కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 6/8 పేజీలు 27-30
  • కొలస్సియం—పురాతన రోము యొక్క “వినోద” కేంద్రం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొలస్సియం—పురాతన రోము యొక్క “వినోద” కేంద్రం
  • తేజరిల్లు!—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • రోమన్‌ చరిత్ర నుండి ఒక పాఠం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవాకు లోబడడం వల్ల నేను ఎన్నో దీవెనలు పొందాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • వాళ్లు దాన్ని వినోదం అన్నారు
    తేజరిల్లు!—1997
  • యౌవనులారా, ఆధ్యాత్మిక లక్ష్యాలపై మనసుపెడుతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 6/8 పేజీలు 27-30

కొలస్సియం—పురాతన రోము యొక్క “వినోద” కేంద్రం

ఇటలీనుండి మేల్కొలుపు! ప్రతినిధి వ్రాసినది

“కొలస్సియం, రోము యొక్క పురాతన జ్ఞాపక చిహ్నములలో అత్యంత ప్రఖ్యాతి చెందినది, దాని గత మహిమాధికారములను ఒక స్మృతిచిహ్నముగాను మహా క్రూర కార్యాలకు సాక్ష్యముగాను నిలిచియున్నది.” అని మార్కో మరియు పౌలో అనే తన మిత్రులకు యాత్రా గైడుగా పనిచేయుచున్న లూకా అంటున్నాడు.

బహుశా మీరు కూడ కొలస్సియమును గూర్చి—అదెప్పుడు నిర్మించబడింది, ఎటువంటి ప్రదర్శనలు ఆ రంగస్థలంలో ప్రదర్శించబడినవి ఎక్కువగా తెలుసుకొనగోరుదురు. తొలి క్రైస్తవులలో ఎవరైనా అక్కడికి వెళ్లారా? కొందరనుకున్నట్లు వారు క్రూరమృగముల చేత చీల్చబడి అచ్చట చంపబడిరా? సరే మరి లూకా తన మిత్రులతో ఏం చెబుతున్నాడో వినండి.

లూకా: “కొలస్సియము తొలుత ప్లేవియస్‌ రంగ స్థలమని పిలువబడేది, ఎందుకంటే అది ఫ్లేవియు కుటింబీకులైన, వెస్పాసియన్‌, మరియు డొమిటియన్‌ అనే చక్రవర్తులు కలిసి చేసిన కార్యమైయుండెను. వెస్పాసియన్‌ అనే చక్రవర్తి సా. శ. 72-75 సంవత్సరముల మధ్యకాలములలో దాని నిర్మాణం చేపట్టాడు, అతని కుమారుడైన టైటస్‌ ఆ పనిని కొనసాగించి కట్టడమునకు సా. శ. 80 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేశాడు, మరి అతని సోదరుడు డొమిటియన్‌ ఆ తర్వాత నిర్మాణాన్ని పూర్తి చేశాడు.”

పౌలో: “మరి అదెందుకు కొలస్సియం అని పిలువబడుతుంది?”

లూకా: “అది ఆసక్తికల్గించే ప్రశ్నేగానీ దానికి ఖచ్ఛితమైన సమాధానము లేదు. సామాన్య శకం ఎనిమిదవ శతాబ్దం వరకు ఆ రంగస్థలం కొలస్సియము అనే పేరున పిలువబడలేదన్నట్లు కనబడుతుంది. దానికా పేరు దాని కోలోసల్‌ (చాలా పెద్ద) పరిమాణమునుబట్టి వచ్చిందని కొందరనుకుంటున్నారు. మరికొందరైతే, షుమారు 35 మీటర్ల ఎత్తున్న బ్రహ్మాండమైన విగ్రహం అనగా నీరోను సూర్య దేవునిగా సూచిస్తూ దగ్గర్లోవున్న నీరో బారీ విగ్రహమును బట్టి దానికి ఆ పేరు వచ్చిందని చెబుతున్నారు.

