్రిందంతా పడి ఉన్నాయి, కఱ్ఱ స్తంభాలు అగ్గిపుల్లలా విరిగిపడిపోయాయి. కార్లు తిరగబడి ధ్వంసం చేయబడి ఉన్నాయి.
బాబ్ వాన్ డైక్, తన క్రొత్త ఇల్లు నివసించడానికి పనికిరాదని తీర్మానించబడినందున ఆ యింటిలోపలి దృశ్యాన్నిలా వర్ణించాడు: “ఇంటి కప్పు ధ్వంసం చేయగల వాటిని ధ్వంసంచేస్తు, వంగగొట్టగల వాటిని వంగగొడుతు, భయపెట్టగల మమ్మల్ని, భయపెడ్తూ విరిగి క్రిందపడింది.”
వ్యక్తిగత వస్తువులు, ఆటబొమ్మలు, బట్టలు, ఫోటోలు, పుస్తకాలు, పూర్వపు జీవితవిధానపు బాధాకరమైన జ్ఞాపకాలలా క్రిందపడి ఉన్నాయి. ఒక ఒంటరి నల్లపిల్లి చెత్తలో నిష్కారణంగా తిరుగుతోంది. అది కెఫర్ దంపతులవైపు తిరిగి వెర్రిగా చూసింది. పూర్వం ఒకరి అమూల్యసంపదయైన వాటిమీద బల్లిపిల్లలు అటుఇటు పరిగెత్తుతున్నాయి. పగిలిపోయిన ఫ్రిజ్‌లలోంచి బయటకొచ్చిన, కుళ్లిన తిండిపదార్థాల దుర్వాసన గాలిలో వ్యాపించి ఉంది. ఏ వైపు చూసినా విపరీత నాశనం—ఇదంతా గంటకు 260 కిలోమీటర్ల ఉద్వేగంతో వీచే గాలులు, బలమైన గాలులవల్ల సంభవించింది.
ఈ యిళ్లల్లో ఉండేవారికి, యజమానులకు ఇది హృదయ విదారకంగా ఉంది. ఈ యిళ్లలో కొన్ని సంవత్సరాలు జీవించి కుటుంబాన్ని పెంచి పోషించుకొన్న వారు, తుఫాను తరువాత వస్తే అంతా ధ్వంసమై విచ్ఛిన్నమైపోయి ఉండడం చూశారు. కెఫర్ దంపతులు తాము ముందు వచ్చినప్పుడు కొన్ని వస్తువులను భద్రపరిచారు, కాని మిగిలిపోయివున్న పాడైన వస్తువుల మధ్య తమ సామాన్లకై వెతకడం వారికి బాధాకరంగా ఉంది. అయినను, వారింకా బ్రదికియుండి దేవుని సేవించగల స్థితిలో ఉన్నందుకు అభినందించారు.
ఆండ్రు తుఫాను దేనినీ విడిచిపెట్టలేదు. దుకాణాలు, కర్మాగారాలు, గోదాములు—అన్ని కూడా ప్రకృతి దాడికి గురయ్యాయి. అల్పుడైన మానవుడు నిర్మించిన ఏ భవన నిర్మాణాలు కూడా ఆ తాకిడికి తట్టుకో లేకపోయాయి.
మానవ నైజంలోని మంచి చెడులు
వివిధ సహాయ సంస్థలు పని సంస్థీకరించడంవల్ల ఫ్లోరిడాకు దేశం నలువైపుల నుండి సహాయం వచ్చింది. న్యూయార్క్‌లోని యెహోవాసాక్షుల పరిపాలక సభ వెంటనే ప్రతిస్పందించి ఫోర్ట్ లాడర్‌డెల్ అసెంబ్లీ హాలులో పని చేయుటకు సహాయ కమిటీని నియమించింది. వారు అత్యవసర వస్తువులు, ఆహారము, మరియు సరుకులు కొనుటకు తగినంత డబ్బు కూడా కేటాయించారు. తత్ఫలితంగా, పరిస్థితికి ప్రతిస్పందించి స్వచ్ఛంద సేవకులను పిలుచుటలో యెహోవా సాక్షులే ముందుండిరి. వాస్తవానికి, చాలా మంది పిలువబడకుండానే వచ్చారు.
