లేత ప్రాయం—నీవిప్పుడు విత్తేదానినే ఆ తరువాత కోస్తావు
పసివారి మనస్సులు చుట్టున్నవాటిని పీల్చుకునే స్పాంజీలు. రెండేండ్లలో వారు అలా వింటూనే కష్టమైన భాషను నేర్చుకుంటారు. శిశువు రెండు భాషలను వింటే వాడు ఆ రెండింటిని నేర్చుకుంటాడు. ఒక్క భాషే కాదు సంగీత కళానైపుణ్యములు, కండర సహకారం, నైతిక విలువలు, మనస్సాక్షి, విశ్వాసం, ప్రేమ మరియు ఆరాధనా భావం—ఇవన్నియు పసివారి మస్తిష్కములలో రూపొందించబడిన శక్తి, సామర్థ్యములద్వారా ఉత్పన్నమౌతున్నవి. వారి అభివృద్ధి నిమిత్తం చుట్టూవున్న పరిస్థితి నుండి వచ్చే సమాచారం సేకరించుటకు చూస్తుంటారు. మరియు లోపలికి తీసుకునే యీ సమాచారం సత్ఫలితాలివ్వడానికి కచ్చితమైన కాలమొకటుంది, ఆ అనుకూల సమయమే లేతప్రాయం.
ఇది పుట్టుకతో ప్రారంభమౌతుంది. దానిని అనుబంధం అంటారు. తల్లి తన బిడ్డ కళ్లలోకి ప్రేమతో చూస్తుంది, మృదువుగా వానితో మాట్లాడుతుంది, కౌగలించుకుని ముద్దాడుతుంది. పసివాడు తల్లివైపే తదేకంగా చూస్తూ తాను సురక్షితంగా వున్నానని భావించేటప్పుడు మాతృప్రేమ పెల్లుబుకుతుంది. ఈ సమయంలో తల్లి పాలుత్రాగితే ఇద్దరికీ ఉత్తమమే. బిడ్డ తల్లిపాలు తాగితే ఆమె పాలు అధికమౌతాయి. బిడ్డ తల్లిని తాకితే, ఆ స్పర్శమూలంగా తల్లి శరీరంలో హార్మోనులు విడుదలై ప్రసవానంతర రక్తస్రావాన్ని తగ్గిస్తాయి. తల్లిపాలలో బిడ్డను అంటురోగాలనుండి కాపాడే విరుగుడు పదార్థాలుంటాయి. అనుబంధం ఆరంభమౌతుంది. అదే వారిద్దరి మధ్య ప్రేమానుబంధానికి తొలిదశ. అయితే అది ప్రారంభం మాత్రమే.
అందులోకి తండ్రిరాగానే ఇద్దరు ముగ్గురౌతారు. తండ్రి తప్పక వారిలోకి రావాలి మరి. “ప్రతి బిడ్డకు . . . ఓ తండ్రి కావాలి, అలాగే ప్రతి తండ్రికి ఒక ప్రత్యేకత అంటూ వుంటుంది. . . . తల్లులు తమ బిడ్డలను మృదువుగా, లాలిస్తూంటారు, తండ్రులైతే, తల్లులకంటె ఎక్కువగా వారిని ఆడిస్తూ పాడిస్తూ, చక్కిలిగింతలు పెడుతుంటారు” అని డా. బెరీబ్రేజెల్టన్ అన్నారు. ఇలా చేసినపుడెల్లా పసివారు ఉల్లాసంతో కేరింతలు కొడుతూ, పెద్దగా నవ్వుతూ, మహా తమాషాగా యింకా అలా చెయ్యాలని కోలాహలం చేసారు. ఇదంతా పుట్టుకతో ప్రారంభించబడిన అనురాగ బంధము, ‘అది శిశువు జీవితంలోని తొలి పద్దెనిమిది నెలలో తల్లిదండ్రులు శిశువు మధ్య సహజంగా ప్రేమానుబంధం ఏర్పడుతుంది లేదా అవకాశం జారిపోతుంది’ అని హైరిస్క్: చిల్డ్రన్ వితౌట్ ఎ కాన్షియన్ల్ అనే పుస్తకపు సహరచయిత డాక్టర్ మెగిడ్ అంటున్నాడు. అదే జరుగకపోతే పిల్లలు తత్సంబంధాలు పెంచుకునే శక్తి లేనివారిగా పెరుగుతారని, ప్రేమించే శక్తికోల్పోతారని అని ఆయన అంటున్నాడు.
