అతిపెద్ద జంతు ప్రదర్శనాసంతలో ఒకరోజు
ఇండియాలోని అవేక్! ప్రతినిధి
మహారాజులు అందంగా అలంకరించబడిన గజరాజుల నెక్కి వేంచేయుట, నమ్రతగల రైతు పెద్దకొమ్ములుగల ఎడ్లజతను తోలుకుంటూ వచ్చుటవంటి ఫొటోలను ఇండియాలో తరచూ తీస్తుంటారు. అయితే, విలువైన అంత పెద్ద జంతువులనెలా సంపాదిస్తారు?
దీన్నిగూర్చి తెలుసుకోవడానికి మాతోపాటు ఇండియాలోని ఈశాన్య భాగమందున్న బీహార్ రాష్ట్రంలోని సోనేపూర్‌కు రండి. అక్కడ మనం బహుశ మీరు మునుపెన్నడూ చూడనటువంటి ప్రదర్శనను చూడగలం. అది ఆసియాలోకెల్ల, బహుశ ప్రపంచంలోకెల్ల అతిపెద్ద జంతు ప్రదర్శనాసంతయని అనుకుంటున్నారు. దాన్ని అక్టోబరు, నవంబరు నెలల్లో రెండువారాల పాటు నిర్వహిస్తారు.
అదొక కనులపండుగ
ఎంత జనసందోహమో! స్త్రీలు నగలెన్నో పెట్టుకొని మెరిసే చీరలు కట్టుకొనియున్నారు. ముఖ్యంగా పెళ్లయిన స్త్రీలు, పాపిటిలో ఎర్రని కుంకుమ పెట్టుకొని ప్రత్యేకంగా కనిపిస్తారు. వారిలో చాలమంది చేతుల్లో పిల్లలెత్తుకొని వుంటారు. ఒకరిద్దరు వారి చీరకొంగు పట్టుకొని వుంటే, తమ భర్తలవెంట వెళ్లడానికి వారు త్వరగా నడుస్తుంటారు.
అంతపెద్ద గుంపులో పిల్లలెలా తప్పిపోకుండ ఉంటారో మనకు తెలియదు. నిజానికి, చాలమందికి తెలియదు. ఒక వారంలోనే 50 మంది పిల్లలు తప్పిపోగా 17 మంది మరలా దొరికారని విన్నాము. మోసగాళ్లు వారిని తీసుకెళ్లి బలవంతంగా వారిచేత బిచ్చమెత్తించడమో, అవినీతి పనులకు వాడుకుంటారని మనం విన్నాం గనుక, అలా తప్పిపోయిన వారికేమౌతుందోనని అనుకుంటేనే భయమేస్తుంది.
రోడ్డు ప్రక్కనుండే చిన్నచిన్నఅంగళ్లు ఆ యిరుక్కుతోడై వుంటాయి గాని చూడ ముచ్చటగా వుంటాయి. ఒక అంగడిలో ఒక నాణెం యిస్తే, ఒక చిన్న చిలుక వచ్చి ఓ కార్డు తీస్తుంది. దాని యజమానుడు అందులోవున్నది చదివి భవిష్యత్‌ను గూర్చి చెప్తాడు. వేగంగా గడ్డం గీయించుకోవాలని వుందా? అయితే ఆ ప్రక్కనేవున్న మంగలివాని దగ్గర కూర్చుంటేచాలు, వాడు పదునైన మంగలి కత్తి తీసుకొని చకచకా మూడు నిమిషాల్లో నీ గడ్డం గీసేస్తాడు. బహుశ ఆధునిక ఉపకరణములంత త్వరగానే అతడు దాన్ని చేస్తాడు.
ఇండియాలోని స్త్రీలు వారి చీరెలకు తగ్గట్టు తొడుక్కోవడానికి ముచ్చటపడే అందమైన రకరకాల రంగురంగుల గాజులు, దుకాణముల్లో అమ్ముతూ వుంటారు. అనుభవస్తులైన వ్యాపారస్థులు చేతికి సరిపోయే మంచిగాజులు సరిపొయ్యేంత వరకు వివిధ రకాల గాజులను చేతికి వేసితీస్తువుంటారు. సాధారణంగా ఇండియాలో స్త్రీ తన చేతికి గాజు, లోహం లేదా ప్లాస్టిక్ గాజులను ఓ డజను వేసుకుంటుంది.