కాలిఫోర్నియా, ఉత్తర కారొలినా, ఒరిగన్, వాషింగ్ట్‌న్ రాష్ట్రము, పెన్సిల్వేనియా, మిస్సోరి, మరియు ఇతర ప్రాంతాల నుండి పని చేయుటకు సాక్షులు వచ్చారు. సాధారణంగా రాజ్య మందిరాలు నిర్మించే వర్జీనియా యొక్క ప్రాంతీయ నిర్మాణ కమిటీ పైకప్పులు బాగుచేయుటకు 18 మంది సాక్షులగుంపును పంపింది. వర్జీనియా నుండి ఫ్లోరిడాకు వాహనంలో రావడానికి వారికి 18 గంటలు పట్టింది. సహాయ పనివారు దీర్ఘకాల సెలవులు తీసికొని లేక మాములు సెలవులు పెట్టుకొని ఆపదలో ఉన్న తమ తోటి సహోదరులను చేరుకొనడానికి కొన్ని వందలు మరియు వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చారు.
దక్షిణ కారొలినాలోని చార్లెస్‌టన్ నుండి వచ్చిన బృందం యొక్క సహాయం ఎంతో విలువైనదిగా ఉండినది. 1989లో హుగో తుఫాను యొక్క అనుభవం అక్కడి సాక్షులు కలిగి ఉన్నారు. ఏం చేయాలో వాళ్లకు తెలుసు కాబట్టి సహాయ సరఫరా, ఎలక్ట్రిక్ జెనరేటర్లు మరియు నిర్మాణ సామాగ్రి తెచ్చి పని మొదలు పెట్టారు. స్వచ్ఛందసేవకులు రెండు వారాల్లోనే 800 ఇళ్లు ఆరబెట్టారు మరియు చాలా పైకప్పులు బాగుచేశారు.
మరమ్మతుచేయు పనివారగు సాక్షుల బృందాలు చేసిన సహాయం వల్ల చాలా మంది సాక్షులు కాని భార్యలు లేక భర్తలు మరియు పొరుగువారు లాభంపొందారు. పశ్చిమ హోమ్‌స్టెడ్ నుండి వచ్చిన రాన్ క్లార్క్ ఇలా చెప్తున్నాడు: “ఇదంతా చూసి అవిశ్వాసులైన భార్యలు లేక భర్తలు నిజంగా ప్రభావితులయ్యారు. సాక్షులు వారికై ఇంతవరకు చేసినదానిని బట్టి వారు ఎంతో ఉప్పొంగిపోయి, కంటతడి పెట్టుకున్నారు.” ఒక అవిశ్వాసి అయిన భర్త గురించి అతనిలా అంటున్నాడు: “సాక్షులు అక్కడికి వచ్చి తన పైకప్పు బాగుచేస్తున్నారని అతను అమితానందం చెందుతున్నాడు.”
ఒక సాక్షి తాను ప్రతిరాత్రి వెళ్లి పరామర్శించిన తన ప్రక్క ఇంటి అవిశ్వాసులను గురించి చెప్తున్నాడు. తాము బాగానే ఉన్నామని వారనేవారు. ఐదవ రోజు భార్య ఆపుకోలేక ఏడ్చేసింది. “మా పాప తువాళ్లు లేవు. పాపకు ఆహారం కూడా లేదు. మాకు సరిపడేంత తిండి, నీళ్లు లేవు.” భర్తకు 20 లీటర్ల పెట్రోలు అవసరం కాని ఎక్కడా దొరకడం లేదు. ఆ సాక్షి అదే రోజు వీరికి అవసరమైన వస్తువులను రాజ్యమందిర సహాయ కేంద్రం నుండి తెచ్చి యిచ్చాడు. భార్య కృతజ్ఞతతో ఏడ్చింది. భర్త సహాయ పనికై చందా ఇచ్చాడు.
ప్రమాద స్థలంలో బాగుచేయబడిన వివిధ రాజ్యమందిరాల నుండి సహాయాన్ని సంస్థీకరించుటకు కలిసి పని చేసిన సంఘ పెద్దలు మరియు పరిచారకులు చాలా ముఖ్యమైన పాత్రవహించారు. వారు సాక్షులందరిని కనుగొని వారి అవసరతలను తీర్చుటకు అలయక పనిచేశారు. దీనికి భిన్నంగా, ఇంకొక ప్రాంతంలోని సహాయపనిని గూర్చి ఒక వైమానికదళ అధికారి ఇలా అన్నట్టు ఉదహరించబడ్డాడు: “అధికారులందరు ఆదేశాలు ఇవ్వడానికే ఇష్ట పడతారు కాని, ముందుకొచ్చి అప్రీతికరమైన ఆ పనిని చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు.”