అనురాగబంధంలో తల్లిదండ్రులు భాగస్థులే
గనుక, కిండర్ గార్టెన్కు వెళ్లకముందున్న లేతప్రాయంలోనే తలిదండ్రులిద్దరు యీ ప్రేమలో, యీ అనురాగ బంధంలో, వారికి శిశువు మధ్యనున్న సంబంధాన్ని పెంపొందించుటలో సహకరించుట ఎంత అగత్యమో చూడండి! తలిదండ్రులారా మీరిద్దరు పిల్లల్ని కౌగలించుకోండి, కొల్లలుగా ముద్దులాడండి. అవును తండ్రులు కూడ అలా చేయాలి! మెన్స్ హెల్త్, జూన్ 1992 ఇలా అంటుంది: “తలిదండ్రులు పిల్లలను హత్తుకొని శారీరక అనురాగం చూపితే అది శిశువు బావి జీవితంలో విజయవంతమగు స్నేహాలకు, వివాహాలకు, మంచిపనులకు దోహదం చేస్తుందని జర్నల్ ఆఫ్ పర్సనాలిటి అండ్ సోషల్ సైకాలజీ నందు ప్రచురింపబడిన 36 సంవత్సరాల అధ్యయనం చెబుతుంది. అనురాగం చూపని తలిదండ్రులుగల పిల్లలలో 30 శాతంమందితో పోల్చిచూస్తే, అనురాగం చూపే తలిదండ్రులుగల పిల్లలలో 70 శాతం మంది పిల్లలు సాంఘికంగా చక్కగా మెలగగలిగారు, మరి అమ్మ కౌగిలింతలెంత ప్రాముఖ్యమో నాన్నవి కూడ అంతే ప్రాముఖ్యము.”
మరియు, ఊపే కుర్చీలో వాన్ని పట్టుకొని ఊగండి. నీ ఒడిలో భద్రంగా కూర్చున్నపుడు అతనికి చదివి వినిపించండి. వానితో మాట్లాడండి, వాడు చెప్పేది వినండి, తప్పొప్పులను గూర్చి వానికి ఉపదేశించండి, మంచి మాదిరిగా వుండండి, యీ సూత్రాలను మీరూ పాటించండి. పసివారి వయస్సును ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనండి. ఆ వాతావరణాన్ని సరదాగా, ఆసక్తికరంగా తమాషాగా వుంచండి.
నీ శిశువుకు సహజ కుతూహలం వుంటుంది, పరిశీలించాలని తన చుట్టున్న వాటన్నిటిని గూర్చి నేర్చుకోవాలనే కోరికవుంటుంది. తెలుసుకోవాలనే యీ తపనను తీర్చడానికి శిశువు నిన్ను శరపరంపరగా ప్రశ్నిస్తాడు. గాలి ఎలా తయారౌతుంది? ఆకాశమెందుకు నీల వర్ణంతోవుంది? సూర్యాస్తమయంలో అదెందుకు ఎర్రగా మారుతుంది? వాటికి సమాధానమివ్వడం ఎప్పుడూ అంత సులభమేమి కాదనుకోండి. ఈ ప్రశ్నలు, నీవు నీ శిశువు మనస్సుకు సమాచారమందించి, బహుశా దేవున్ని ఆయన సృష్టిని గూర్చిన అభినందనను నాటుటకు నిన్ను అవి ఆహ్వానిస్తున్నవి. ఆకు మీద ప్రాకే చిన్న రంగుల పురుగు వాన్ని ఆకర్షించిందా లేక అందమైన చిన్ని పూవు లేదా సాలీడు గూడుకట్టు కొనుట గమనించుటా, లేక వట్టిగా మట్టి త్రవ్వి ఆడుకొనుటయా? యేసు తాను చెప్పిన ఉపమానములలో వారిని గూర్చి చెప్పినట్లు మరి మీరు చిన్న చిన్న కథలు చెబుతూ బోధించడం నిర్లక్ష్యం చేయవద్దు. నేర్చుకోవడం ఆనందభరితంగా వుంటుంది.
జీవనోపాధికి తలిదండ్రులిద్దరు ఉద్యోగం చేయవలసివుంటుంది. మరి వారు సాయంకాలంపూట, వారాంతంలో తమ పిల్లలతో గడిపేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించగలరా? తల్లి ఒక్క పూటనే పనిచేసి మిగతా సమయం పిల్లలతో గడిపే వీలున్నదా? ఈనాడు తండ్రి లేక తల్లి ఒక్కరు మాత్రమేవున్న కుటుంబాలెన్నో వున్నవి. మరి వారు వారిని, వారి పిల్లలను పోషించుటకు తప్పక ఉద్యోగంచేయాలి. వారుకూడ సాయంకాలంపూట, వారాంతంలో ఎక్కువసేపు వారి పిల్లలతో గడిపేందుకు ప్రయత్నించగలరా? అనేక సందర్భాలలో తల్లులు పిల్లలకు దూరంగా వుండే అవసరమేర్పడుతుంది. దూరంగా వుండటానికి గల కారణాలు సహేతుకమైనను పసివాడు దాన్ని అర్థంచేసుకోలేడు గనుక వదిలివేశారనే భావం వానికి కలుగుతుంది. కాబట్టి మీ శిశువు కొరకు సమయాన్ని ఏర్పాటుచేసుకొనే ప్రత్యేక ప్రయత్నం చేయవలసివుంటుంది.
సరే, “శ్రేష్ఠమైన సమయం” అని మనం వింటూ వుంటామే ఏమిటిది? పనిరద్దీలోనున్న తలిదండ్రులు ప్రతిరోజు వారి పిల్లలతో బహుశ 15 నుండి 20 నిమిషాలు, వారాంతములో ఒక గంట సమయం గడుపుతూ దాన్ని శ్రేష్ఠమైన సమయం అని పిలువవచ్చును. ఇది శిశువు అవసరానికి సరిపోతుందా? లేక తలిదండ్రుల మనస్సాక్షిని ఒప్పించుటకా? లేదా తన బిడ్డను అలా వదిలేసి తన తృప్తికొరకు ఉద్యోగం చేసే తల్లి మనస్సును కుదుటపరచుటకు చేసే పనియా? అయితే నీవిలా అనవచ్చు, ‘నిజంగా నాకు చాల పనివుంది నాకంత సమయమే లేదు.’ అలా అనడం నీకు నీ బిడ్డకు మంచిదికాదు, ఎంతో శోచనీయం, ఎందుకంటే దీనికి వేరే దగ్గరి మార్గాలేమి లేవు. ఆ లేత వయస్సులోనే సమయాన్ని కనుగొనండి లేదా యుక్త వయస్సులో వచ్చే తరాల అంతరాన్ని ఎదుర్కొనుటకు సిద్ధపడండి.
పగటిపూట శిశుసంరక్షణ కేంద్రంలో వదలివేయబడే పసివానికి కలిగే తీరని నష్టంతోపాటు ఆ పసివాడు పెరిగే కొలది వానితో కలిసి ఆనందించే మహదవకాశాన్ని తలిదండ్రులు జారవిడుచుకుంటారు. పసివాన్ని ఒంటరిగా విడిచిపెట్టి ఎక్కడికి ఎందుకు వెళ్లిపోయారనే కారణాలు వానికర్థం కావు; తాను అలక్ష్యంచేయబడి, తిరస్కరించబడి, వదలివేయబడి, ప్రేమకు నోచుకోవడం లేదని పసివాడు భావించవచ్చు. తనకు యుక్తవయస్సు వచ్చేనాటికి పనిరద్దీగానున్న తలిదండ్రులకు బదులు స్నేహితులతో సంబంధమేర్పరచుకొనవచ్చు. పసివాడు ద్వంద జీవితాన్ని అంటే ఒకటి తలిదండ్రులను ప్రీతిపరచుటకు మరొకటి తనను తాను తృప్తిపరచుకొనుటకు జీవిస్తూవుండవచ్చును. మాటలు, వివరణలు, క్షమాపణలు—ఇవేవి వారి మధ్య అంతరాన్ని పూరించలేవు. ఆ పసివానికి తలిదండ్రుల అవసరత ఎంతగానో ఉన్నప్పుడు నిర్లక్ష్యంచేసిన ప్రేమను యిప్పుడు ఒలకబోస్తే, వాని దృష్టికి అది నిజమైనదిగా కనబడదు. ప్రేమ మాటే వానికి మాయమాటనిపిస్తుంది. ఆ మాటలు వానికి పూర్తిగా శూన్యంగా వినిపిస్తాయి. క్రియలు లేని విశ్వాసం వలెనే బూటకపు ప్రేమ మృతమైనదే.—యాకోబు 2:26.
మనం విత్తిన దానిని ఇప్పుడును కోయుట
నేనే మొదట, అనే యీ తరంలో స్వార్థం పెరిగిపోతుంది, మరి మన పిల్లల్ని వదలివేయుటలో ముఖ్యంగా అది వ్యక్తమౌతుంది. మనం వాళ్లను కని, శిశు సంరక్షణా కేంద్రాలలో వదలివేస్తున్నాం. అలాంటి కొన్ని శిశు సంరక్షణ కేంద్రాలు పిల్లలకు బాగానే వుండవచ్చుగాని వాటిలో అనేకములు అలా వుండటంలేదు. అలాంటివి కొన్ని, పిల్లలమీద అత్యాచారం జరిపిన నేరానికి పరిశోధనకు గురౌతున్నవి. ఓ పరిశోధకుడు ఇలా అన్నాడు: “భవిష్యత్తులో నిస్సంశయముగా మనము అధిక సమస్యలను ఎదుర్కొంటాము, వాటితో పోలిస్తే ఈనాటి సమస్యలు తేనీటి విందులా అనిపిస్తాయి.” సైకాలజి టుడే మే/జూన్ 1992 నందలి గణాంకములు చూపిస్తున్నట్లు యీనాటి “తేనీటి విందు” ఇప్పటికే భయంకరంగా ఉంది.
“గత రెండు దశాబ్దాలుగా, యుక్త వయస్కులలోను పిల్లల్లోను స్థూల శరీరం గలవారు 50 శాతము పెరిగినట్లు కనబడుతుంది. మత్తు పదార్థాల మూలంగా దుర్ఘటనలపాలైన యుక్త వయస్కులను సంవత్సరానికి పదివేలమందిదాకా మనం పోగొట్టుకుంటున్నాము. ప్రతి రెండువారాలకు నల్గురు యుక్త వయస్కులలో ఒకరు అధికంగా త్రాగుచున్నారు. మరి మనమధ్య, యుక్త వయస్కులలో ఇరవైలక్షలమంది త్రాగుబోతులున్నారు.
“అమెరికాలో సంవత్సరానికి పది లక్షలమంది కన్నెపిల్లలు గర్భవతులౌతున్నారు, దీని తర్వాత వచ్చే పశ్చిమ దేశమైన ఇంగ్లాండుతో పోల్చితే ఇది రెండింతలన్నమాట. గత 20 ఏండ్లలో యుక్తవయస్సు గలవారిలో ఆత్మహత్యలు మూడింతలు పెరిగినవి, మరియు ప్రతి సంవత్సరం ఐదునుండి ఆరువేలమంది తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. నలుగురు యువతులలో ఒకరు తాను తినే విషయంలో సమస్య కలిగి ఉన్నారని, అంటే సర్వసాధారణంగా ఆహారం తగ్గిస్తూ ఉంటారని అంచనా వేయబడింది. అందరికంటే ఎక్కువగా 14 నుండి 19 మధ్య వయస్సున్న వారిలో నరహత్య ద్వితీయస్థానంలోవుంది.”
ఈ భయంకరమైన సంఘటనలకు తోడుగా 5 కోట్ల కంటె ఎక్కువ మంది గర్భస్థ శిశువులు చంపబడుతున్నారు. మరి యీ నాటి “తేనీటి విందు” వర్ణనకు కష్టంగా ఉంది. కుటుంబాలు కూలిపోతున్న దృష్ట్యా సైకాలజీ టుడె ఇలా అన్నది: “ఆరోగ్యాభివృద్ధికి పెరుగుదలకు అవసరమైన స్థిరత్వం భద్రత కావలసియున్న యవ్వనస్థులకు, పిల్లలకు, శీఘ్రగతిన వచ్చు యీ సాంఘిక మార్పు వినాశనకరమైయున్నది.” నేనే మొదట అనే స్వార్థపూరిత ధోరణినిగూర్చి ఓ రచయిత తన ఆగ్రహాన్ని యిలా వ్యక్తపరచాడు: “దంపతులతో, ఇదిగో చూడండి, మీరు విడిపోకూడదు. మీకు పిల్లలుంటే వివాహితులుగానే వుండిపోండి” అనే మాట ఒక్కరు కూడ వారితో చెప్పడానికి ఇష్టపడటం లేదు.
పసివాన్ని ప్రేమించడానికి సమయం కావాలి. నీ పసివానితో సమయం గడుపకుండ మానుకుంటే వచ్చే పర్యవసానములను గూర్చి కెప్టెన్ కంగారొ అనే పేరుతో పిల్లల కార్యక్రమాలను నడిపించే రాబర్ట్ కీషన్, ఒక దూరదర్శిని ప్రసారంలో హెచ్చరించాడు. ఆయన ఇలా అన్నాడు:
“ఓ పసిపాప నోట్లో వేలేసుకొని, బొమ్మ చేతబట్టుకొని కొంచెం చీకాకుతో నాన్నకొరకు ఎదురుచూస్తూవుంటుంది. తన ఇసుక గూళ్ల అనుభవాన్ని చెప్పాలని ఆశిస్తుంది. ఆ రోజు తాను నేర్చుకున్న విషయాన్ని చెప్పి సంతోషించాలనే ఉబలాటంతోవుంది. తానెదురు చూసిన ఘడియ రానే వస్తుంది, నాన్నగారొస్తారు. ఉద్యోగ స్థలంలోని పనివత్తిడి మూలంగా నలిగిన నాన్న ఆ పాపతో ‘చిట్టితల్లీ, ఇప్పుడు కాదమ్మా నేను పనిలోవున్నా, వెళ్లి టివి చూడమ్మా’ అని తరచూ అంటూవుంటాడు. అమెరికాలోని అనేక కుటుంబాలలో అతితరచుగా వచ్చే మాటలేమంటే, ‘నేను పనిలోవున్నా, వెళ్లి టివి చూడు.’ మరిప్పుడు కాక పోతే మరెప్పుడో? ‘తర్వాత.’ ఆ తర్వాత అనేది అరుదుగా వస్తుంది. . . .
“సంవత్సరాలు అలా దొర్లిపోతూనేవుంటాయి పాప పెరుగుతూవుంటుంది. మనం పాపకు బొమ్మలు బట్టలు యిస్తాం. పాపకు అందమైన దుస్తులు, ఒక స్టీరియో ఇస్తాం గాని మనమామెకు అత్యవసరమైనదాన్ని అంటే సమయాన్ని ఇవ్వం. ఆమెకు పద్నాలుగేళ్లు వచ్చాయి, ఆమె కళ్లు బరువెక్కివున్నాయి. ఆమె ఏదో మత్తులో మునిగివుంది. ‘బుజ్జితల్లీ, ఏమైందమ్మా? నాతో చెప్పమ్మా, నాతో చెప్పురా’ అని అంటాడు. అప్పటికది ఎంతో ఆలస్యమైపోయింది, కాలం వృధా అయింది. ప్రేమ మనల్ని దాటి వెళ్లిపోయింది. . . .
“మనం పసివారితో, ‘ఇప్పుడు కాదు, తర్వాత,’ ‘వెళ్లి టివి చూడు,’ ‘అన్ని ప్రశ్నలడగొద్దు’ అని చెబితే, మనపిల్లలు మననుండి కోరే సమయాన్ని వారికివ్వకపోతే, మనం వారిని అలక్ష్యం చేయడమని కాదు గాని, మనం పసివారిని ప్రేమించలేనంత పనిరద్దీలో మునిగి వున్నామని దాని అర్థం.”
అధిక సమయం అవసరం
“శ్రేష్ఠమైన సమయము” అని పిలువబడే దానిని అప్పుడప్పుడూ కొలిచి ఇవ్వడమనేది ముఖ్యం కాదు, దానికి బదులుగా అధిక సమయము అవసరమని ద్వితీయోపదేశకాండము 6:6, 7లో బైబిలు చెబుతుంది: “నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను.” నీ హృదయములోనున్న దేవుని వాక్యమందలి నిజమైన విలువలను నీ పిల్లల హృదయాల్లో నాటుటకుపయోగించే సమయమదే. నీవు వాటిని అవలంబిస్తే, నీ శిశువు నిన్ను అనుకరిస్తుంది.
ముందటి శీర్షికలోని ప్రారంభపు పేరాలో వ్రాయబడిన సామెత జ్ఞాపకమున్నదా? ఇదిగో మరల ఇక్కడుంది: “బాలుడు నడువ వలసిన త్రోవను వానికి నేర్పుము; వాడు పెద్దవాడైనను దానినుండి తొలగిపోడు.” (సామెతలు 22:6) శిక్షణా విలువలు అంతర్లీనమైతేనే అంటే అతనిలో ఉంచితేనే, అతని ఆలోచనల్లో అతని అంతర్భావంలో అతని ఆంతర్యములో ఏమైయున్నాడో అందులో అవి భాగమైతేనే అది నిజమౌతుంది. తలిదండ్రులు వాటిని బోధించడమే గాక బాటిని అభ్యాసములో పెట్టినప్పుడే ఇది సంభవిస్తుంది.
అతడు వాటిని జీవిత పరమావధిగా చేసుకున్నాడు. అది అతనిలో భాగమై అతని వ్యక్తిగత నియమమైంది. ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా వెళ్లడమంటే తన తలిదండ్రులు ఉపదేశించిన వాటికి వ్యతిరేకంగా వెళ్లడం కాదుగానీ తానేమయ్యాడో దానికే వ్యతిరేకంగా వెళ్లినట్లవుతుంది. అలా వెళ్లడం తనకు తానుగా అసత్యమైనట్లుంటుంది. తననుతాను త్యజించినట్లవుతుంది. (2 తిమోతి 2:13) తానుగా యిలా చేయడానికి ఎంతో అయిష్టపడతాడు. గనుక, అతడు తనలో నాటబడిన ‘మార్గమునుండి తొలగిపోవుట’ బహుశా అరుదే. కావున నీ పిల్లలు నీ నుండి సత్ప్రవర్తనను తీసుకోనివ్వండి. కనికరమును చూపుతూ కనికరమును గూర్చి నేర్పించండి, మర్యాదలనభ్యసిస్తూ, వాటిని గూర్చి మృదువుగా వుంటూ మృదుత్వాన్ని గూర్చి యథార్థత, నమ్మకత్వముల విషయంలో మాదిరికరంగా వుంటూ వారికి వాటిని నేర్పించండి.
యెహోవా ఏర్పాటు
ఆదినుండి మానవుని యొక్క కుటుంబవలయాన్ని యెహోవా ఏర్పాటు చేశాడు. (ఆదికాండము 1:26-28; 2:18-24) ఆరువేల సంవత్సరాల మానవ చరిత్రానంతరం, ఆ ఏర్పాటు యిప్పటికి అటు పెద్దలకు ఇటు పిల్లలకు శ్రేష్ఠమైనదిగా గుర్తించబడింది. సీక్రెట్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫామిలీస్ అనే పుస్తకం యీ క్రిందవున్నటువంటి తుది నిర్ణయానికొచ్చింది:
“మనలోని ఆంతర్యమేదో కుటుంబమే నాగరికతకు మూలమని ప్రబోధిస్తుంది. జీవితంలో అత్యవసర పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇక డబ్బు, ఉద్యోగం, కీర్తి, ఓ మంచి ఇల్లు, పొలం లేదా ఆస్తిపాస్తులకు ప్రాధాన్యత ఇవ్వంగానీ, మన జీవితంలో మనల్ని ప్రేమించి పరామర్శించే మనుష్యులకు ప్రాముఖ్యత నిస్తామనేది బహుశా మనకు సహజంగానే తెలుసు. మన జీవితాల్లోవుంటూ మనకు సహాయ సహకారాలందించే వారే వాస్తవంగా ముఖ్యం. మనందరం అమితంగా ఆశించే ప్రేమ, సహకారం, పరామర్శ మరియు అంకిత భావం కుటుంబంలో తప్ప మరెచ్చటను కానరాదు.
కావున, భవిష్యత్లో ఓ సంతోషభరిత కుటుంబ జీవితాన్ని నీకు నీ పిల్లలకొరకు పొందాలంటే ఇప్పుడే యీ లేతప్రాయంలోనే వారికి మంచి శిక్షణ యిచ్చుటలో శ్రమపడుట ప్రాముఖ్యం. (g92 9/22)
[10వ పేజీలోని బాక్సు]
నే నెలాంటి తల్లి/తండ్రిగా ఉంటాను?
“నాకు ఏ గ్రేడ్ మార్కులొచ్చాయ్” అని పిల్లవాడు పెద్దగా అన్నాడు, సంతోషంతో. వాళ్లనాన్న కరకుగా “యింకా ఎక్కువెందుకు తెచ్చుకోలేదూ?” అని అడిగాడు. వంటగది తలుపు దగ్గరున్న పాప, “అమ్మా అంట్లన్నీ తోమేశానే” అని అన్నది. తల్లి, పాపతో “చెత్తంతా ఎత్తేశావా” అని నెమ్మదిగా అడిగింది. పెద్దబ్బాయి వచ్చి, “పెరట్లో గడ్డిమొత్తం చదునుచేసి పారను ప్రక్కనబెట్టాను” అని అన్నాడు. తండ్రి “సరేలే పైభాగమంతా కత్తిరించావా?” అని అడిగాడు.
పక్కింటి పిల్లలు సంతోషంగా సంతృప్తికరంగావున్నట్లు కనబడుచున్నారు. ఇదే సంభాషణ అక్కడకూడ జరిగింది, అక్కడిలావుంది:
“నాకు ఏ గ్రేడ్ మార్కులొచ్చాయ్” అని పిల్లవాడు పెద్దగా అన్నాడు సంతోషంతో. వాళ్లనాన్న ఉప్పొంగి, “భేష్, చాలా బాగా చేశావ్” అని మెచ్చుకున్నాడు. వంట గది తలుపు దగ్గరున్న పాప “అమ్మా అంట్లన్నీ తోమేశాను” అని అన్నది. తల్లి నవ్వి మృదువుగా “అందుకే నువ్వంటే నాకెంతో ప్రేమ” అన్నది. పెద్దబ్బాయి వచ్చి “పెరట్లో గడ్డిమొత్తం చదును చేసి పారను ప్రక్కన బెట్టాను” అని అన్నాడు. తండ్రి ఆనందంతో “నిన్ను చూసి నేను గర్విస్తున్నాను బాబూ” అని అన్నాడు.
పిల్లలు ప్రతిరోజు వారు చేసే పనులకు చిన్న పొగడ్త పొందనర్హులే. వారు సంతోషభరితమైన జీవితాలను గడపాలంటే అది ఎక్కువ నీ మీదే ఆధారపడివుంది.
[7వ పేజీలోని చిత్రాలు]
తల్లితోపాటు తండ్రి కూడ అనుబంధంలో భాగం వహిస్తాడు
[8వ పేజీలోని చిత్రం]
ఊహ వెల్లువైనపుడు, ఓ అబ్బాయి చేతులు బారుగా చాపి విమానం వంటి పెద్ద శబ్దం చేస్తు పరుగెత్తుతాడు, ఇల్లుకట్టే ఆట ఆడుకోవడానికి ఓ అట్టపెట్టె ఒక ఇల్లులాగే అవుతుంది, ఓ చీపురు కర్రే గుర్రం అవుతుంది, ఓ కుర్చీ పందెపు కారు సీటు అవుతుంది