దూరదర్శిని ఎలా ప్రపంచాన్ని మార్చివేసింది
గత వేసవిలో, టివి ప్రపంచాన్ని లోకవ్యాప్తమైన మైదానముగా మార్చివేసింది. ఇటలీలోని రోము నగరమంతా వీధులు నిర్మానుష్యమైనవి. 2 కోట్ల 50 లక్షల మంది వరకు ఇటలీ దేశస్థులు ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ ఆటలను తిలకించారు. అర్జెంటీనాలోని బ్యూనోస్ ఏర్స్‌లో కూడ అలాగే వీధులన్నీ జనసంచారం లేకుండా పోయినవి, అదీ అందుకొరకే. పశ్చిమాఫ్రికాలోని కెమరూన్‌లో లక్షలాదిమంది ముక్తకంఠముతో కేరింతలు కొట్టుచుండగా అదే బూడిద-నీలివర్ణపు వెలుగు కిటికీలలోనుండి మెరిసింది. యుద్ధపీడిత లెబనాన్ దేశంలో, సైనికులు దూరదర్శినులను పనిలేకుండ వున్న వారి ట్యాంకుల మీదవుంచి ఈ ఆటను తిలకించారు. ఆ పోటి అయిపోయేటప్పటికి ప్రపంచ జనాబాలోని ఐదవ భాగం, మంటల దగ్గరికి వచ్చే దీపపు పురుగులవలె ఆ పెట్టె దగ్గరికి ఆకర్షితులై, దాని మసకవెలుగులో వారి ముఖాలు వెలుగుచుండగా చూచినట్లు అంచనా.
ఇంతగా టివిని తిలకించటం వింతేమి కాదు. 1985 లో ప్రపంచజనాభానందు దాదాపు మూడవ భాగం—షుమారు 160 కోట్ల ప్రజలు—లైవ్ ఎయిడ్ అనే రాక్ కచ్చేరిని తిలకించారు. ఐస్‌లాండ్ మొదలు ఘానా వరకు, కనీసం 150 దేశాలకు ఓ పన్నెండు ఉపగ్రహాలు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశాయి.
టివి—ఈ సర్వవ్యాపిత పెట్టె సూక్ష్మజ్ఞాన విప్లవంలో ప్రముఖ పాత్రను వహించినది. దీని సాంకేతిక జ్ఞానం 1920 మరియు 1930 దశాబ్దముల కాలములో చిరుమెరుపుగా మొదలయిన ఓ బుల్లి తెరనుండి ఈ నాటి స్వచ్ఛమైన రంగులతో స్ఫుటమైన అత్యంత ఆధునాతన తెరల వరకు వచ్చి లోకంలో సంచలనం సృష్టించినది. 1950 లో ప్రపంచంలో యాభైలక్షలకు తక్కువ దూరదర్శినులే ఉండేవి. ఈనాడు షుమారు 75,00,00,000 ఉన్నవి.
ఒకే సమాచారాన్ని ఏకకాలంలో ప్రసారంచేసి లోకాన్నే ఏకం చేయగల టివికి ఎంతటి శక్తి వుందో ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ ఆటలవంటి సంఘటనలను గమనిస్తే తెలిసిపోతుంది. ప్రజలు తమ చుట్టూవున్న ప్రపంచాన్ని గూర్చి నేర్చుకునే పద్ధతిని టివి మార్చివేసింది. వార్తలను, అభిప్రాయాలను, సంస్కృతిని, విలువలను సహితం వ్యాపింపజేయుటకును ఒక దేశం నుండి మరో దేశానికి, ఒకనాడు ఉవ్వెత్తునలేచిన రాజకీయ, భౌగోళిక హద్దులను అప్రయత్నంగానే దాటిపోవుటకును, అది సహాయపడినది. టివి, ప్రపంచాన్నే మార్చివేసింది. నిన్నుకూడ మార్చగలదని కొందరంటున్నారు.
జోహనెస్ గూటెన్‌బర్గ్ అనేవ్యక్తిని, 1455 లో తన అచ్చు యంత్రంనుండి మొట్ట మొదటిసారిగా బైబిలును అచ్చువేసి బయటికి రప్పించినప్పుడు గొప్ప సమాచార సంకేతానికి విప్లవాత్మక మార్పు తెచ్చాడని వేనోళ్ల పొగిడారు. ఇప్పుడు ఒక సమాచారాన్ని అకస్మాత్తుగా అంతకంటె గొప్ప సమూహానికి, స్వల్పకాలంలోనే, చాలా తక్కువ ఖర్చుతో అందించవచ్చును. ప్రభుత్వములు అచ్చుయంత్రం యొక్క శక్తిని గమనించి లైసెన్స్ చట్టాలను తెచ్చి దాన్ని అదుపులో పెట్టాలని ప్రయత్నించినవి. అయితే అచ్చువేయబడిన సమాచారం ఇంకా చాలామంది ప్రజలను చేరుతూవుంది. 1800 శతాబ్దపు తొలిదశలో అలెక్సిస్ డి. టాక్‌పైల్ అనే చరిత్ర కారుడు ఒకరోజు 10,000 మంది మనస్సులలో ఒకే అభిప్రాయాన్ని చొప్పించే అసాధారణ శక్తి వార్తాపత్రికలకు వున్నదని వ్యాఖ్యానించాడు.
ఇప్పుడు దూరదర్శిని విషయం పరిశీలించండి. అది కోట్లమంది మనస్సులలో ఒకే అభిప్రాయాన్నీ—తక్షణమే అందించగలదు. అచ్చు వేయబడిన సమాచారం వలె కాకుండ దాన్ని తిలకించే వారు చిక్కైన చదివే కళను నేర్చుకోవాలని గాని వారిస్వంత మనోభావాలను ఊహలను కల్పించుకోవాలని గాని అది కోరదు. అది, దాని సమాచారములను చిత్రములతోను శబ్దములతోను అవి చేయగలిగే ఆకర్షణలతోను అందింస్తుంది.
దూరదర్శిని యొక్క అమోఘమైన శక్తిని గ్రహించుటకు రాజకీయ నాయకులకు ఎంతో సమయం పట్టలేదు. అమెరికాలో, డ్వయిట్. డి. ఐసన్‌హోవర్ 1952 లో తన అధ్యక్షపదవి ప్రచారానికి దీనిని అతి తెలివిగా ఉపయోగించుకున్నాడు. ట్యూబ్ ఆఫ్ ప్లెంటీ—ది ఎవెల్యూషన్ ఆఫ్ అమెరికన్ టెలివిజన్ పుస్తకం ప్రకారం, ఆయన వార్తలలో బాగా “ఆకర్షణీయమైన” అభ్యర్థిగా రుజువు చేసుకొన్నందువల్ల ఐసన్ హోవర్ గెలిచాడు. 1960 ఎలక్షన్‌లో రిచర్డ్ యం. నిక్సన్‌కంటె జాన్ ఎఫ్. కెనెడీకే ఎక్కువ శ్రోతల ఓట్లు లభించుటలో టివి ఇంకా ప్రముఖపాత్ర వహించి యుండవచ్చునని ఆ పుస్తకము చెప్పుచున్నది. అయిననూ రేడియో ద్వారా విన్న ప్రేక్షకులకు మాత్రం వారి బలాబలాలు సమానంగా ఉన్నట్లు తోచింది. ఎందుకు తేడావచ్చింది? నిక్సన్ పేలవంగాను, దిగులుతో వున్నట్లు కనబడ్డాడు, కెనెడీ సంపూర్ణారోగ్యముతో గట్టిగా ఎంతో దృఢవిశ్వాసమును శక్తిని ప్రదర్శించాడు. ఎన్నికలు అయిన తర్వాత కెనెడీ దూరదర్శినిని గూర్చి ఇలా చెప్పాడు: “ఆ యంత్రపరికరమే లేకపోతే మాకు ప్రచారలాభమే ఉండేది కాదు.”
