అందరిని సంతృప్తిపరచే నూతన లోకం
నూతన లోకాన్ని నమ్మడం ఎంతకష్టమో, నిజంగా అది అంత సమీపంగా ఉన్నది. జీవాన్ని పోషించడంలో మన భూమికున్న సామర్థ్యం పూర్తిగా నిర్మూలించబడకముందే దానిని ఆదుకొనడానికి అది తగిన సమయంలో వస్తుంది. మానవుని ఉనికిని ప్రమాదంలో పడద్రోసే అపాయాలన్నింటిని ఈ నూతన లోకం నిర్మూలించును. అది వీటిని ఎలా చేస్తుంది?
ప్రపంచ క్లిష్ట పరిస్థితిని సూచించిన తదుపరి చరిత్ర కారుడైన ఆర్నాల్డ్ జె. టోన్‌బి కొన్ని సంవత్సరాల క్రితం యిలా ప్రశ్నించాడు: “కాపాడబడుటకు మనమేమి చేయాలి?” తన ప్రశ్నకు తానే సమాధానమిస్తూ అతడిలా అన్నాడు: “రాజకీయాలతో, రాజ్యాంగ సహకార విధానముతో కూడిన ప్రపంచ ప్రభుత్వాన్ని నెలకొల్పండి.”
అయితే రాబోయే నూతన లోకం “సహకార విధానము” “రాజకీయాలతో” ముడిపడియుండదు. అది ప్రజాస్వామ్యమును గాని, మరే యితర మానవ నిర్మిత రాజకీయ భావనలనే గాని హత్తుకొనదు. ఈ నూతన లోకంలో ఒకే ప్రభుత్వం పాలించనైయున్నది గనుక అది తన ఆశయాలను సాధించగలదు. ఒకదానివెంట మరొకటిగా ఆశ్చర్యం గొల్పే కార్యాలతో, నేడు మానవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని ఆ ప్రభుత్వం శీఘ్రంగా నిర్మూలించును. ఎలా? ఈ సమస్యల కారణాలను, వాటిని సరిచేయడానికి చేసే ప్రయత్నాలను తరచు కలతపర్చే ఆటంకాలను తొలగించుట ద్వారా చేస్తుంది.
నిజంగా, అది ఎప్పటికైనా ఎలా సాధ్యపడుతుంది? మానవుని సమస్యలను పరిష్కరించుటలో అవినీతిపరులు, అసమర్థులని నిరూపించబడిన అసంపూర్ణులైన మానవులేకదా యింకా పాలించుచున్నది? అయితే ఈ ప్రపంచ ప్రభుత్వంలోనే తమ పౌరుల కోరికలను నిస్వార్థంగా తీర్చే పరిపూర్ణులైన పాలకులున్నారేమో ఒక్కసారి ఊహించండి. ఆ పిమ్మట సమస్యలెట్లు పరిష్కరించ బడునో పరిశీలించండి.
ఒకే సమయములో పరిష్కారములు
పరిపూర్ణ పాలకుల ప్రపంచ ప్రభుత్వం వచ్చేసరికి ఆయాదేశాలు వివిధ రకాల ప్రభుత్వాలతో యిక ఉనికి యందుండవు. దేశాధినేతలు, రాయబారులు, మరి యితర రాజకీయ నాయకులు అనేక జనాంగముల, జాతుల, గోత్రములపై యిక ఎన్నటికిని అధికారం చెలాయించరు. అనేక దేశాల, రాష్ట్రాలకు భవనాలు, అధికార నివాస గృహాలతో కూడిన ముఖ్య పట్టణములు అవసరం లేదు. అట్టి భవనాలను పరిరక్షించుటకయ్యే అత్యధిక వ్యయాన్ని, అధికారులు సభలకు, కమిటీకూటములకు, జాతీయ శిఖరాగ్ర సమావేశాలకు హాజరగుటకయ్యే ప్రయాణ ఖర్చులన్నింటికి యిది చరమాంకము పల్కును. అనవసరమైన ప్రభుత్వాధికారులు, వారికున్న అనేకమంది సహాయకులు, కార్యదర్శులు, గుమస్తాలు, వీరితోపాటు అభివృద్ధినిరోధక కార్యాలయ వ్యవహారములు కనుమరుగవును.
విభాగించే జాతీయభావం అంతరించి, ఐక్యమైన ప్రపంచ అధికారం స్థాపించబడును గనుక శాంతి తేటగా కన్పిస్తాది. సైనిక, నావిక, వైమానికి దళాలు వాటివాటి ఆయుధాలతోపాటు ఉన్నతస్థాయి కమాండర్లు, వారి క్రింది అధికారులతో కూడిన కార్యవర్గం తమ దేశ సార్వభౌమాధిపత్యాన్ని కాపాడవలసిన అగత్యత లేదు. లేదా అక్కడ మరేవిధమైన గూఢచారి సంస్థలుండవు. పరిపూర్ణ పాలకులతోకూడిన ప్రపంచ ప్రభుత్వము క్రింద ఆయుధాలు కొనాలా లేదా అనేదానిపై బహిరంగ వ్యాపారం లేక చీకటి వ్యాపారం యిక ఉండదు; అంతేకాదు వివాదాస్పదమైన ప్రాంతాలు అక్కడ ఉండవు. భూమి మీదనున్న ప్రజలంతా విడదీయజాలని ఒకే సహోదర బృందమైయుంటారు. కావున, జాతీయతా భావం మటుమాయమగును.
పరిపూర్ణ పాలకులతో, విభాగింపజాలని ఒకే ప్రభుత్వం క్రింద ప్రజలు అనుభవించే మరియితర ప్రయోజనాలను గూర్చి యోచించండి. ఆయుధ ఉత్పాదకులవంటి గొప్ప వ్యాపారవేత్తలు, తమ వినాశక ఉత్పత్తులను ఉత్పత్తిచేస్తూ అమ్ముతూ ఉండేందుకుగాను రాజకీయ నాయకులు యిక ఏ విధంగాను పలుకుబడి ఉపయోగించజాలరు. కేవలం స్థానిక ప్రయోజనాల బిల్లులు లేదా కొన్ని నిర్దిష్ట శాసనాలపై అధికారులతో నేర్పుగా పనిచేయించుకునే తెలివైన లోపాయికారులచ్చట ఉండరు; కొద్దిమందికే ప్రయోజనకరమగు నిరుపయోగ పథకాలపై ఎక్కువ ద్రవ్యాన్ని వ్యయపర్చేవి, ఒకే ఆశయానికి విరుద్ధ మార్గాలను అనుసరించే అస్తవ్యస్థ ప్రభుత్వ శాఖలుండవు; స్వార్థ ప్రయోజనాలకు (లాభాలను పెంచుకొనుటకు) కాలుష్య నిర్మూలనా పరిష్కారములకు అవరోధములుండవు; ప్రమాదములోనున్న జీవరాసులకు ప్రత్యేక శ్రద్ధనిచ్చి కాపాడు శాసనాలకు ఓటమి ఉండదు.
సరిచేయబడే ఇతర సమస్యలు
అట్టి పరిపూర్ణ ప్రపంచ ప్రభుత్వం అన్యాయాన్ని సహించదు. అధికారాన్ని హస్తగతం చేసుకొని, నేరమునకు సంబంధించిన చట్టాలు సరియైన విధంగా, న్యాయసమ్మతంగా చేపట్టబడునట్లు చేయును. ఆ విధంగా భయంకరమైన హత్యల మూలంగా మరిన్ని హత్యలు జరుగుతాయన్న భయం నుండి పౌరులు స్వతంత్రులౌతారు.
లోకవ్యాప్తంగా అల్లుకుపోయిన సంస్థీకర నేరసంస్థలు, మాదక ద్రవ్య అక్రమ రవాణాల విషయమేమి? ఒక పరిపూర్ణ ప్రపంచ ప్రభుత్వం వీటిని సమూలంగా నిర్మూలిస్తుంది. నేరస్థులను పట్టి అప్పగించుటను నివారించే శాసనాలు అట్టి అంతర్జాతీయ నేరస్థులకు యిక ఆశ్రయ దుర్గాలుగా ఉండవు. స్థానిక చట్టాలలో ఉన్న లోపాలను యుక్తిగా ఉపయోగించుకొని చట్టాన్ని అతిక్రమించే వీరికి ఉండే రాజకీయ పలుకుబడి గతించిపోతుంది. నేరాన్ని నిర్మూలం చేసే ఒకే ఒక చర్యద్వారా జూదం, ముఠా పోరాటాలు, అశ్లీల సాహిత్యం, వ్యభిచారవృత్తి, దొంగవ్యాపారం వంటి అనేక యితర సామాజిక విద్రోహ చర్యలు కూడ భూమి మీద లేకుండా అంతమొందుతాయి. ఎంతటి సమర్థవంతమైన ఆర్థిక సవరణ!
అవును, నేడు మానవులలో మేధా సంపన్నులను కలవరపరచే, చిక్కైన, బాధ కల్గించే సమస్యలన్నీ అట్టి నూతన లోకంలో పూర్తిగా పరిష్కరించబడును. తుదకు ప్రతి ఒక్కటీ శాశ్వతంగా సరిచేయబడుతుంది. ఆ తదుపరి తరాలు ఎన్నటికి వాటి మూలంగా మరలా బాధ ననుభవించనక్కర్లేదు.
సౌభాగ్యాన్ని గూర్చిన కలకాదు
నీవిలా అడుగవచ్చు, ‘ఇంతకూ అట్టి నూతన లోకాన్ని పాలించుటకు పరిపూర్ణ పాలకులు ఎక్కడినుండి వస్తారు?’ మానవుని సృష్టించినవాడు వారిని అనుగ్రహిస్తాడు. ఇది నమ్మశక్యము కాదనిపిస్తున్నదా? అయితే, ఆలోచించండి: అలా చేసే శక్తి నీకుంటే, భూమి మీద యింతటి కలతకు కారణమైన పరిస్థితులన్నింటిని నీవు అంతమొనర్చవా? నిశ్చయంగా నీవలా చేస్తావు! కాబట్టి, మన సృష్టికర్త అంతకన్నా తక్కువ చేస్తాడని మనం తలంచాలా?
వాస్తవమేమంటే, ఒక నూతన లోకాన్ని సృష్టించాలని, దానిని కాపాడుటకు ఒక నీతియుక్త ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మన ప్రేమగల సృష్టికర్త సంకల్పించాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దీనిని గూర్చి యిలా ప్రార్థించుడని మానవులకు నేర్పెను: “నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”—మత్తయి 6:10.
ఆ రాజ్యం ఒక నిజమైన ప్రభుత్వం, ప్రపంచ ప్రభుత్వం. దాని రాజైన యేసుక్రీస్తు, “సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు రాజ్యము చేయును.” (కీర్తన 72:8) దేవుని వాక్యం వాగ్దానము చేసినట్లుగా అది అతి త్వరలో మానవ ప్రభుత్వాలను తొలగిస్తుంది: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము [దేవుని రాజైన యేసుక్రీస్తుచే పాలించబడు ప్రభుత్వము] స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దానిపొందిన వారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన [ప్రస్తుతదిన] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.
ఈ ప్రపంచ ప్రభుత్వం పరలోకమందలి దేవునిచే ఏర్పాటు చేయబడి, మానవాతీత పాలకులచే పర్యవేక్షించబడును గనుక మానవ పాలకులు చేయలేకపోయిన మంచి పనులన్నింటిని అది నెరవేర్చును. దేవుని ప్రభుత్వము 1,44,000 మంది ఆత్మీయ వ్యక్తుల కార్యవర్గం సహాయంతో రాజైన యేసుక్రీస్తుతో కూడిన మహిమాయుత రాజ్యపాలనని బైబిలు అభివర్ణిస్తున్నది. ఈ పాలకులు తాము పరలోక జీవమునకు పునరుత్థానము చేయబడక ముందు భూమిమీద తమ జీవిత కాలములో నిర్దోషమగు యథార్థతను చూపిన నమ్మకమైన వ్యక్తులు. వారంతా మానవజాతి మేలు కొరకు కృషిచేయగల్గే అద్భుతమైన స్థానమందున్నారు. ఎందుకనగా వారు భూమిమీద నివసించినప్పుడు మానవుల అవసరతలను వారు అనుభవించారు.—ప్రకటన 14:1-3.
ఇది తొలగించే సమస్యలను గూర్చి యోచించండి. అమర్త్యులై యున్నందున, ఈ ఆత్మీయ పాలకులు ఎన్నటికి ఉడిగిపోరు లేదా చనిపోరు. (1 కొరింథీయులు 15:50, 53) న్యాయమును తప్పించుటకు లేదా ముడుపులకు ఆశపడి పక్షపాతంచూపే శోధనలకు వారు లొంగిపోయి అవినీతిపరులు కాజాలరు. ఒక అమర్త్య ఆత్మీయ వ్యక్తికి రహస్యంగా యివ్వదగిన లంచమేమిటి? ధనమా, ఖరీదైన మద్యం సీసాలున్న పెట్టెనిద్దామా, విదేశీ ద్వీపానికి పర్యటనా సౌకర్యమా, ఏదో చిత్రానికి లేదా సంగీత కచ్చేరికి వెళ్లేందుకు టిక్కెట్లనిద్దామా? ఈ వస్తు సంపదలు రక్తమాంసం గలవారిని శోధించవచ్చునేమో గాని, ఈ ఆత్మీయ ప్రాణులను కాదు. ఈ పాలకులచే పాలించబడు ప్రజలు నేడు సర్వ సామాన్యమై యున్న ప్రభుత్వముల అవినీతి మూలంగా బాధననుభవించరు.
నూతన లోకం నిన్ను తృప్తిపర్చును
నీవు వృద్ధుడవా? అనేక సంవత్సరాలనుండి నీవు సంపాదించిన జ్ఞానాన్ని, నైపుణ్యాలను, అనుభవాన్ని గూర్చి యోచించుము. అయితే, నీ మనస్సు, లేదా మానసిక సామర్థ్యం బాగుగా ఉండగనే నీ భౌతిక సామర్థ్యాలు క్రమేపి నెమ్మదిగా బలహీనపడడం నీవు గమనించితివా? నీ శరీరం ఒకప్పుడు మానసిక సంకేతాలకు స్పందించిన రీతిగా యిప్పుడు స్పందించడం లేదు. అవును, నీ సామర్థ్యాలు సన్నగిల్లుతున్నాయి, నీ బలం ఉడిగిపోతున్నది, నీ సహనము తరిగిపోతున్నది. నీ కనుచూపు, వినికిడి మరింత మందగిస్తున్నవి, కండరాలు మరీ బలహీనమై తరచు నొప్పివస్తున్నవి.
అయితే, నీ జీవితంలో నీవు 20వ దశకములో ఉన్నదానికంటె శ్రేష్ఠమైన యౌవన శరీరముతో ఉండగా సంపాదించిన జ్ఞానాన్ని గూర్చి ఊహించుము—అవును, నీ భౌతిక సామర్థ్యాలు నీ మానసిక సామర్థ్యాలంత శ్రేష్ఠంగా ఉన్నాయి. ఆరోగ్యవంతమైన శరీర సౌష్టవముతో నీవు చేయగల కార్యాలను గూర్చి తలంచుము! నీ పరిపక్వ మనస్సుకు స్పందించగల మంచి స్థాయిలో ఉన్న శరీరముతో నీవు చేపట్టే ఏ పనియైనా ఆనందదాయకంగా ఉంటుంది. నీకున్న అనుభవం అట్టి పనులను సమర్థవంతముగా చేపట్టుటకు దోహదపడును. అది నీ సంతృప్తిని మరెంతో అధికం చేస్తుంది నీవు యౌవనుడవైతే, వివేకము, జ్ఞానము, అనుభవాలను నిరంతరం సంపాదిస్తూ నీ యౌవనాన్ని, బలాన్ని కాపాడుకొనే ఉల్లాసమును ఊహించుము.
మరో అడుగు ముందుకెళ్లి, అదే స్థితియందుండే నీ సహచరులు, స్నేహితులు, చెలికాండ్లు, బంధువులను గూర్చి తలంచుము. నిర్మాణ పథకములు, నిర్మాణములు లేదా హస్తకళలతో నీవు సాధించగల్గే వాటిని ఊహించుము. ఓహో, కళాకారులు, సంగీత విద్వాంసులు, చిత్రలేఖికులు, ప్రకృతి దృశ్య నిర్మాణకులు, తోటమాలి, వృక్షశాస్త్ర నిపుణులవంటి ప్రజ్ఞావంతులకు ఎంతటి ఉజ్వల భవిష్యత్తు! వారి పనులు విస్మయమొందిస్తాయి. మిక్కిలి సొగసైన చిత్రలేఖనములు, గృహాలు, తోటలు, ఉద్యానవనములు—అవును, మంచి సంగీత వాయిద్యాలు వాటిపై ప్రతిభను సాధించే కళ పేర్కొనదగిన కొన్ని ఆశ్చర్యకార్యాలు మాత్రమే.
మానవ సమాజాన్ని శారీరక పరిపూర్ణతకు అంటే లేతప్రాయానికి తెచ్చుటను ఈ నూతన లోకప్రభుత్వం ఒక ఆశయంగా కల్గివుంది. నీ కనుదృష్టి, వినికిడి మరితర ఇంద్రియాలు చక్కగా పనిచేస్తాయి. ఎంతకాలం వరకు? నీ శారీరక అవయవాలన్నిటిని ఒక్క సంవత్సరంపాటు 50 శాతం హామితో పునరుద్ధరించే వైద్య పద్ధతిని ఒక మానవ ప్రభుత్వం అతి తక్కువ రుసుముతో నీకు అందిస్తానంటె, దానిని పొందగోరే వారిలో నీవు మొదట ఉండవా? ఈ నూతన లోక ప్రభుత్వం పూర్తిగా 100 శాతం లేతప్రాయాన్ని ఉచితంగా—ఒక సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు లేక 50 సంవత్సరాలు కాదు. ఎల్లకాలం ఉండే నిత్యయౌవనానికి హామి యిస్తున్నది.
ఈ భూమి మీదనే మానవులు అనుభవించగల్గే ఈ అద్భుత జీవితాన్ని నమ్మశక్యం కాదని త్రోసిపుచ్చవద్దు. దేవుని ప్రేమించేవారు అనుభవించే కొన్ని దీవెనలు 7 నుండి 10 పేజీలలో ఉన్నాయి చూడండి. (g92 10/22)
[7-10వ పేజీలోని బాక్సు/చిత్రం]
నూతన లోకం ఏమి తెచ్చును
నేరము, దౌర్జన్యాన్ని అంతమొనర్చును
“భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు.”—సామెతలు 2:22.
యుద్ధాన్ని నివారించును
“వారు తమ ఖడ్గములను నాగటినక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:4.
అందరూ భుజించుటకు సమృద్ధియైన మంచి పదార్థములు
“దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:16.
మంచిగృహాలు, ప్రతిఒక్కరికి ఆనందదాయకమైన పని
“జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. . . . వారు కట్టుకొన్న
యిండ్లలో వేరొకరు కాపురముండరు; వారు నాటుకొన్న వాటిని వేరొకరు
అనుభవించరు.”—యెషయా 65:21, 22.
మానవులకు జంతువులకు మధ్య సమాధానము
“తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును . . . బాలుడు వాటిని తోలును.”—యెషయా 11:6.
రోగము, వృద్ధాప్యము లేదా మరణము ఇక ఉండవు
“ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:4.
చనిపోయిన ప్రియులు పునరుత్థానమౌతారు
“ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్న వారందరు ఆయన [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29.