“కొన్ని వివరాలు తెలుసుకోకుండా అది రోమీయుల అతి పెద్ద రంగస్థలమని ఊరక చెప్పుటలో అర్థంలేదు. ఉదాహరణకు, పెద్ద ఇరసు 188 మీటర్లు, చిన్నది 156 మీటర్ల వ్యాసం గలిగి ఒక పెద్ద వృత్తాకారములో అది నిర్మించబడెను. దానికి 527 మీటర్ల చుట్టు కొలత వున్నది మరియు అది 57 మీటర్ల ఎత్తున్నది. దాని నిర్మాణానికి ప్రక్కనున్న టివొలి పట్టణము దగ్గర్లోని రాతిగనుల నుండి తీసిన చలువరాయి వంటి ఒక విధమైన సున్నపు రాయి వేల టన్నుల వరకు, మరియు ఆ చలువరాతి పెద్దపెద్ద ముక్కలను జతచేసి కట్టుటకు గాను 300 టన్నుల ఇనుము అవసరమై యుండెను. ఈనాడు మనం ముందుగా తయారు చేయబడిన భాగాలని పిలుస్తున్నామో, అటువంటివాటిని కూడ కట్టేవారు విస్తారంగా వుపయోగించారు. రాతి స్తంభాలను, పెద్దముక్కలను వేరేచోట తయారు చేసి తర్వాత వాటిని నిర్మాణ స్థలానికి తరలించే వారు. దీన్నిబట్టి కొలస్సియము ఎంత వేగంగా నిర్మించబడిందో తెలుస్తుంది. కొంచెం ఆలోచించండి, ఈ బ్రహ్మాండమైన నిర్మాణాన్ని నిర్మించుటకు ఐదు నుండి ఏడు సంవత్సరములు సరిపోయినవి.”

మార్కో: “లూకా, నేనొకటి ఆలోచిస్తున్నా, ఆ కొలస్సియమును కట్టడానికి ఎంతమంది దాసులు ఉపయోగించబడ్డారో మరి!”

లూకా: “పెద్దనిర్మాణపు పనికి యుద్ధఖైదీలను వుపయోగించు కున్నారనుట సాధ్యమే, కాని అంతవరకే. నిర్మాణపని పూర్తిచేయబడిన వేగాన్ని బట్టి బహిర్గతమయ్యేదేమనగా వృత్తిపరంగా నిపుణులైన పనివారే వుపయోగించబడిరి.”

పౌలో: “కొలస్సియమునకు ఎన్ని అంతస్తులున్నవి?”

లూకా: “బయటినుండి చూస్తే పరిపూర్ణ సమానముగాయున్న కమానులతో వున్న మూడు అంతస్తులు కనబడును. మొట్టమొదట ప్రతి కమాను ఒక విగ్రహంతో అలంకరింపబడెను, ప్రతి అంతస్తులోను 80 కమానులుండెను. మూడవ అంతస్తుపైన నాలుగవ దాని గోడలకు దీర్ఘచతుస్రాకారపు పెద్ద కిటికీలున్నట్లు మీరు చూడగలరు.”

మార్కో: “అందులో ఎంతమంది ప్రేక్షకులు పడతారు?”

లూకా: “అనేక పుస్తకాలు తెలుపునదేమనగా అందులో షుమారు 45,000 మంది కూర్చోవచ్చును, మరో 5,000 మంది నిల్చోవచ్చును. కొన్ని ఆధారాలను బట్టి అందులో 70,000 కంటె ఎక్కువమంది ప్రేక్షకులు పడతారు. ఏదేమైననూ, అందులో చాలామంది పట్టే అవకాశమున్నది రంగస్థలంలో కూర్చుండే భాగాన్ని మూసివేయు వెలేరియం లేదా విశాలమైన పైకప్పు వలన ప్రేక్షకులు క్షేమంగా పరిరక్షించబడేవారు.

“ఈ వర్తులాకార రంగస్థలం, శతాబ్దాల తరబడి చెక్కుచెదరకుండుటకు కారణమైన 13 మీటర్ల మందమున్న కాంక్రీటు దిమ్మమీద నిర్మించబడింది. మీరిప్పుడు చూచేది, దాని చరిత్రలో అనేక భూకంపములను, అగ్నిని తట్టుకొని నిలిచినదే. అయిననూ ఈ కొలస్సియము యొక్క బద్ధవిరోధులెవరంటే వాస్తుకాళా పునరుజ్జీవము మరియు బరాక్‌ కళారీతి కాలములోని నిర్మాణకులే, వారు దానిని సులభముగా మరియు చౌకగా చలువరాయి దొరికే స్థలంగా భావించి, వుపయోగించారు. రోములోని కొన్ని ముఖ్యమైన భవనాలు ఇక్కడున్న చలువరాతిని తీసికొని నిర్మించబడినవి లేక పునర్నిర్మించబడినవి. అయితే ఇప్పుడు మనం లోపలికి వెళదాం.”

పౌలో: “ఈ శిథిలాలు ఎంత ముగ్ధమనోహరంగా ఉన్నాయో! అక్కడ ఆ మధ్యలో ఏమి ఉండెనో నాకు చెబుతావా, లూకా?”

