మారుతున్న మన ప్రపంచం—ఎక్కడికి పయనిస్తోంది?
కొన్ని మార్పులు లక్షలాదిమంది పైనేకాక పూర్తి ప్రపంచ జనాబాపైన, రానున్న తరంపైన సహితం వాటి గాఢమైన, ఎడతెగని ప్రభావాన్ని ఉంచుతాయి. హింసాత్మకమైన నేరము, మాదకద్రవ్యాల దుర్వినియోగము, ఎయిడ్స్ వ్యాప్తి, గాలి, నీటి కాలుష్యము, అటవీనిర్మూలము వంటివి మనందరిపై గట్టిప్రభావాన్ని కనపరిచే వాటిలో కొన్ని మాత్రమే. ప్రచ్ఛన్న యుద్ధాంతము, వ్యాపార ఆర్థిక వ్యవస్థతో పాశ్చాత్య తరహా ప్రజాస్వామ్యంకూడా జీవితాలను మారుస్తూ, భవిష్యత్తునుకూడా ప్రభావితంచేస్తోంది. వీటిలో కొన్ని అంశాలను పరిశీలిద్దాం.
నేరము మన జీవితాలను ఎలా మార్చింది
మీ చుట్టుప్రక్కల వీధులు ఎలావున్నాయి? ఒంటరిగా రాత్రిళ్లు బైట తిరుగగలరా? ముప్ఫై లేక నలభై ఏళ్ల క్రితంవరకు అనేకులు తమ ఇళ్లకు తాళాలు వేసేవారు కాదు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఈనాడు కొన్నిళ్లకు రెండు మూడు తాళాలు వేస్తారు, కిటికీలను ఇనుప చువ్వలతో చేస్తారు.
వీధుల వెంబడి వెళ్లేటప్పుడు మంచి వస్త్రాలను, నగలను ధరించడానికి కొందరు ప్రజలు భయపడుతున్నారు. లెదర్ జాకెట్టుకొరకో లేక మింక్ కోట్లకొరకో కొందరు పట్టణవాసులు చంపబడ్డారు. ఇతరులు మాదకద్రవ్యాల వినియోగదారుల ఎదురుకాల్పుల్లో మరణించారు. అనేక మంది అమాయక ప్రజానీకం మరియు పసివారు సహితం ప్రతిరోజన్నట్లుగా గాయపరచబడుతున్నారు లేక చంపబడుతున్నారు. కార్లను వీధుల్లో సురక్షితంగా వుంచాలనుకుంటే, పరాన్నభుక్కులైన కారు దొంగలకు అవరోధం కలిగించేలాగున తమ కార్లలో భద్రతా ఉపకరణములను అమర్చుకోవాలి. పెడదారిపట్టిన యీ ప్రపంచ వాతావరణంలో ప్రజలు మారిపోయారు. నీతి నిజాయితీ అన్నవి మరుగునబడిన విలువలుగా మిగిలాయి. విశ్వాసం అదృశ్యమైంది.
నేరము, దౌర్జన్యము ప్రపంచవ్యాప్త సంఘటనలు. అనేక వార్తాధార ముఖ్యాంశాలు ఈ విషయాన్ని ఇలా ఉదహరిస్తున్నాయి: “దోపిడీలు, దొంగలు, ముఠాదొంగలు, ప్రతి విధమైన అవినీతి మొదలైనవన్నీ తనలో వున్నట్లు మాస్కో తెలుసుకుంది”; “నేరాలనుబట్టి కొరియాలో కొత్త శకమారంభమైంది”; “పట్టణవీధి నేరము ప్రేగ్ అనుదిన జీవనాన్ని ముట్టడిస్తోంది”; “జపాను దొమ్మినేరాలను ముట్టడిస్తోంది, మరి దొమ్మిమూకలు మరల ఎదిరిస్తున్నాయి”; “అష్టదంతి అనే ముఠాను—ఇటలీలోని పెద్ద మాఫియ వ్యతిరేక సంస్థ కాల్చివేసింది.” నేరము జగద్‌వ్యాప్త సమస్య.
ఈనాటి నేరాలుకూడా చాలా దౌర్జన్యపూరితంగావున్నాయి. జీవితానికి బొత్తిగా విలువ లేకుండాపోయింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో పట్టణం చివర్లలోని మురికివాడ ప్రాంతాలు “ప్రపంచంలోనే అత్యంత దౌర్జన్యపూరిత ప్రాంతాలుగా అమెరికావలన అధికారికంగా గుర్తించబడ్డాయి. అక్కడ ప్రతి సంవత్సరం 2,500 మంది ప్రజలు హత్యగావించబడుతున్నారు.” (వరల్డ్ ప్రెస్ రివ్వూ) కొలంబియాలో పేరుమోసిన మాదకద్రవ్య విక్రయదారులు వారి ప్రత్యేకవిధమైన, తక్షణ మరణ శిక్ష విధించే పద్ధతిలో తమ ప్రత్యర్థుల మీద, అప్పులవారి పద్దు తీర్చుకోవడానికి తమ యవ్వన సీకార్యోస్‌లను లేక అద్దె హంతకులను మోటారు సైకిళ్లపై పంపుతారు. ఎక్కడైనా, అటు కొలంబియాలోనైనా లేక మరి ఏ ఇతర ప్రాంతంలోనైనా నేరాన్ని మీరు కళ్లారా చూసివుంటే మరుక్షణం మీరది చూసినందుకు పశ్చాత్తాపపడతారు. బహుశ తరవాతి బలిపశువు మీరేకావచ్చు.
మరొక పెద్ద మార్పేమంటే, అనేకమంది నేరస్థులు, ఆటోమాటిక్ మారణాయుధాలను పట్టుకుని తిరుగుతున్నారు, అనేకానేక ప్రజానీకం స్వయం-సంరక్షణకై తుపాకులను ధరించటానికి సుముఖతను చూపుతున్నారు. ఆయుధాల పెరుగుదల అంటేనే, నేరమువల్ల లేక దుర్ఘటనలవల్లకలిగే మరణాలలోను, తీవ్ర గాయాలలోను పెరుగుదల అని వెంటనే అర్థమౌతుంది. జేబులోనో లేక ఇంట్లోనో తుపాకీ ఉంటే ఆ మనిషి బహుశ హంతకునిగా మారగలడన్నది ఇప్పటి నగ్నసత్యం.
నేరము, మాదకద్రవ్యములు
యాబై ఏళ్ల క్రితం మాదక ద్రవ్యం ప్రపంచ సమస్యగా మారుతుందని ఎవరూహించారు? అదే ఈనాటి నేరము దౌర్జన్యములకు మూల కారణాలలో ఒకటి. టెరరిజమ్, డ్రగ్స్ అండ్ క్రైమ్ ఇన్ యూరోప్ ఆఫ్‌టర్ 1992, అనే తన పుస్తకంలో రిచ్చర్డ్ క్లటర్‌బాక్, “తుదకు మాదక ద్రవ్య విక్రయములో పెరుగుదల మానవ జాతికి అన్నిటికంటే గొప్ప విపత్తుగా తయారౌతుంది . . . దాని లాభాలు పేరుమోసిన మాదకద్రవ్య విక్రయదారులకు విస్తృతంగా ఆర్థిక మరియు రాజకీయ శక్తితోసహా (కొలంబియ మంచి ఉదాహరణ) ప్రపంచ వ్యాప్తంగా భీకర నేర ప్రవృత్తికి ప్రోద్భలాన్నిస్తున్నవి” అని సూచించారు. “తీవ్రవాదము మరియు నేరస్థుల దౌర్జన్యములకు గొప్ప ఆధారం, కొలంబియా కోకా పొలాలనుండి ఐరోపా మరియు అమెరికాలో దానికి దాసులైన వారికి చేరవేసే కోకేన్ విక్రయమే.”
ప్రబలమైన నేర ప్రవృత్తి పెరుగుదల మరియు ప్రపంచవ్యాప్తంగా చెరసాలలో పెచ్చుపెరిగిపోతున్న వారి సంఖ్య, లక్షలమంది ప్రజలు నేర ప్రవృత్తిని కలిగి, మారటానికి విముఖతను కనపరుస్తున్నారని తేటతెల్లమవుతోంది. నేరం లాభప్రదమని అనేకులు కనుగొన్నారు. తత్‌ఫలితంగా, మన ప్రపంచం మారింది—నీచాతి నీచానికి దిగజారింది. అది మరింత అపాయకరమైంది.
ఎయిడ్స్—అది మార్పును తెచ్చిందా?
కేవలం సలింగసంయోగులకు మాత్రమే అని ఆపాదించబడిన ఈ వ్యాధి ఇప్పుడు ప్రతి జాతి, ప్రతి జీవన విధానంలోని ప్రజలకు కూడా పట్టే మహమ్మారిగా మారింది. ఎయిడ్స్‌కిక ఏమాత్రం ప్రీతిపాత్రులులేరు. ఆఫ్రికా దేశంలోని కొన్ని ప్రాంతాలలో, అది పరలింగ సంయోగుల జనాబాలోని అధిక భాగాన్ని పొట్టన బెట్టుకుంటోంది. తత్‌ఫలితంగా, కొందరు లైంగిక దురాచారం ఇక ఏమాత్రం నాగరికత అనిపించుకోదనే భావనకొచ్చారు. ఈ భావం నైతిక విలువల దృష్ట్యాకాదు గాని ఎయిడ్స్ సోకుంతుందన్న భయానికే. “సేఫ్-సెక్స్” అన్నది ఈనాటి నినాదం, మరి దాని వ్యాపకాన్ని అడ్డుకోవడానికి కాండమ్‌ల వాడుక సిఫారసు చేయబడుతోంది. దీన్ని అరికట్టడంలో, లైంగిక అవినీతినుండి వైదొలగడం అతితక్కువ ఆమోదాన్ని అందుకుంటోంది. మరి రానున్న భవిష్యత్తులో మానవ కుటుంబంపై ఎయిడ్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
“ఎయిడ్స్ 2000 సంవత్సరం నాటికి, 1918 లోని ఇన్‌ఫ్లూయెన్‌జా తెగులును అధిగమించి, ఈ శతాబ్దంలోకెల్లా అతి గొప్ప రుగ్మతగా తయారయ్యే అవకాశముంది. ఆ ఇన్‌ఫ్లూయెన్‌జా, 2 కోట్ల ప్రజలను, లేక 1% ప్రపంచ జనాబా, అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులకు రెండింతలు ప్రజలను చంపిందని టైమ్ పత్రిక ఇటీవల నివేదించింది.” ఒక నిపుణురాలు చెప్పిన ప్రకారం “ఈ మహమ్మారి చరిత్రను బద్దలుకొడుతుంది.”
ఎయిడ్స్ పరిశోధనలకై కొన్ని లక్షల డాలర్లను, ఇతర కరెన్సీని ఎంత పోసినప్పటికీ, పరిష్కారం గోచరించడంలేదు. నెదర్‌లాండ్స్ ఆమ్‌స్టర్‌డమ్‌లో జరిగిన ఎయిడ్స్ సదస్సులో ఈ సమస్యలను పరిశీలించడానికని 11,000 వైజ్ఞానికులు, నిపుణులు కూర్చబడ్డారు. “నిష్ఫల, ఓటమినెదుర్కున్న మరియు ప్రవృద్ధి చెందుతున్న విషాదాంత సంఘటనతో ముగిసిన దశాబ్దంపై ప్రతిబింబిస్తూ, అక్కడి వాతావరణమంతా గంభీరంగా మారింది. . . . ఎయిడ్స్ పరిశీలన మొదలు పెట్టినదాని కంటే దాని పరిష్కారం కనుగొనడానికి మానవజాతి ఇంకా చాలా దూరం పోవలసి వుంటుంది. టీకాలులేవు, నివారణలేదు, కనీసం నిర్వివాద ప్రభావవంతమైన చికిత్సలేదు.” (టైమ్) హెచ్.ఐ.వి వున్నవారు తప్పకుండా ఎయిడ్స్ వలన రోగగ్రస్థులౌతారనడం ఇప్పటికే ఖాయం. ఆశ ఏమాత్రం లేదు. ఎయిడ్స్ విషయంలో కూడా మార్పు యింకా దిగజారుతూనేవుంది.