అంగళ్లలో జంతువుల ఆభరణాలు కూడ అమ్ముతారు. ఎంతైనా ఇది జంతు ప్రదర్శనా సంతే గదా, వ్యాపారం జోరుగా సాగుతుంది. ఎందుకంటే గ్రామీణులు వాళ్ల జంతువులను వాటిని అలంకరించాలని ఉబలాటపడుతూ వుంటారు. ఈ ఆభరణాల్లో జంతువుల మెడచుట్టువేసే పూసల పట్టీలు, రంగురంగుల వివిధ ఆకారాల్లోవున్న గంటలు వుంటాయి.
ఎవరా కేకలు వేసేది? ఇంకెవరు, బిచ్చగాడే! ముడుతలు పడి, దుమ్ముపట్టిన శరీరంతో బిచ్చగాడు రోడ్డుమీద ప్రాకుతూ తన భిక్షాటన గిన్నెను నెట్టుకుంటూ వస్తాడు. గుంపునుచూస్తే, వారు అతన్ని తొక్కకుండా అతడెలా తప్పించుకుంటాడన్నదే ఆశ్చర్యం! ఈ ప్రదర్శన రోజుల్లో ప్రజలు బిచ్చగాళ్లకు బహుగా దానం చేస్తారు, అందుకే వాడిగిన్నె అప్పుడే నాణెములతో సగం నిండిపోయి వుంది. గుడి దగ్గర వేలాదిమంది బిచ్చగాళ్లు—కుంటి, గ్రుడ్డి, కుష్టురోగులు మొదలైన వారంతా బిచ్చమెత్తుకుంటూ వున్నారు. కొందరు వారి దురదృష్టాన్ని శపించుకుంటూవుంటే, ఇతరులు దేవుళ్లపేర్లు వల్లిస్తూ వుంటారు, మరి కొందరైతే వారికి బిచ్చమిచ్చిన వారిని దీవిస్తూంటారు.
ఇక జంతు ప్రదర్శనాసంతలోనికి వెళ్తే, రకరకాల జంతువులున్నాయి. గజరాజులు అందంగా రంగులతో అలంకరించబడినవి. ప్రతిదాని మీద ఓ మావటివాడు కూర్చొని, వాటి చెవుల వెనుక అప్పుడప్పుడు అంకుశంతో పొడుస్తూ కదలాలో, ఆగాలో ఆజ్ఞాపిస్తూ, వాటిని అదుపులో పెడుతూవుంటాడు. గేదెలు మోరలెత్తుకొని ఎంతో మెల్లిగా వస్తుంటాయి, వాటి వెనుక పోగవుతున్న గుంపును అసలు ఖాతరుచెయ్యనే చెయ్యవు.
అలా వెళ్తుంటే, మనం చాలా ఆవులను కొన్ని ఒంటెలను కూడ చూస్తాము. మామూలు జాతికిచెందిన కోతులు కొల్లలుగా వున్నవి. వీటి కనుబొమ్మలకు బొచ్చు, చిన్నగడ్డములున్నవి. ఇంకా బోలెడన్ని పక్షులు అందమైన నెమళ్లు, చిలుకలు పావురాలున్నాయి. ఇవన్నీ ఆ జంతు ప్రదర్శనాసంతకు ఎక్కడెక్కడ నుండో వచ్చాయి.
కొన్ని ప్రత్యేక ఆకర్షణలు
పంజాబు నుండి వచ్చే ప్రత్యేకమైన ఆవులు విశేష ఆకర్షణలలో ఓ భాగం. వాటిలో కొన్ని రోజుకు రెండుపూటలు 25 లీటర్ల పాలు ఇస్తాయి. నిజంగా అవి చాలా అందమైన పశువులు. చాలామంది వాటిని చూడ్డానికే వస్తారు. ఇతరులైతే వాటిని కొంటారు. అమ్మకం జరిగినప్పుడల్లా వాటి యజమానుడు, ‘బోలో హరిహరనాథ్ కీ” అని ఒక దేవుని పేరున అరుస్తాడు,. అప్పుడు అక్కడున్న గుంపు “జై” అని అంటారు. ఇండియాలోని స్వదేశీ ఆవులు సాధారణంగా 3 వేలనుండి 5 వేల రూపాయలు పలుకుతాయి గాని, మంచి విదేశీ జాతివైతే 20 వేల నుండి 40 వేలరూపాయలకు అమ్ముడుపోతాయి.a
ఈ సంవత్సరం సంతకు 15 ఒంటెలు మాత్రమే అమ్మకానికి వచ్చాయి. ఈ “ఎడారిఓడలు” ఒక్కొక్కటి 5 వేల రూపాయలు పలుకుతాయి. అవి గంటల తరబడి పనిచేయగలవు, ఎండను, చలిని, ఆకలిదప్పులను సహించి, తట్టుకోగలవు. ఒంటెలు బండ్లను లాగి, పొలం దున్ని, నీళ్లు కట్టుటకుపయోగపడతాయి, సాధారణంగా ఎడ్లు చేసే పనులను యివి చేయగలవు.
అత్యంత సాధారణమైన పశువులు ఎడ్లే. రైతులు తమ సరకులను కుటుంబ పరివారాన్ని యీ ఎడ్లబండి మీద తోలుకొని పట్టణానికి వస్తూపోతూ వుంటారు గనుక, ఇండియాలోని రోడ్లమీద ఎడ్లబండి కనబడని స్థలమంటూ వుండదు. అమ్మేవాడొకడు, “సూపర్‌స్టార్ ఎడ్లు” అనే బోర్డుపెట్టుకున్నాడు. అవి నిజంగా సూపర్‌స్టార్లలాగే కనబడుతున్నవి! ఎవడైన అతన్ని మోసగించాలని గాని, దొంగిలించాలని గాని అనుకుంటే మాత్రం పొరపాటే, ఎందుకంటే అందంగా అలంకరించబడిన రెండు రైఫిళ్లు అతని దగ్గర సిద్ధంగా వున్నవి. ఒక సూపర్ స్టార్ 35 వేల రూపాయలకు అమ్ముడు బోతుంది.
ఇక సకిలించే గుర్రాలవైపుపోతుంది మన అవధానం, మరి అవెంత అందమైన జంతువులో! కొన్నేమో పోలీస్‌వారు లేక సైనికులు ఎక్కడానికి ఉంటే, మరికొన్ని పందెపు గుర్రాలు. స్వారి చేయడానికి, బండిలాగడానికి పొట్టిజాతి గుర్రాలుకూడ ఉన్నవి. ఒక చావడిలో బ్యాండ్‌మేళం వేస్తూవుంటే, శిక్షణపొందిన గుర్రం ఆనందంతో ఆ సంగీతానికి తగినట్లు నాట్యం చేస్తుంది.
ఇక మనం ఘీంకార శబ్దాలవైపు వెళ్తాం. అక్కడ ఓ మామిడి తోపులో 250 దాకా గజరాజులు వున్నాయి. అవి ఎంతటి రాచఠీవిగల జంతువులో! అవి ఇండియాలోని అన్నిభాగాలనుండి, నేపాల్ నుండి వచ్చాయి. అవి చికాకుగా వున్నట్లు కనబడుతున్నాయి. బహుశ ఆ జన సందోహాన్ని చూచిగాని, స్వజాతికి సంబంధించిన వాటి ననేకములను చూచి నందువల్ల గాని అవి అలావుండి యుండవచ్చును.
ఇక్కడ మనం ఘీంకరిస్తున్న 25 సంవత్సరాల హరిహర ప్రసాద్ అనే మగ ఏనుగును కలుస్తాం. దాని యజమానుడు గంగేబుసింగ్, దాన్నప్పుడే 70,000 రూపాయలకు అమ్మాడు. మంచి జంబో ఏనుగు సంతలో 1,30,000 రూపాయల ధర పలుకుతుండగా, దీన్ని అమ్మిన ధర చాలా తక్కువే. అయితే, యీ హరిహర అనే ఏనుగు కొంచెం గడుసుదే.