లూకా: “అది రంగస్థలములో వాడిన సామాను భద్రపరచే భూగృహం. రంగస్థల దృశ్యాలను అందులో పెట్టేవారు, క్రూరమృగాల బోనులు, ఆయుధాలు, క్రూరమృగాలను, ఖడ్గయోధులను మైదానమునకు సమానంగా ఎత్తుటకుపయోగించబడే సరితూకమున్న సాధనములుంచేవారు. భూగర్భ గదులను కప్పి వేయుచున్న ఈ రంగస్థల వేదిక చెక్కలతో చేయబడింది. అందుకే దానిలో ఒక ముక్క కనబడుటలేదు. మైదానం యొక్క చుట్టు కొలత అంతా పెద్ద అల్లికతో లేదా లోహపు కడ్డీలతో కంచెగా కట్టివేయబడింది. స్తంభాల సహాయముతో వున్న ఈ అల్లికమీద, క్రూరమృగాలు దూకి రాకుండ వుండుటకు దంతపు చుట్టలు మరియు శూలములవంటివి వుండేవి. ఇంకా జాగ్రత్త కొరకు అన్నట్లు మైదానం చుట్టూ అనేకమంది విలుకాండ్రను వుంచారట.”

పౌలో: “ప్రేక్షకులు ప్రవేశరుసుము చెల్లించవలసి వుండిరా?”

లూకా: “లేదు, కొలస్సియములోనికి ప్రవేశం ఉచితమే. ప్రజలను అదుపులో వుంచుటకు చక్రవర్తుల నియమావళిలో ఈ ఉచితవినోద కార్యక్రమం ఒక భాగమే. వాస్తవానికి ఈ వినోదాలు ప్రజల మనస్సులను పాడుచేసే మత్తు పదార్థములాంటివే. తినుటకు సుఖించుటకే జీవించే ప్రజల ప్రవర్తనకు వాపోతూ రోమా కవి జూవెనల్‌ ‘పానెం ఎట్‌ సర్కెన్‌సెస్‌’ ‘తిండి మరియు సర్కస్‌లు’ అనే ప్రఖ్యాతి చెందిన పదసముదాయాన్ని వాడెను.

“రంగస్థలంలో చూపబడిన సీట్ల పద్ధతిలోని తేడాను బట్టి రోమా సమాజం తరగతులుగా విభాగింపబడినది. ముందరి సీట్లు పాలక సభ సభ్యులకు కేటాయించారు, వీటి వెనుక వున్నవి ప్రముఖుల సీట్లు, మిగిలినవి, పైనున్నవి స్త్రీలకు, దాసులకు వదిలిపెట్టబడినవి.”

మార్కో: “ఇక్కడేనా ఖడ్గయోధులు పోరాడినది?”

లూకా: “అవును. రెండురకాల పోరాటములుండేవి, మునేరా అనేది ఇద్దరు ఖడ్గయోధుల మధ్యజరిగే పోరాటం, మరి వెనేషినెస్‌ అనేది క్రూరమృగాలను వేటాడే పద్ధతి. మరియు ఇక్కడ నేరస్థులను చంపేవారు, నిరాయుధులను ఖడ్గయోధుని కప్పగించేవారు లేదా క్రూరమృగాలముందు పడవేసేవారు. వారి మరణం ప్రజల ‘ఆనందానికి’ భయంకర దృశ్యంగా కనబడేది.

పౌలో: “నాకు సరిగ్గా జ్ఞాపకమున్నదనుకుంటున్నా, ఖడ్గయోదులు దాసులేనని, నిజమోనా?

లూకా: “నిజమే, ప్రాణాలను రక్షించుకొనుటకు ఏ పనినైనా చేయుటకు ఒప్పుకున్న యుద్ధఖైదీలలోనుండి దాసులను ఎన్నుకొనేవారు. నేరస్థులు కొందరు మరణశాసనాన్ని తప్పించుకొనుటకై ఖడ్గయోధుల పోరాటంలో మంచి అవకాశాన్ని పొందుటకై నిరీక్షించేవారు. వారి వృత్తిని ప్రారంభించుటకు ముందు వారికి శిక్షణ పాఠశాలలు కొన్నివుండేవి. ఖడ్గము లేదా ఈటె, డాలు లేదా వల మరియు త్రిశూలము (మూడు మొనలున్న ఈటె) మొదలగు వివిధ మారణాయుధాలను వారుపయోగించుటకు అనుమతించబడిరి. లూడి గ్లాడియేటోరీ అనగా ఖడ్గయోధుల ఆటలు అని పిలువబడిననూ, ఆ పోరాటములు, తలపడే వ్యక్తులలో ఎవరో ఒకరు మరణించవలసిన దుర్గతి పట్టే దుఃఖకరమైన వినోదాలైయుండెను.”