ప్రమాదాలు మనుషులలోని మంచి మరియు చెడు లక్షణాలను బయటికి తెస్తాయి. ఈ రెండవదానికి ఉదాహరణ దోపిడీ. ఒక సాక్షికుటుంబం ప్రాంతీయ రాజ్యమందిరంలోని సహాయ కేంద్రంలో ఉపయోగ పడుతుందని కనీసం తమ రిఫ్రిజిరేటర్‌ను మరియు వాషింగ్ మెషీన్ను కాపాడుకుందామని నిర్ణయించు కున్నారు. వారు ట్రక్కు కొరకు మందిరానికి వెళ్లారు. వాళ్లు తిరిగిరాక ముందే దోపిడీదారులు ఆ రెండు వస్తువులను దొంగిలించారు!
ఒక ప్రత్యక్ష సాక్షి ఇలా నివేదించాడు: “నిర్జనమైన వీధులలో మేము ప్రయాణిస్తుంటే, దోపిడీదారులను దూరపరచడానికి ఇళ్లమీద హెచ్చరిక సూచనలు చూశాము. కొన్నింటిమీద ఇలా ఉన్నది, ‘దోపిడీదారులు చావాలి’ మరియు, ‘దోపిడీదారులు పేల్చివేయబడతారు.’ ఇంకొకదాని మీద ఇలా ఉన్నది, ‘ఇద్దరు దోపిడీదారులు కాల్చబడ్డారు. ఒకడు చచ్చాడు.’ అంగళ్లు మరియు దుకాణాలు దోచుకొనబడ్డాయి. 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌లోని ఒక సార్జెంట్ ప్రకారం, కేవలం ఒక్క దోపిడీదారుడు మాత్రమే ప్రజలచేతిలో పట్టుబడి, చిత్రవధ చేయబడ్డాడు.
చాలా మంది అరెస్టుచేయబడ్డారు. ఏ ప్రమాదములోనైనా నేరస్థులు డేగలవలె, దొరికినది తన్నుకుపోడానికి సిద్ధంగా ఉంటారు. మామూలు మనుషులు కూడా కొన్నిసార్లు దోపిడీకి పాల్పడవచ్చు. ఏమీ ఖర్చు పెట్ట కుండానే ఏదైనా దొరుకుతుందనే శోధన, మతాన్ని, మత సూత్రాలను, మరియు నైతిక విలువలను మర్చిపోయేలా చేస్తుంది.
మొదట్లో కొంతమంది సైనికుల గుండ్లులేని తుపాకులను సాయుధులైన దోపిడీదారులు దొంగిలించారని అవేక్! ప్రతినిధికి చెప్పబడింది. రాజ్యమందిర సహాయ కేంద్రాలు ఎడారిలో నీటిబుగ్గల్లా ఉన్నాయని కొందరు సైనికులు అంటున్నట్లు వినిపించింది “ఎందుకంటే, వీరు తుపాకులు పట్టుకోరు” అని వారన్నారు.
“ఖాళీగా కూర్చోకు”
ప్రకృతి వైపరీత్యాలతో వారికున్న అనుభవాన్ని బట్టి యెహోవాసాక్షులు ఏమి నేర్చుకున్నారు? ఆత్మీయ కార్యకలాపాలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పునఃప్రారంభించాలి. సోమవారం నాడు తుఫాను వచ్చినా, ఒకే భవనంలో ఉండే రెండు రాజ్యమందిరాలు బుధవారంకల్లా కూటములకు సిద్ధంగా ఉన్నాయని హోమ్‌స్టెడ్‌లోని ఒక అధ్యక్షుడైన ఎడ్ రమ్‌సీ, అవేక్! ప్రతినిధికి చెప్పాడు. పైకప్పు కొంత పోయి కూలిపోయింది, మరియు నీళ్లు లోనికివచ్చాయి. కూటములకు మరియు వారి వినాశనమైన ప్రాంతంలో సహాయపని జరిగించుటకు ఉత్తరువులు అందుకొను స్థలంగా ఉపయోగించేందుకు రాజ్యమందిరాలను సిద్ధం చేసేందుకు స్వచ్ఛంద సేవకులు త్వరపడి పనిచేశారు. బాధితులకు మరియు సహాయ పనివారికి భోజనాలు సిద్ధంచేయడానికి వంట గదులను నెలకొల్పారు.