‘ఆ యంత్ర పరికరం” లోకమంతట దాని ప్రభావాన్ని చూపుట కొనసాగించింది. కొందరు దాన్ని మూడవ అగ్రరాజ్యం అని పిలుచుట కారంభించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానము, ప్రచారకులు జాతీయ సరిహద్దుల వరకు మహాసముద్రాలు దాటి వారి ప్రచారం చేసికొనుటకు వీలుకల్గించింది. లోకనాయకులు అంతర్జాతీయ మద్దతును సేకరించుటకును ప్రత్యర్థులను నిందించుటకును టివిని ఒక ఉపకరణముగా వాడుకున్నారు. కొన్ని ప్రభుత్వాలైతే వారి ప్రచారాన్ని శత్రు దేశాలకు చేరవేయుటకు దాన్ని ఒక సాధనంగా వినియోగించినవి. ఒకసారి దాని శక్తిని గ్రహించిన తర్వాత గలాటెన్‌బర్గ్ కనిపెట్టిన అచ్చుయంత్రాన్ని ఎట్లు ప్రభుత్వాలు అదుపులో పెట్టుటకు ప్రయత్నించినవో, అలాగే అనేక దేశాలు దూరదర్శినిని తమ ఆధీనంలోకి తీసుకున్నవి. 1986 వ సంవత్సరంలో దాదాపు సగం దేశాలు, ప్రభుత్వ ఆధీనమందున్న కార్యక్రమాలనే ప్రసారం చేసేవి.
అయిననూ, సాంకేతిక పరిజ్ఞానం మూలంగా టివిని అదుపుచేయుటకు చాలా కష్టమౌతుంది. ఈనాటి ఉపగ్రహాలు, అతి చిన్న డిస్క్ యాంటీనాలున్న ఇళ్లలో సహితం ప్రసార కార్యక్రమాన్ని అందుకోగల సంకేతాలను పంపిస్తున్నది. సరదా ఫొటోగ్రాఫర్ల సమూహముతోపాటు మోసికొనిపోగల చిన్న వీడియో కెమెరాలు మరియు వీడియో క్యాసెట్లు, ప్రసారయోగ్యమైన దాదాపు ఏ సంఘటన నైననూ దృశ్యరికార్డులను ఆపలేనన్ని సంఖ్యలో కుప్పతెప్పలుగా తయారు చేస్తున్నారు.
అమెరికాలోని ఒక వార్తాసంస్థ, టర్నర్ బ్రాడ్‌కాస్టింగ్ యొక్క కేబుల్ న్యూస్ నెట్‌వర్క్ (CNN), కనీసం 80 దేశాలనుండి వార్తలను సేకరించి ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేస్తుంది. ఇరవైనాలుగు గంటలు భూగోళమంతట చేసే ప్రసారం, ఏ సంఘటనైననూ దాదాపు తక్షణమే ఒక అంతర్జాతీయ అంశముగా మార్చగలదు.
దూరదర్శిని ప్రపంచ సంఘటనలను రికార్డు చేసే పనినుండి ప్రపంచ సంఘటనలను మార్చేదిగా మారిపోయింది. 1989 లో తూర్పు ఐరోపాను ఒక్క కుదుపు కుదిపిన తిరుగుబాటు సంఘటనలలో టివి ప్రధమ పాత్రను వహించింది. ప్రాగ్, జెకొస్లొవేకియాలలో ప్రజలు టివిలో “ప్రత్యక్ష ప్రసారం చేయాలని” వీధులలో నినాదాలుచేస్తూ పట్టుపట్టారు. ఒకనాటి విప్లవ కారులు ప్రభుత్వ భవనాలను, కోటలను, లేదా పోలీస్ స్థావరాన్ని వశపరచుకొనుటకు రక్తాన్ని ధారపోసేవారు గానీ 1989 వ సంవత్సరంలో విప్లవకారులు మొదట దూరదర్శిని కేంద్రాలను స్వాధీనం చేసికోవాలని పోరాడారు. నిజానికి, రుమేనియా క్రొత్త ప్రభుత్వం, దేశాన్ని దూరదర్శిని ప్రసారకేంద్రం నుండే పరిపాలించుట కారంభించింది. గనుక టివిని మూడవ అగ్రరాజ్యం అని పిలుచుట ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో.
అయితే టివి రాజకీయ రంగం మీద ప్రభావం చూపుటకంటె ఇంకా అధికంగా పనిచేస్తుంది. అది ఇప్పుడు కూడా ప్రపంచ సంస్కృతిని, విలువలను మార్చుతుంది. అమెరికా ‘సాంస్కృతిక సామ్రాజ్యవాది’, అంటే దూరదర్శిని ద్వారా దాని సంస్కృతిని లోకంమీద రుద్దుతుందని తరచూ నిందించ బడుతుంది. లాభసాటియైన వాణిజ్యకార్యక్రమాలను అధికంగా సేకరించి నిలువచేయుటలో అమెరికాయే మొదటి దేశం గనుక 1940 మరియు 1950 వ దశాబ్దపు చివరి భాగములో, స్వంత ప్రదర్శనలు స్వయంగా తయారు చేసుకుంటే ఎంత ఖర్చవుతుందో అంతకంటే చాలా తక్కువ ధరలో కార్యక్రమాలను తయారుచేసి అమెరికా నిర్మాతలు ఇతర దేశాలకు వాటిని అమ్మగలిగారు.