మార్కో: “నిజానికి ఖడ్గయోధులు మైదానంలో ప్రవేశించిన తోడనే వారు చక్రవర్తిని ‘ఎవి. సీజర్‌, మొరిటూరి టి శాల్యుటాంట్‌,’ అనగా ‘జయం, కైసరూ, చావబోయేవారు మీకు నమస్కరిస్తారు,’ అనే మాటలతో నమస్కరిస్తారని నాకు జ్ఞాపకమొస్తుంది.”

పౌలో: “మరైతే సినిమాలో చక్రవర్తి ఓడిపోయిన ఖడ్గయోధుని చంపవలెనని తన బొటనవ్రేలిని క్రిందికి పెట్టి చెయ్యిచాపి చూపిస్తూ ఆజ్ఞాపించే విషయమేమిటి—నిజంగా అది జరిగిందా?”

లూకా: “అవును, అలాగే జరిగింది. గెలిచిన వాడే ఓడిన వాని భవిష్యత్‌ను నిర్ణయించేవాడు. తర్వాతికాలంలో ఆ హక్కు చక్రవర్తికే ఇవ్వబడింది, ఆయన ప్రేక్షకుల నిర్ణయం విన్నతర్వాత తన తుది నిర్ణయం చెప్పేవాడు. ఓడిపోయిన వాడు ధైర్యంగా పోరాడెనని ప్రేక్షకులు అనుకుంటే వారు వారి బొటన వ్రేలిని పైకెత్తి, ‘మిట్టే!’ (వదలిపెట్టు!) అని పెద్దగా కేకలు వేసేవారు, మరి చక్రవర్తి కూడ చెయ్యి ఎత్తితే ఓడినవాడు ప్రాణభిక్ష పొందేవాడు. అలాకాకుండా, ఓడిన వాడు పిరికివాని వలె పోరాడెనని ప్రేక్షకులు అనుకుంటే వారువారి బొటన వ్రేలిని క్రిందికి చూపుతూ ‘అయుగులా!’ (చంపుము!) అని అరిచేవారు. చక్రవర్తి కూడా అటువంటి సంజ్ఞచేసినచో ఓడిన ఖడ్గయోధుని మరణం ఇక వ్రాసిపెట్టినట్లే. ఇక అతడు చేయగల్గినదంతా ఒకటే, గెలిచినవానికి ఛేదించుటకు తన కంఠాన్ని అప్పగించుటే. ఇదంతా ప్రేక్షకుల ఉత్సాహపూరిత కరతాళ ధ్వనుల మధ్యనే జరిగిపోయేది. పిదప గెలిచిన వానికి విలువైన బహుమతులు బంగారు నాణెములనిచ్చెడివారు.”

మార్కో: “ఎంత క్రూరమైన వినోదం!”

లూకా: “అవును మరి! మానవ రక్తం నిజంగా ఏరులై పారేది, చంపబడిన క్రూరమృగాల గూర్చి ఇక చెప్పనక్కర్లేదు. జంతువుల వినోదాలలో ఈనాడు మనం సర్కస్‌లో చూసినట్లే వాటకి శిక్షణనిచ్చే వాని మాట మౌనంగా వినేటువంటి శిక్షణ పొందిన క్రూర జంతువులనే అక్కడ ప్రదర్శించేవారు. అయితే ఈ క్రూర జంతువులు ఒక దాన్ని ఒకటి తరుముట లేదా వాటిని వెంటాడి చంపుట అనేది అక్కడ తరచూ జరిగే సంఘటన. అది నిజంగా సంహారమే. కొలస్సియము ప్రారంభోత్సవం నాడే ఒక్కరోజే 5,000 క్రూరజంతువులు చంపబడినవి, ఇక ఆలోచించండి మరి!”

పౌలో: “ప్రజలెలా అటువంటి వాటిని చూచి ఆనందించారో నాకర్థం కావడంలేదు.”

లూకా: “సరే, ఇప్పుడుచేసే బాక్సింగ్‌ ఆటలనుగూర్చి తలంచండి. ఓడినవాన్ని నేలకొరిగేటట్టు కొట్టి అతని ముఖంచిట్లి రక్తం ధారగా కారుతూవుంటే ప్రేక్షకులు చూస్తూ అంగీకరిస్తున్నట్లు అరుపులతో తెలియజేస్తారు. లేదా అంతటా రక్తపాతం మరణం, చీల్చిచెండాడే దృశ్యాలతో ప్రజలను పులకరించేసే సినిమాలకు ఆకర్షితులైనవారి సంగతేమిటి మరి? ప్రజలీనాడు బహుశా ఆనాటివలెనే మొద్దుబారిపోయారు.

