లేతప్రాయం—నీ విచ్చే అతి శ్రేష్ఠమైన శిక్షణ అత్యవసరమయ్యే కాలం
పిల్లలు “యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” అని తెలుపబడియున్నారు. వారు “నీ భోజనపు బల్లచుట్టు ఒలీవ మొక్కలవలె” వున్నారని చెప్పబడినది. (కీర్తన 127:3; 128:3) తలిదండ్రులు “ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచ” వలెనని ఉపదేశించబడియున్నారు.—ఎఫెసీయులు 6:4.
నీవు ఒలీవ చెట్లను శ్రేష్ఠమైన ఫలములనిచ్చే వాటిగా పెంచవలెనంటే, అవి ‘నీ బల్లయొద్ద మొక్కలుగా” వున్నపుడే వాటినలా చేయాలి. మొక్కను ఎలా పెంచితే అలా పెరుగుతుంది. దేవుని మార్గాల ప్రకారం నీ పిల్లలను తీర్చి దిద్దుటకై శిక్షణ యివ్వాలనుకుంటే దానికి అత్యంత శ్రేష్ఠమైన సమయం వారి లేత వయస్సే. “బాలుడు నడువ వలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” (సామెతలు 22:6; 2 తిమోతి 3:15) భవిష్యత్‌లో ఇక ఎన్నడు చేయలేనంత వేగంగా ఆ లేతప్రాయంలో అతని మెదడు సమాచారాన్ని స్వీకరిస్తుంది. అదే నీ పిల్లలకు నీవిచ్చే శ్రేష్ఠమైన శిక్షణకు మంచి అదను.
సోనీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడైన మాపారు ఈబుక; కిండర్ గార్టెన్ ఈజ్ టూలేట్ అనే పుస్తకాన్ని వ్రాశాడు. దాని అట్టమీద యీ మాటలు కనబడుచున్నవి: “నీ శిశువు తన జీవితంలోని తొలి రెండు మూడు సంవత్సరాల కాలములో నేర్చుకొనుటకు అత్యధిక శక్తిని కల్గివుంటుంది. గనుక ఆలస్యం చేయవద్దు. . . . కిండర్ గార్టెన్ చాలా ఆలస్యమైపోతుంది.”
ది ఇన్స్టిట్యూట్స్ ఫర్ ది యచీవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్‌కు డైరెక్టర్ అయిన గ్లెన్ డూమెన్ తన ముందుమాటలో ఇలా తెలిపాడు: “ఈబుక వ్రాసినది అద్భుతమైన రమ్యమగు పుస్తకం. అది ఏవో గంభీరమైన వాటిని గూర్చి ఏమీ చెప్పడంలేదు. పిల్లలు పసివారిగా వున్నపుడే ఏదైనా నేర్చుకునే సామర్థ్యం కలిగియున్నారని మాత్రమే ఆయన ఉద్దేశం. వారు రెండు, మూడు లేక నాలుగు సంవత్సరాల వయస్సులో అంతగా కష్టపడకుండానే నేర్చుకునే విషయాలను వారు తమ తర్వాతి జీవితకాలంలో ఎంతో కష్టపడి నేర్చుకోవలసివస్తుందని లేక అసలే నేర్చుకోలేరని ఆయన అంటున్నాడు. పెద్దలు శ్రమపడి నేర్చుకునే వాటిని పిల్లలు సంతోషంగా నేర్చుకుంటారని ఆయన అభిప్రాయము. పెద్దలు నత్తనడకలా నెమ్మదిగా నేర్చుకుంటే పసిపిల్లలు అతివేగంగా నేర్చుకుంటారని ఆయన చెబుతున్నాడు. పెద్దలు కొన్నిసార్లు నేర్చుకోకుండ తప్పుకుంటారు గానీ పసిపిల్లలైతే తిండికి బదులు నేర్చుకోవడానికి ఇష్టపడతారని ఆయన అంటున్నాడు.”
కిండర్ గార్టెన్ ఎంతో ఆలస్యమని, ఈబుక ఎందుకు అంటున్నాడంటే అప్పటికే పిల్లవాడు నేర్చుకునే మంచి సంవత్సరాలు దాటిపోతున్నాయి. అయితే మరో కారణం కూడవుంది. ఈ రోజుల్లో అనైతికత్వం కిండర్‌గార్టెన్ వరకు చేరింది, మరి పసివాడు అక్కడికి వెళ్లకముందే పిల్లవాడు ఆ మలినము నుండి సంరక్షణ పొందుటకు తలిదండ్రులు వానిలో మంచి నైతిక నియమాన్ని నాటవలసిన అవసరమున్నది.
దీని అవసరతవున్నదని, అప్పుడే కిండర్ గార్టెన్‌లో చేరిన ఆరు సంవత్సరాల బాలుని తలిదండ్రులు చెప్పే దాన్ని బట్టి తెలుస్తుంది. “కిండర్‌గార్టెన్‌లో చేర్చిన మొదటి వారంలోనే మా కుమారున్ని 15 నిమిషముల పాటు వాడు ప్రయాణించే బస్సులో మరో అబ్బాయి లైంగిక దుష్ప్రవర్తన చేసేవాడు. ఇలా చాలారోజులు జరిగింది. అది పిల్లలాటేమి కాదు లేదా ఓ డాక్టర్ లాగా నటించేదేమి కాదు గానీ అదొక అసాధారణమైన స్పష్టమైన లైంగిక దుష్ప్రవర్తనే.
“మా అబ్బాయి క్లాస్‌లో అనేకమంది పిల్లలు వారి తలిదండ్రులతో కలిసి, శృంగారం, హింసను విచ్చలవిడిగా చూపించే సినిమాలు చూస్తారు. పిల్లలను పరామర్శించే సంశయాస్పద వ్యక్తుల దగ్గర వారిని ఉంచే బదులు వారిని తమతోపాటే తీసికెళ్లడం మంచిదని బహుశా తలిదండ్రులు భావించవచ్చును. వారిలో కొందరు కేబుల్ దూరదర్శినిద్వారా గానీ వారి తలిదండ్రులు యింట్లో ఉంచినవాటి ద్వారాగాని అటువంటి సినిమాలను చూస్తుంటారు.
లేతప్రాయంలోనే, పసితనమునుండియే నైతిక సూత్రాలను మా కుమారునికి అలవరచుటలోగల విలువను మా ఇంట్లో జరిగిన దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ద్వారా మేము తెలుసుకున్నాము. కొంతమంది అతిథులతో పాటు ఓ నాలుగు సంవత్సరాల పాపకూడ మాయింటికి వచ్చింది. పెండ్లయిన పెద్దలకుమాత్రమే లైంగికానుభూతి పరిమితమని కచ్చితంగా ఉపదేశం పొందిన మా కుమారుడు, ఆ అమ్మాయి కలిసి ఓ గదిలో ఆట్లాడుకోవడానికి వెళ్లారు. వారిద్దరు పెండ్లి చేసుకొనబోయే ఓ జంటమాదిరి నటించాలని, అబ్బాయి పడుకోవాలని ఆ అమ్మాయి కోరింది. వాడు అమాయకంగా అలా పడుకున్నపుడు, ఆ అమ్మాయి వాడిమీద పడుకుంది. వాడు భయపడి ఇలా కేక వేశాడు: ‘అది పెండ్లయిన వారికే గదా!’ వాడు విడిపించుకొని ఆ గదిలోనుండి బయటికి పరుగెత్తేటప్పుడు ఆ అమ్మాయి ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అని పెద్దగా చెప్పింది.”—ఆదికాండము 39:12 పోల్చుము.
నగరాల్లోను, పరిసరప్రాంతాల్లోను జరిగే కొన్నింటిని యీ క్రింద పొందుపరస్తున్నాము—పసితనం నుండే మీ పిల్లలను వీటినుండి పరిరక్షించవలసిన అవసరముంది.
ఏడేండ్ల వయస్సున్న ఇద్దరు కుర్రాళ్లు, బడిలోని బాత్రూమ్లో ఆరేండ్ల అమ్మాయిని మానభంగం చేశారని ఆరోపించబడింది. ఆరు, ఏడు, తొమ్మిదేండ్ల వయస్సున్న ముగ్గురు కుర్రాళ్లు ఆరేండ్ల అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు. ఎనిమిదేండ్ల కుర్రాడు, కిండర్ గార్డెన్ చదివే పసివానిని సలింగ సంయోగానికి గురిచేశాడు. ఒక 11 సంవత్సరాల కుర్రాడు 2 సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం చేశాడని ఆరోపించబడింది. పసితనంలో లైంగిక దుర్నీతికి గురైన వారే తరచు అటువంటి నిందితులుగావున్నారని కొంతమంది వైద్యుల అభిప్రాయం.
ఇది ఒక అబ్బాయి విషయంలో జరిగినదాన్ని బట్టి నిర్ధారించబడింది. అతడు పసికందుగా వున్నపుడే వాని 20 సంవత్సరాల చిన్నమ్మ నోటితో వాన్ని లైంగికంగా రెచ్చగొట్టే దురలవాటు చేసింది. ఆ అబ్బాయి 18 నెలలనుండి 30 నెలల వరకు ఈ లైంగిక దురపయోగానికి గురయ్యోడు. అతడు దానికి రెండు, మూడేండ్ల తరువాత బాలికలను లైంగికంగా వేధించేవాడు. బడికెళ్లడం ఆరంభించినపుడు వాడు అదే పని చేసేవాడు, మొదటి తరగతిలోను, రెండవ తరగతిలోను అతడు బడినుండి బహిష్కరించబడ్డాడు.