కెన్యా, 1980 దశాబ్దపు చివరికల్లా, 60 శాతం, ఆస్ట్రేలియా 46 శాతం, ఈక్వెడార్ 70 శాతం; మరియు స్పెయిన్ 35 శాతం టివి ప్రదర్శనలను దిగుమతి చేసుకుంటూ ఉండేవి. వీటిలో అధికంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలనుండే దిగుమతైనవి. లిటిల్ హౌస్ ఆన్‌ది ప్రెయిరీ అనేది 110 దేశాలకు ప్రసారం చేయబడింది. డల్లాస్ ప్రదర్శన 96 దేశాల్లో ప్రదర్శించబడింది. ప్రపంచమంతట దూరదర్శినిలో స్థానిక అభిమానం అంతరించి, అమెరికా వినిమయవాదం మరియు ధనాపేక్ష వ్యాపిస్తున్నవని కొందరు ఫిర్యాదుచేశారు.
అనేక దేశాలు ‘సాంస్కృతిక సామ్రాజ్యవాదం’ మీద దుమారం రేపుతున్నవి. నైజీరియాలో, విదేశి ప్రదర్శనల మూలంగా జాతి సంస్కృతి దెబ్బతింటుందని ప్రచారకులు ఫిర్యాదు చేస్తున్నారు; నైజీరియా ప్రేక్షకులు నైజీరియా కంటె అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు బ్రిటన్ దేశాలను గూర్చియే తెలిసికుంటున్నారని వాపోతున్నారు. ఐరోపా వారు కూడ ఆలాగే భావిస్తున్నారు. యు.యుస్. లో ఇటీవల జరిగిన ఓ సభలో ప్రచార దురంధరుడైన రాబర్ట్ మాక్స్‌వెల్ యిట్టి ఆవేశం వెళ్లగ్రక్కాడు: “విదేశం తమ సంస్కృతిని కాలరాయుట ఏ దేశం సహించకూడదు.” తత్ఫలితంగా, కొన్ని దేశాలు అవి ప్రసారంచేసే విదేశి కార్యక్రామాల సంఖ్యమీద హద్దులు విధించుట కారంభించినవి.
‘సాంస్కృతిక సామ్రాజ్యవాదం’ సంస్కృతులనే కాకుండ ఇతర వాటిని కూడ పాడు చేయవచ్చును. అది భూగోళానికే హాని కల్గించవచ్చును. ఇప్పుడే అన్నింటిని కల్గియుండుడి అనే పశ్చిమ సమాజ వినిమయవాదం, గాలి, నీరు చెడిపోవుటకు కొంత కారణమయినది. ది ఇండిపెండెంట్ పత్రికకు వ్యాసం వ్రాస్తూ ఒక లండన్ దినపత్రిక ఇలా అంటుంది: “దూరదర్శిని, లోకానికి ధనవిముక్తి యొక్క మెరుపు నిరీక్షణ నందించినది—అనగా పశ్చిమ దేశ సంపత్తి—అనే భ్రమను కల్గించింది, ఎందుకంటే, సహజ పర్యావరణమును మరలా బాగుచేయలేని రీతిలో నాశనం చేయుట ద్వారా మాత్రమే దాన్ని సంపాదించగలరు.”
నిజంగా, దూరదర్శిని ఈనాడు ప్రపంచాన్ని మార్చివేస్తుంది, గానీ ఎల్లపుడు మంచికొరకే కాదనుకోండి. అయితే దాని విశేష ప్రభావం వ్యక్తులమీద కూడ అంతకంటె ఎక్కువగా వుంటుంది. నీవు ఆ అపాయములో ఉన్నావా?
[4వ పేజీలోని చిత్రం]
వార్తాపత్రికలు ఒక తలంపును ఒకే రోజులో పదివేలమంది మనస్సులలో వుంచగలవు
[5వ పేజీలోని చిత్రం]
దూరదర్శిని ఒక తలంపును తక్షణమే కోట్లాదిమంది మనస్సులలో వుంచగలదు