లోక రాజకీయంలో మార్పు
గత నాలుగేళ్లుగా మారిన రాజకీయవిధానం చాలామంది నాయకులను ఆశ్చర్యపరచింది. మరియు అమెరికాలో వచ్చినన్ని మార్పులు మరి ఏ ప్రాంతంలో కూడా రాలేదు. అకస్మాత్తుగా, రాజకీయరంగంలో తనకు సరితూగు ప్రత్యర్థులెవరూ లేనట్లు అనుకుంటోంది. ఇకముందు తనతో ఎవరూ ఆడడానికి ఏమాత్రం సుముఖత చూపడంలేదని అకస్మాత్తుగా కనుగొన్న, అతి ప్రభావశీలియైన, ఎదురులేని బాస్కెట్‌బాల్ జట్టుకు అది పోల్చబడింది. ఈ సందిగ్ధ స్థితిని చార్లెస్ విలియమ్ మేన్స్, ఫారిన్ పాలసి పత్రిక సంపాదకుడు, 1990 లో ఆ పత్రికలో సంక్షిప్తంగా ఇలా రాశారు: “ఈనాడు అమెరికా ఫారిన్ పాలసీయొక్క ధ్యేయం, వినాశకరమైన యుద్ధంనుండి దేశాన్ని విమోచించడం కాదుకానీ, (గతంలో) సోవియట్ యూనియన్ మరియు అమెరికాల మధ్య అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఊహాతీత శాంతిని సంస్థీకరించడమే.”
అధికమయ్యే న్యూక్లియర్ సామర్థ్యత కొత్త భయోత్పాతాన్ని సృష్టిస్తున్నా, ప్రపంచ ఆయుధ విక్రయదారులకు సంతోషంగావుంది—ప్రస్తుతమున్న ఆయుధాలతో యుద్ధ భేరి మ్రోగుతూనే వుంది. శాంతికొరకు ఉవ్విళ్లూరుతున్న లోకంలో, అనేక మంది రాజకీయనాయకులు తమ సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని కూడగట్టుకుంటున్నారు. ఇక దివాళా తీసిందన్నట్లున్న ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దీర్ఘకాలిక పుండ్లకు పైపై కట్లు కట్టడంలో నిమగ్నమైవుంది.
జాతీయవాదంయొక్క మార్పులేని శాపము
కమ్యూనిజం తిరుగుముఖం పట్టేప్పటికి, అమెరికా మాజీ రాష్ట్రపతి, బుష్, “నూతన లోక క్రమము” గురించి ప్రచారంచేశారు. అయినప్పటికి, కొందరు రాజకీయనాయకులు గమనించి, విలక్షణమైన నినాదాలు ఊరకనే దొరుకుతాయి కాని, అనుకూల మార్పులను సాధించడం చాలాకష్టం. జెఫ్రి గోల్డ్‌ఫార్బ్, తాను రాసిన పుస్తకం ఆఫ్ట్‌ర్ ది ఫాల్—ది పర్స్యూట్ ఆఫ్ డిమోక్రసి ఇన్ సెంట్రల్ యూరోప్ లో ఇలా అంటున్నారు: “‘నూతన లోకక్రమము’ యొక్క అంతులేని ఆశ, ఆ వెంటనే కొన్ని ప్రాచీన సమస్యలు, కొన్నిసార్లు వాటి తారాస్థాయిలో మనలనింకా వెంబడిస్తున్నట్లు వ్యక్తమౌతుంది. విమోచనా వేదాంతం . . . ఎల్లప్పుడు రాజకీయ ఉద్రిక్తత, జాతి విభేదము, మత వాదము, ఆర్థిక అస్థిరత్వంవలన కలిగిన నిరాశలో మరుగునపడుతోంది.” నిశ్చయంగా అంతర్యుద్ధంలోవున్న యుగోస్లోవియా జాతి మత రాజకీయ విభేదాలలో స్పష్టమైన చక్కని మాదిరి.
ఇంకా పొడిగిస్తూ, గోల్డ్‌ఫార్బ్ ఇలా అన్నారు: “పరదేశీయుల భయము మరియు వ్యక్తిగత అభద్రత, మధ్య ఐరోపాలోని జీవిత సత్యాలు. ప్రజాస్వామ్యం దానంతటదే ఆర్థిక రాజకీయ మరియు సాంఘిక ఫలితాలను తెచ్చిపెట్టదు మరియు వ్యాపార ఆర్థిక వ్యవస్థ సంపదను తెస్తుందని వాగ్దానం చేయదు సరికదా, దానిలో పనిచేసే విధానం తెలియని వారికి అది అగోచరమైన సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది.”
అయితే ఇవి మధ్యఐరోపా మరియు మాజీ సోవియట్ యూనియన్‌ల సమస్యలు మాత్రమే కావన్న విషయం స్పష్టమైంది. విదేశీయుల భయం, ఆర్థిక అసంరక్షణ భూవ్యాప్తమైనవి. మానవ కుటుంబము దాని వెలను బాధలలో, మరణంలో కడుతోంది. మరియు లోతుగా పాతుకుపోయిన గోతులు త్రవ్వే స్వభావం సృష్టిస్తున్న ద్వేషము మరియు దురాగతాలలో మార్పుకై రానున్న భవిష్యత్తు ఎలాంటి నిరీక్షణనూ ఇవ్వటంలేదు. ఎందుకని? ఎందుకంటే తల్లిదండ్రులనుండి లేక జాతీయతను ప్రోత్సహించే పాఠశాలలనుండి అనేకులు ఆర్జించిన విద్య ద్వేషం, అసహనము, జాతీయత, మతం మరియు తెగల మూలం లేక భాషపై ఆధారపడిన అధికార మదంవంటి వాటినే ప్రబోధిస్తుంది.
ఏషియావీక్ వారపత్రిక జాతీయవాదానికి నామకరణం చేసినట్లు “చివరి వికృత వాదం” ద్వేషాన్ని, రక్తతర్పణాన్ని రెచ్చగొడుతూవుండే మార్పులేని విషయాలలో ఒకటి. ఆ పత్రిక ఇలా పేర్కొంది: “ఒక సెర్బ్ వాడైయుండుటకు ఒకడు గర్విస్తే అది ఒక క్రోట్ జాతీయుని ద్వేషించడమైనప్పుడు, ఒక ఆర్మేనియుని స్వేచ్ఛ ఒక టర్క్ దేశీయునిపై పగ సాధించడమైనప్పుడు, ఒక జుళు దేశీయుని స్వాతంత్ర్యము ఒక కోసాను లొంగదీసుకోవడం మరియు ఒక రుమేనీయుని ప్రజాస్వామ్యం ఒక హంగేరియుని వెళ్లగొట్టడమైనప్పుడు, ఇక జాతీయవాదం అప్పటికే దాని వికృత రూపాన్ని ధరించినట్లే.”
ఆల్‌బర్ట్ ఐన్స్‌టైన్ ఒకప్పటి మాటలు మనకు జ్ఞప్తికొస్తాయి: “జాతీయవాదం పిల్లల చేష్టలు. అది మానవ జాతికి పట్టిన పొంగు.” ఒకసారి కాకపోతే మరోసారి అది ప్రతి ఒక్కరికీ వస్తుంది, వ్యాపిస్తూనేవుంటుంది. వెనుకటికి 1946 లో, బ్రిటిష్ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాంబీ ఇలా రాశారు: “దేశభక్తి . . . ప్రాశ్చ ప్రపంచపు మతంగా క్రైస్తవత్వాన్ని త్రోసివేసి ముందుకు పరుగుతీసింది.”
ఈ పరిస్థితులలో మానవ నైజంలో మార్పు కలుగుతుందన్న ఆశాభావం వుందా? కేవలం విద్యలో మౌలిక మార్పులవలన అది సాధ్యపడుతుందని కొందరు నమ్ముతున్నారు. జాన్ కె. గాల్‌బ్రాత్ అనే అర్థశాస్త్రవేత్త ఇలా రాశారు: “ప్రజల లక్షణాలే పురోగతికి సోపానాలు” కాబట్టి . . . ఔన్నత్యంలేని ప్రజలున్నప్పుడు అభివృద్ధి అసాధ్యం. ప్రజలు విద్యావంతులై, విమోచించబడినప్పుడు పురోగమనం నిశ్చితం. . . . మొట్టమొదట నిరక్షరాస్యతపై విజయం సంపాదించాలి.” ద్వేషము, సంశయాలకు బదులు ఈనాటి ప్రపంచ విద్యా సంస్థలు ప్రేమను ఔదార్యాన్ని నేర్పించగలవనే నిరీక్షణ ఏమైనావుందా? మనమందరము ఒకే మానవ కుటుంబానికి చెందినవారమని గ్రహించి, లోతుగా పాతుకుపోయిన జాతి, మత వైషమ్యాలు విడనాడి ఎప్పుడు వివేచనా విశ్వాసాలతో నింపబడగలము?
గనుక, అనుకూల మార్పు అవసరమనేది సుస్పష్టం. సాన్‌డ్రా పోస్టెల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ లో ఇలా రాశారు: “ఒకవేళ మనం మరింత మెరుగైన ప్రపంచానికొరకై వాస్తవిక నిరీక్షణను కలిగియుండాలంటే, మరి గంభీరమైన, సంపూర్ణ పరివర్తనను ఈ దశాబ్దంలోని శేషకాలమే అందివ్వాల్సి వుంటుంది.” మరి మనమెటు పయనిస్తున్నాము? రిచర్డ్ క్లట్టర్‌బక్ ఇలా పేర్కొన్నారు: “ప్రపంచం మాత్రం అస్థిరంగా, అపాయకరంగానే వుంటోంది. జాతి మతాల అత్యాసక్తి కొనసాగుతూనే వుంటుంది. ఈ 1990 వ దశాబ్దం, అత్యంత అపాయకరమైనదిగానో లేక అత్యంత అభివృద్ధిచెందినదిగానో వుంటుంది.—టెరరిజమ్, డ్రగ్స్ అండ్ క్రైమ్ ఇన్ యూరోప్ ఆఫ్‌టర్ 1992.
మారుతున్న మన పర్యావరణము
గత కొన్ని దశాబ్దాలుగా, మానవుని చర్యలు పర్యావరణం మీద భయంకర పరిణామాలను కనపరుస్తోందని మానవజాతి గ్రహించింది. ఉద్రుతమైన అటవీనిర్మూలనం వలన లెక్కలేనన్ని జంతు వృక్షజాతులు చనిపోతున్నాయి. ఈ గ్రహశ్వాసకోశంలో అడవులు ఒక భాగమే గనుక, వాటి నాశనంవల్ల కార్బన్‌డైఆక్సైడ్‌ను ప్రాణంపోసే ప్రాణవాయువుగా మార్చే శక్తిని భూమి కోల్పోతుంది. పైమట్టిని బలహీన పరచి చివరికి ఎడారిమయం చేయటానికి దోహదపడడమే దీని మరో ప్రభావం.
కొన్ని హెచ్చరికా స్వరములు వినిపించాయి. అందులో ఒకటి అమెరికా రాజకీయ నాయకుడైన ఆల్ గోర్ స్వరము. ఎర్త్ ఇన్ ది బాలన్స్—ఎకాలజి అండ్ హ్యుమన్ స్పిరిట్ అనే తన పుస్తకంలో ఆయన ఇలా రాశారు: “ప్రస్తుత వేగంలో అటవీనిర్మూలనం జరిగితే, వచ్చే శతాబ్దంకల్లా సతత హరితారణ్యాలను మనం కోల్పోతాం. ఈ నాశనాన్ని మనం ఇలాగే అనుమతిస్తే, మన గ్రహం పైనున్న జన్యు సంపదకు దానితోపాటు మనలను పీడించే అనేక రుగ్మతలకు సంభవమైన చికిత్సను సహితం మనం కోల్పోతాం. వాస్తవానికి, ప్రస్తుతం ప్రచారంలోవున్న వందలకొలది ఔషధాలు ఉష్ణమండల అరణ్యములలోని వృక్షాలనుండి, జంతువులనుండే తీయబడుతున్నాయి.
పర్యావరణంపై మానవుని ప్రభావం జీవమునకు సంభవింపనైయున్న అపాయమును సూచిస్తోందని గోర్ నమ్మకం. “ఊహాజనితమైన ప్రతి పర్యావరణంలోకి మనం జొరబడితే, మన స్వంత జాతి వినాశనం స్పష్టంగా కనపడుతుంది. . . . ఒక తరం గతించక మునుపే, చరిత్రలోని ఏ అగ్నిపర్వతంకూడా మార్పు చేయనంతరీతిలో, అతి వేగంగా మనం మన భౌగోళిక వాతావరణపు వాస్తవిక రూపాన్ని మార్చివేసే ప్రమాదంలో వున్నాము, మరి దాని ప్రభావాలు రానున్న కొన్ని శతాబ్దాల వరకూ ఉండవచ్చు.”
గోర్ మరి ఇతరుల ప్రకారం మన పర్యావరణమేకాదుకానీ, మనకు అతి ప్రాముఖ్యమైన నీటి సరఫరాకూడా ప్రమాదంలోవుంది. ప్రాముఖ్యంగా “అనుభవింపబడుతున్న దాని ఫలితాలు అంటే నీటి కాలుష్యంవలన కలరా, విషజ్వరం, రక్తవిరోచనాలు, అతిసార వ్యాధి రూపాలలో అతి తీవ్రంగాను అత్యంత హృదయవిదారకంగా” వున్న అభివృద్ధిచెందే దేశాలలోనే చాలా ఎక్కువగా కనబడుతున్నవి. తరువాత గోర్: “170 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలకు సరైన తాగే నీటి సరఫరా లేదు. 300 కోట్ల మంది ప్రజలకు సరైన మరుగు దొడ్లులేవు, తత్‌ఫలితంగా వారి నీరు కలుషితమయ్యే ప్రమాదంలోవున్నది. ఉదాహరణకు భారతదేశంలో నూటాపద్నాలుగు పట్టణాలు, నగరాలు శుద్ధిగావించని మానవ మల విసర్జనను మరి ఇతర మురికిని సరాసరి గంగలోనే కలుపుతున్నవి” అనే వాస్తవాన్ని తెలుపుతున్నాడు. మరి ఆ నదే లక్షలాది మంది ప్రజలకు జల జీవాధారము.
ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడైన గౌతమ్ ఎస్. కాజీ, బాంకాక్‌లో తన ప్రేక్షకుల నుద్దేశించి ఇలా హెచ్చరించారు: “వచ్చే శతాబ్దానికి నీటి సరఫరాయే తూర్పాసియలో సంక్షోభాంశమౌతుంది. . . . ఆరోగ్యరీత్యా, ఉత్పాదనారీత్య సురక్షిత మంచినీరు తాగడం వలన అందరికీ తెలిసిన ప్రయోజనాలున్నప్పటికీ, తూర్పు ఆసియా ప్రభుత్వాలు ప్రజలకు త్రాగే నీటి సరఫరా చేయలేని ప్రజా సంస్థలతో సతమతమౌతున్నవి. . . . వాతావరణ సంబంధమైన మంచి పురోభివృద్ధికిది మరువబడిన అంశము.” ప్రపంచ మంతటకూడా జీవనానికి కనీసావసరతలైన వాటిలో ఒకటైన మంచినీటి సరఫరా నిర్లక్ష్యం చేయబడుతోంది, వృధా చేయబడుతోంది.
ప్రపంచములోని అనేక ప్రాంతాలలో మానవజాతి భవిష్యత్ జీవనాన్ని భయోత్పాతంలో ముంచెత్తుతూ అపాయకరమైన ఊబిలా రూపొందుటే, మారుతున్న మన ప్రపంచ వైఖరులు. ప్రాముఖ్యమైన ప్రశ్నేమిటంటే, భూవనరుల బారీ నిర్మూలనను ఆపగలిగే చర్యలు తీసుకోగల ప్రోత్సాహము, చిత్తశుద్ధి ప్రభుత్వాలకు మరియు బారీ వ్యాపార సంస్థలకువున్నాయా?
మతం ప్రపంచాన్ని మలుస్తోందా?
మతం విషయంలో, బహుశ మానవుని అతి గొప్ప ఓటమి మనకు కనపడుతుంది. ఒక వృక్షము దాని ఫలాలాధారంగా తీర్పుతీర్చ బడితే, అప్పుడు మతం దాని ఫలాలైన ద్వేషము, అసహనము, యుద్ధములను బట్టి సమాధానం చెప్పుకోవలసివుంటుంది. చాలా మంది మతాన్ని వట్టి పైపై మెరుగులా దృష్టిస్తారు. అది జాతి వివక్షత, జాతీయతా భావం, ఆర్ధిక అస్థిరతల ఒత్తిడికి గురై త్వరగా ఊడిపోయే చర్మపు పైపొరవంటిదే.
క్రైస్తవత్వము ‘నీ పొరుగువారిని మరియు నీ శత్రువును ప్రేమించు’ మతం గనుక, కాథొలిక్‌లు, గత యుగొస్లావియాలోని అర్థడాక్స్‌కు ఏమయింది? వారి గురువులు, వారు రేపిన ద్వేషాన్ని, జరిపించిన మారణహోమాన్ని మన్నిస్తారా? శతాబ్దాల “క్రైస్తవ” బోధలు ఉత్తర ఐర్లాండ్‌లో కేవలం ద్వేషాన్ని, హత్యలను మాత్రమే ఉత్పన్నంచేశాయా? మరి క్రైస్తవేతర మతాల మాటేమిటి? వారు వీరికంటే మెరుగైన ఫలాలను ఫలించారా? హిందు, సిఖ్, బౌద్ధ, ముస్లిం, షింటో మతాలన్నీ మత సామరస్యాన్ని కనబరచాయన్న దాఖలాలున్నాయా?
మతం మానవజాతి సంస్కారానికి అనుకూల ప్రభావాన్ని కనపర్చే బదులు, అది దేశభక్తి అనే వెర్రితనాన్ని, రెండు ప్రపంచ యుద్ధాలలోని సేనలను మరి అనేక ఇతర పోరాటాలను ఆశీర్వదించి మత మౌఢ్యపు రగిలేమంటలను రేపే పాత్రనువహించింది. అది మార్పుకు పురోభివృద్ధికరమైన శక్తికాదు.
కాబట్టి, సమీప భవిష్యత్‌లో మతంనుండి మనం ఏమి ఆశించగలం? వాస్తవికంగా, మన ప్రస్తుత ప్రపంచ పరిస్థితికైన భవిష్యత్ ఉత్తరాపేక్షేమిటి—ఎటువంటి మార్పులుంటాయి? మా మూడవ శీర్షిక ఈ ప్రశ్నలను విశేష దృక్కోణంలో చర్చిస్తుంది? (g93 1/8)
[7వ పేజీలోని చిత్రం]
హింసాత్మక నేరంలో ఆకస్మిక మార్పు, మార్పునకు మరో సూచన
[8వ పేజీలోని చిత్రాలు]
జాతి మత ద్వేషాలు రక్తపాతాన్ని ఒలికిస్తూనేవున్నాయి
[Credit Lines]
Jana Schneider/Sipa
Malcom Linton/Sipa
[9వ పేజీలోని చిత్రాలు]
మానవ పర్యావరణ దుర్వినియోగం, జీవ మండలపు సున్నిత సమతుల్యాన్ని మారుస్తోంది
[Credit Lines]
Laif/Sipa
Sipa
[10వ పేజీలోని చిత్రం]
హిట్లర్‌కు 1933 లో బ్యాసల్లో డై టోర్రెగ్రోసా అనే పోపు అనుచర బృందం అభినందనం చేసింది. చారిత్రాత్మకంగా, మతం రాజకీయంలో, జాతీయతలో పాలుపంచుకుంది
[క్రెడిట్ లైను]
Bundesarchiv Koblenz