చిన్న తనం నుండే శిక్షణయిచ్చే అవసరత
తలిదండ్రులు లేత ప్రాయంలో సరియైన శిక్షణ యివ్వని కారణంగా బాల్యనేరాలకు పాల్పడి వారు అంతకంటె తీవ్ర నేరాలు చేయడానికి వారిని నడుపవచ్చును: కళా ఖండములను నాశనం చేయుట, దోపిడి, దొంగతనం, హత్య మొదలగు వాటికి వారు పాల్పడం జరుగుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఇచ్చట ఇవ్వబడినవి.
ముగ్గురు ఆరేండ్ల ఆకతాయిలు తమ మిత్రుని ఇంటికెళ్లి దాదాపు అన్ని గదుల్లోవున్న వస్తువుల్ని నాశనంచేశారు. మరో తొమ్మిదేండ్ల తుంటరి చట్టవిరుద్ధ నేరస్థునిగా నిందించబడ్డాడు, దోపిడి దొంగతనాలు చేశాడు, మరోపిల్లవాన్ని కత్తితో బెదిరించాడు, ఓ అమ్మాయి వెంట్రుకలకు నిప్పంటించాడు. ఇద్దరు 11 సంవత్సరాల కుర్రవాళ్లు, 10 ఏండ్ల వయస్సున్న అబ్బాయి నోట్లో ఓ తొమ్మిది మిల్లీమీటర్ల పిస్తోలును బలవంతంగా దూర్చి బెదిరించి వాని గడియారం లాక్కున్నారు. ఒక వీడియో ఆట విషయంలో వాగ్వివాదానికి దిగి, పది సంవత్సరాల అబ్బాయి ఏడేండ్ల అమ్మాయిని కాల్చి చంపాడు. మరో పదేండ్ల అబ్బాయి తన మిత్రున్ని చంపి శవాన్ని ఇంట్లో పాతిపెట్టాడు. ఐదేండ్ల పిల్లవాడు తప్పటడుగులువేసే ఓ బాబును ఐదో అంతస్థు మెట్లమీది నుండి క్రిందికి త్రోస్తే పసివాడు పడి చనిపోయాడు. ఓ 13 ఏండ్ల కుర్రాడు మరో ఇద్దరు కుర్రాళ్లతో కలిసి 7 సంవత్సరాల కుర్రవాన్ని బలవంతంగా ఎత్తుకుపోయి, వాని ఇంటినుంచి డబ్బు గుంజాలని ప్రయత్నించారు. గానీ ఇంటినుండి విమోచన సొమ్ముతెమ్మని ఫోనుద్వారా చెప్పకముందే వారా బాలుని సజీవంగా పాతిపెట్టారు.
ఇక చివరిగా పరిశీలిస్తే, మారణాయుధాలు ధరించి, వీధుల వెంట తిరుగుతూ, తుపాకి పోరాటాలు చేస్తూ, తూటాలను ఇష్టం వచ్చినట్లు పేలుస్తూ, ఒకరినొకరు చంపుకొనడమేగాక అమాయకులైన పిన్నలను పెద్దలను కాల్చివేసే భయంకరమైన ముఠాలతో కూడిన కుర్రవాళ్లున్నారు. పెద్దపెద్దనగర పరిసర ప్రాంతాల్లో వారు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారు—లాస్ ఏంజిల్స్ చుట్టున్న ప్రాంతంలోనే “1,00,000 కంటె ఎక్కువమంది సభ్యులుగల పేరుమోసిన 800 ముఠాలున్నవి.” (సెవెంటీన్, ఆగస్టు 1991) వారిలో అనేకులు విచ్ఛిన్నమైన కుటుంబాలకు సంబంధించిన వారు. ఇక్కడ ముఠాయే వారికి కుటుంబం. అనేకులు జైలు పాలౌతున్నారు. చాలామంది మరణిస్తున్నారు. జైలునుండి వ్రాసిన యీ మూడు ఉత్తరాలు ఇందుకు దృష్టాంతముగా ఉన్నాయి.
మొదటి వ్యక్తి: ‘నేను దోపిడిచేసిన నేరానికి శిక్షననుభవిస్తున్నాను. మేం మొత్తం నలుగురమున్నాము. అప్పుడు పోలీసులు వచ్చారు. మా ముఠాలో ఇద్దరు ఒక వైపు నేను నా సన్నిహితుడు కలిసి మరో వైపు పారిపోయాము గాని మమ్మల్ని పట్టిన కుక్కలకంటే వేగంగా పరిగెత్త లేకపోయాము. నేనిక్కడనుండి బయట పడిన తర్వాత ఏదో ఒకనాడు ఒక విశేషమైన వ్యక్తిగా కావాలనుకుంటున్నాను. బడికెళ్లడం మంచి గ్రేడ్లు తెచ్చుకోవడం ఎన్నటికీ నావల్ల అయ్యేది కాదు. అయితే జైల్లో కష్టాలననుభవించే దానికన్న ఘోరమైందేమీ లేదు!’