తన 80 మంది సాక్షులు ఉన్న సంఘంలో ఏడు కుటుంబాలు తమ ఇండ్లను పూర్తిగా పోగొట్టుకున్నారని ప్రిన్స్‌టన్‌లోని స్పానిష్‌భాష సంఘానికి పెద్ద అయిన ఫెర్‌మెన్ పాస్ట్రానా చెప్పాడు. తన తోటి సాక్షులకు అతనే పరిష్కారాన్ని సూచించాడు? “నీవు ఏడవాల్సిన అవసరం ఉంటే ఏడువు. కాని ఖాళీగా కూర్చోకు. ఇతరులకు సహాయం చేయడంలో మునిగిపో, మరియు వీలైనంతమట్టుకు సేవకు వెళ్లు. మన క్రైస్తవ కూటములు మానవద్దు. పరిష్కరించుకోగల వాటిని పరిష్కరించుకో, కాని పరిష్కరించుకోలేని వాటికొరకు బాధపడవద్దు.” తత్ఫలితంగా, సాక్షులు ఇంటింటికి వెళ్లి ప్రకటించుట మరియు సహాయ నిధి డబ్బాలు అందించుట మొదలు పెట్టారు. ఆండ్రూ తుఫాను వారి ఉత్సాహాన్ని ఆపలేక పోయింది.
‘మనం ఈసారి ఖాళీచేద్దాం!’
కెట్లర్ రిజ్‌లోని 37 సంవత్సరాల వయస్సుగల స్త్రీ అయిన షారెన్ కాస్టరో, అవేక్! ప్రతినిధికి తన కథను చెప్పింది: “నా తండ్రి ఖాళీచేయ వద్దని నిశ్చయించుకున్నాడు. గడచిన తుఫాను ఫ్లోరిడా తీరాన్ని తాకకుండా పోయినందుకు, ఆండ్రూ తుఫాను కూడా అదే చేస్తుందని అతను భావించాడు. అతను కిటికీలు కూడా మూయుటకు పోలేదు. అదృష్టం కొద్ది, నా తమ్ముడు వచ్చి కిటికీలకు పెవుడ్ పెట్టమని పట్టుపట్టాడు. నిస్సందేహంగా అతని చర్య మా ప్రాణాలు కాపాడింది. మా కిటికీలు పగిలి పోయుండేవి, మేము ముక్కలయ్యుండే వాళ్లము.
“ఇంచుమించు ఉదయం 4:30కు కరెంటుపోయింది. బయట నుండి భయంకరమైన శబ్దాలువస్తున్నాయి. అది పెద్ద రైలుబండి ధ్వనిలా ఉంది. చెట్లు మరియు భవనాలు తటాలున విరుగుతుంటే పెటేలుమనే ధ్వని వచ్చింది. ఆ శబ్దం మా పైకప్పులోని చువ్వలు పట్టుసడలి పోవడం వల్ల వచ్చిందని మాకు తరువాత తెలిసింది. అటక ఎగిరిపోయింది, పైకప్పు మూడోవంతు లేచి పోయింది. చివరకు మేము అస్వస్థురాలయిన మా అమ్మ 90 సంవత్సరాల వయస్సుగల నాన్నమ్మతో సహా 12 మందిమి, కిటికీలులేని మధ్య గదిలో తలదాచుకున్నాము. మేమక్కడ తప్పక చనిపోతామని అనుకున్నాము.”
ఈ అనుభవం ద్వారా ఆమె ఏమి పాఠం నేర్చుకుంది? “ఈసారి వారు మమ్మల్ని ఖాళీ చేయమంటే ఏ ప్రశ్నా అడగకుండా మేము ఖాళీ చేస్తాము. హెచ్చరికలపై అవధానము ఉంచుతాము. చాలా తక్కువ ఉన్నప్పుడు సర్దుకుని జీవించడం కూడా నేను నేర్చుకున్నాను. ఏడవడం, బాధపడడం, తప్పేమి కాదని, తరువాత వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని నేను తెలుసుకున్నాను.”
పత్రికల ప్రతిస్పందన
సాక్షులు ఎంత చక్కగా సంస్థీకరించబడ్డారన్నది వార్తాపత్రికలు కూడా గమనించాయి. “యెహోవా సాక్షులు దక్షిణ ఫ్లోరిడాలో ఆహ్వానింప బడ్డారు” అను వార్తాశీర్షికతో సవానా ఈవినింగ్ ప్రెస్ వెలువడింది, మరియు ది మియామి హెరాల్డ్ పత్రిక “సాక్షులు తమ స్వంతవారిపట్ల మరియు ఇతరులపట్ల శ్రద్ధ చూపుతారు”అని వెల్లడించింది. “హోమ్‌స్టెడ్‌లో—ఎవరికైనా ఒకవేళ తలుపులు మిగిలి ఉంటే కూడా—ఈవారం ఎవ్వరు యెహోవాసాక్షులను చూసి దభాలున తలుపులు మూయటంలేదు. దేశం మొత్తం మీద 3,000 మంది స్వచ్ఛంద సేవకులైన సాక్షులు ప్రమాద స్థలానికి కూడివచ్చి మొదట తమ స్వంతవారికి, తరువాత ఇతరులకు సహాయం చేశారు. . . . సాక్షులు కలిగియున్న క్రమశిక్షణ, సామర్థ్యత, చక్కని ప్రవర్తనను చూసి ఏ సైనిక సంస్థ అయినా ఈర్ష్యపడుతుంది.”
వారి చిన్నా, పెద్ద సమావేశాలలో ఎక్కువ మందికి వంట చేయడం సాక్షులకు అలవాటే. పైగా, వారు ప్రపంచమంతటా రాజ్యమందిరాలను మరియు పెద్ద సమావేశ మందిరాలను నిర్మించుటకు ప్రాంతీయ నిర్మాణ కమిటీలను సంస్థీకరించారు. కాబట్టి, కొన్ని గంటల వ్యవధిలోనే ప్రతిస్పందించుటకు సిద్ధంగా ఉండేందుకు వారు వ్యక్తులకు తర్ఫీదునిచ్చారు.
అయినను, ఇంకొక విషయం కూడా ఉంది—వారి మనోభావం. అదే నివేదిక ఇలా చెప్తుంది: “అక్కడ పెత్తనం చేయడం జరగదు. ఎవ్వరూ తనను తాను గొప్పగా భావించరు. బదులుగా, ఎంత వేడిగా, మట్టికొట్టుకు పోయి లేక అలసటగా ఉన్నా సేవకులు ఎప్పుడూ చాలా సంతోషంగా సహకరిస్తూ ఉంటారు.” అది ఎలా వివరించబడింది? ఒక సాక్షి ఇలా జవాబిచ్చాడు: “దేవునితో మనకుగల సంబంధం ఇతరులపట్ల మన ప్రేమను ప్రదర్శించుటకు మనలను ప్రేరేపించును.” ఆండ్రూ తుఫాను తీయలేని ఇంకొకటి, సాక్షుల క్రైస్తవ ప్రేమ.—యోహాను 13:34, 35.
ఇంకో ఆసక్తికరమైన పోలికేమంటే సాక్షులు చెట్లనుండి నేర్చుకున్నారు అనుటయే. ఒక ప్రత్యక్షసాక్షి దాన్నిలా వ్యక్తంచేశాడు: “నేను ప్రయాణిస్తుండగా, వందలాది పెద్ద చెట్లు పెకిలించబడి నేలకొరిగి ఉండటం నేను గమనించాను. అలా ఎందుకు జరిగింది? వాటివేళ్లు పైపైనే వ్యాపించి ఉన్నందుననూ, అవి అతిపెద్దగా ఉండి విస్తారమైన గాలిని తాళుకొనవలసి వచ్చినందున నేలకొరిగాయి. ఇంకో వైపు, సన్నటి తాటి చెట్లు నిలబడే ఉన్నాయి. అవి గాలితో వంగాయి, అవి కొన్ని మట్టలు పోగొట్టుకొనినను, చాలామట్టుకు భూమిలో పాతుకొనే ఉన్నాయి.”