ఈ హరిహర అనే ఏనుగు 22 రోజులు ప్రయాణంచేసి యీ ప్రదర్శనాసంతకు వచ్చింది. దాన్ని విడిచి పెట్టడానికి తన యజమానుడు దిగులుపడుతున్నాడు. గాని, వ్యాపారమంటే వ్యాపారమే మరి. భావోద్రేకాలను అణచుకోవాలి. హరిహర కూడ తన పాత మావటివాన్ని వదిలిపెట్టడానికి దుఃఖించిందేమోమరి. క్రొత్త మావటివాడు హరిహరను అదుపులో పెట్టాలనుకున్నప్పుడు అది తన త్రాళ్లుతెంపుకుంది. అందుకే ఇప్పుడు గొలుసుతో కట్టివేయబడింది.
దాన్ని మౌనంగావుంచి, సాదరంగా సాగనంపుటకుగాను, పాత మావటివాడు దాని క్రొత్త స్థావరం వరకు దానితోపాటు వెళ్తాడు. అక్కడ క్రొత్త మావటివాడు యీ హరిహర కదలికలకు అలవాటయ్యేంతవరకు వీరిద్దరు కలిసిపనిచేస్తారు. క్రొత్త యజమానుడు దాన్ని ఎక్కువకాలం వుంచుకోడని మనకు తెలుసు. గనుక వచ్చే సంవత్సరం మరలా దాన్ని సోనేపూర్‌కు తెచ్చి అమ్మేయవచ్చును.
ఎక్కడో ప్రజలు యీ హరిహరను రాజస్థాన్ నుండి కొని ఎక్కడో దూరప్రాంతంలో గుడిలో సేవచేసే ఏనుగుగా వుపయోగించుకుంటారు. అప్పుడు అది చాలా అందంగా అలంకరించబడి, గుడి రథాన్ని లాగుటకు ఉపయోగించబడుతుంది. లేదా, బంగాళాఖాతంలోని అండమాన్ నికొబార్ దీవులలోవున్న అడవుల్లో దూలములు మోయడానికి వుపయోగపడుతుంది.
దీర్ఘకాల చరిత్రగల ప్రదర్శనాసంత
సోనేపూర్‌లో యీ జంతు ప్రదర్శనాసంత ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికి, అది మొగల్ చక్రవర్తి, ఆలంగీర్, (1658-1707) కాలంలో ప్రాధాన్యత పొందినట్లు కనబడుతుంది. 1887 సంవత్సరం నుండి గుర్రాల సంతకొరకు యీ ప్రదర్శనా సంతభూమిని తన కుటుంబీకులు అద్దెకు యిస్తున్నట్లు రాజేశ్వర్ ప్రసాద్ అనే స్థానిక భూస్వామి అంటున్నాడు. పందొమ్మిదవ శతాబ్దంనుండి నీలిమందు మొక్కలను పెంచే బ్రిటీష్ రాజులు పోలో ఆటలకు, గుర్రపుస్వారి కొరకు, నాట్యముల నిమిత్తం వచ్చి యీ ప్రదర్శన సమయంలో పాల్గొనేవారు.
గొప్ప పరివారంతో వచ్చే మహారాజాలు ప్రత్యేకంగా నిర్మించిన గుడారములలో వుంటూ ఆ కాలంలో యీ ప్రదర్శనకు మంచి కళ తెచ్చేవారు. అయినను జంతువుల లావాదేవీలు ఉండేంతవరకు సోనేపూర్ ప్రదర్శనాసంత కొనసాగుతునే వుంటుంది. వివిధ రకాల జంతువులు ప్రదర్శింపబడుతున్న యీ ప్రత్యేక ప్రదర్శనాసంతలో కొంత సమయాన్ని గడుపుటకు మేమానందించాము. (g92 10/22)
[అధస్సూచీలు]
a వెయ్యిరూపాయలు, షుమారు 40 అమెరికన్ డాలర్లకు సమానం.
[13వ పేజీలోని చిత్రం]
అలంకరించబడిన గుర్రం ప్రేక్షకుల కొరకు ఉంచబడింది
[14వ పేజీలోని చిత్రం]
హరిహర ప్రసాద్ అనే ఏనుగు అమ్ముడుబోయిన అనంతరం