పోన్ డూ గార్ పరీక్షా కాలాన్ని తట్టుకున్నది
“రోమా సామ్రాజ్యం అస్తమించిన ఎంతో కాలం తరువాత కూడ వారి అక్విడక్టులు (కాలువ ప్రవహించుటకు నిర్మించిన వంతెన) ఉపయోగార్థము నిలిచి, విస్మయము గొల్పి, తదనంతర యుగమందలి నిర్మాణములకు ప్రేరణగా నిలిచి యున్నవి,” అని ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వివరిస్తుంది. పోన్ డూ గార్ ఈ నియమానికి ఒక మినహాయింపు కాదు. బహుశ అది ఫ్రాన్సునందున్న అంత్యంత ఖ్యాతిగాంచిన రోమనుల స్మృతిచిహ్నం.
రోమనుల అక్విడక్టులు సాధారణంగా వ్యవసాయ పొలాల కొరకు నిర్మించబడలేదు గాని పట్టణాలకు నీటిని రవాణా చేయడానికి నిర్మించ బడ్డాయి. ఈ పట్టణాలకు బహిరంగ నీటి బుగ్గలు, స్నానపు గదులు, ఈత కొలనులు, చెరువులు; మరీ పెద్ద పట్టణములకైతే మురుగు నీటికాలువల ఏర్పాటు కూడ ఉండెను. అవును, రోమా పట్టణాలకు కాలువనీరు అవసరముండెను—అత్యధికంగా అవసరముండెను.
గార్ నదిపై దాదాపు 49 మీటర్ల ఎత్తున ఉన్న వంతెన వంటి నిర్మాణమే ఈ పోన్ డూ గార్. నీటి కాలువను ఏర్పాటు చేయుటకు రోమన్లు నిర్మించిన వాటన్నిటికంటె ఇది ఎత్తైనది. అది 275 మీటర్ల పొడవున్నను, ఆ అక్విడక్టు అంతటిలోను అది ఒక చిన్న భాగమే. వాస్తవానికి ఆ నీటి కాలువ మొత్తం పొడవు 49 కిలోమీటర్లు. నీమ్స్ అనే రోమా పట్టణానికి నీటిని సరఫరా చేయడానికి అది ఉపయోగించబడింది. అదే కాలానికి చెందిన కొన్ని యితర రోమను నిర్మాణములవలె ఈ అక్విడక్టు శతాబ్దముల కాలం నిలిచియుండి, రోమనుల అత్యుత్తమ పని ప్రమాణములను వారి యింజనీర్ల నైపుణ్యాన్ని చాటిచెపుతుంది. సమీపాన ఉన్న క్వారీలో పెద్ద పెద్ద సున్నపురాళ్లను, వాటిలోకొన్ని ఆరు టన్నుల బరువుండేటంత పెద్దవి పగులకొట్టి తయారు చేసేవారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ రాతి దిమ్మలను అతుకుటకు ఏవిధమైన జిగురు సున్నము వాడలేదు.
అనేక కారణాల నిమిత్తం కమానులను అంతస్తులుగా నిర్మించుట అవసరమయింది. ఒక నిర్దిష్ట ఎత్తువరకు నిర్మాణము చేరిన పిదప అది తేలికగా ఉండేటట్లు చేయాలి, దీన్ని సాధించడానికే ఈ కమానులు రూపొందించ బడ్డాయి. అయితే, ఈ పోన్ డూ గార్ ఒక నదికి వంతెనగా ఉండాలి. శరవేగంగా వచ్చు నీటి ప్రవాహమును అడ్డుకొనడానికి, నిర్మాణకులు ఆ వంతెనను కొద్దిగా వంపు తిరిగి ఉండేటట్లు నిర్మించారు.
ఆ వంతెనను చూచి విస్మమొందే వారందరు ఒప్పుకొనకపోయినను అటుపిమ్మట కొన్ని నిర్మాణపు మార్పులు చేయబడ్డాయి. గుర్రపు బండ్లు వెళ్లేందుకు వీలుగా దాని మందమైన స్తంభములు నరకబడ్డాయి. మరి 18 శతాబ్దములో మొదటి అంతస్థు వెడల్పు చేయబడింది. ఒక శతాబ్దానంతరం సంరక్షణను గూర్చి ప్రప్రథమంగా ప్రచారం చేసిన నెపోలియన్ III ఆ నిర్మాణమును కాపాడవలెనని ఆసక్తిగలవాడై ఆ వంతెనను పునరుద్ధరించుటకు అవసరమగు చర్యలను తీసుకున్నాడు.
ప్రతి సంవత్సరం దానిని 20 లక్షల కంటె ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆసక్తే పోన్ డూ గార్కు ప్రమాదంగా పరిణమించింది, అందుకే ఆ ప్రాంతాన్ని కాపాడుటకు వివిధ పథకాలను సిద్ధం చేస్తున్నారు. ఏమేమి చేయనై యున్నను, నైపుణ్యంతో చేసిన పని కాలపరీక్షను తట్టుకోగలదని నిరూపిస్తున్నది. (g91 11/22)