సాక్షులకు దేవుని వాక్యంలో లోతుగా వేరుపారిన విశ్వాసం ఉంది మరియు వారు తమ ప్రతిస్పందనలో అనుకూలంగా ఉన్నారు. సంపద మరియు ఇళ్లు వారికి సమస్తం కాదు. విపత్తులున్నప్పటికి వారు ఇంకా సజీవులై యుండి యెహోవాను సేవించుటలో కొనసాగుటే చాలు. ఆండ్రూ తుఫాను వారి నుండి తీసేయని ఇంకొకటి, ప్రాణం.
అదెట్లు నిర్వహించబడినది?
యాన్‌హోఈజర్ బష్ అను వ్యాపారసంస్థ ఒక లారీనిండా త్రాగేనీరు విరాళంగా ఇచ్చింది. ఆ ప్రాంతానికి చేరుకున్న తరువాత నీళ్లు ఎక్కడ పోయాలి అని డ్రైవరు అధికారులను అడిగాడు. ఏదైనాకొంత సంస్థీకరింప బడినవారు కేవలం సాక్షులు మాత్రమేనని అతనికి చెప్పబడింది. నిజానికి, ఆండ్రూ తుఫాను వచ్చిన వారానికే, యెహోవా సాక్షుల ఫోర్ట్ లాడర్‌డెల్‌లోని సమావేశ మందిరానికి 70 ట్రక్కులనిండా సరుకులు వచ్చాయి.
ఒక స్వచ్ఛంద సేవకుడు ఇలా అన్నాడు: “మాకు ఒక ట్రక్కునిండా త్రాగేనీరు దొరికింది. రాజ్యమందిరాలలోని సరఫరా కేంద్రాలకు మేము పంపే ఆహార పదార్థాలలో దాన్ని కూడా మేము చేర్చాము. వాటిని సహోదరులు మరియు ఆ ప్రాంతములోని అవసరములో ఉన్న ఇరుగుపొరుగు వారు పంచుకున్నారు.” వాషింగ్ట్‌న్ రాష్ట్రములోని పేపరు వ్యాపారసంస్థ 2,50,000 పేపరు ప్లేట్లు విరాళంగా ఇచ్చారు.
మొదట్లో, పట్టణ అధికారులు సాక్షులుకాని స్వచ్ఛంద సేవకులను ‘వీరే (సాక్షులు) కొంత సంస్థీకరించబడిన వారు’ అని చెప్పి రాజ్యమందిరాలకు పంపేవారు. చివరకు సైన్యం వచ్చి ఆహారం మరియు నీటి సరఫరా కేంద్రాలు మరియు గుడారాలతో నగరులు స్థాపించారు.
మొదట ప్రారంభించిన సరుకుల సరఫరా కేంద్రం ఫోర్ట్ లాడర్‌డెల్‌లోని సమావేశ మందిరంలో సహాయ కమిటీ ద్వారా నెలకొల్పబడింది. అది హోమ్‌స్టెడ్‌లోని ముఖ్య ప్రమాద స్థలానికి 60 కిలోమీటర్లు ఉత్తరాన ఉంది. ఒత్తిడిని కొంత తగ్గించడానికి, ఒర్‌లాండొలోని ముఖ్య ప్రమాద స్థలానికి 400 కిలోమీటర్లు వాయవ్యంలో ఉన్న ప్లాంట్ సిటీ సమావేశ మందిరంలో ప్రాధమిక సరుకుల సరఫరా కేంద్రాన్ని స్థాపించారు. ఎక్కువ సహాయ వస్తువులను వేరుచేసి కట్టుటకు అవి అక్కడికే పంపబడేవి. ప్లాంట్ సిటీనుండి అవసరమైన వస్తువులను కమిటీ కోరినట్లుగా రోజువారిగా పెద్ద ట్రక్కులలో తీసుకెళ్లేవారు. ఫోర్ట్ లాడర్‌డెల్‌కి ప్రయాణానికి ఐదుగంటలు పట్టేది.
తద్వారా ఈ సరఫరా కేంద్రాలు ఆహారము, వస్తువులు, నీళ్లు, జెనరేటర్లు, మరియు ఇతర అవసరతలను ప్రమాద స్థలములో బాగుచేయ బడిన మూడు రాజ్యమందిరాలకు సరఫరా చేశారు. అక్కడ, సామర్థ్యం గల సాక్షులు సహాయం అవసరమైన వందల ఇళ్లకు నిర్మించే మరియు శుభ్రపరిచే దళాలను పంపారు. అవసరతలో ఉన్న వారందరు వచ్చి తినుటకు రాజ్యమందిర ఆవరణంలో వంటగదులను మరియు వడ్డించే పంక్తులను నెలకొల్పారు. కొందరు సైనికులు కూడా అక్కడికివచ్చి భోజనం చేశారు. తరువాత చందాపెట్టెలో విరాళం వేస్తూ కనిపించారు.
పురుషులు ఇళ్లు బాగుచేయడంలో నిమగ్నులై ఉంటే, కొందరు స్త్రీలు భోజనం సిద్ధంచేయడంలో మునిగిపోయారు. మరికొందరు తాము కనుగొన్న వారికి ప్రకృతి వైపరీత్యాలను గూర్చి బైబిలిస్తున్న వివరణను తెలియజెప్పడానికి, అవసరతలో ఉన్నవారికి సహాయ సరుకుల డబ్బాలు అందచేయడానికి బయటకు వెళ్లారు. వీరిలో తెరాసా పెరాడా ఒకరు. ఆమె ఇల్లు నాశనం అయినప్పటికి, ఆమె కారు కిటికీలు ధ్వంసం అయినప్పటికి, దాని నిండా సహాయ సరుకుల డబ్బాలు పెట్టి తన పొరుగు వారికై సిద్ధంగా ఉంచింది. ఆమె భర్త, లాసారొ ఒక రాజ్యమందిరం వద్ద పనిచేస్తున్నాడు.—ప్రసంగి 9:11; లూకా 21:11, 25.
ఇళ్లులేని చాలామందికి, ఆండ్రూ తుఫాను తాకిడికి గురికాని సాక్షుల ఇళ్లలో స్థానం కల్పించారు. ఇతరులు ఆ పనికొరకు అద్దెకు తీసుకున్న లేక విరాళంగా ఇవ్వబడ్డ వాహనాలలో నివసించారు. కొందరు సైన్యం స్థాపించిన గుడారపు నగరులలో ఉండటానికి వెళ్లారు. ఇతరులు తమ ఇండ్లను ఒక నష్టంగా భావించి స్నేహితులు మరియు బంధువులతో దేశంలోని వేరే ప్రాంతానికి తరలి పోయారు. వారికి ఇండ్లుకాని ఉద్యోగాలుకాని లేవు. అక్కడ విద్యుత్తు, నీరు, మురుగు నీటిపారుదల సౌకర్యాలేమి లేవు—కాబట్టి తమకు తగిన మార్గాన్ని వారెన్నుకున్నారు.
అందరు నేర్చుకున్న పాఠాన్ని ఒక స్పానిష్ మాట్లాడే సాక్షి బాగా వ్యక్తం చేశాడు: “జీవితంలో లక్ష్యాలను గూర్చిన పాఠం నేర్చుకొన గలిగి నందుకు మేము చాలా కృతజ్ఞత కలిగియున్నాము. ఒక వ్యక్తి ఇల్లుకట్టి, వస్తువులు సంపాదించుటకు 15 లేక 20 సంవత్సరాలు పనిచేస్తాడు, తరువాత కేవలం ఒక గంటలో, అదంతా పోవచ్చు. మనము మన ఆత్మీయ లక్ష్యాలను గుర్తించుటకు, జీవితాన్ని నిరాడంబరం చేసుకొనుటకు మరియు యెహోవాను సేవించుటను గూర్చి వాస్తవంగా ఆలోచించుటకు సహాయం చేయును.”
అది అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు ఉంది: “అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.”—ఫిలిప్పీయులు 3:7, 8.