“గనుక ఆ రంగస్థలాలు హింసకు, అవినీతికి స్థలాలు. ఇందుకే తొలి క్రైస్తవులు వాటి జోలికి పోకుండ జాగ్రత్తపడ్డారు. నిజానికి, మూడవ శతాబ్దపు టెర్టూలియన్‌ డి స్పెక్టాకులిస్‌ అనే తన పుస్తకంలో ఆ రంగస్థలములో జరిగినదంతా ‘చెత్త’ అని వర్ణిస్తూ క్రైస్తవులకు ఆ రంగస్థలము ‘పూర్తిగా తెలియదని’ నొక్కితెలిపాడు.”

మార్కో: “ఆ కొలస్సియములో కొందరు క్రైస్తవులు హతసాక్షులై యుండవచ్చా?”

లూకా: “క్రైస్తవులు నిస్సందేహంగా రోమీయుల రంగస్థలాల్లో చనిపోయారు, క్రూరజంతువుల చేత చీల్చబడ్డారు. చరిత్ర ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నవి. తాను ఎఫెసులోని రంగస్థలంలో క్రూరమృగాల బారిన పడు అవకాశమున్నదని బహుశా అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 15:32 లో చెబుతున్నాడు.

“నిశ్చయంగా రోము నందు ఎక్కడో ఒకచోట క్రైస్తవులు హతసాక్షులైయ్యారు గానీ వారు కొలస్సియములో హతసాక్షులయ్యారో లేదో చెప్పడానికి సాధ్యం కాదు. ది ఎన్‌సైక్లోపిడియా యూనివర్సలీ, సంపుటి 4 చెప్పునదేమనగా: ‘కొలస్సియము క్రైస్తవుల హత్యాస్థలమని చరిత్రాత్మకంగా రుజువు కాలేదు.’ అయిననూ అనేకమంది కేథొలిక్‌ గ్రంథకర్తలు అది హత్యాస్థలమేనని నమ్ముచున్నారు. అటుతర్వాత కాలములో వచ్చిన పురాణ గాథలు, మరియు వాటిని నమ్మిన కేథొలిక్‌ మతాధిపీఠము యొక్క నమ్మకాలమీద నిజానికి వారి అభిప్రాయాలు ఆధారపడినవి.

“అయినను హింసాయుత లోకమందు తటస్థంగా ఉండుటలో ఆ ప్రాచీన క్రీస్తు అనుచరులు మరణం వరకు నమ్మకంగా వుండిరనే వాస్తవమే ఈనాటి క్రైస్తవులకు ప్రోత్సాహకరముగా వున్నది. వారిక్కడ హత సాక్షులయ్యారనే విషయం తెలుసుకొనుట ప్రాముఖ్యం కాదుగాని వారు యథార్థతను పూర్ణంగా కాపాడుకున్నారని తెలుసుకొనుటయే.

“రోమీయుల ఈ బ్రహ్మాండమైన కళాఖండాన్ని దర్శించుటను మీరానందించారా?”

“నిశ్చయంగా సంతోషించాం, చాలా బాగా వివరించి చెప్పినందుకు మీకు మా ధన్యవాదాలు” అని మార్కో మరియు పౌలో జవాబిచ్చారు.

చరిత్ర ద్వారా మనతో మాట్లాడే ఈ రాళ్లు అనేక శ్రద్ధకల్గించే వాటిని తెలుపగలవు. శిల్పకళాఖండములోను, నిర్మాణంలోను ప్రాచీన రోమీయుల అసాధారణ నైపుణ్యములను తెల్పుటకు ఈ కొలస్సియము ఒక దర్పణం. వంతెనలు, రోడ్లు, కాలువలు, థియేటర్లు, రంగస్థలాలు, దేవాలయాలు మరియు నగరములను నిర్మించేవారు. అయిననూ, కొలస్సియము ఎంతటి భయంకర దృశ్యాలను కనబరచే స్థలమంటే, ఆనాటి క్రైస్తవులు, ఈ నాటి క్రైస్తవులు కూడా వట్టి ప్రేక్షకులుగా కానీ లేదా ఇష్టపూర్వకంగా పాల్గోనే వారిగాకానీ అందులో జోక్యం కల్గించుకొనుటకు తిరస్కరిస్తారు. (g91 4/8)

[28వ పేజీలోని చిత్రం]

ఈనాటి కొలస్సియం అంతర్భాగం

[29వ పేజీలోని చిత్రం]

వైభవం క్షీణించిన కొలస్సియం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి