దుర్భలమైన స్థితినుండి చురుకుగా దేవున్ని మహిమపరచు స్థితికి వచ్చుట
ప్యూర్టొరికొలో ఎన్యాస్కో నందు కోర్కెవాడె అనే గ్రామములో ఫిబ్రవరి 1984 న ఇద్దరు యెహోవాసాక్షులు యింటింటి పరిచర్యలో పాల్గొని ఒక స్త్రీతో మాట్లాడారు. ఇంటి లోపలినుండి వారు మూలుగును విని, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా అని ఆ స్త్రీని అడిగారు.
“అవును, ఆయన నా భర్త. ఆయన 14 సంవత్సరములనుండి రోగగ్రస్థుడైయున్నాడు, స్నానం చేయడానికి, తినడానికి తప్ప ఆయన ఎన్నడు గదినుండి బయటికి రాడు,” అని ఆమె ప్రత్యుత్తరమిచ్చింది.
మీ భర్తతో మాట్లాడవచ్చా అని ఆ యిద్దరు సాక్షులు ఆమెనడిగారు. అతడు ఎవరితోను మాట్లాడడానికి యిష్టపడడుగాని, మీరు లోపలికి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు అని అతని భార్య చెప్పింది.
ఒక సాక్షి యిలా వివరించారు, “మేము గదిలోనికి ప్రవేశించి అతడు పడకమీద పడుకొనియుండుట గమనించాము. అతని పరిస్థితి చూచి జాలిపడ్డాము. అతడు ఎంతో బలహీనుడై వణకుతున్నాడు. దేవుని రాజ్యమునుగూర్చి రోగం, మరణం సహితములేని లోకములో జీవించు నిరీక్షణను గూర్చి మేము అతనికి తెల్పాము. కన్నీరు కార్చాడు. ఎవ్వరూ రోగులైయుండని నూతనలోకములో జీవించగోరుదువా అని నేను అతనిని అడిగాను.”—ప్రకటన 21:3, 4.
“అవును” అని అతడు సమాధానమిచ్చాడు. “మేము మరలా వచ్చి అతనితో బైబిలు పఠనం చేస్తామని చెప్పాము. అతని అనుమతి తీసుకొని మరలా వెళ్ళాము. అతడు పడకమీద పండుకొని యుండగానే పఠనము జరిగింది.
“కొన్ని సందర్శనముల తరువాత, తాను పడకమిదే లేచి కూర్చొనియుంటే పఠనము చేయడానికి సులభంగా ఉంటుందని నేను సలహా యిచ్చాను. మొదట్లో తల తిరుగుతున్నందున కొద్దిసేపే కూర్చోగల్గినప్పటికిని, అతడు ప్రయత్నం చేశాడు. మరికొన్ని పఠనములయిన తరువాత, అతడు కొంచెం బలపడినప్పుడు, ముందుగదిలో మనం పఠనము చేద్దాం అని నేను సలహా యిచ్చాను. అతడు అంగీకరించాడు. ప్రతివారము అతడు అక్కడికి నడిచివచ్చేలా సహాయము చేసాము.
“అతడు చూడలేకపోతున్నను, అతని చేతులు వణికి భూతద్దం పట్టుకొనడానికి కష్టమౌతున్నను, పఠనములు చేయుటలో మంచి అభివృద్ధికనపర్చాడు. తాను ఈ 14 సంవత్సరములు ఆనారోగ్యముతో యిల్లు వదలలేని స్థితిలో ఉన్నందున తాను డాక్టరు యొద్దకు వెళ్ళలేక పోయానని అతడు మాతో చెప్పాడు. కావున అతనిని ఒక డాక్టరు యొద్దకు తీసుకొని వెళ్లే ఏర్పాట్లు చేసాము.
“అతని కళ్ళకు చేసిన ఆపరేషన్ విజయవంతమయ్యింది, అనతికాలంలోనే అతడు భూతద్దం సహాయం లేకుండా బైబిలును చదువుతున్నాడు. అతని చేతులు వణకడం కూడా ఆగిపోయింది. ఇంటిచుట్టూ క్రమంగా నడవడం ప్రారంభించాడు, తుదకు అతడు రాత్రులందు పండుకొన డానికే పడక మీదకు వెళ్ళేవాడు. అటుపిమ్మట అతడు రాజ్యమందిరములో మా క్రైస్తవ కూటములకు హాజరగుటకు ప్రారంభించాడు.
“కొద్దికాలానికి తాను నేర్చుకున్న వాటిని గూర్చి యితరులతో మాట్లాడుటకు యెహోవా యెడల ఆయన సంకల్పముల యెడల అతనికిగల ప్రేమ గతములో దుర్భలుడైన వానిని బలవంతం చేసింది. వెనువెంటనే, అతడు యింటింటి పరిచర్యలో మాతోపాటు వచ్చాడు. అది అతని పొరుగువారిని, స్నేహితులను ఎంతో ఆశ్చర్యపర్చింది. అతని ఆరోగ్యం ఎంతగా మెరుగుపడిందంటే, అతడు తన పొలంలో పనిచేయడం కూడా ప్రారంభించాడు.”
ఈ అనుభవము 1988 నవంబరులో జరిగిన యెహోవాసాక్షుల ప్రాంతీయ సమావేశములో చెప్పబడింది, అతడే పెత్రో మోర్టినెస్, వేదికమీద కన్పించాడు. తుదకు 1989 నవంబరులో తాను యెహోవాకు సమర్పించుకొనిన దానిని నీటి బాప్తిస్మము ద్వారా చూపాడు. (g91 10/22)