ప్రకృతి వైపరీత్యాలు మన ప్రస్తుత లోకజీవితంలో ఒక భాగం. మనం ఒకవేళ అధికారుల హెచ్చరికను వింటే, కనీసం మన జీవితాలనైనా కాపాడుకొనగలము. బహుశా ఇళ్లు మరియు సంపద పోయినను, “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని”తో ఒక క్రైస్తవుని సంబంధం దృఢపడాలి. ఒకవేళ ఎవరైనా ప్రమాదంలో చనిపోయినను, బాగు పరచబడిన భూమి—ప్రకృతి వైపరీత్యాలవల్ల సంభవించే మరణము మరియు దుఃఖము తీసివేయ బడిన భూమిపై—దేవుని నూతన విధానంలోనికి పునరుత్థానం చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు.—2 కొరింథీయులు 1:3, 4; యెషయా 11:9; యోహాను 5:28, 29; ప్రకటన 21:3, 4. (g93 1/8)
[అధస్సూచీలు]
a “ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మీద ఉష్ణప్రాంతపు తుఫానులు ఏర్పడినప్పుడు గంటకు 121 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.” దీనినే హరికేన్ అంటారు. (ది కాన్‌సైస్ కొలంబియా ఎన్‌సైక్లోపెడియా) “చైనా లేక పశ్చిమ పసిఫిక్ సముద్రాల పైవచ్చు తుఫానును టైఫూన్” అంటారు.—ది అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్.
[20వ పేజీలోని బాక్సు]
పూర్తిగా ఆశ్చర్యపోయారు
సహాయపనిలో తోడ్పడుటకు టాంపా నుండి ఫ్లోరిడాకు 11మంది శ్వేతజాతి సాక్షులగుంపు వచ్చింది. వారు సరుకు తీసుకుని ఒక నల్లజాతి సాక్షి ఇంటి పైకప్పును బాగుచేయుట మొదలుపెట్టారు. ఒక సాక్షికాని సోదరుని కుమారుడు వచ్చి చూసినప్పుడు అతను తాను చూస్తున్నది నమ్మలేక పోయాడు—కొంతమంది శ్వేతజాతి సాక్షులు తనకంటే ముందే వచ్చి తన చిన్నాన్న ఇంటిని బాగుచేయడం చూసి అతను నిర్ఘాంత పోయాడు. అతను ఎంతో ప్రభావితుడై నిర్మాణపనిలో కూడా తోడ్పడ్డాడు.
సాక్షులు మళ్లీసారి తన ఇంటివైపు వస్తే, తాను బైబిలు పఠనం కొరకు అడుగుతానని అతనన్నాడు. అతను టాంపా నుండి వచ్చినవారితో మాట్లాడుతుంటే, అతను వారి ప్రాంతంలోనే ఉంటాడను విషయం తెలిసింది. సమయం కొంతకూడా వృధాచేయకుండా ఆ గుంపులోని ఒక పెద్ద మరుసటి వారంకల్లా బైబిలు పఠనానికి ఏర్పాట్లు చేశాడు! ఒక సాక్షి అన్నట్లు, నీవు సాక్ష్యమిచ్చుటకు కేవలం తలుపులే కాదు—పైకప్పులు కూడా తట్టవచ్చును!
[15వ పేజీలోని చిత్రాలు]
ఆండ్రూ తుఫాను దేనిని కనికరించలేదు, కొన్ని భవనాలే తట్టుకొనగలిగాయి
కెఫర్ దంపతుల సంచార గృహము—మరియు దాని మిగిలిన భాగం
[16వ పేజీలోని చిత్రాలు]
రెబేకా పెరేజ్, ఆమె కుమార్తెలు, మరియు 11 మంది ఇతరులు ఈ చిన్న స్థలంలో తలదాచుకున్నారు
దోపిడీని ఆపుటకు సైన్యం రంగప్రవేశం చేసింది (పైన కుడివైపు); దోచుకొనబడిన దుకాణాలు (కుడివైపు)
తుఫాను పైకప్పులను చీల్చివేసింది, మరియు వాహనాలు అల్లకల్లోలంగా పడ్డాయి
[17వ పేజీలోని చిత్రాలు]
సహాయ పని రాజ్యమందిరాలలో సంస్థీకరించబడింది
సంచార గృహాలు చెట్లకు చుట్టబడ్డాయి; ఒక పిల్లల బొమ్మ పరుపుపై దీనంగా పడి ఉంది; పడిపోయిన శిథిలాలలో బైబిలు ప్రచురణలు కూడా ఉన్నాయి; తెరాసా పెరాడా లాంటి సాక్షులు, తమ పొరుగువారికి సరుకులు అందజేశారు
విరాళంగా ఇవ్వబడిన వస్తువులు. బట్టలు వేరుచేయడం
[18వ పేజీలోని చిత్రాలు]
సహాయపనిలో తోడ్పడుటకు అమెరికా అంతటి నుండి స్వచ్ఛందసేవకులు వచ్చారు