రెండవ వ్యక్తి: ‘నేను మొదటిసారి మెక్సికోనుండి వచ్చినపుడు నాకు ఎనిమిదేండ్లు. నాకు 12 ఏండ్లు వచ్చేటప్పటికి నేను ముఠాలో చేరిపోయాను. నాకు 15 ఏండ్లు వచ్చేటప్పటికి మా వ్యవహారాల్లో నిండా మునిగిపోయాను. కారులోనుంచే ప్రజలను కాల్చడం క్రమంగా అలవాటైంది. ఎప్పుడు నా వెంట తుపాకి ఉండేది. నాకు 16 ఏండ్లు వచ్చినపుడు, తుపాకి కాల్పులకు గురై చచ్చినంత పనయ్యింది. మరైతే నేను ప్రభువుతో వెళ్లడానికి సిద్ధంగా లేను కాబట్టి ఆయన నన్ను తీసుకోనందుకు నేనాయనకు కృతజ్ఞున్ని. ఇప్పుడు కూడ నా కాళ్లలో బుల్లెట్ తగిలిన రంధ్రాలున్నవి. గనుక నేనిచ్చే సలహా ఏమంటే ఏ ముఠాలో చేరవద్దు లేకపోతే నీవు ఒంటరివై, నా మాదిరి జైల్లో మ్రగ్గిపోవలసివుంటుంది!’
మూడవ వ్యక్తి: ‘నా 11వ ఏటనుండే నేను ముఠాలో సభ్యున్ని. నాలుగుసార్లు నన్ను పొడిచారు, మూడు సార్లు కాల్చారు, జైల్లో త్రోశారు, ఎన్నిసార్లు నన్ను కొట్టారో లెక్క పెట్టడం కష్టం. ఇక చావే నాకు మిగిలింది, నాకు 13 ఏండ్లు వచ్చేటప్పటికి ప్రతిదినం చావుకొరకు సిద్ధంగా ఉన్నాను, నా కిప్పుడు 16 ఏండ్లు. ఎనిమిది నెలలనుండి యీ జైలు శిక్ష అనుభవిస్తున్నాను, మరికొన్ని సంవత్సరాల్లో నేను చచ్చిపోతా, గాని నీవు మాత్రం ముఠాలో చేరకుంటే యిదంతా తప్పించుకుంటావు.’
అవకాశాన్ని సద్వినియోగం చేయండి
ఇదంతా ఎందుకంటే లేతప్రాయంలోనే శిక్షణ యివ్వకపోతే యింతటి ఘోర నేరాలకు తప్పకుండ పాల్పడతారని చెప్పడానికి కాదు. గాని అలా చేయకపోతే అది దుష్ప్రవర్తనకు నాంది పలికి వారు బాల్యనేరాలకు దారితీసే ప్రమాదములో పడగలరని, దాన్ని గమనించకుండవుంటే ఆ బాల్యనేరమే నేరప్రవృత్తికి, జైలుకు చివరకు మరణానికి నడిపించగలదు.
యౌవన దశ వచ్చేంతవరకు వేచివుండే బదులు ఆ దశకు ముందే నీ పిల్లలలో అటువంటి లక్షణాలున్నవో లేదో పరిశీలించుట చాలా సులభం, నిజానికి కిండర్ గార్టెన్‌కు వెళ్లకముందే, ఎక్కువ కాలం వారు నీతోపాటు ఉన్నప్పుడే, వారి అవధానాన్ని మళ్లించే బయటి ప్రభావము వారి మీద పడకముందే, ఆ లేత వయస్సులోనే వారికి అటువంటి శిక్షణ ప్రారంభించుటకది యుక్తసమయం. నీవు వారితో లేత వయస్సులోనే సన్నిహితంగా వుండకపోతే, యౌవన దశలో వారు నిన్ను దగ్గరికి రానివ్వరు, నీ మాటవినరు. వారి మిత్రులే నీ స్థానం తీసుకున్నారని నీవు గమనిస్తావు. గనుక తలిదండ్రులకిచ్చే సలహా ఏమంటే, యీ లేతప్రాయంలోనే నీ పిల్లలకు శిక్షణయిచ్చుటకు అలక్ష్యం చేయవద్దు, నీవిచ్చే శ్రేష్ఠమైన శిక్షణ అత్యంత శ్రేష్ఠమైన ఫలాలను ఫలిస్తుంది, అది నీకును వారికిని దీవెనలందించును.—మత్తయి 7:16-20 పోల్చుము. (g92 9/22)