“అన్వేషణల యుగం”—ఎంత మూల్యంతో?
స్పెయిన్‌లోని అవేక్! ప్రతినిధి ద్వారా
నాకేం దొరికిందో చూడండి!” అని ఒక అందమైన సీతాకోక చిలుకను పట్టుకుని చిన్న అమ్మాయి అంటుంది. పెద్దవాళ్లు కూడ వారి యొక్క సరిక్రొత్త అన్వేషణలను సగర్వంగా చూపించాలని ఇష్టపడతారు.
అలాంటి దానికి విశ్వ ప్రదర్శనశాల లేక ప్రపంచ సంత కంటే మించిన దెక్కడైనా ఉందా? దక్షిణ స్పెయిన్‌లోని సెవిల్‌లో 1992 ఏప్రిల్ 20 నుండి అక్టోబరు 12 వరకు ఈ శతాబ్దపు చివరి మరియు అతి పెద్ద ప్రపంచ సంత, అంటే ఎక్స్‌పో ‘92 అని పిలువబడేది, నిర్వహింపబడింది.
ఎక్స్‌పో ‘92 యొక్క ఇతివృత్తమేమంటే “అన్వేషణల యుగం”, అందుకే దానిలో పాల్గొన్నవారు, మానవ జాతి యొక్క పూర్వపు మరియు ప్రస్తుత అన్వేషణల్లో వారి పాత్రను వివరించటానికి ప్రయత్నించారు. ప్రపంచపు 111 దేశాల పారిశ్రామిక విజ్ఞానము, నిర్మాణశైలి, సాంప్రదాయము, వంటవిధానం వంటివాటిని కనుగొనగల్గే విశేషమైన అవకాశాన్ని సందర్శకులు పొందారు.
అయినా, ఇటీవలి సంవత్సరాలలో, అన్వేషణ యొక్క చీకటి కోణం బయటపడింది. ఎన్నో అన్వేషణల అసంతోషదాయకమైన ఫలితమేమిటంటే, భూమి యొక్క సున్నితమైన వాతావరణపు నాశనమే. ఒక చిన్న అమ్మాయి ఎలాగైతే సీతాకోక చిలుక యొక్క సున్నితమైన రెక్కలకు హాని కలుగజేస్తుందో అలాగే సాంకేతిక పరిజ్ఞానం యొక్క బాధ్యతారాహిత్య ఉపయోగం కూడ మన గ్రహానికి తిరిగి బాగు చేయలేని నష్టాన్ని కలిగించ వచ్చును.
కాబట్టి, ఎక్స్‌పో ‘92 అఫీష్యల్ గైడ్ ఇలా వివరించింది, “మానవ జాతి యొక్క అన్వేషణా సామర్థ్యానికి నివాళులర్పించాలి” అన్నదే ధ్యేయం కాదు గాని మన సున్నితమైన గ్రహాన్ని రక్షించటానికి కావలసిన అంతర్జాతీయ పరస్పర సామరస్యాన్ని పెంపొందించటం కూడ ఓ గురైయుండెను.
“ఒక ద్వీపం పై ప్రపంచం”
ఈ ప్రదర్శనను నిర్వహించిన పట్టణమైన సెవిల్, అన్వేషణా యుగంలో సంపన్నవంతమయ్యింది. క్రిస్టాఫర్ కొలంబస్ తన ద్వితీయ గొప్ప పరిశోధనాత్మక యాగానికి రెండవసారి సెవిల్ నుండియే నౌకాయానం సాగించాడు. పదహారవ శతాబ్దంలో, అమెరికా నుండి చాలా వెండి, బంగారం సెవిల్‌కు స్పెయిన్ ఓడల ద్వారా రవాణా చేయబడింది. తొలి అన్వేషకులకు ముఖ్య ప్రేరణ అయిన—యీ వెండి బంగారం—నగర ప్రముఖ ప్రదేశాలలో ఒకటైన టోరె డెల్ ఓరా వద్ద దింపబడ్డాయి.
అయినను, ఇటీవలి కాలంలో ఎలాగైనా డబ్బు సమకూడే బదులు, ప్రవాహంలా బయటికి పోతూనే ఉంది. గత ఐదేళ్లలో, ఎక్స్‌పో ‘92 కొరకు అండలూషియా ముఖ్య పట్టణాన్ని సిద్ధం చేయటానికి వెయ్యి కోట్ల డాలర్లు ఖర్చు చేయబడ్డాయి. ఆ డబ్బంతా ఏమి తయారగుటకు కారణమయ్యింది?
సెవిల్ పొలిమేరలలో ఉన్న గ్వాథాల్‌కెవేర్ నదిచే తయారు చేయబడిన లా కార్టూహా ఒండ్రు ద్వీపంలో, ఒక పాత సన్యాసి మఠం మరియు ఒక మూతబడిన పింగాణి ఫ్యాక్టరీ ఉండేవి. అది, ఇరువైపులా చెట్లున్న దారులు, తోటలు, కాలువలు, సొరంగాలు మరియు మెరిసే నమూనాల వంటివాటితో, అన్నీ అనేక మనోహరమైన వంతెనలతో నగరానికి జత చేయబడి, ఒక నిర్దిష్ట సంకల్పం కొరకు రూపొందించబడిన అతిపెద్ద వినోదశాలగా రూపొందింది. స్పెయిన్ రాజైన జాన్ కార్లోస్ 1 క్రొత్త లా కార్టూహాను ఇలా వర్ణించాడు “ఒక ద్వీపంపై ప్రపంచం, మరియు ప్రపంచం కొరకు ఒక ద్వీపం” ఉన్నాయి. ఈ ఎక్స్‌పో ‘92కు వచ్చిన సందర్శకులు ఏవిధమైన ప్రపంచాన్ని కనుగొన్నారు?
సాంకేతిక నైపుణ్యాలకే కాకుండ సాంప్రదాయానికి, మంచి ఆహారానికి, మరియు వినోదానికి కూడ ఎక్స్‌పో ‘92లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడినట్లు కనిపిస్తుంది. రచయిత సెసార్ ఆలెన్ సో ఇలా అభిప్రాయపడ్డాడు: “ఎక్స్‌పో ‘92లో అభివృద్ధి సాధించాలనే ఆశాజనక భావం నుండి కేవలం విజ్ఞాన, సాంకేతిక ప్రగతికే ప్రాముఖ్యతనివ్వకుండా జాగ్రత్త పడుటలో ప్రగతి సాధించాము.” అంతేకాక, చెప్పుకోదగిన సంఖ్యలో చిన్న దేశాలు పాల్గొనటం వల్ల ప్రదర్శనకు సాంకేతిక ఆకృతి కంటే మానవతాదృక్పధమే ఎక్కువగా వచ్చింది.
భిన్నమైన నమూనాలు, దూరంలో ఉన్న దేశాలను ఎప్పుడూ సందర్శించలేని వారికి, ఆ దేశాల సౌందర్యం, ప్రజలు, మరియు చరిత్ర యొక్క సంక్షిప్త రూపాన్ని అందజేశాయి. న్యూజీలాండు మరియు పాపువా న్యూ గినియా యొక్క నాటకీయ గిరిజన నృత్యాలు, ఉల్లాసవంతమైన రష్యా జానపద నృత్యం, స్పెయిన్ సెవేయానాస్, మనోహరమైన ఇండోనేషియా దేశపు సంగీతం సందర్శకుల అవధానాన్ని పొందడానికి పోటీ పడ్డాయి. ప్రయోగాత్మక ఉత్పాదనలు, బాణాసంచా ప్రదర్శనలు, మరియు తిరుగుతూ నవ్వించే విదూషకులు వాతావరణానికి మరింత రంగును చేకూర్చాయి.
పూర్వపు మరియు ప్రస్తుత అన్వేషణలు
క్రిందటి ఐదు శతాబ్దాలలో ప్రపంచం ఎంత మార్పు చెందిందో సందర్శకుడు అక్కడ చూడవచ్చు. లా కర్టూహా యొక్క పునరుద్థరింపబడిన మఠం, 1492లో—కేవలం యూరపులోనే కాదు అమెరికా, ప్రాచ్య, మరియు ముస్లిం దేశాలలో కూడ జీవితం ఎలా ఉండేదోనని చూపించింది. ఆ సమయంలో ఆ నాలుగు ప్రాంతాలు విశాలమైన ద్వీపాల వలె వుండి, మహా సముద్రాలు, ఎడారులు, లేక పరస్పర అనుమానాలతో ఒకదాని నుండి మరొకటి విభాగింపబడినట్లుగా వుండేవి.
అన్నిటికంటె ముఖ్యంగా, ఎక్స్‌పో ‘92 స్నేహపూరిత వాతావరణం కలిగివుండాలని ఉద్దేశించ బడింది. అంతర్జాతీయ సమావేశాలందు మొట్టమొదటి సారిగా సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇటీవలి అన్వేషణలు—ఓజోను పొరలో ఏర్పడిన రంధ్రం—మన గ్రహానికి మానవ జాతి మూలంగా వచ్చే ముప్పులను ఎలా నొక్కి చెప్పిందో ఒక మూడు డైమెషన్ల వార్తా చిత్రం వివరించింది. వాతావరణమునకు సంబంధించిన నమూనా అనేది అడవుల సంరక్షణను సమతూకం చేసే సమస్యను గూర్చి విశ్లేషించింది, అమెజాను యొక్క వర్షాన్ని కలిగించే అడవులకి సంబంధించిన వివరణ గల ఒక చిన్న నమూనాను తయారు చేసిన ప్రకృతి నమూనా, ఈ వెలకట్టలేని సంపద యొక్క దుర్బలతను నొక్కితెల్పింది.
యూరపు యొక్క ముఖ్యమైన తోటపని పథకాలలో ఒకటిగా, లా కార్టూహా ద్వీపంపై 30,000 చెట్లు మరియు 3,00,000 పొదలు నాటబడ్డాయి. ప్రదర్శన స్థలాన్ని అందంగా చేయడము మరియు ఈ అన్వేషణ మన వాతావరణాన్ని నాశనం చేయకూడదనే సందేశాన్ని అందజేయాలన్నదే దాని ముఖ్య లక్ష్యం. ఎర్రని మరియు పసుపు కలువలు అధునాతన ప్రసారసాధన ఉపగ్రహంతో స్థలం కొరకు పోటీపడ్డాయి. ఒకే పట్టాగల రైలు మార్గం క్రింద జకరాండా చెట్లు పుష్పించాయి, విశాలమైన పచ్చిక మైదానములు సంకీర్ణ టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థను కప్పేసాయి.
అనేక నమూనాలు రూపంలోగాని, నిర్మాణ సామాగ్రిలోగాని సంప్రదాయ నిర్మాణశైలితో ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. జపానీయుల నమూనా ప్రపంచంలోని అతిపెద్ద చెక్క కట్టడంగా గుర్తించ బడింది, స్విట్జర్‌ల్యాండ్ కాగితంతో మనోహరమైన గోపురాన్ని నిర్మించింది. మొరాకొ ఒక అరేబియన్ భవనాన్ని, యునైటెడ్ ఆరబ్ ఎమరేట్స్ చిన్న దుర్గాన్ని నిర్మించాయి. న్యూజీలాండు నమూనా శిలామయమైన ఎత్తైన కొండ పైనుండి నీరు ప్రవహిస్తున్నట్లు, సహజంగా కనిపించే సముద్రపక్షుల గూళ్లతో అలాగే ఇండియా చెక్క నమూనా అతిపెద్ద నెమలి పింఛముతో అలంకరింప బడింది.
వాతావరణం ఉక్కపోతగా వుండే సెవిల్ వేసవిలో చల్లదనం కావాలంటే సమస్యే. ఎక్స్‌పో వ్యవస్థాపకులు సమస్యను సహజంగా, సెవిల్‌లో శతాబ్దాలుగా నివసిస్తున్న మూర్స్ అనే ఒకతెగకు చెందిన మహమ్మదీయ ప్రజల కాలపరీక్షను తట్టుకున్న పద్ధతి నుపయోగించి పరిష్కరించాలని ఆపేక్షించారు. ఎన్నో జల ప్రవాహాలు, నీటి జల్లుల కృత్రిమ మేఘాలు మరియు చెట్లు, పొదలు, సొరంగ మార్గాలు కలిసి వేడిని తగ్గించాయి.
“మన కాలం యొక్క అత్యంత గొప్ప అన్వేషణ”
కొలంబస్ తన మొదటి సముద్రయానానికి బయలుదేరక ముందు, లా కార్టూహాలోని పురాతన మఠంలో నివసించాడు. అతని సముద్రయానం ప్రదర్శన వేడుక చేసుకుంటున్న అన్వేషణా యుగాన్ని ప్రారంభించింది. కాని, అనేక రంగాలలో ఐదు శతాబ్దాల అభివృద్ధి తరువాత కూడ, మానవజాతి భవిష్యత్తు వైపు పెరుగుతున్న శ్రద్ధతో చూస్తోంది. “సామూహిక అభిలాష మరియు ఆశావాదము ప్రజల మధ్య ఉన్న పరస్పర అవగాహన, చర్చలపైనే సూత్రానుసారంగా ఆధారపడి ఉంటాయి” అని రాజైన జాన్ కార్లోస్ తెలియజేశాడు.
ఆ కారణాన్ని బట్టే ఎక్స్‌పో ‘92 “భూగ్రహంపై. . .నివసిస్తున్న వారందరు శాంతిని, మంచి సామరస్యాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించుకోవాలని సందేశాన్నిచ్చింది”—అయితే పూర్తిగా విభాగింపబడిన యీ లోకం దృష్టిలో ఇది అంత సులువైన లక్ష్యం కాదు. అఫీష్యల్ గైడ్ గుర్తించిన విధంగా, “ఈ సూత్రాలపై ఆధారపడిన ఒక నూతన లోక విధానం అనేది, వాస్తవానికి, మన కాలం యొక్క అత్యంత గొప్ప అన్వేషణ అయివుంటుంది.” (g92 12/22)
[25వ పేజీలోని చిత్రం]
సివెల్ యొక్క 13వ శతాబ్దపు టోర్ డెల్ ఓర్ (టవర్ ఆఫ్ గోల్డ్)
[26వ పేజీలోని చిత్రం]
ప్రసారసాధనా ఉపగ్రహ ప్రదర్శనలో కలువలు స్థలం కొరకు పోటీ పడుతున్నాయి.
[26వ పేజీలోని చిత్రం]
మొరాకొ నమూనా మూరిష్ రాజభవన విధానాన్ని అనుకరించుట